రేవంత్ బెనిఫిట్ షో నిర్ణయం సింగిల్‌ స్క్రీన్‌లకు ప్రాణం పోస్తుందా?

ఇండస్ట్రీ తరలింపునకు ఆంధ్రా నుంచి పిలుపు, వినేవాళ్లున్నారా?

Update: 2024-12-24 05:46 GMT

తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ వివాదం ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే.. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ పుష్ప రాజ్ అని మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ గవర్నమెంట్, తెలుగు పరిశ్రమ మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందంటూ మరో చర్చను లేవనెత్తారు. ఇండస్ట్రీ ఏపీకి రావాలని, వారు వస్తే తాము ఘనంగా స్వాగతిస్తామని చెప్పారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన కూడా చెప్పారు. అంతేకాదు పవన్ కల్యాణ్‌ కూడా ఇండస్ట్రీ ఏపీకి రావాలని కోరుతున్నారని, స్వయంగా అధికారులతో చర్చించినట్లు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ఈ తరుణంలో తెలుగు పరిశ్రమ ఏపీకి షిఫ్ట్ కాబోతోందా అంటూ డిస్కషన్స్ మొదలయ్యాయి .

అయితే ఆంధ్రా లీడర్ల నుంచి ఆహ్వానం ఉన్నా మూవీ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలిపోవడం సాధ్యం కావటం లేదు. 2014 నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వైజాగ్ లో రామానాయుడు స్టూడియో వచ్చినా, అంతకు మంచి ముందుకు సాగలేదు. అందురు రకరకాలు కారణాలు చెప్తున్నారు. ఆంధ్రా వాతావరణం షూటింగ్ లకు అనుకూలంగా ఉండదని, ఇక్కడే షూటింగ్ ల కు సరబడ టెక్నికల్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ల దాకా అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారని అన్నారు. అయితే అసలు కారణం పెద్ద హీరోలు అక్కడకి షూటింగ్ లకు రావటానికి ఇష్టపడటం లేదని, సాయింత్రానికి ఇంటికి వెళ్లిపోయేలా హైదరాబాద్ లోనే షూటింగ్ లు పెట్టుకోమని అంటున్నారని చెప్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం... సింగిల్ స్క్రీన్స్ కు ప్లస్

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఏమీ బాగోలేదు. టిక్కెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో ప్రేక్షకులు అంతంత రేట్లు పెట్టి సినిమా థియేటర్స్‌కి రావటం తగ్గించేసారు. ఈ క్రమంలో తాజాగా బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరలు పెంచేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ పేర్కొంది. ఒక్కో సినిమాకు ఒక్కోరకంగా టికెట్‌ ధరలు పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ (telugu film distributors association) అభిప్రాయపడింది. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌ సమావేశం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఈ సందర్బంగా తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ అధ్యక్ష్యుడు విజయేందర్ రెడ్డి ... మాట్లాడుతూ...‘‘కొత్త సినిమా విడుదలైన రెండు, మూడు రోజులు అభిమానులు, కాలేజ్‌ స్టూడెంట్స్‌, యువత, మాస్‌ ఎక్కువగా చూస్తారు. టికెట్‌ ధరలు పెంచి, వారి నుంచి అత్యధిక వసూళ్లు చేయడం బాధాకరంగా ఉంది. అన్ని సినిమాలకు నిర్ణీత మొత్తంలోనే టికెట్‌ ధరలు ఉండేలా చూడాలని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ దిల్‌రాజును కోరాం. ఈ క్రమంలో సీఎం రేవంత్‌, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రీమియర్‌ షోల పేరిట రూ.1200 టికెట్‌ ధర పెడితే, అదే ధర ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. ఇటీవల విడుదలైన ‘పుష్ప’ విషయంలోనూ అనేక రకాలుగా ధరలు నిర్ణయించారు.ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది ఆంధ్రా ఎగ్జిబిటర్లు, నిర్మాతలు స్వాగతించారు. ఇది సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లకు మరో నాలుగేళ్ల పాటు ప్రాణం పోసినట్లు అయింది. ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా చూసి డబ్బులు రావాలనుకోవాలని కానీ, తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయలన్న నిర్మాతల నిర్ణయం సరైనది కాదు’’ అన్నారు.

అలాగే ‘‘బెనిఫిట్‌ షోలు, రేట్లు పెంచవద్దని మేం డిమాండ్‌ చేస్తున్నాం. సినిమా నిర్మాణ ఖర్చు ఎక్కువ అయిందని రేట్లు పెంచుతున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. కానీ, థియేటర్‌లో ఆక్యుపెన్సీ తగ్గుతోంది. ఏపీ ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇచ్చాం. బెనిఫిట్‌ షోలకు అధిక రేట్లు వద్దని కోరాం. తెలంగాణ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొస్తాం. పెంచిన టికెట్‌ రేట్ల భారం మొత్తం ప్రేక్షకుడి మీదే పడుతోంది. ఏడాదిలో 80శాతం మిడిల్‌ బడ్జెట్‌ సినిమాలు వస్తున్నాయి. పెద్ద బడ్జెట్‌ సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రేక్షకుడు ఆ నెలలో ఆ సినిమా చూసి మరో దానికి వెళ్లడం లేదు. దీంతో చిన్న, మిడ్‌ రేంజ్‌ సినిమాలు దెబ్బ తింటున్నాయి’’అని చెప్పుకొచ్చారు.

ఇక ‘‘టికెట్‌ ధరల పెంపు, ప్రస్తుతం తారస్థాయికి చేరింది. రూ.1000 టికెట్‌ ధర అని చెప్పడంతో ప్రేక్షకుడు ముందుగానే సినిమాకు వెళ్లే యోచన చేయడం లేదు. రేటు తక్కువ ఉంటే, ప్రేక్షకులు బాగా వస్తారు. అమెరికా, చైనాలతో పోలిస్తే, భారత్‌లో సినిమా స్క్రీన్‌లు తగ్గిపోతున్నాయి. అమెరికాలో ముగ్గురు కలిసి సినిమా చూడాలంటే సుమారు 50 డాలర్లు ఖర్చవుతుందనుకుందాం. వారి సగటు వేతనం 5వేల డాలర్లు అనుకుంటే, అందులో ఒకశాతం మాత్రమే. కానీ, ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. ఒక మధ్య తరగతి వ్యక్తి సగటు జీతం రూ.25వేలు అనుకుందాం. సినిమా చూడటానికి నలుగురున్న కుటుంబం వెళ్తే, రూ.1000 నుంచి రూ.1500 అవుతోంది. అంటే, జీతంలో ఐదారుశాతం సినిమా చూసినందుకు అయిపోతోంది. ఇక డబ్బులు ఉండటం లేదు. దీంతో చిన్న సినిమాలు చూడటానికి వాళ్లు థియేటర్‌కు రావటం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేసారు.

‘‘నిర్మాతలను మేం కోరేది ఒక్కటే.. ప్రేక్షకులు రెండు రకాలు.. డబ్బులున్న వాళ్లు మల్టీప్లెక్స్‌లో చూస్తారు. అక్కడి సౌకర్యాలకు అనుగుణంగా ధరలు పెంచుకోండి. మధ్యతరగతి వాళ్లు సింగిల్‌ స్క్రీన్‌లకు వస్తారు. ఇక్కడ టికెట్‌ ధర రూ.500 పెడితే ఎవరూ రావటం లేదు. పెంచిన టికెట్‌ ధరకు సరిపడా సౌకర్యాలు మా దగ్గర లేవు. దీంతో ప్రేక్షకులు తిట్టుకుంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల వాళ్లు సంతోషపడే నిర్ణయం తీసుకున్నారు’’ అని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News