తొలి ఏకాదశికి పేలాల పిండికి సంబంధం ఏంటో తెలుసా!
తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తప్పక తినాలని పెద్దలు చెప్తారు. చాతుర్మాస వ్రతం చేయాలంటారు. ఎందుకు? ఇవి తినడం వెనక రహస్యమేంటి?
ఈరోజు తొలి ఏకాదశి. ఈ పండుగకు హైందవ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషు పాన్పుపై యోగనిద్రకు ఉపక్రమిస్తారని పురాణాలు చెప్తున్నాయి. జూలై 17న చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. వీటి ప్రతి ఒక్కొ ఏకాదశి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. దీనిని శయనైకాదశి, హరి వాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగకు పేలాల పండగ అని పేరు రావడానికి ప్రధాన కారణం ఈ పండగ సందర్భంగా అందరూ తప్పనిసరిగా పేలాల పిండి తినడమే. ఆ కారణంగానే ఈ రోజును పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు. కానీ ఎందుకు తినాలి అంటే మాత్రం సమాధనం చెప్పరు. అది ఎందుకో ఈరోజు మనం తెలుసుకుందాం.
పేలాల పిండి ఎందుకు తినాలి?
తొలి ఏకాదశి రోజున తప్పక తినాలని పెద్దలు చెప్పే పదార్థం పేలాల పిండి. అయితే ఈ పేలాల పిండిని ఏకాదశి రోజున ఎందుకు తప్పకుండా తినాలి అంటే.. కొందరు పేలాలు మన పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవని, మనకు జన్మనిచ్చిన పూర్వీకుల పండుగ రోజు వారిని గుర్తు చేసుకోవడం మన బాధ్యత కాబట్టి అందుకు ప్రతీకగా పేలాల పిండి తినాలని చెప్తారు. ఇదిలా ఉంటే అదేమీ లేదని పేలాల పిండి తినడం వెనక సైంటిఫిక్ కారణం ఉందని మరికొందరు చెప్తారు. వాటిలో వాతావరణంలో వచ్చే మార్పుల ప్రధానమని అంటారు. తొలి ఏకాదశి అంటే ఆరోజు గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో జరుపుకునే పండగ. ఈ సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. అప్పటి వరకు సూర్యుడి తాపానికి శరీరం అలవాటు ఉండటం వల్ల ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా వచ్చే మార్పులు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. వాటి నుంచి బయటపడటానికి పేలాల పిండి తినాలి. ఇది తినడం వల్ల మన శరీరంలో వేడి పెరుగుతుంది. తద్వారా వాతావరణ మార్పు ప్రభావాన్ని తగ్గించడం జరుగుతుంది. ఆ కారణంగా ఈ రోజు ఆలయాలు, ఇళ్లలో కూడా పేలాల పిండిని తప్పనిసరిగా తినడం ఆనవాయితీగా వస్తుంది.
పేలాల పిండి ఎలా తయారు చేస్తారు!
తొలి ఏకాదశి రోజున తినే పేలాల పిండి తయారీ చాలా సులభం. దీనిని తయారు చేసుకోవడానికి మొక్కజొన్న పేలాలు, బెల్లం తురుము, పుట్నాల పొడి, యాలుకల పొడి అరస్పూను, ఎండుకొబ్బరి పొడి కావాలి. ముందుగా మొక్కజొనన పేలాలను పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన అన్ని పొడులను వేసి బాగా కలుపుకోవాలి. పేలాల పిండి తయారు చేసుకునే విధానం ఇదే. అయితే కొందరు ఇందులో డ్రైఫ్రూట్స్‌ను కూడా కలుపుకుంటారు. వాటిలో ఇవే కలపాలని అని ఏమీ లేదు. తినేవారి అభిరుచిని బట్టి డ్రైఫ్రూట్స్ కలుపుకోవచ్చు.
చాతుర్మాస దీక్ష కూడా ఆరోగ్యం కోసమే
తొలి ఏకాదశి నాడు శయనించిన మహావిష్ణువు.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ‘ప్రబోధినీ ఏకాదశి’ నాడు మేల్కొంటాడని పురుణాల్లో ఉంది. ఈ నాలుగు నెలలను చతుర్మాసాలుగా పిలుస్తారు. ఈ సందర్భంగా తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు అంటే ప్రబోధినీ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ దీక్ష వేనక కూడా మన ఆరోగ్యమే ప్రధాన కారణంగా ఉంటుంది. ఉత్తరాయణం కంటే దక్షణాయనంలో ఎక్కువ పండగలు, పర్వదినాలు వస్తాయి. వాతావరణంలో మార్పులు కూడా అధికంగానే వస్తాయి. వాటన్నింటి తట్టుకుంటే ఆరోగ్య కరమైన జీవనం పాటించడానికి సహాయం చేసేదే ఈ దీక్ష. ఈ దీక్ష మన దైనందిక, ఆహార అలవాట్లపై ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుంది. ఈ నాలుగు మాసాల్లో మనిషి ఆరోగ్య రక్షణ కోసమే ఎక్కువగా వ్రతాలు, నోములు, దీక్షలు ఉంటాయని కొందరు పెద్దలు కూడా చెప్తారు.
ఈ సమయంలో ఇవి తినకూడదు
సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశులన్నింటిలోకి ఈ చాతుర్మాసాల్లో(జులై నుంచి నవంబర్) వచ్చే ఏకాదశులు ప్రముఖంగా ఉంటాయి. ఈ ఎనిమిది ఏకాదశుల్లో తప్పకుండా ఉపవాసం ఉండాలని, ఈ ఏకాదవుల సమయంలో వంకాయ, కరుబూజ, రగి మొదలైనవి తినకూడదన చెప్తారు. ఈ చాతుర్మాసాల్లో ఒక్కో నెలలో ఒక్కో ఆహార పదార్థాన్ని విడిచిపెడతారు. వీటితో తొలి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాల్గవ నెలలో రెండు ఆకులు ఉండే ఆకు కూరలను తినరు. ఇదిలా ఉంటే మొత్తం చాతుర్మాసాలు పూర్తయ్యే వరకు నిమ్మ జాతి పళ్ళు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకుగడలు తినకూడదని శాస్త్రం చెప్తుంది.