షణ్ముఖ్ జస్వంత్ 'లీలా వినోదం' ఓటిటి రివ్యూ
‘ఈటీవీ విన్’ (ETV Win) మిగతా ఓటిటి సంస్దలకు భిన్నంగా చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఎక్కువ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తన ఓటిటి వ్యూయర్స్ కు అందిస్తోంది.
‘ఈటీవీ విన్’ (ETV Win) మిగతా ఓటిటి సంస్దలకు భిన్నంగా చిన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఎక్కువ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తన ఓటిటి వ్యూయర్స్ కు అందిస్తోంది. అందులో భాగంగా వచ్చిన లేటెస్ట్ ఒరిజినల్ మూవీ ‘లీలా వినోదం’ (Leela Vinodham). యూట్యూబర్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) హీరోగా రూపొందిన చిత్రమిది. రిలీజ్ కు ముందు ట్రైలర్స్, టీజర్స్ తో బాగానే బజ్ చేసింది. ఏదో కొత్త సినిమా చూడబోతున్నట్లు ఫీల్ ఇచ్చింది. ఇంతకీ ఈ సినిమాలో టైటిల్ లో ఉన్నట్లు ‘వినోదం’ ఉందా? అసలు కథేంటి? చూద్దాం.
కథ:
పవన్ కల్యాణ్ సినిమా ‘జల్సా’ (2008) విడుదలైన రోజులు. 'తణుకు' లో ఉండే ప్రసాద్ (షణ్ముఖ్) మిడిల్ క్లాస్ కుర్రాడు. ప్రతి విషయానికి ఏదేదో ఊహించుకుని కంగారుపడి పోయే మనస్తత్వం ప్రసాద్ ది. కాలేజ్ చదువు పూర్తి చేసి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ సంపాదించాలనే ప్రయత్నంలో ఉంటాడు. అతను పనిలో పనిగా లీలా ( అనఘ అజిత్)ను ప్రేమిస్తాడు. అయితే తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడు. అంటే వన్ సైడ్ లవ్.
ఇక ప్రసాద్ కి రాజీవ్ .. అశోక్ .. సాగర్ అనే ఫ్రెండ్స్. వాళ్లు ఒత్తిడితో లీలను లవ్ చేస్తున్న సంగతిని ఆమెతో చెబుతాడు. అయితే ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. దాంతో కంగారుపడిపోతాడు. అంతేకాదు ఈ విషయం ఆమె ఇంట్లో తెలిసిపోయిందేమోనని భయపడిపోతాడు. తన కారణంగా ఆ ఇంట్లో గొడవ జరుగుతుందేమోనని ఆందోళన చెందుతాడు.
దాంతో లీలా వాళ్లింట్లో అసలు ఏం జరిగి ఉంటుందనే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అది తెలుసుకోవడమే ఈ సమస్యకి పరిష్కారం అని రంగంలోకి దిగాడు. తన ముగ్గురు స్నేహితుల సాయంతో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు ఏమైంది? లీల మనసులో ఏముంది? ప్రసాద్ జీవితాశయం పోలీసు కాగలిగాడా ? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (Leela Vinodam Story).
ఎలా ఉంది
అమ్మాయికి ఐలవ్యూ చెప్పాక , ఆమె నుంచి రెస్పాన్స్ రాకపోతే ఆ కుర్రాళ్ల పరిస్థితి ఏమిటి..వాళ్ల ఊహలు ఎలా ఉంటాయి. అసలు నిజం ఏమై ఉంటుందనే విషయాలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సినిమా మొత్తం హీరో, అతని ఫ్రెండ్స్ చుట్టూనే తిరుగుతుంది. హీరోయిన్ కు పెద్దగా ప్రయారిటీ లేదు. హీరోకు ఫ్యామిలీ చూపెట్టినా ఆ ఎమోషన్స్ ని పెద్దగా పట్టించుకోలేదు. సినిమా మొత్తం ఏదో జరిగిపోయి ఉంటుందనే ఊహ చుట్టూనే తిరుగుతుంది. అంతకు మించి ఏమీ లేదు. అయితే అలా లేకపోవటం కూడా కొత్త కాబట్టి, ఉన్నంతలో ఇంట్రస్టింగ్ గానే కొన్ని సీన్స్ రాసుకున్నారు కాబట్టి అలా నడిచిపోతుంది. పెద్ద ఫన్ లేదు. జస్ట్ ఓకే అన్నట్టు నడుస్తుంది.
ఎవెరలా చేసారంటే..
ప్రధాన పాత్రలో షణ్ముఖ్ జస్వంత్ .. అనఘ .. ఓకే అనిపిస్తారు. ఫ్రెండ్స్ పాత్రలు కీలకమైనప్పుడు వాళ్ల క్యారెక్టర్ మరింత బాగా డిజైన్ చేసి ఉండాల్సింది. దర్శకుడు పవన్ సుంకరకి ఇదే మొదటి సినిమా కావడం ఆ అనుభవలేమి కొన్ని చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. ఆమని .. గోపరాజు రమణ .. రూప లక్ష్మి వంటి ఆర్టిస్టులను వాడుకో లేదనిపించింది. ఇంకాస్త కామెడీ ఉంటే ఈ సినిమా చెప్పుకోదగిన విధంగా ఉండేది. లవ్ స్టోరీని డైరెక్టర్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. కృష్ణచేతన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. నరేష్ అడుప ఎడిటింగ్ ఓకే.
చూడచ్చా
ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా చూస్తే ఫర్వాలేదనిపిస్తుంది. ఓ వీకెండ్ కు కాలక్షేపం ఇస్తుంది.
ఎక్కడుంది
ఈటీవి విన్ లో తెలుగులో ఈ సినిమా ఉంది