'గురక' పై రెండు సినిమాలు.. ఒకటి హిట్..రెండోది ఫట్ ...ఎందుకంటే

గురక సమస్యపై వచ్చిన రెండో సినిమా డియర్. మొదటి సినిమా గుడ్‌నైట్. గురక బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన తొలిసి సినిమా హిట్ అయింది. మరి రెండోది ఎందుకు ప్లాప్ అయింది..

Update: 2024-04-14 02:15 GMT

"కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకనర్హం" అని శ్రీశ్రీ అన్నట్లు… జీవితంలో ఎదురుపడే ప్రతీ సంఘటన, అంశాన్ని సినిమా కథగా మార్చవచ్చు అని ప్రూవ్ చేస్తున్నారు తమిళ, మళయాళ దర్శకులు, రచయితలు. నిత్య జీవితంలో మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లోంచే ఓ చిన్న అంశాన్ని తీసుకొని దాన్ని కథలా మార్చి రెండున్నర గంటల సినిమా తీసి హిట్ కొడుతున్నారు వీళ్లు. ఇంతకు ముందు ఇరాన్ ఫిల్మ్స్‌లలో ఇలాంటి టెక్నిక్ ఉండేది. ఇప్పుడు మనవాళ్లు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు..

లేకపోతే గురక అనే చిన్న సమస్యను తీసుకొని దానికి కథ రాసి సినిమా తీయడం ఏమిటి.. అది సూపర్ హిట్ అవటం ఏమిటి. ఇప్పుడు దానికి సీక్వెల్ అనిపించేలా… ఇంకో సినిమా గురక నేపథ్యంలో రావడం విశేషమే. అసలు గురక మీద కామెడీ ట్రాక్ చేయటానికే మన క్రియేటివిటి లెవిల్స్ నిద్రపోతాయి. కానీ వాళ్లు మేల్కొని మరీ గురక చుట్టూ రెండు కథలు అల్లేసి సినిమాలు తెరకెక్కించేశారు.

వాస్తవానికి మనలో చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు. ఇది మనకు తెలియకపోవచ్చు కానీ పక్కనుండే వాళ్లను మాత్రం చాలా చికాకు పెడుతుంది. భలే చికాకుగా అనిపిస్తుంటుంది. కుదిరితే దూరంగా వెళ్తాం లేదంటే చేసేదీమీలేక మనం కూడా వాళ్ల గురకకు అలవాటు పడిపోతాం. ఇది చెప్పుకునేంత పెద్ద సమస్య కాదు అలా అని చిన్నది కూడా కాదు. అలాంటి గురక బ్యాక్‌డ్రాప్‌లోనే సినిమా తీస్తే ఎలా ఉంటుందని, ఎవరైనా తీస్తారని ఎప్పుడైనా ఆలోచించామా? దాని చుట్టూనే కథ అల్లి గుడ్‌నైట్‌, డియర్ అనే సినిమాలు తీశారు.

గుడ్ నైట్‌లో హీరో గురక వల్ల అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది ఎంతో ఆసక్తిగా చూపించారు. ఈ సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్లు లేకపోయినా సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను బాగా నవ్వించిన గుడ్‌నైట్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. జనాలు బాగానే చూసి ఎంజాయ్ చేశారు. అదే కోవలో ఇప్పుడు 'డియర్' అనే మరో గురక చుట్టూ తిరిగే కథతో సినిమా వచ్చింది. 'డియర్' ఈ వారం రిలీజైంది.

గురక చుట్టూ కథ అనగానే యాజ్ యూజువల్‌గా 'గుడ్ నైట్'తో కంపేరిజన్స్ వచ్చాయి. 'గుడ్ నైట్'లో హీరో గురక పెడితే... 'డియర్'లో హీరోయిన్ గురక పెడుతుంది. గురక వల్ల సంసార జీవితంలో సమస్యలు వస్తాయని ప్రేక్షకుడు ఊహిస్తాడు. అతడి ఊహకు అందని విధంగా సన్నివేశాలు, కథనం ఉన్నప్పుడు మాత్రమే సినిమా ఆసక్తిగా ముందుకు కదులుతుంది. దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్ ఆ తరహాలో సినిమాను ముందుకు తీసుకు వెళ్లాడా.. విఫలమయ్యాడా అంటే ఐడియా లెవిల్‌లో బాగా రాసుకున్న ఈ సినిమా ట్రీట్మెంట్ విషయంలో దెబ్బ తింది.

'డియర్'లో కథేమిటంటే... టీవిలో న్యూస్ రీడర్‌గా పనిచేస్తూండే అర్జున్ (జీవీ ప్రకాష్)కు నిద్ర అత్యవసరం. టీవిలో ముఖం ఫ్రెష్‌గా కనపడాలంటే రోజూ 8 గంటలు కచ్ఛితంగా నిద్రపోవాలి. కానీ అతనికి ఏ చిన్న శబ్దం వినిపించినా మెలకువ వచ్చేసే సమస్య ఉంటుంది. ఇక అర్జున్‌కి.. దీపిక(ఐశ్వర్య రాజేష్)తో పెళ్లి జరుగుతుంది. దీపికకు ఓ సమస్య అదేమిటంటే... నిద్రపోతే భయంకరంగా గురక పెడుతుంది. పెళ్లైన కొత్తలో కొన్ని రోజులు అర్జున్‌కి తన భార్య గురకతో చాలా భారంగా నడుస్తాయి. దీంతో నిద్ర సరిపోక అర్జున్ బాధపడుతూ ఉంటాడు. ఓ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసే సమయంలో అర్జున్‌కి నిద్ర వచ్చి ఆఫీస్ బాత్రూంలో నిద్రపోవడంతో అతని ఉద్యోగం పోతుంది. దీంతో తన భార్య మీద చిరాకు.. గొడవలతో.. విడాకులు ఇవ్వాలనుకుంటాడు. ఈలోగా దీపిక ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అప్పుడు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అంతకు ముందు వచ్చిన ‘గుడ్ నైట్’ సినిమాలో కథేమిటంటే... అయితే హీరోకు గురక సమస్య ఉంటుంది. తనకున్న గురక సమస్య వల్ల నిత్యం అందరితో తిట్లు తింటూనే ఉంటాడు. ఈ లోగా హీరోయిన్‌తో పరిచయం, ప్రేమ.. పెళ్లి. తనకు గురక సమస్య ఉందనే విషయం ముందునుంచీ హీరోయిన్ దగ్గర దాస్తూవస్తాడు. పెళ్లి తర్వాత అసలు విషయం బయటపడుతుంది. గురక వల్ల వారి మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. భర్త సమస్యను భార్య అర్థం చేసుకుందా లేదా తర్వాత ఏం జరిగింది? అనేదే సినిమా.

ఈ రెండు కథల్లో లైఫ్ పార్టనర్‌లో ఒకరికి గురక ఉంటే మరొకరికి ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి. అనేది ఫన్నీగా డీల్ చేశారు. గుడ్ నైట్ సినిమాలో భర్తకు గురక ఇబ్బంది ఉంటే భార్య పడే కష్టాలు ఏంటి అని చూపించారు. ఇందులో దానికి రివర్స్‌గా భార్యకు గురక ఉంటే భర్త పడే ఇబ్బందులు ఏంటి అని చూపించారు. అయితే ‘గుడ్ నైట్’ నాటికి సినిమాల్లో గురక అనేది కొత్త సమస్య. కానీ డియర్‌కు వచ్చేసరికి అది రొటీన్ అయ్యిపోయింది. అలాగే కొత్త సీన్స్ ఏమీ పెద్దగా లేవు. దాంతో పెద్దగా ఏమీ అనిపించలేదు. అయితేనేం గురక మీద రెండు సినిమాలు రావడం మాత్రం గొప్ప విషయమే.

Tags:    

Similar News