దశరథుడు కోసలకు అల్లుడే అంటున్న ఇతర రామాయణాలు

రామాయణంలో నిరుత్తరకాండ-14: దశరథుడు కోసలకు రాజా, అల్లుడా? రామాయణ సందేహం

Update: 2024-07-28 06:20 GMT


ములుకుట్ల నరసింహావధానులు గారు తన ‘శ్రీ రామాయణ సారోద్ధారము’ అనే గ్రంథరచనకు అనుసరించిన పద్ధతే విచిత్రంగా ఉంటుంది. వాల్మీకి రామాయణంతో సహా, తను పరిశీలించిన ఆయా రామాయణాల కథనాలను అన్నింటినీ కలిపేసి ఆయన వ్యాఖ్యానిస్తారు. వాటి మధ్య తేడాలను, వైరుధ్యాలను చూపుతూనే వాటిని ఏదోవిధంగా సమన్వయించడానికి, లేదా నప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు, ఆ ప్రయత్నం మూలకథ అనే నేలను పూర్తిగా విడిచిపెట్టి సాగించే సాములా పరిణమిస్తుంది. అదే సమయంలో, మామూలు కంటికే స్పష్టంగా కనిపించే అసంబద్ధాలను అలాగే వదిలేస్తారు. మొత్తంమీద ఆయన రచన, సాంప్రదాయిక పండిత వ్యాఖ్యానపద్ధతికి అద్దంపట్టే ఓ ప్రాథమికస్థాయి పాఠ్యగ్రంథంలా కనిపిస్తుంది.

మధ్య మధ్య వాల్మీకి రామాయణకథాంశాలను జోడిస్తూ, ‘శ్రీరామ భాగవతము’, ‘నానారామాయణ సారము’, ‘ఆనందరామాయణము’లనుంచి ఆయన ఉదహరించిన కౌసల్యాదశరథుల వృత్తాంతం ఇలా ప్రారంభమవుతుంది:

సరయూనదీతీరంలో ధనధాన్యాలతో తులతూగే కోసల అనే దేశం ఉంది. ఆ దేశంలో జగత్ప్రసిద్ధమైన అయోధ్య అనే నగరం ఉంది. సూర్యుని కొడుకైన వైవస్వతమనువు నిర్మించిన ఆ నగరంలో దశరథుడనే క్షత్రియుడు సుఖంగా నివసిస్తున్నాడు. గొప్ప ప్రభావం కలిగిన సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, కకుత్థ్సుడు, రఘువు అనే అయిదురు జన్మించిన వంశంలో అతను అరవై ఆరవవాడు. తన పూర్వులకంటె ఎక్కువగా రాజ్యాన్ని అభివృద్ధిచేసిన దశరథునికి తన కూతురు కౌసల్యనివ్వాలని కోసలరాజు(భానుమంతుడు)అనుకున్నాడు. దశరథుడు కూడా సమ్మతించాడు...

ఇక్కడ ఆదిలోనే హంసపాదు ఎలా దొర్లిందో చూడండి. కోసలదేశంలోని అయోధ్యానగరాన్ని నిర్మించినదేమో వైవస్వతమనువు. ఆ మనువు వంశంలో జన్మించిన అరవై ఆరవవాడు దశరథుడు. కనుక అయోధ్యానగరానికి అధిపతీ, కోసలదేశానికి రాజూ కావలసింది దశరథుడు కదా! వేరే ‘కోసలరాజు’ ఎక్కడినుంచి వచ్చాడు? ఆ కోసలరాజు తన కూతురైన కౌసల్యను ‘కోసలరాజు’ కివ్వాలని అనుకోవడమేమిటి? ఈ ‘కోసలరాజు’ దానికి అంగీకరించడమేమిటి?

ఈ వైరుధ్యాన్ని నరసింహావధానులు గారు అసలే గుర్తించలేదా అంటే, గుర్తించారు. కానీ ఇక్కడ ఇలాంటి వైరుధ్యముందున్న సంగతిని మాత్రం సూటిగా చెప్పరు. కోసలదేశం గురించి పైన చేసిన పరిచయానికి ముందే ఆయన ఒక వివరణ ఇస్తారు. దాని ప్రకారం, కోసలదేశం ఉత్తరకోసల, దక్షిణకోసల అని రెండు విధాలుగా ఉంటుంది. ఉత్తరకోసలకు ముఖ్యపట్టణం అయోధ్య, ఔఢ్. దక్షిణ కోసలకు రాజధాని గుజరాత్ లో చేరిన కుశస్థలి. అది గంగానది దక్షిణతీరంలో నాగపూర్ అనే చోట ఉంది. సరయూనది ఉత్తరతీరంలో కౌసల్య తండ్రి భానుమంతుని పాలనలో ఉన్న దేశం ఉత్తరకోసల. దానికి ముఖ్యపట్టణం శ్రావస్తి...

నేటి ఉత్తరప్రదేశ్ లో ఉన్న కోసల ఉత్తరకోసల, దక్షిణకోసల అనే రెండు ముక్కలుగా ఎప్పుడు, ఎందుకు విడిపోయిందో; వాటిలో రెండవ ముక్క, మొదటి ముక్కకు చాలా దూరంగా పశ్చిమభారతంలో ఉన్న గుజరాత్ కు చేరి ‘దక్షిణకోసల’ ఎలా అయిందో; దాని ముఖ్యపట్టణమని చెబుతున్న కుశస్థలికి, మహారాష్ట్రకు చెందినదిగా మనకు తెలిసిన నాగపూర్ కు సంబంధమేమిటో; ఆ నాగపూర్ గంగానది దక్షిణతీరంలో ఉండడమేమిటో; లేక ఆయన చెప్పిన నాగపూర్ వేరే ఇంకెక్కడైనా ఉందో...అంతా అయోమయంగానూ, గంద్రగోళంగానూ ఉంటుంది. నరసింహావధానులు గారు మాత్రం ఎలాంటి వివరణా ఇవ్వరు; రెండు కోసలలు ఉన్నట్టు ఎలాంటి ప్రమాణమూ చూపరు.

కొంత కథ నడిచిన తర్వాత ఆయనే ఇంకోచోట చెప్పిన ప్రకారం, కౌసల్య వివాహసందర్భంలో కోసలరాజు తన అల్లుడైన దశరథునికి అర్థరాజ్యమిచ్చాడు! అందువల్ల దశరథుడు దక్షిణ, ఉత్తరకోసలలు రెండింటికీ రాజయ్యాడు! తమాషా ఏమిటంటే, ఇలా చెప్పడం ద్వారా తను ప్రారంభించిన కథనాన్ని తనే ఖండించుకుంటున్న సంగతిని కూడా ఆయన గమనించుకోకపోవడం! అయోధ్యానగరాన్ని నిర్మించి ఏలిన మనువు వంశంలో అరవై ఆరవ వాడుగా దశరథుడు జన్మించాడని చెప్పినప్పుడు, ఆ నగరం భాగంగా ఉన్న కోసలరాజ్యానికి వారసుడు కావలసింది అతడే కదా? కానీ నరసింహావధాన్లు గారి కథనాన్ని బట్టి కౌసల్యను పెళ్లాడేనాటికి అతను దక్షిణకోసలకు రాజుగా ఉన్నాడు. ఆ దక్షిణకోసల ఎక్కడుందంటే, పశ్చిమభారతంలోని గుజరాత్ లో ఉంది! అతనికి ఆనువంశికంగా లభించవలసిన ఉత్తరకోసల ఇంకో కోసలరాజు ఏలుబడిలో ఉంది. అది అతని చేతుల్లోకి ఎప్పుడు వెళ్లిందో, ఎందుకు వెళ్ళిందో, అతను ఏ వంశం వాడో తెలియదు. నరసింహావధాన్లుగారు చెప్పిన ప్రకారం చూస్తే, దశరథుడికి వారసత్వంగా లభించాల్సిన కోసలరాజ్యంలో సగభాగాన్ని హరించిన వ్యక్తే అతనికి తన కూతురునిచ్చి, తను హరించిన భాగంలో సగభాగాన్ని అతనికే కట్నంగా ఇచ్చాడన్నమాట. చివరికిదంతా అంతుబట్టని ఓ పొడుపుకథలా తయారవుతుంది.

అయితే, ‘శ్రీరామ భాగవత’, ‘నానారామాయణసార’, ‘ఆనందరామాయణ’ కర్తలనూ, వారి కథనాన్ని ఉటంకించిన నరసింహావధాన్లుగారినీ మరొకందుకు అభినందించాలి. ఎలాగంటే, భానుమంతుడనే మరో కోసలరాజును సృష్టించి అతనిచేత దశరథునికి కౌసల్యను ఇప్పించి కోసలరాజ్యానికి అల్లుణ్ణి చేశారంటే; దశరథుడు కోసలరాజు కావడంలోనూ, తన పేరు ద్వారా కోసలరాకుమారి అని స్పష్టంగా తెలుస్తున్న కౌసల్య అతని భార్య కావడంలోనూ ఉన్న మౌలికమైన అసంబద్ధతను వారు గుర్తించారన్నమాట. కాకపోతే, ఆ అసంబద్ధతను తొలగించే ప్రయత్నం సక్రమంగా చేయలేక మరికొన్ని అసంబద్ధతలను సృష్టించారు.

***

పైన చెప్పిన వాల్మీకేతర రామాయణాలను ఉటంకిస్తూ నరసింహావధాన్లు గారు పొందుపరిచిన తదుపరి కథాక్రమం -ఓ మహత్తరజానపదచిత్రాన్ని చూస్తున్న అనుభూతి కలిగించి, పై పొడుపుకథలాంటి తికమక వివరాలతో వేడెక్కిన బుర్రకు ఒకింత వినోదం కలిగిస్తుంది:

కౌసల్యాదశరథులకు వివాహం జరగబోతున్న సంగతిని నారదుడు రావణుని దృష్టికి తెచ్చి, వారికి పుట్టబోయే కొడుకు నిన్ను చంపుతాడని తను సనత్కుమారుని ద్వారా విన్నట్టు చెప్పాడు. దాంతో రావణుడు భయపడి కౌసల్యాదశరథుల వివాహం జరగకుండా చూడాలనుకున్నాడు. కోసలరాజైన భానుమంతుడి దగ్గరికి వెళ్ళి, “శక్తి ఉంటే నువ్వు నాతో యుద్ధమైనా చేయి, లేదా నీ కూతురినైనా ఇవ్వ”మన్నాడు. రావణునితో యుద్ధానికి భయపడిన కోసలరాజు కౌసల్యను ఒక బంగారు పెట్టెలో ఉంచి రావణునికి ఇచ్చాడు...

అప్పుడు కౌసల్య, “నా కాబోయే భర్త అయిన దశరథుడు తాకితేనే ఈ పెట్టె తెరచుకుంటుంది; ఇంకెవరు తాకినా తెరచుకోదు” అని ప్రతిజ్ఞ చేసి ఆ పెట్టెలోకి ప్రవేశించింది. రావణుడు ఆ పెట్టెను తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి, దానిని హింసిక అనే ఓ మొసలికిచ్చి జాగ్రత్తగా కాపాడమన్నాడు. తిరిగి అయోధ్యకు వెళ్ళి, దశరథుని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాడు...

ఆ సమయంలో దక్షిణకోసల రాజైన దశరథుడు ఉత్తరకోసల నగరమైన అయోధ్యలో ఎందుకున్నాడో తెలియదు. పోనీ పెళ్లి చేసుకోడానికి వచ్చాడనుకుంటే, అప్పటికి పెళ్లి నిశ్చయమైనట్టు కథకుడు చెప్పాడే కానీ, పెళ్ళికి ఏర్పాట్లు జరిగినట్టు చెప్పలేదు. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న, కౌసల్య ఉన్న బంగారు పెట్టె తన అధీనంలోనే ఉన్నప్పుడు, దశరథుని చంపాల్సిన అవసరం రావణునికి ఏమిటన్నది! వారికి పెళ్లై కొడుకు పుట్టినప్పుడే కదా తనకు ప్రాణహాని?

ఒక థర్డ్ రేట్ జానపదసినిమా కథ కూడా ఇంతకన్నా పటిష్ఠంగా, పకడ్బందీగా ఉంటుంది.

అప్పుడో, లేక ఆ తర్వాత ఎప్పుడో తెలియదు కానీ, దశరథుడు మంత్రులతో సహా సరయూనదిలో ఓ నావనేక్కి వందిమాగధులు పొగడుతుండగా, వారకాంతలు నాట్యం చేస్తుండగా రత్నదీపాల కాంతిలో జలక్రీడోత్సవం జరుపుతున్నాడు(‘స కదాచిత్ దశరథస్సాకేతే సరయూజలే..’ అన్న ఆనందరామాయణ శ్లోకభాగంలోని ‘కదాచిత్’ అనే మాటకు ‘ఒకప్పుడు’ అని నరసింహావధాన్లు గారి అనువాదం).

సరిగ్గా ఆ సమయంలో లంకలో ఉన్న రావణుడు కౌసల్యాదశరథుల వివాహలగ్నం ఎప్పుడని బ్రహ్మదేవుని అడిగాడు. నేటికీ అయిదవరోజున అని బ్రహ్మదేవుడు చెప్పాడు. వెంటనే రావణుడు పుష్పకవిమానమెక్కి అయోధ్యకు చేరుకున్నాడు...

అయోధ్యలో ఉన్నట్టు చెప్పిన రావణుడు తిరిగి లంకకు ఎప్పుడు చేరుకున్నాడో, బ్రహ్మదేవుడు లంకలో ఎందుకున్నాడో వివరం లేదు.

అయోధ్యకు చేరుకున్న రావణునికి, దశరథుడు సరయూనదిలో నౌకావిహారం చేస్తున్నట్టు తెలిసింది. ఓ పర్వతాన్ని పెకిలించి ఆ నావమీద పడేశాడు. దాంతో ఆ నావలో ఉన్నవాళ్ళు అందరూ సరయూనదిలో మునిగిపోయారు. దశరథుడు, అతని మంత్రులలో ఒకడైన సుమంత్రుడు మాత్రం బద్దలైన ఆ నౌకలోని ముక్క నొకదాన్ని పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారు. అలా సరయూప్రవాహంలో కొట్టుకుపోతూ గంగానదికి చేరి అక్కడినుంచి సముద్రంలోని ఒక దీవికి చేరారు.

రావణుడు కౌసల్య ఉన్న బంగారు పెట్టెను సముద్రంలోని ఒక మొసలికిచ్చి కాపాడమని చెప్పాడనుకున్నాం. అప్పటినుంచి ఆ పెట్టెను మొసలి నోటకరచుకుని సముద్రంలో విహరిస్తూనే ఉంది. అంతలో ఇంకో మొసలి వచ్చి దానిని యుద్ధానికి పిలిచింది. అప్పుడది తన నోట కరచుకున్న బంగారు పెట్టెను ఒక దీవిలో ఉంచి దానితో యుద్ధానికి దిగింది. ఆ యుద్ధంలో మునిగి, కౌసల్య ఉన్న పెట్టెను ఓ దీవిలో ఉంచిన సంగతిని ఆ మొసలి మరచిపోయింది. దశరథుడు చేరుకున్నది ఆ పెట్టె ఉన్న దీవికే!

ఇంతకీ ఆ మొసలి మరెవరో కాదు, ఇంద్రుడే. కౌసల్యాదశరథులను కలపడం అనే దైవకార్యం కోసమే ఆ వేషంలో వచ్చాడు. ఇప్పుడు నిజరూపంతో దశరథుడి దగ్గరకు వచ్చి ఆ పెట్టెను తాకమన్నాడు. దశరథుడు తాకేసరికి ఆ పెట్టె తెరచుకుని కౌసల్య బయటికి వచ్చింది. ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకుని దశరథుడు ఆశ్చర్యపోయాడు. అంతలో బ్రహ్మాదిదేవతలు, నారదుడు మొదలైన దేవరుషులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ముహూర్తంలోనే కౌసల్యాదశరథులకు వివాహం జరిపించేసి కొత్త దంపతులతోపాటు సుమంత్రుని కూడా ఆ పెట్టెలోనే ఉంచి మూసేసి దేవలోకానికి వెళ్ళిపోయారు.

ఇక్కడ వివాహం జరుగుతున్నప్పుడు బ్రహ్మ పలికిన ఆశీర్వచనమంత్రం అక్కడ లంకలో రావణుని దగ్గరున్న బ్రహ్మ నోట వినిపించింది. దాంతో రావణునికి అనుమానం వచ్చి ఎందుకా మంత్రం ఉచ్చరించావని అడిగాడు. కౌసల్యాదశరథులకు వివాహం జరిగిందనీ, అది వారిని ఆశీర్వదిస్తూ పలికిన మంత్రమనీ బ్రహ్మ చెప్పాడు. వెంటనే రావణుడు ఆ దంపతులను చంపడానికి ఆ దీవికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడున్న పెట్టె తెరవగానే అందులోంచి దశరథుడు బయటికి వచ్చాడు. వారిద్దరికీ యుద్ధం జరుగుతుండగా బ్రహ్మ మొదలైన దేవతలు వచ్చి నచ్చజెప్పి వారింపజేశారు...

రావణుడు వెళ్లిపోగానే అక్కడికి దైవవశంగా జటాయువు వచ్చాడు. అతనికీ, దశరథుడికీ స్నేహం ఏర్పడింది. నిన్ను అయోధ్యకు తీసుకెడతానని జటాయువు అంటే, నిన్ను పక్షులకు రాజును చేస్తానని దశరథుడు అన్నాడు. వాస్తవంగా పక్షులకు రాజైన గరుత్మంతుడికి ఈ విషయం తెలిసినా, తన ప్రభువైన శ్రీమహావిష్ణువే దశరథునికి కొడుకుగా పుట్టబోతున్నాడు కదా అనుకుని ఊరుకున్నాడు...

వాల్మీకి రామాయణం ప్రకారం, రావణుడు సీతను అపహరించుకు వెడుతున్నప్పుడు జటాయువు అడ్డుపడి అతనితో యుద్ధం చేసి కన్నుమూస్తాడు. జటాయువు తమ తండ్రి అయిన దశరథునికి మిత్రుడని రాముడు లక్ష్మణునితో చెప్పి అతనికి అంత్యక్రియలు చేస్తాడు. ఈ ఒక్క వివరాన్ని తీసుకుని ఆనందరామాయణకర్త పై కథను అల్లినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అదలా ఉంచితే, జటాయువును పక్షిరాజును చేసే అధికారం దశరథుడికి ఎలా వచ్చిందో తెలియదు. అలా పక్షిరాజుగా తనకున్న హోదాను దశరథుడు జటాయువుకు కట్టబెడతానన్నా గరుత్మంతుడు ఊరుకోడానికి చెప్పిన కారణమూ అసంబద్ధంగానే ఉంటుంది. అప్పటికి కౌసల్యాదశరథుల వివాహం మాత్రమే అయింది తప్ప, వారికి ఎంతకాలానికీ సంతానం కలగకపోవడం, దశరథుడు మరో ఇద్దరిని వివాహమాడడం, పుత్రకామేష్టి చేయడం, రావణసంహారం కోసం విష్ణువు దశరథునికి కొడుకుగా పుట్టాలనుకోవడం వగైరా కథ అంతా జరగనేలేదు.

అయినాసరే, తన ప్రభువైన విష్ణువు దశరథునికి కొడుకుగా పుట్టబోడుతున్నాడు కదా అనుకుని తన హోదా అన్యాక్రాంతమవుతున్నా గరుత్మంతుడు ఊరుకున్నాడట! కథనంలో ముందువెనుకలు పాటించాలన్న కనీసమైన ఆలోచన కూడా లేకుండా, జరగబోయే కథకు చెందిన అంశాలను కూడా జరిగిన, జరుగుతున్న కథలో కలిపేసి చెప్పడం, లేదా వ్యాఖ్యానించడం సాంప్రదాయిక పండిత శైలిగా కనిపిస్తుంది.

ఆ తదుపరి కథనం ప్రకారం, దశరథుడు జటాయువును అధిరోహించి అయోధ్యానగరాన్ని చేరుకున్నాడు... కౌసల్యతో కలసి ‘స్వగృహం’లో సంతోషంగా అగ్నిష్టోమం మొదలైనవి చేస్తూ సంతోషంగా ఉన్నాడు...అతనికి ఎంతకాలానికీ సంతానం కలగకపోవడంతో, కౌసల్య స్వయంగా పంపగా మగధరాజకన్య అయిన సుమిత్ర స్వయంవరానికి వెళ్ళి ఆమెను పెళ్లాడాడు. ఆమెవల్ల కూడా సంతానం కలగకపోవడంతో అప్పటికే వృద్ధుడైన స్థితిలో, కేకయరాజు కోరిన వరాలను శుల్కంగా ఇచ్చి అతని కుమార్తె కైకను పెళ్లిచేసుకున్నాడు...

‘దక్షిణకోసల’కు రాజని చెప్పిన దశరథునికి ‘ఉత్తరకోసల’కు చెందిన అయోధ్యలో ‘స్వగృహం’ ఎలా ఉందో, ఎందుకుందో తెలియదు. జటాయువు దశరథుడికి మిత్రుడన్న వాల్మీకి రామాయణంలోని చిన్న వివరాన్ని పట్టుకుని అతణ్ణి దశరథుడికి వాహనం చేసే క్రమం అంతటితో ఆగకుండా అతని పేరు దాకా విస్తరించింది. పదిమంది రథికుల బలం కలవాడని, లేదా ‘దశము’ అనగా పక్షి అనే అర్థం ఉంది కనుక జటాయువు రథంగా కలిగినవాడని దశరథుని పేరుకు అర్థం చెప్పే ఒక శ్లోకాన్ని, అది ఎందులోదో స్పష్టంగా చెప్పకుండా, నరసింహావధాన్లు గారు ఉదహరిస్తారు. ఇదీ ఆ శ్లోకం:

రథికానాం దశానాంచ బలాద్దశరథో zభవత్/జటాయు రథవత్త్వాచ్చ సవై దశరథ స్మృతః

విశేషమిటంటే, వాల్మీకేతర రామాయణాల ప్రకారం, కౌసల్య, దశరథుడు, అతని పెళ్లిళ్లకు సంబంధించిన కథనానికి సమాంతరంగా; పుట్టబోయే తన శత్రువును రావణుడు అంతమొందించే ప్రయత్నాలూ కొనసాగుతూ ఉంటాయి. కాకపోతే, కౌసల్యా, దశరథులను చంపే ప్రయత్నాలు కాస్తా అతని సంతానాన్ని చంపే ప్రయత్నాలుగా మారతాయి...

ఇతర విశేషాలు తర్వాత...



Tags:    

Similar News