"భీమా" మూవీ రివ్యూ
పవర్ పోలీస్ పాత్రలో గోపీచంద్ నటించిన సినిమా ‘భీమా’. వైవిధ్యమైన చిత్రీకరణతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గోపీ చంద్ రెడీగా ఉన్నాడు. ఈ సినిమా ఎలా ఉందంటే..
(సలీమ్ బాషా)
గోపీచంద్ మరోసారి పోలీసు పాత్రలో నటించిన చిత్రం "భీమా". గత ఐదు ఆరు సంవత్సరాలుగా గోపీచంద్ కెరీర్ గ్రాఫ్ బాగా కిందికి దిగిపోయింది. పక్కా కమర్షియల్ ,రామబాణం లాంటి సినిమాలు బాగా నిరాశపరిచాయి. ఈ మధ్యకాలంలో ఒక “సీటిమార్” తప్ప మిగతావి ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కన్నడలో విజయవంతమైన సినిమాలు తీసిన, డైరెక్టర్, కొరియోగ్రాఫర్, యాక్టర్ ఏ.హర్ష చెప్పిన(తెలుగులో నే) కథ నచ్చి గోపీచంద్ ఈ సినిమాలో నటించాడు. ఇది ఒక సూపర్ నేచురల్ యాక్షన్ సినిమాగా ఉండవచ్చునని ఊహాగానాలు ఉన్నాయి. గోపీచంద్ మాత్రం అలాంటిదేమీ లేదు అని చెప్పాడు. దర్శకుడు ఈ సినిమాకి సలార్ లాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించిన రవి బస్రూర్ తన టీమ్ లోకి తీసుకున్నాడు.
డిఫరెంట్ కథ.. వైవిధ్యమైన చిత్రీకరణ
కథ గురించి చెప్పాలంటే, ఈసారి గోపీచంద్ ఒక డిఫరెంట్ స్టోరీ ని ఎన్నుకున్నాడు. ఈ సినిమా లో పరశురాముడి అంశ తో ఒక క్యారెక్టర్ ఉంటుందని దర్శకుడు ముందే చెప్తాడు. అది గోపీచంద్ అనే అందరికి అర్థమవుతుంది. అది ఎలా, ఎప్పుడు సినిమాలో ప్రకటితమవుతుందన్న దానిమీద కొంత ఆసక్తిని ముందే క్రియేట్ చేశాడు కాబట్టి, సినిమాలో కొంత కొత్తదనాన్ని ఆశించి కూర్చున్న ప్రేక్షకులను ఈ సినిమా అంతగా నిరాశపరచదు. కన్నడ దర్శక, కొరియోగ్రాఫర్ క్లారిటీ ఉన్న దర్శకుడు అనిపిస్తుంది. ఏం తీయాలి, అది ఎలా తీయాలి? అన్నదాంట్లో దర్శకుడు క్లారిటీ క్లియర్ గా కనబడుతుంది. అదే సినిమాకు ఒక బలం. డిఫరెంట్ గా కనిపించే కథని, డిఫరెంట్ గా నడిపే క్రమంలో కొంత క్లారిటీ తగ్గినప్పటికీ, ఈ సినిమాను దర్శకుడు బాగానే తీశాడు అని చెప్పాలి.
ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీ, ఊహకు అందని ఫైట్లు అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే దర్శకుడు వాటిని కూడా బాగానే వాడుకున్నాడు. గోపీచంద్ ఈ సినిమాతో తన నటనని కూడా ప్రదర్శించే అవకాశం కలిగింది. మొత్తం మీద చెప్పాలంటే గోపీచంద్ ఈ సినిమాతో కొంతవరకు హిట్ కొట్టినట్టే. ఈ కథకు ప్రధాన బలం దర్శకుడు. కథనంలో ఎక్కడ ట్విస్ట్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అన్నది చాలా బాగా స్టడీ చేశాడు. ఈ కథకు ప్రధాన బలం ఓ మూడు నాలుగు ట్విస్టులు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్లస్ చాలామంది ఊహించని ట్విస్ట్.
సీరియస్ సినిమాకు వర్కౌట్ అయిన కామెడీ
ఇంత సీరియస్ సినిమాలో కామెడీ వర్కౌట్ కావడం కష్టం. కానీ దర్శకుడు ఆ పనిని చాలా సులభంగా చేశాడు. సినిమా మొదలుకావడమే కామెడీతో మొదలవుతుంది. వెన్నెల కిషోర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సీరియస్ సినిమాలో కామెడీ వర్కౌట్ కావడానికి కారణం దాన్ని సరిగ్గా నడపడమే. ఇక్కడ కామెడీలో సర్ప్రైజింగ్ ప్యాకేజీ ఏంటంటే సీరియస్ ఇన్స్పెక్టర్ పాత్రలో కూడా గోపీచంద్ చేసిన కామెడీ. బాగానే వర్కౌట్ అయింది. సినిమాలో గోపీచంద్ ఇంట్రడక్షన్ సీన్ తోపాటు ఇతర కామెడీ సన్నివేశాలు, బాగానే పండాయి. అవే సినిమాను ఎంటర్టైనింగ్ సినిమా గా మలిచాయి. సినిమాను చూడదగ్గ సినిమాగా మార్చేశాయి.
అందం- అభినయం కలిసొచ్చాయి
అందంగా ఉన్న మాళవిక శర్మ యూత్ కు మంచి ఎంటర్టైన్మెంట్. గోపీచంద్, మాళవిక మధ్య నడిచే సన్నివేశాలు కొన్ని నిడివి ఎక్కువైనప్పటికీ, హద్దు దాటకుండా ఆహ్లాదకరంగా ఉండడం వల్ల యూత్ ఎంజాయ్ చేస్తారు. తన అందంతో మాళవిక శర్మ యువతను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు నేల టికెట్టు, రెడ్ సినిమాల్లో ఈమె నటించింది. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ తమిళ నటి ప్రియా భవాని శంకర్. ఓటీటీ లో బాగానే నడిచిన నాగచైతన్య " దూత" సినిమాలో ఈమె మెరిసింది. ఈ సినిమాలో కూడా మంచి పాత్రలో బాగానే చేసింది. చిలిపిగా ఉంటూ, చివర్లో రామ్ అనే పాత్రని ఇన్స్పైర్ చేయడంలో ఆమె నటన ప్రతిభావంతంగా ఉంది.
ఈ డిఫరెంట్ కథకు మరో బలం, కేజిఎఫ్ సలార్ సినిమాలకు, సంగీతం అందించిన రవి బస్రూర్. ఈ సినిమాలో కూడా కథను ఎలివేట్ చేసే నేపథ్య సంగీతాన్ని అందించాడు. "ఏదో ఏదో మాయ" పాట బాగుంది. థ్రిల్లింగ్, ఫైటింగ్ సన్నివేశాల్లో సంగీతం సరైన పాత్రనే నిర్వర్తించింది. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన పోరాట సన్నివేశాలు కొంచెం అతిగా అనిపించినా, కొత్తగా ఉండి, ఈ సినిమాకు అవసరమే అనిపించేలా ఉన్నాయి. స్వామి గౌడ ఫోటోగ్రఫీ, సంగీతం తో పాటు పరిగెత్తింది. విఎఫ్ఎక్స్ కూడా కొంతవరకు పర్వాలేదు. ఈ సినిమాకు ఎడిటింగ్ చేసిన తమ్మిరాజు తన కత్తెరను ఇంకా కొంచెం ఉపయోగించి ఉంటే, సినిమా మరింత క్రిస్పీగా ఉండేది.
నటీనటుల నటన ఒక బలం
ఇక ఈ సినిమాలో గోపీచంద్ నటన కూడా ఒక స్థాయిలో ఉంది. అనుభవం ఉన్న నటుడే కాబట్టి, ఆకట్టుకుంటాడు. కామెడీలో కూడా పర్వాలేదనిపించాడు. సీరియస్ సన్నివేశాలు అతనికి కొత్త కాదు. అలా చేసుకుంటూ పోయాడు. ఈ సినిమాలో హిందీ విలన్ ముఖేష్ తివారి అంతగా అతకలేదు. వైద్యుడిగా నాజర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే.
ముందే చెప్పినట్లు ఈ సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటైన ట్విస్టులు, సరైన చోట సరైన సమయంలో ఉపయోగించడం సినిమా విజయవంతం కావడానికి ఉపయోగపడవచ్చు. ఒకటి రెండు ట్రిస్టులు తెలివైన ప్రేక్షకులు ఊహించినప్పటికీ, అవి వాడిన సమయం వాడిన సందర్భం వారిని కూడా ఆశ్చర్యపరిచే అవకాశాలు ఉన్నాయి.
మాటల తూటాలు
ఈ సినిమాకి మరోసారి సర్ప్రైసింగ్ ప్యాకేజీ, అజ్జు మహాకాళి రాసిన డైలాగులు. ఇలాంటి సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ సినిమాలో చాలా అర్థవంతమైన డైలాగులు ఉన్నాయి. అవి చాలా చోట్ల పవర్ ఫుల్ గా మారాయి, ముఖ్యంగా హీరోకి. గోపీచంద్ డైలాగ్ డెలివరీలో బానే ఉన్నాడు. క్లైమాక్స్ లో ప్రియా భవాని శంకర్ పాత్రకి రాసిన డైలాగులు బాగున్నాయి.
మొదట్లో శుభలేఖ సుధాకర్ పాత్ర చెప్పిన " దేవుడిని నమ్మినప్పుడు దయ్యాన్ని కూడా నమ్మాలి", " కోరిక తీర్చుకోవడం ధర్మబద్ధంగా ఉండాలి, వారి కర్మలో ఉండాలి" డైలాగులు అర్థవంతంగా ఉన్నాయి. గోపీచంద్ పోలీసులతో మాట్లాడేటప్పుడు " ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, ఉద్యోగం చేయండి". విలన్ గ్యాంగ్ ఒక మహిళను నిర్ధాక్షణంగా కొట్టేటప్పుడు " మహిళను పడగొట్టేవాడు కాదురా, నిలబెట్టేవాడు మగాడు", తల్లి పుడమి లాంటిది. పురిటి నొప్పులు మగవాడు భరించలేడు కాబట్టి దేవుడు ఆడవాళ్లకు ఆ అవకాశం ఇచ్చాడు"
క్లైమాక్స్ లో "అహం కోసం చంపేవాడు రాక్షసుడు. ధర్మం కోసం చంపేవాడు దేవుడు". " దేవుడు కూడా ధర్మం కోసం చంపేటప్పుడు రాక్షసంగానే ఉంటుంది" లాంటి డైలాగులు ఆ సన్నివేశానికి సరిపోయాయి. గోపీచంద్ ఈ సినిమాతో కొంత ఊపిరి పీల్చుకోవచ్చు. కాసింత రిలాక్స్ కావచ్చు. ఇది గొప్ప సినిమాల కోవలోకి చేరుకపోయినా, కొన్ని లోపాలు ఉన్నా మాస్, కొంతవరకు క్లాస్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు కన్నా, ఈ సినిమా బెటర్ గా ఉండడం, దాన్ని చూడదగ్గ సినిమాగా చేసింది.
తారాగణం:
గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ,
వెన్నెల కిషోర్, నాజర్, నరేష్, పూర్ణ, రఘు బాబు
రచన , దర్శకత్వం: ఏ. హర్ష
మాటలు: అజ్జు మహాకాళి
ఛాయాగ్రహణం: స్వామి జె గౌడ
కూర్పు :తమ్మిరాజు
సంగీతం: రవి బస్రుర్
నిర్మాత: కేకే రాధామోహన్
నిర్మాణ సంస్థ: . శ్రీ సత్య సాయి ఆర్ట్స్
విడుదల తేదీ: 2024 మార్చి 8