రివ్యూలు హిట్, థియేటర్‌లు ఖాళీ!
దర్శకుల కన్నీళ్ల వెనుకున్న నిజం ఏమిటి?;
ఈ రోజు సినిమా సర్కిల్స్ లోనే కాకుండా,మీడియా సర్కిల్స్ లో కూడా హాట్ డిస్కషన్ గా మారిన విషయం ఓ దర్శకుడు చెప్పుతో కొట్టుకుంటూ వీడియో వదలటం. ఇది చాలా మందిని సినిమాకు సంభందం ఉన్న వాళ్లనే కాకుండా , సినిమాకు సంభందం లేని చాలా మందిని ఆవేదనకు గురి చేసింది. కష్టం కళ్లెదురుగా కూలిపోతున్నప్పుడు ఎవరికైనా ఆవేదన సహజమే. ఎంతో కష్టపడి తీసిన సినిమా థియేటర్ లో జనం చూడటం లేదంటే బాధే కలుగుతుంది. ఎంతో కొంత జనం చూసి హిట్టో, ప్లాఫ్ అని తేలిస్తే అందులో అర్దముంది. ఏదో బాయ్ కాట్ చేసినట్లు జనం చిన్న సినిమాలకు అసలు థియేటర్స్ రాని పరిస్దితి కనపడుతోంది. ఎక్కడుంది లోపం, ఇంతకీ ఈ దర్శకుడు ఏమన్నాడో చూసి, అప్పుడు అసలు సమస్య ఏమిటో ఆలోచిద్దం.
ఈ శుక్రవారం ఎప్పటిలాగే కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బార్బరిక్ ఒకటి. ఈ సినిమాకు రివ్యూలు అయితే పాజిటివ్ గా వచ్చాయి కానీ థియేటర్స్ కి జనమే రాలేదు. ఎంత రాలేదంటే చాలా థియేటర్స్ లో మరీ పది మంది లోపే. కొన్ని చోట్ల షోలు రద్దైన పరిస్దితి. ఇది గత రెండేళ్లుగా చిన్న సినిమాకు ఎదురు అవుతున్న పరాభవమే కదా,కొత్తేముంది అనిపించవచ్చు. కానీ తన సినిమా ఎంతో ప్రేమించి, కష్టపడి, రాత్రిబవళ్లు తీస్తే ఎవరూ పట్టించుకోకపోతే దర్శకుడు మనస్తాపానికి గురి అవుతాడు. కదా అదే జరిగింది. అయితే కొందరు ఇంట్లో బాధపడతారు. స్నేహితుల దగ్గర ఏడుస్తారు. మరికొందరు కన్నీళ్ళను దిగమింగుకుంటారు. కానీ ఈ దర్శకుడు ఓపెన్ అయ్యాడు.
”ఓ థియేటర్‌కి వెళ్లా. అక్కడ పది మంది కూడా లేరు. నేను దర్శకుడ్ని అని చెప్పకుండా సినిమా ఎలా ఉంది? అని అడిగా. అందరూ చాలా పాజిటీవ్ గా స్పందించారు. ఇంత మంచి సినిమా తీస్తే జనాలు ఎందుకు రావడం లేదు? అనేది అర్థం కావడం లేదు. మలయాళం నుంచి సినిమాలు తీస్తే.. అక్కడి నుంచి మంచి కంటెంట్ వస్తే, థియేటర్లకు వెళ్తున్నారు కదా. అలాంటప్పుడు ఇక్కడి సినిమాలు ఎందుకు చూడరు? నేను ఓ నిర్ణయానికి వచ్చా.. ఇక మలయాళంలోనే సినిమా తీస్తా. అక్కడ హిట్ కొట్టి నిరూపించుకొంటా” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ సెల్ఫీ వీడియోని పోస్ట్ చేశారు.
అంతే కాదు.. ”ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకొంటా అన్నాను. ఇప్పుడు అదే పని చేస్తా” అని ఆవేశంతో తన చెప్పు తీసుకొని తానే కొట్టుకొన్నారు. దాంతో జనం ఈ సినిమా గురించి కన్నా ఈ దర్శకుడు గురించి, అతని ఆవేదన గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నిజంగా ఎక్కడ సమస్య ఉంది. ఈ దర్శకుడు చెప్పినట్లుగా మళయాళ సినిమాలు తెగ ఆడుతున్నాయా తెలుగు థియేటర్స్ లో అంటే అదేమీ కనపడదు. ఓటిటిలలో ఆ సినిమాలు ఆడుతున్నాయి.
అవి కూడా అన్ని సినిమాలను జనం చూడటం లేదు. అక్కడ కూడా పాపులర్ స్టార్స్ సినిమాలుతో పాటు కామెడీ, క్రైమ్ సినిమాలు జనం చూస్తున్నారు. మళయాళ సినిమాలు మొదటి నుంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తాయనే పేరు పడటం కలిసొచ్చింది. వాళ్లు చాలా భాగం ఆ పేరు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. దాంతో చిన్న సినిమాలు అంటే ఓటిటిలలో వచ్చే చిన్న సినిమాలు అనే పరిస్దితి కు వచ్చేసింది.
తెలుగులో పెద్ద హీరోలు అంటే మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, చిరంజీవి వంటి స్టార్స్ మూవీలు వస్తే కచ్చితంగా థియేటర్స్ కు వెళ్తున్నారు. ఆ సినిమాల రిలీజ్ కు ముందే టిక్కెట్లు అమ్ముడు అవుతాయి. జనం ఆ సినిమాలకు వెళ్లాలనే ప్లాన్లు వేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చిన్న సినిమాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అందుకు కారణం చాలా వరూ ఓటిటి నే అనేది ఎవరు చెప్పక్కర్లేని నిజం.
ఎలాగూ ` మూడు నాలుగు వారాల తరవాత ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది కదా` అన్న ఆలోచన ప్రేక్షకుడుకి కలిగినప్పుడు వాళ్లు పనిగట్టుకుని చిన్న సినిమాకు ఎందుకు వెళ్తారు. ఆ క్రమంలో బలి అవుతన్నవి మొదటి చిన్న సినిమాలే.
ఇక ఈ వారం, క్రితం వారం రిలీజైన చిన్న సినిమాల పరిస్దితి ఇదే. నారా రోహిత్ సుందరకాండ సినిమాకు మంచి టాకే వచ్చింది. ఫన్ బాగా పేలిందన్నారు. రివ్యూలు బాగున్నాయి. కానీ థియేటర్స్ లో జనం లేదు. అంతకు ముందు రిలీజైన ‘పరదా’ సినిమాదీ ఇదే పరిస్దితి. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఆవేదనతో..హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమాలు చూడటం లేదు అని బాధ పడింది. మరో ప్రక్క అదే దర్శకుడు ప్రెస్ మీట్ పెట్టి ‘మంచి సినిమా తీశాం… చూడండి’ అంటూ కన్నీరు పెట్టుకొన్నాడు. ఇది ఇలా జరిగిపోతూనే ఉంటోంది. మరో వారం మరి కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటున్నాయి. దీనికి ఆది, అంతం కనపడటం లేదు.