పైరసీ నే నన్ను 'స్టార్' చేసిందంటున్న అమీర్ ఖాన్!
ఓ స్టార్ హీరో సినిమా విడుదలైన రోజు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.;
ఓ స్టార్ హీరో సినిమా విడుదలైన రోజు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. థియేటర్‌లో సినిమా పడి బ్లాక్ బస్టర్ టాక్ బయటివస్తే పండగ చేసుకుంటారు. నిర్మాతలు హ్యాపీ ఫీలవుతారు. కట్ చేస్తే కొద్ది గంటల్లోనే ఆ సినిమా హై క్వాలిటీతో నెట్టింట కనిపించే సరికి ఆ నిర్మాతలు అవాక్కవుతారు. రీసెంట్ గా గేమ్ ఛేంజర్, తండేల్ సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ సైట్లలో దర్శనమిచ్చాయి. అంతే కాదు రెండు రోజుల్లోనే ఓ ఆర్టీసీ బస్‌లో హెచ్ డీ ప్రింట్‌తో ప్రదర్శించారు. వాట్సప్‌లో లింకులు టెలిగ్రామ్‌లో షేరింగ్‌లు యూట్యూబ్‌లో ముక్కలు ముక్కలుగా సినిమా గా దర్శనమిచ్చేసాయి.
అక్కడితో ఆగుతుందా అంటే అదీ లేదు ఆ పైరసీ వ్యవహారం ఓటీటీలోకి సినిమా వచ్చిన ఆ మరుక్షణమే ఒరిజినల్ సినిమా పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది. ఇది పైరసీ మాఫియా సినీ పరిశ్రమకు విసురుతున్న ఛాలెంజ్ లు . కోట్ల రూపాయల పెట్టుబడిని గంటల వ్యవధిలో ఆవిరి చేస్తోంది ఈ మాఫియా అని నిర్మాతలు, హీరోలు గగ్గోలు ఎత్తిపోతూంటారు.
పైరసీ దెబ్బకు గతేడాది దేశవ్యాప్తంగా 22 వేల 400 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అందులో 13 వేల 700 కోట్ల రూపాయలు థియేటర్లు నష్టపోగా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు 8,700 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఓ అధ్యయనంలో తేలింది. అయితే ఇంత నష్టం తెచ్చిపెడుతున్న పైరసీ తనను చైనాలో స్టార్ చేసిందంటున్నారు అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ కు పైరసీ కలిసొచ్చింది.
పైరసీ కూడా ఒక్కోసారి ప్లస్ అవుతుందా అంటే అవును అంటున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్. తను చైనాలో స్టార్ అవటానికి కారణం కారణంగానే చైనాలో స్టార్ అయ్యానంటున్నారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ ఈ విషయం స్వయంగా చెప్పి షాక్ ఇచ్చారు. ఇంతకీ ఏ సినిమా గురించి అంటారా ఆయన చెప్పేది.
అమీర్ ఖాన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్' ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. తమిళం లో ఈ చిత్రాన్ని శంకర్ రీమేక్ కూడా చేసారు. అక్కడా మంచి విజయం సాధించింది. హిందీలో ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అదెలా అంటే అమీర్ ఖాన్ సినిమాలు చైనాలో తప్పకరిలీజ్ అవుతుంటాయి. అక్కడ అమీర్ ఖాన్ కు మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ సినిమా రిలీజ్ చేస్తుంటారు. అయితే '3 ఇడియట్స్' మాత్రం రిలీజ్ కాలేదు.
చైనాలో భారీగా పైరసీ
'3 ఇడియట్స్' కాలేజీ స్టోరీ కావడంతో అక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమని రిలీజ్ చేయలేదు. అయితే ఈ సినిమా హిందీ నుంచి చైనాలో పైరసీ అయింది. అక్కడ జనాలు ఈ సినిమాని విపరీతంగా ఆదరించినట్లు అమీర్ ఖాన్ తెలిపారు. ఈ సినిమా తర్వాత తన స్టార్ డమ్ అక్కడ మరింత పెరిగిందన్నారు.
పైరసీ కారణంగా చైనాలో తానో పెద్ద స్టార్ గా అవతరించానన్నారు. దీంతో ఇది విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలా పైరసీ కారణంగా కూడా హీరో అవ్వొచ్చని నిరూపించిన మొట్ట మొదటి వ్యక్తి మీరే సార్ అంటూ దండాలు పెట్టేస్తున్నారు. ఆ సినిమా తర్వాత అమీర్ నటించిన 'దంగల్' చైనాలోనే 1500 కోట్ల వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.
ఎక్కడుంది సమస్య
ఇక మనమంతా సినీ పరిశ్రమకు పట్టిన చీడ పురుగు పైరసీ అని చెప్తుంటాము. కోట్లాది రూపాయల పెట్టుబడి, వందలమంది కష్టానికి గండి కొడుతూ పైరసీ సినిమా రంగానికి అతి పెద్ద సమస్యగా మారిందనేది నిజం. సినిమా అలా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే పైరసీ ప్రింట్లను తమ సైట్లలో పెడుతూ పైరసీ మాఫియా నిర్మాతల ఆదాయాన్ని దెబ్బతీస్తోంది.
ఇంతకీ పైరసీకు కారణమేమిటి అంటే...సినిమా డిజిటల్ హంగులు అద్దుకోవడమే అని చెప్తున్నారు. ఓటీటీ లో వచ్చాక పైరసి రక్కసి కోరలు మరింత విస్తరిస్తున్నాయి. చిన్న, పెద్ద, ఆ భాష, ఈ భాష అనే తేడా లేకుండా సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే పైరసీ చిత్రాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఓటీటీ మార్కెట్ ను కూడా దెబ్బతీస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ కు పైరసీ దెబ్బ
రీసెంట్ గా రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఈ పైరసీ దెబ్బ గట్టిగా తగిలింది. ఈ సినిమా రిలీజైన ఇరవైనాలుగు గంటల లోపే అత్యంత నాణ్యతతో ఆన్‌లైన్‌లోకి వచ్చింది. దీంతో చిత్ర టీమ్, మెగా అభిమానులు సైతం షాకయ్యారు. ఓ లోకల్ ఛానల్‌లో పైరసీ కాపీని ప్రసారం చేయడం చర్చనీయాంశమైంది. మెగా అభిమానులు రంగంలోకి దిగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఆ పైరసీ సైట్ నుంచి ఆ పైరసీ కాపీ తొలగించలేక పోయారు.
తండేలు ని ఆఫ్రికాలో పైరసీ చేశారు
మొన్నటికి మొన్న నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం విడుదలై 3 రోజులు కాకముందే పైరసీ కాపీని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. దీనిపై ఆ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవర్ సీస్ కు పంపిన ప్రింట్ నుంచి పైరసీ అయినట్లు గుర్తించామని, ఆఫ్రికా దేశాల నుంచి అప్‌లోడ్ చేసినట్లు తేల్చారు.