'ఏస్' మూవీ రివ్యూ
ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.;
విజయ్ సేతుపతి ....అతను ఒక నటుడు కాదు... ఒక ఎమోషన్! ఒకే సమయంలో మాస్ హీరోలా ఆకట్టుకుంటాడు…విలన్‌గా భయపెడతాడు… మరోవైపు, ఓ మౌనమైన పాత్రలో మనసు తాకేలా నటిస్తాడు. అతని ప్రతి సినిమా — అతని నటనకు కొత్త నిర్వచనం లాగుంటుంది. రీసెంట్ గా ‘మహారాజా’ సినిమాతో మన తెలుగుఆడియెన్స్‌ను ఎమోషనల్‌గా కట్టిపడేసిన ఈ నటుడు… ఇప్పుడు ‘ఏస్’ అనే కొత్త పాత్రతో… మరోసారి మన ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది, కథేంటి, చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) గత జీవితం బై చెప్పి, కొత్తగా మొదలెట్టాలని మలేషియాలో అడుగుపెడతాడు. అక్కడ జ్ఞానం (యోగి బాబు) అనే సరదా వ్యక్తిని కలుసుకుంటాడు, అతడి సహాయంతో ఓ హోటల్‌లో పని దొరుకుతుంది. ఇదే సమయంలో కాశీకి రుక్మిణి (రుక్మిణి వసంత్) పరిచయమవుతుంది . ఆమె ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయి, తన ఇంటిని కాపాడుకోవడానికి ఒక మిలియన్ మలేషియా డబ్బు అవసరం అవుతుంది. అందుకోసం పోరాడుతూంటుంది. ఆమె కష్టాన్ని చూసి, కాశీ ఆమెకు సహాయం చేయాలని నిశ్చయిస్తాడు.
అలాగే సేతు ఇష్టపడ్డ అమ్మాయి షాలినికి తన షాప్ సొంతం చేసుకోవడానికి ఒక మిలియన్ మనీ కావాల్సి వస్తుంది. ఇద్దరికి డబ్బు ఇవ్వాలంటే ఏం చేయాలి. తక్కువ టైమ్‌లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో కాశీ జూదానికి మొగ్గు చూపుతాడు. కానీ ధర్మ (బీఎస్ అవినాష్) చేతిలో ఓడిపోతాడు. ఐదు లక్షలు అక్కడ కట్టాలి.
ఎందుకంటే ధర్మ సాధారణ వ్యక్తి కాదు ఒక కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్! కాశీ అప్పుగా తీసుకున్న పెద్ద మొత్తం డబ్బును వారం రోజుల్లో తిరిగి ఇవ్వాలనే ఒప్పందంలో పడతాడు. ఇక వేరే దారి లేని పరిస్థితిలో కాశీ ఒక డేంజర్ ప్లాన్ వేస్తాడు. అదే బ్యాంక్ దోపిడీ! ఆ దొంగతనం సజావుగా జరిగిందా..కాశీ గతం ఏమిటి.. దొంగతనంతో చివరికి పోలీసులకు చిక్కుతాడా? తన ప్రేమను గెలుచుకుంటాడా? చివరకు ఏమైంది అనేది కథ.
విశ్లేషణ
"If your scenes don't build, your film won't move."
– Robert McKee, story
కథ బోల్డ్ కాశీ అనే మాజీ నేరస్తుడి చుట్టూ తిరుగుతుంది. అతను మలేషియాలో కొత్త జీవితం మొదలెట్టాలనుకుంటాడు. కాని పాత మోజులు – జూదం, డబ్బు కోసం ఎక్స్ట్రీమ్ మార్గాలు – మళ్లీ అతడిని దారి తప్పిస్తాయి. ఇది ఆసక్తికరమైన కాన్సెప్ట్ అయ్యుండేది, కానీ ప్రెజంటేషన్ చాలా బలహీనంగా నిలుస్తుంది.
ఇక ఈ సినిమాకు ప్రధాన సమస్య Pacing & Predictability. . కథలో ఏ మలుపు వచ్చినా, అది ముందే ఊహించగలుగుతారు. స్క్రీన్‌ప్లే టెంపో మొదటి నుంచే నత్తనడకలా సాగుతుంది. ఎక్కడైనా ఇక పికప్ అవుతుంది అనుకుంటే, అక్కడే మన ఉద్దేశ్యం డైరక్టర్ కు తెలిసిపోయినట్లుగా వెంటనే డ్రాప్ అవుతుంది. కొంచెం కూడా ఉత్సాహం లేని నేరేషన్ వల్ల అక్కడక్కడా ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అస్సలు వర్కవుట్ కాలేదు.
అలాగే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే..ఏస్ సినిమా చాలా క్యాజువల్ గా మొదలువుతంది. ముందు ముందు ఏదో ఉందేమో..పెద్ద ప్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో వస్తుందేమో అన్నట్లుగా అనిపిస్తూంటుంది. అయితే అదే సమయంలో క్రైమ్, కామెడీ, రొమాన్స్ అన్నీ కలపాలనే ప్రయత్నిస్తుంది. కానీ ఏ ఒక్క వైపు పూర్తిగా వెళ్లదు.
సెకండాఫ్ మొత్తం దొంగతనం చేసిన డబ్బును ఎలా సేఫ్‌గా మార్చాలి? పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి? అనే లైన్ మీదే సాగుతుంది. ఈ ట్రాక్‌ను ఆసక్తికరంగా మలచవచ్చని అనిపిస్తుంది కానీ, అక్కడ కూడా దర్శకుడు ఫోకస్ లేకుండా అక్కడక్కడే మెలికలు తిప్పుతూనే ఉంటాడు.
క్లైమాక్స్‌లో మాత్రం ఓ మోస్తరుగా గేమ్ ప్లే ఉంటుంది. కానీ చివర్లో ఇచ్చిన ట్విస్ట్‌ను ప్రేక్షకులు చాలా ముందే ఊహించేసే ఛాన్సుంది. అలాగే హీరో ఫ్లాష్‌బ్యాక్ ఏంటి? అనే కీలక అంశాన్ని మాత్రం దర్శకుడు ఓపెన్‌గానే వదిలేస్తాడు.
టెక్నికల్ గా చూస్తే...
సినిమా సంగీతం, ఎమోషనల్ హైపాయింట్లు రెండూ పేలవంగా నిలిచాయి. రెండు భాగాల్లోనూ ప్రేక్షకుడిని ఇన్నర్ గా ఆకట్టుకునే మోమెంట్స్ లేవు. పాటలు గుర్తుండిపోయేలా లేవు, కథకు బలాన్ని ఇవ్వలేదు. స్క్రీన్ ప్లే స్పూర్తిలేకుండా సాగిపోతూ, నారేషన్ పాతతనాన్ని తలపిస్తుంది.
కరన్ బి రావత్ సినిమాటోగ్రఫీ పరంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. సామ్ సి.ఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఊపునివ్వాల్సిన చోట అదేమీ ఫీల్ కలిగించలేదు. నిర్మాణ విలువలు సరిగ్గానే ఉన్నా, ఎడిటింగ్‌లో స్పష్టమైన బలహీనత కనిపిస్తుంది — కొన్ని సీన్లు కత్తిరించి ఉంటే పేసింగ్ మెరుగై ఉండేదని అనిపిస్తుంది. డబ్బింగ్ మాత్రం బాగానే ఉంది.
నటీనటుల్లో ..
.విజయ్ సేతుపతి లాంటి నటుడిని తీసుకొని, ఆయనకు సరపడే, గుర్తుండిపోయే సీన్లు డిజైన్ చేయలేదుృ. బోల్ట్ కాశీ పాత్రపై సెంటిమెంట్ ఉంది కానీ substance లేదు. అలాగే, రుక్మిణి పాత్ర కూడా కేవలం కథ నడిపించేందుకు మాత్రమే ఉందనిపిస్తుంది. వారి బంధంలో ఎమోషన్, డెప్త్ ఉండదు. యోగి బాబు లాంటి కమెడియన్ ఉన్నా, అతడి హాస్యానికి అవసరమైన punch స్క్రీన్‌ప్లే ఇవ్వలేదు.
ఫైనల్ థాట్:
‘ఏస్’ ఒక క్రైమ్, కామెడీ, ఎమోషన్ కలయికగా ఇవ్వాలన్న ప్రయత్నంలో, ఏదీ సరిగ్గా వర్కవుట్ చేయని,కాని చిత్రం. కొన్ని చిన్నపాటి హాస్య సన్నివేశాలు, నటుల పెర్ఫార్మెన్సులు తప్ప సినిమాలో చెప్పుకోదగినవి లేవు. ఇలాంటి సినిమా చూడాలంటే కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి.