మార్గన్: ది బ్లాక్ డెవిల్ రివ్యూ
అసలు కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు కొత్తవాడేం కాదు. బిచ్చగాడుతో అతను మన దగ్గర ఓ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో ఏదీ ఆ రేంజ్లో హిట్ కాలేదు. అయినా ఆయన జోరు ఏ మాత్రం తగ్గలేదు. రిలీజ్ ల స్పీడ్ మాత్రం కంటెంట్ రేంజ్ కంటే ముందే పరిగెడుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన "మార్గన్: ది బ్లాక్ డెవిల్" అనే డార్క్ థ్రిల్లర్‌తో మళ్లీ భాక్సాఫీస్ తలుపు తట్టాడు.
మార్గన్: ది బ్లాక్ డెవిల్ అనే టైటిల్ వినగానే హాలీవుడ్ టైటిల్ లాగ అనిపిస్తుంది. అదే టోన్‌లో మొదటి 6 నిమిషాల్లోనే శరీరాన్ని మసిగా మార్చే మర్డర్‌తో మొదలయ్యే కథ, ఓ ఇంటర్నేషనల్ క్రైమ్ థ్రిల్లర్ వర్కౌట్ అవుతున్న ఫీలింగ్ ఇస్తుంది. అయితే ఆ ఫీల్ ని తర్వాత కొనసాగించాడా..అసలు కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
హైదరాబాద్ నగరాన్ని షేక్ చేసిన ఓ బ్రూటల్ హత్య. బాధితురాలు రమ్య. ఆమెపై ఓ కిల్లర్ ఇంజెక్షన్ ఉపయోగించి దారుణంగా చంపేస్తాడు – శరీరం మొత్తం బ్లాక్ కర్బన్తో నిండిపోయినట్లు మారిపోతుంది. ఈ కేసు మీడియాలో దుమారం రేపగా, ముంబయి అడిషనల్ డీజీపీ ధృవ్ కుమార్ (విజయ్ ఆంటోనీ) దీన్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే... ఇదే విధంగా అతని కూతురు కూడా హత్యకు గురైంది.
దాంతో రమ్య కేసును పర్సనల్‌గా తీసుకున్న ధృవ్, హైదరాబాద్ పోలీస్ సహాయంతో అనధికారికంగా విచారణ మొదలుపెడతాడు. ధృవ్ ఇది కేసు కాకుండా... తన కూతురు చివరి క్వశ్చన్‌కి సమాధానం అని భావించి కేసు లోతుల్లోకి తవ్వటం మొదలెడతాడు. అరవింద్ (అజయ్ దిశాన్) అనే కుర్రాడు ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అవుతాడు. కానీ, విచారణలో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. అరవింద్ నిజంగా గిల్టీనా? ధృవ్ కుమార్తె హత్యతో రమ్య కేసుకు సంబంధముందా? అసలు ఈ కేసుల వెనక ఉన్న బ్లాక్ డెవిల్ ఎవడు? అతని మోటివ్ ఏమిటి? అన్నది తెరపై చూడాల్సిన కథ.
ఎనాలసిస్ :
మర్డర్ మిస్టరీ కథలు సింపుల్ గా ఒకే రూట్ లో ప్రయాణం పెట్టుకుంటాయి. మర్డర్ – ఇన్విస్టిగేషన్ – క్లూ – ట్విస్ట్ – కిల్లర్ రివీల్. కానీ గొప్ప స్క్రీన్‌ప్లేలు ఇదే మూసలో కొత్త దారులు త్రవ్వుతాయి. 'మార్గన్: ది బ్లాక్ డెవిల్' కూడా ఇదే ఈజీ రూట్‌ను తీసుకుంది. కాని మార్గ మధ్యలో మాత్రం ఓ చోట రూట్ మార్చుకుంది. ఓ మర్డర్ మిస్టరీగా మొదలైన కథ, అరవింద్ అనే పాత్ర ద్వారా ఆకస్మాత్తుగా సైకలాజికల్, ఆధ్యాత్మిక కోణాల్లోకి మలుపుతీసుకుంటుంది.
ఇక్కడే దర్శకుడి కొత్త ప్రయత్నం చేసాడని అర్థం చేసుకోవాలి – కిల్లర్ కేవలం 'ఎవరు చంపాడు?' అనే ప్రశ్న కాకుండా, 'ఎందుకు చంపాడు?' అన్న యాంగిల్ ని ఎక్సప్లోర్ చేసారు. ఇది సాధారణంగా డేవిడ్ ఫించర్ సినిమాల్లో కనిపిస్తూంటుంది. “A killer is not a twist. A killer is a reflection of what the world did to him.”
“మూడ్ తేలిపోతే మర్డర్ స్కీమ్ వర్క్ అవ్వదు… స్క్రీన్ మీద మర్డర్ జరగడం కాదు, అది మనలో జరగాలి.”
ఇక అరవింద్ లవ్ స్టోరీ ఈ కథలో ఓ ప్యాచ్ లా అనిపిస్తుంది. కొద్దిగా అసంబద్ధంగా అనిపించినా, అతని అసాధారణమైన మెమరీ పవర్, గతాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లా తిప్పే ప్రతిభ, సూక్ష్మదేహం అనేదాన్ని టచ్ చేసిన విధానం – ఇవన్నీ రిస్కీ, కానీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లు. అయితే ఇవి స్క్రీన్‌ప్లేలో మనం ఎప్పుడెప్పుడో విని చూసిన "సైన్స్ vs స్పిరిటువల్" డైలెమా లా కాస్త క్లిష్టంగా అనిపిస్తాయి.
అవి ఎంతలా అంటే ఓ దశలో ప్రేక్షకుడి రీజనింగ్‌ను పరీక్షించే దశకు చేరి, మరి కొన్ని చోట్ల అది కథ మీద నమ్మకాన్ని దెబ్బతీసి, ఎటు నుంచి ఎటు వెళ్తుందా అనిపించి బుర్ర గోక్కుంటాం. ఓ స్క్రిప్టులో అతీంద్రియ శక్తులను ప్రవేశపెడితే, ఖచ్చితంగా వాటిపై అపనమ్మకాలని చెప్తూ బ్యాలెన్స్ చేయగలగాలి. అదే లోపించింది. మిగతాదంతా బాగుంది. కొత్తగా అనిపిచింది.
ఏదైమైనా ఫస్టాఫ్ వరకు టెన్షన్ ని నిలబెట్టిన కథ, రెండో భాగంలో ఇన్విస్టిగేషన్ తో స్లో అయ్యింది. అరవింద్ పాత్రకు అనవసరంగా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో, క్రైమ్ థ్రిల్లర్ కాస్త క్రైమ్ కిల్లర్ గా మారిపోయింది.ఈ సినిమా నుంచి తెలుసుకోవాల్సిన గొప్ప పాఠం... విలన్ ఎప్పుడు శక్తిమంతుడు గా కనపడతాడంటే...అతని లాజిక్స్,రీజన్స్ బలంగా, మనం నమ్మదగినదిగా ఉంటేనే . లేకుండా తేలిపోతాడు.
స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోతే, ఎంత స్టైల్ పెట్టినా, కథంతా "బ్లాక్ హోల్" లోకి జారిపోతుంది.
టెక్నికల్ గా .. మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి మార్కులు పడతాయి. నటుల్లో విజయ్ ఆంటోని కన్నా అజయ్ దిశాన్ బాగా చేసాడు. అతనిదే సినిమా.
ఫైనల్ థాట్
ఈ సినిమా ఏదో ఉందే అనిపిస్తూనే… ఏమీ లేకుండా మాయమవుతుంది. అర్దమయ్యేలా చెప్పాలంటే ఓపెనింగ్ చాలా బాగుంది. కాని, కంటెంట్ లో కంట్రోల్ లేకుండాపోయింది.
డెవిల్ డ్రెస్ వేసుకుని వండిన హాఫ్కుక్డ్ థ్రిల్లర్!
చూడచ్చా?
మరీ హై కాన్సెప్టు థ్రిల్లర్ లా ఊహించుకోకుండా చూస్తే బాగానే ఉందనిపిస్తుంది. కొన్ని ఎలిమెంట్స్ నచ్చుతాయి. వాటితో సరిపెట్టుకుంటే హ్యాపీనే.