గ్యాంగస్టర్ డ్రామా విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' రివ్యూ
ఈ సినిమా ఎలా ఉంది కథేంటి చూడదగినదేనా రివ్వూ లో చూద్దాం;
1990ల నేపథ్యంగా, శ్రీలంకలో స్థిరపడిన శ్రీకాకుళం వలసదారుల జీవితాలను నేపథ్యంగా మొదలైన ఈ కథ – ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే భావోద్వేగ ప్రయాణంగా టర్న్ తీసుకుని సాగుతుంది.
సూరి (విజయ్ దేవరకొండ) – ఓ తెలివైన, నిబద్ధత గల కానిస్టేబుల్. ఎవరికీ తలొగ్గడు. కొన్నిసార్లు తనకంటే పై అధికారులకైనా తప్పు చేస్తే బుద్ధి చెప్పే ధైర్యం ఉన్నవాడు. అతడిని అనుకోని విధంగా శ్రీలంకలోని ఓ కోవర్ట్ ఆపరేషన్ కోసం 'రా' వాళ్లు ఎంచుకుంటారు. అయితే సూరి ఒప్పుకోవటం వెనక మెయిన్ ఎజెండా ..ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయి 18 ఏళ్లుగా కనిపించకుండా పోయిన తన అన్న శివను (సత్యదేవ్) మళ్లీ కలవడం. అతను అక్కడే ఉన్నాడని తెలవటంతో ఓకే చెప్పి బయిలు దేరతాడు.
శివ ఇప్పుడు శ్రీలంకలోని జాఫ్నాలో శ్రీకాకుళం నుండి వెళ్ళిన తెగకు నాయకుడిగా ఉన్నాడు. అక్కడికి వెళ్లి నానా కష్టాలు పడి జైల్లో ఉన్న అన్నను సూరి కలుస్తాడు. వెనక్కి ఇండియా తీసుకువద్దామనుకుంటాడు. అయితే అక్కడ నుంచి కొత్త సమస్య మొదలవుతుంది. అదేంటి. అసలు ఇంటి నుండి పారిపోయి శ్రీలంక చేరిన శివ... అక్కడి వారికి ఎలా నాయకుడు కాగలిగాడు? అలాగే ఓ సాదా సీదా కానిస్టేబుల్ ని ...కోవర్ట్ ఆపరేషన్ కు 'రా' వాళ్లు ఎందుకు ఎంచుకున్నారు.అలాగే ఈ కథలో వచ్చే అ్రకమ ఆయుధాల రవాణా మేటర్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే 'కింగ్ డమ్' చూడాల్సిందే.
విశ్లేషణ
“ఎక్కడో ఓ ద్వీపం... ఎవరికీ తెలియని ఓ గూడం... అక్కడ చీకటి ఇంకా చచ్చిపోలేదు.” ఇలాంటి మూడ్ ని సెట్ చేస్తూ గమ్మత్తైన నేరేషన్ తో మొదలైన సినిమాని మనం కాస్తంత ఎక్కువే ఎక్సపెక్ట్ చేస్తాం. అందుకు విజువల్ టోన్ కూడా మనకు కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనేందుకు లీడ్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే అక్కడనుంచి దర్శకుడు మన ప్రపంచంలోకి వస్తాడు. ఆ స్థాయిలో ప్రారంభమైన కథ, అందుకు తగ్గట్లుగా సాగదు. తరువాతి వచ్చే సీన్స్, స్క్రీన్‌ప్లే ప్రారంభ ఊపునే మింగేసింది.
అయితే మళ్లీ కాసేపటికి ఓ కానిస్టేబుల్ ని స్పైగా ఎంపిక చేసి శ్రీలంక పంపుతున్నారు అనగానే మళ్లీ అంచనాలు మొదలవుతాయి. అయితే అదీ కొంతసేపే. ఈ క్రమంలో అన్నదమ్ముల అనుబంధం అనే ఎమోషనల్ హుక్ వేసినా దానికి మనంచిక్కుకోము. అయితే ఎదర ఏదో జరగబోతోందనే సెటప్ లో ఆశతో ఫస్టాఫ్ నడిచిపోయింది. కానీ ఆ ఏది జరగబోతోంది అనేదే సరిగ్గా సెకండాఫ్ లో కుదరలేదు. ముఖ్యంగా కథకు సరైన స్ట్రాంగ్ విలన్ లేడు. ఎక్కడో మొదలై ఎక్కడో కథ ముగిసినట్లు అనిపించేలా చేసింది స్క్రీన్ ప్లే.
దానికి తోడు ఈ మధ్యన పార్ట్ 2 కోసం కథలను కొంత చెప్పి అర్దాంతరంగా ఆపేస్తున్నారు. దాంతో సరైన క్లైమాక్స్ రావటం లేదు. కథ బిగిన్,మిడిల్,ఎండ్ కరెక్ట్ గా కుదరటం లేదు. ఇలా రెండు పార్ట్ లు చేసే కథలు కరెక్ట్ సరైన ప్లేస్ లో కట్ చేసి, సెకండ్ పార్ట్ కు లీడ్ ఇవ్వాలి, ఫస్ట్ పార్ట్ కూడా విడిగా ఓ సినిమాలా అనిపించాలి. అంతేకానీ అసంపూర్ణం అనిపిస్తే ఆ సినిమా ని భరించటం కష్టమే అవుతోంది.
డైరక్టర్ గా గౌతమ్ తిన్ననూరికి భావోద్వేగంతో కూడిన కథలు చెబడంలో ప్రత్యేకమైన నైపుణ్యం ఉందని ఆయన గత సినిమాలు చెప్తాయి. అయితే “Kingdom” లో, ఆయన ఓ భారీ స్థాయి కథ చెప్పాలనుకుని , అందుకు తగినట్లు మారుతూ తన అసలు ని వదిలేసినట్లు అనిపించింది. అలాగే ఈ సినిమాలో రాజమౌళి ఛత్రపతి, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ కలిపేయాలనే కోరిక కనపడింది. చివరకు ఈ సినిమా సూర్య రెట్రోని గుర్తు చేసింది.
టెక్నికల్ గా
ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవ్వాల్సిన అనిరుద్ స్కోర్ ఆ స్దాయిలో అయితే లేదు. జస్ట్ ఓకే అన్నట్లు సాగింది. 'రగిలే రగిలే యుద్ధాలే' సాంగ్ మాత్రం బాగుంది. గిరీష్ గంగాధరం, జోమన్ టి జాన్ ల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ సెంకడాఫ్ సమస్యగా మారింది. అదే కథనం మీద ఇంపాక్ట్ పడింది. దర్శకత్వం తన సొంత స్టైల్ ని గౌతమ్ వదిలేసి ప్రశాంత్ నీల్ ఎడాప్ట్ చేసుకునే ప్రయత్నం లా అనిపించింది.
నటీనటుల్లో ...
విజయ్ దేవరకొండ అయితే అదరకొట్టాడు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు సినిమాలో ప్రాధాన్యం లేకుండా పోయింది. మురుగన్ పాత్రలో వెంకిటేష్ వి. పి. చాలా బాగా చేశాడు. మిగతా సీనియర్లు పాత్రోచితంగా చేసుకుంటూ వెళ్లి పోయారు.
చూడచ్చా
విజయ్ దేవరకొండ అభిమానులకు బాగా నచ్చుతుంది