'తుండు' నెట్ ఫ్లిక్స్ మూవీ రివ్యూ

బిజూ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ మూవీ ‘తుండు’. ఈ సినిమా కథ ప్రమోషన్ కోసం పరీక్షలో కాపీ కొట్టిన కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఇక సినిమా ఎలా ఉందంటే..

Update: 2024-04-02 13:56 GMT

మలయాళ కథలు ఈ మధ్య బాగా భిన్నంగా వస్తున్నాయి. రెగ్యులర్ హీరోయిజంకు, పవర్ ఫుల్ ప్రాస డైలాగ్స్‌కు వారు స్వస్తి చెప్తున్నారు. సామాన్యుడిని హీరో చేసి పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఆ క్రమంలో ఒక్కోసారి అది సినిమా అనే విషయం మర్చిపోయి టీవి సీరియల్‌ని తలిపిస్తున్నారు. ప్రతీ మలయాళ సినిమా అద్భుతం అని ఎక్సపెక్ట్ చేయొద్దు అని చెప్పే ప్రయత్నం కొందరు దర్శకులు చేస్తున్నారు. మలయాళం నటుడు బిజూ మీనన్ ఇలాంటి సాదా సీదా కథలకు పెట్టింది పేరు.

తెలుగులో బిజూ మీనన్ అంటే 'రణం, ఖతార్నాక్' వంటి సినిమాల్లో విలన్ గుర్తుకు రావచ్చేమో కానీ మలయాళంలో మాత్రం సాదా సీదా పాత్రలే గుర్తొస్తాయి. అయ్య‌ప్ప‌కోషియ‌మ్ లాంటి క్లాసిక్ సినిమాతో పేరు తెచ్చుకొన్న‌ బీజూ మీన‌న్ తాజాగా హీరోగా నటించిన 'తుండు' సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే...

బేబి (బిజూమీనన్) సగటు సాదా సీదా ఏ ప్రత్యేకతల్లేని కానిస్టేబుల్. కేరళలోని 'త్రిస్సూర్' పోలీస్ స్టేషన్‌లో పనిచేసే అతనికి భార్య సీనా (ఉన్నిమయ ప్రసాద్), టీనేజ్ కొడుకు ఉంటారు. కొడుకు ఇంటర్ చదువుతుంటాడు. అయితే అతను ఓ సారి పరీక్షల్లో కాపీ కొట్టి దొరికిపోతాడు. దాంతో తండ్రి బేబిని పిలిచి అధికారులు మందలిస్తారు. మీ కొడుకుకి బుద్ధి చెప్పి లైన్‌లో పెట్టుకోమని సలహా ఇస్తారు. లేకపోతే సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇస్తారు. తలవొంచుకుని మరోసారి తన కొడుకు వల్ల అలాంటి పొరపాటు జరగదని హామీ ఇచ్చి వస్తాడు.


ఇక బేబికి ఆఫీస్‌లో ఓ సమస్య ఉంటుంది. అతనిపై ఉన్న హెడ్ కానిస్టేబుల్ శిబిన్ చంద్రన్ ( షైన్ టామ్ చాకో) టార్చర్ పెడుతుంటాడు. ఇద్దరికీ పడదు. అతని బారి నుంచి బయటపడాలంటే ప్రమోషన్ రావాలి. అంటే టెస్ట్ రాసి పాసవ్వాలి. కానీ బేబి ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చదువుకున్న చదువు. ఇప్పుడు మళ్లీ పుస్తకాలు తెరవాలంటే కష్టం.. బద్దకం.. కానీ తప్పదు. ఇప్పుడు బేబికి దారేముంది.. డిజిగ్నేషన్ మారకపోతే జీవితం ప్రశాంతంగా నడవడం కష్టం. అప్పుడు తన కొడుకు చేసిన పనే తానూ చేయాలనుకుంటాడు. అదే కాపీ. కానీ భయం అతన్ని హెచ్చరిస్తుంటుంది. కానీ తోటి వాళ్ళు అతనికి ధైర్యం చెప్తారు. డిపార్టమెంట్ పరీక్షల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరని అంటారు.

సరే అని ఎగ్జామ్ హాల్‌కి చిట్టీలు పట్టుకుని వెళ్లి రాయడం మొదలుపెడతాడు. అయితే ఇంతలో స్క్వాడ్‌గా వచ్చిన సత్యచంద్రన్ (బైజు) బేబిని పట్టుకుంటాడు. దాంతో ఇదంతా మీడియాలో వస్తుంది. ఇక ఇప్పుడు పూర్తి అవమానభారం. ఇన్ హౌస్ (పోలీస్ డిపార్ట్‌మెంట్‌)లో ప‌నిష్‌మెంట్ ఇస్తారు. అప్పుడు బేబీ ఏం చేస్తాడు? ఏం చెయ్యగలడు? అనేది మిగతా కథ.

ఇక ఈ సినిమా ఎత్తుకున్న పాయింట్ చూసి ఏదో రియలిస్టిక్ స్టోరీ నేరేట్ చేస్తున్నారనుకుంటాము. కానీ అదేమీ జరగదు. మొదటి నుంచి చివరి దాకా అలా వెళ్తూనే ఉంటుంది. హీరో ఏమి చెయ్యటానికి ఉండదు. ఎక్కడన్నా అలాంటి అవకాశం ఉన్నా దాన్ని దర్శకుడు దాటేస్తాడు. కొడుకు కాపీ, తండ్రి కాపీ తప్పించి చెప్పుకోదగిన ఎలిమెంట్ ఏదీ ఈ కథలో లేదు. సినిమా చూశాక మనం కాఫీ తాగి రిలాక్స్ అవ్వడం తప్పించి ఏమీ చెయ్యలేం. దర్శకుడు రియాజ్ షరీఫ్ .. కనప్పన్‌తో కలిసి రాసుకున్న కథ అసలు మలుపంటూ లేకపోవటమే సినిమా విసుగెత్తించటానికి కారణం. భారీ పోలీస్ డైలాగులు లేకపోయినా ఫర్వాలేదు.

మినిమం ప్రధాన పాత్ర ఏమీ చేయకపోతే.. అంత చేతకాని వాడి కథ ఏం చూడగలం. ఈ కథలో హీరో బిజు మీనన్‌ని చూసి జాలి పడతాం. ఆ తర్వాత ఈ సినిమాలో ఏదైనా ఉందేమో అని చివరి దాకా వెయిట్ చేసినందుకు మన మీద మనం జాలి పడతాం. అయితే సినిమాలో అసలేమీ లేదా అంటే కొన్ని చోట్ల ఫన్ ఉంది. హీరో కాపీ కొట్టి పరీక్షలు రాయడం.. పోలీస్ వ్యాన్‌లో పొరపాటున టియర్ గ్యాస్ ప్రయోగం జరగడం.. పోలీస్ ట్రైనింగ్ డాగ్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ నవ్విస్తాయి. అయితే ఇవి మాత్రమే సరిపోవు కదా.. రెండు గంటలు పైగా సాగిన సినిమాని నిలబెట్టడానికి . నటీనటుల్లో.. బిజూ మీనన్, షైన్ టామ్ చాకో ఎప్పటిలాగే బాగా చేశారు. కానీ వాళ్ల పొటెన్షియల్‌ని ఇంకా బాగా వాడుకునే అవకాసం ఈ కథ ఇవ్వలేదు. జింషీ ఖాలిద్ కెమెరా వర్క్, నబూ ఉస్మాన్ ఎడిటింగ్, గోపీసుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అలాగే నీరసంగా కథకి తగినట్టుగా సాగాయి.


చూడచ్చా?

ఓటిటీలో మనం చూద్దామనుకున్న సినిమాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు ఈ సినిమా ఓ ఆప్షన్ అంతే.

ఎక్కడ చూడచ్చు..?

నెట్ ఫ్లిక్స్‌లో తెలుగులో ఉంది

నటీనటులు: బిజు మీనన్ , షైన్ టామ్ చాకో, ఉన్నిమయ ప్రసాద్, గోకులన్, రఫీ తదితరులు

కథ: కన్నప్పన్, రియాజ్ షరీఫ్

ఎడిటింగ్: నబు ఉస్మాన్

మ్యూజిక్: గోపి సుందర్

సినిమాటోగ్రఫీ: జింషీ ఖలీద్

నిర్మాతలు: అషిఖి ఉస్మాన్ , జింషీ ఖలీద్

దర్శకత్వం: రియాజ్ షరీఫ్


Tags:    

Similar News