ఈవీవీ ‘అప్పుల అప్పారావు’ ఎందుకు అంత మంచి చిత్రమయింది?
తెలుగు డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఒక సోషల్ సైంటిస్టు అంటున్నారు మూవీ క్రిటిక్ సి. రామ్ . ఈవీవీ చిత్రాల విశ్లేషణ: 2;
రామ్.సి
భ్రమలను తొలగించకుండా, కుటుంబం, కుటుంబ సభ్యుల పార్స్యాలను, దాని లోపలి అజెండాలను బయటపెట్టే సినిమా అయినా, ఎక్కడా నైతికతను ప్రశ్నించే తత్వాన్ని ప్రదర్శించకుండా, నొప్పింపక తానొప్పక, సందేశం అనేదేది మచ్చుకైనా ఇవ్వకుండా చేసిన ప్రయత్నం 'అప్పుల అప్పారావు'.
"All families are dysfunctional" నేను బాగా నమ్మే నిజం.
ఈ ఒక్క ప్రాతిపదికతన ఆస్కార్ పొందిన సినిమాలు హాలీవుడ్లో కోకొల్లలు. అనేక కుటుంబాలు వాస్తవానికి ఒక నకిలీ సమూహం లాంటిది. ఎలా అయితే ఓ సంస్థలో వృత్తిపరమైన బృందాలు ఒక వ్యవస్థీకృత hierarchyలో ఉంటాయో, అక్కడే మౌనంగా పాటించాల్సిన నియమాలు, అధికార పెత్తనాలు, అధికారపట్టు కోసం కుతంత్రాలు, పోరాటాలు ఇంకొన్ని ఎప్పటికీ ఆగని మానసిక నాటక ప్రదర్శనలు కుటుంబంలోనూ ఉంటాయి.
సమాజం కుటుంబాన్ని అచంచల ప్రేమ, భద్రతకు స్థావరంగా చిత్రీకరించినా, అదే స్థాయిలో సంక్షోభాలకు కేంద్రంగా కూడా మారుతుందని గ్రహించాను. వృత్తిపరమైన బృందాలలో లక్ష్యాలు స్పష్టంగా ఉంటాయి, తప్పించుకునే అవకాశాలు ఉంటాయి, కానీ కుటుంబాలు ఎవరూ తప్పించుకోలేని నిర్మాణా సమాఖ్యలు. ఇక్కడ ప్రేమ, బాధ్యత, కుళ్ళు, కుతంత్రాలు, మంచి, చెడు , లాభం ,నష్టం నీది, నాది, నువ్వు నేను అనే ముసుగులో వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరే వ్యూహాత్మక ఆటలు నడుస్తుంటాయి.
నా ఉద్దేశ్యం కుటుంబాన్నిపూర్తిగా మెప్పించడం కాదు, కానీ దాని అసలైన స్వరూపాన్ని అంగీకరించడం లేదని నా ఆలోచన. కానీ చాలా కాలం పాటు, నేను కుటుంబాన్ని తటస్థంగా చూడలేకపోయాను.ఇందుకు నేను తీసుకున్న సమయం మాత్రమే కాదు, నా సహనం కూడా పెట్టుబడి అనే చెప్పాలి. ఆప్యాయతలో వ్యూహాలు, బంధాలలో లెక్కలు, ప్రేమలో లావాదేవీలు అన్నీ అర్థం చేసుకునే ప్రయత్నంలో తప్పటడుగులు వేసాను. హేళన చేయబడ్డాను, మోసపోయాను, కానీ ఇదంతా ఉత్ప్రేరకాలు మాత్రమే అని గుర్తించిన తరువాత ఆసాంతం నా ఆలోచన మార్పు చెందినదనే చెప్పాలి.
ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలం ఆశించడం, సహాయానికి బదులుగా బాధ్యతలు మోపడం, నిస్వార్థంగా అనిపించిన బంధాలలో ఎప్పుడూ కదిలే లావాదేవీలు ఉండటం సహజమని, మనం అందులో భాగమని గుర్తించినప్పుడు, నేను ఆ నరుడి బతుకు నటనలో పాల్గొనడం మానేశాను.నాకు కష్టంగా తోచిన ప్రతిదాన్ని ప్రవర్తన ఆధారంగా నన్ను ఓ ఉత్సాహభరితుడిగాను, కుదిరితే పరిశీలకుడిగా మారిపోయాను.
నా చుట్టూ 'నాకేదో తెలియదని' కొందరు, లేదా ' వీడికి అవగాహనే లేదని' మరికొందరు సలహాలు , అభిప్రాయాలూ చెప్పే మిడిమిడి జ్ఞ్యానగాళ్ళు చాలా ఎక్కువ. తమను మెరుగైన వారిగా చిత్రీకరించుకునే వారు, తాము తప్పులు చేయరని డంకా బజాయించుకునే వారు, 'మనం చాలా ప్రత్యేకం కదా' అనుకునే వారూ,నమ్మకంతో ముందుకు సాగి ఎప్పటికీ మోసపోతూనే ఉన్నవారూ,కుటుంబ అనేది ఒక వ్యూహమని అర్థం చేసుకుని, ఈ ఆటలో గెలిచే వారూ ఇలా ఎందరో చూస్తూనే ఉన్నాను.
ఈ పరిశీలనల్లో ఒక అద్భుతమైన నిజం గమనించాను, ప్రతి కుటుంబ సభ్యుడి గాయాలు వారి వ్యవస్థలో ఒదిగిపోయినందుకు, పోనందుకు నేరుగా ఆపాదించి ఉంటాయి. ప్రామాణికమైన పాత్రల్లో నాటకమాడే వారే ఎక్కువగా బాధపడతారు. కానీ కుటుంబాన్ని ఒక ఆటల నడిపించడం నేర్చుకున్నవారు కష్టపడతారు, కానీ, చాలావరకు నిలదొక్కుకుంటారు.
ఈ ‘అప్పుల అప్పారావు’ సినిమా అదే చూపిస్తుంది, బంధాలలోని అర్ధంలేని మానసిక నాటకాలు, అధికమైన అంచనాల భారం, మరియు ప్రేమ, బాధ్యత పేరుతో వ్యూహాత్మకంగా బంధాలను ఉపయోగించుకునే విధానం, వదిలించుకుని తప్పించుకుని పారిపోయిన వాళ్లను చూస్తుంటే చాల బేషుగ్గా ఉంటుంది. కానీ, ప్రయత్నాలలో విఫలమైన ప్రతిసారి, కొత్త దార్లు వెదుకుతూ లౌక్యం కేంద్రంగా ఫలితాలు సాధించడమే ముఖ్యమని చెప్పడం సరదాగా సాగిపోవడం ఈ.వి.వి సూక్ష్మ శైలి. మనకు ఇది సరికాదేమో కదా అనిపించినా, లాజిక్కే లేదని స్ఫురించినా, 'ఎహే !జరుగుతున్న దాని చూస్తూ సర్దుకుపోక ఈ నసుగుడేంటని' పక్కనోడు ప్రశించినట్టు ఉంటుంది సినిమా మొత్తం.
అసంతృప్తి, భ్రమలు, అబద్ధాలు ఇవి ఇంట్లోనే పుట్టుకొస్తాయి. మనుషులు పెద్దయ్యాక మోసగాళ్లుగా మారరు. వారిని కుటుంబ వ్యవస్ఠ వాతావరణమే వారి మానసిక స్వభావాన్నివారు మారేటప్పటి నుండి మారేంత వరకు తీర్చిదిద్దుతుంది. చిన్నతనంలో నేర్చుకున్న పాఠాలు మన జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో నిర్ధారిస్తాయి.
'అసంతృప్తి' ఎప్పుడు ఎన్నుకోని పాత్రల్లో "మంచి బిడ్డ," "బాధ్యతగల సోదరుడు," "శ్రద్ధగల కూతురు" లాంటి పాత్రల్లో నలిగిపోతే.'భ్రమలు' పిల్లలుగా ప్రేమ, వివాహం, కుటుంబం గురించి పరిపూర్ణమైన పాఠాలు నేర్పిస్తాయీ.'అబద్ధాలు' నిజం చెప్పినంత మాత్రాన మనకు అవసరమైనవి దొరకవు, కానీ సరిగ్గా చెప్పిన ,చెప్పగలిగిన అబద్ధాలు మన ప్రయోజనాలను నెరవేర్చుతాయిని గుర్తించాలని సినిమా మొత్తం అబ్బద్దాల చుట్టూ తిరిగే పాత్రలతోనే తీశారు ఈ.వి.వి.
ఈ సినిమా అసహజ నిజాలను సరదాగా అనిపించినా, కానీ లోతైన వాస్తవాన్ని కలిగించిన సంఘటనల ద్వారా మన ముందు ఉంచుతుంది. ప్రతి కుటుంబ సభ్యుడు ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు, తన అసలు ఉద్దేశాలను దాచుకుని, బంధాలను ఒక సాధనంగా ఉపయోగించుకుంటుంటారు అని అంగీకరించడానికి కఠినమైన నిజాన్ని తెరపై చూపిస్తుంది.