‘పుష్ప 2’ కలెక్షన్స్: మెగా ఇంపాక్ట్ పడిందా?

నార్త్ లో దుమ్ము రేపుతోందా?;

Update: 2024-12-07 01:36 GMT

అంతటా 'పుష్ప 2'  మేనియా కనపడుతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా కలెక్షన్స్ కబుర్లే వినిపిస్తున్నాయి. ప్రభాస్ కల్కి తర్వాత ఈ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇదే. ఆ క్రేజ్ ఎంతలా అంటే సినిమా వెయ్యకపోతే థియేటర్ యాజమాన్యంపై దెబ్బలాటలకు దిగేంతలా. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పుష్ప సినిమా వేయలేదని థియేటర్‌పై కొంత మంది రాళ్లదాడికి దిగారు. అనంతరం థియేటర్‌ ఓనర్‌‌పై బెదిరింపులకి కూడా దిగారు. అలాగే చెన్నైరులోని శ్రీనివాస థియేటర్‌లో మరమ్మతుల కారణంగా పుష్ప 2 సినిమాని ప్రదర్శించలేకపోయారు. దాంతో థియేటర్ లోపలికి ప్రవేశించి రాళ్లతో థియేటర్‌లోని అద్దాలను ధ్వంసం చేశారు.

ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. పుష్ప బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌తో సీక్వెల్ కోసం దాదాపు మూడేళ్లుగా దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తోన్నారు. ఇదంతా పుష్ప‌రాజ్ క్యారెక్ట‌ర్ క్రియేట్ చేసిన ఇంపాక్టే. పుష్ప‌రాజ్ పాత్ర‌లో అల్లు అర్జున్ మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్ మాస్ క్లాస్ అంద‌రికి నచ్చేసాయి, ఎక్కేశాయి. ఈ నేపధ్యంలో పుష్ప 2 కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. మెగాభిమానుల నిరసన ఇంపాక్ట్ ఏమన్నా కనిపిస్తోందా, నార్త్ లో ఊహించినట్లుగానే దుమ్ము రేపుతోందా చూద్దాం.

పుష్ప 2 చిత్రానికి టిక్కెట్ రేట్లు మునిపెన్నడూ లేని విధంగా పెంచటం, ప‌న్నెండు వేల‌కుపైగా స్క్రీన్స్‌లో సినిమా రిలీజ్ కావ‌డం, అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వంద కోట్లు దాట‌డం.. ఇలా రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డుల‌తో పుష్ప 2పై అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు వెయ్యి కోట్ల టార్గెట్‌తో పుష్ప ది రూల్ బాక్సాఫీస్‌ బ‌రిలోకి దిగిందీ చిత్రం. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ సినిమా మొదటిరోజు వసూళ్లలోనూ సత్తా చాటింది.

డిసెంబర్‌ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన ‘పుష్ప 2’ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లోనూ టాప్‌లో కొనసాగుతోంది. మొదటి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువే. అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసినట్లు నిర్మాణసంస్థ అఫీషియల్ గా తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్‌ విడుదల చేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం ‘పుష్ప 2’ అని చెప్పుకొచ్చింది.

అయితే పుష్ప 2: ది రూల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్‌ తర్వాత రెండో రోజు కొంతమేరకు కలెక్షన్లలో తగ్గుదల కనిపిస్తోంది. అయితే నార్త్ లో మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు వెర్షన్ బుకింగ్స్ లో మార్పు కనపడుతోంది. ఈ స్దాయి భారీ ప్రమోషన్స్ ఉన్నప్పుడు మొదటి రోజు భాక్సాఫీస్ దగ్గర తన ర్యాంపేజ్ చూపించటంలో ఆశ్చర్యం లేదు కానీ రెండో రోజుకే డ్రాప్ అనేది ఆశ్చర్యంగా ఉందంటోంది ట్రేడ్. అయితే అందుకు భిన్నంగా నార్త్ లో 2వ రోజు 60% అడ్వాన్స్ బుక్కింగ్ లు కనపడుతోంది దాంతో అక్కడ రెండో రోజు ఖచ్చితంగా 50 కోట్లు నికర ఆదాయం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.

బాలీవుడ్‌లో పుష్ప 2 స్టార్ హీరోల ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. తొలిరోజు రూ.67 కోట్ల వసూళ్లతో అద్భుతం సాధించింది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు హయ్యెస్ట్ ఓపెనింగ్ రికార్డు ఉంది. కానీ ఇప్పుడు దాన్ని పుష్పరాజ్ బద్దలుకొట్టాడు.హిందీ మార్కెట్‌లో అల్లు అర్జున్ సంచలనం సృష్టించాడు. హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా పుష్ప2 మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఈ రికార్డు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్న నటించిన జవాన్ మూవీ రూ.65.5 కోట్లతో హిందీ బాక్సాఫీసు వద్ద అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఉంది. ఇప్పుడు పుష్ప రూ.67 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసింది.

సౌత్ కు వచ్చేసరికి పుష్ప 2 కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ లు కేవలం మొదటి రోజు అడ్వాన్స్ లలో మూడవ వంతు మాత్రమే ఉన్నాయని ట్రేడ్ అంటోంది. అందుకు కారణం విపరీతంగా పెంచేసిన టిక్కెట్ రేట్లు, మెగాభిమానులు అప్రకటిత బ్యాన్ కారణం అని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ రెండు కాకుండా శని,ఆదివారాలు వీకెండ్ అవటంతో అప్పటికి చాలా మంది ప్లాన్ చేసుకోవటం కూడా ఈ రోజు తగ్గటానికి కారణం అంటున్నారు. శుక్రవారం సాయింత్రం షోల నుంచి పెద్ద జంప్ అయ్యే అవకాసం ఉందని లెక్కలు వేస్తున్నారు. అదే జరిగితే ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించినట్లే అని చెప్తున్నారు. నిర్మాణ సంస్ద కూడా ఆ బిగ్ జంప్ కోసం ఎదురుచూస్తోంది. ఇక మిగతా రాష్ట్రాల్లో అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా పుష్ప 2 కు మొదటి రోజు ఉన్నంత స్ట్రాంగ్ గా రెండో రోజు కనపడటం లేదంటున్నారు.

ఇక కూలీగా జీవితాన్ని మొద‌లుపెట్టి సిండికేట్ నాయ‌కుడిగా పుష్ప‌రాజ్ ఎలా ఎదిగాడ‌న్న‌ది పుష్ప పార్ట్ 1లో చూపించారు. పుష్ప 2 మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ మూవీలా న‌డిపించారు సుకుమార్‌. సిండికేట్ లీడర్ గా ఎదిగిన త‌ర్వాత పుష్ప‌రాజ్‌కు ఎదురైన ఛాలెంజ్ లు.... నేష‌న‌ల్ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌కు త‌న సామ్రాజ్యాన్ని ఎలా విస్తారించాడ‌న్న‌ది చూపిస్తూ సీక్వెల్ రాసుకున్నారు. సీక్వెల్‌లో పుష్ప‌రాజ్ జ‌ర్నీ మొత్తం ఎలివేష‌న్స్‌, బిల్డ‌ప్ షాట్స్‌తో నింపేశారు. బ‌న్నీ హీరోయిజాన్ని పీక్స్‌లో చూపించటమే ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. దాంతో సినిమాలో కథ పెద్దగా లేదనే ఫీలింగ్ కు చాలా మంది వచ్చారు.

Tags:    

Similar News