సింధు లోయలో ఇటు కరువు, అటు ఆర్యుల సైనిక పాటవం

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 19. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

By :  Admin
Update: 2024-12-02 13:01 GMT

-బేతి పాణిగ్రాహి

హరప్పనుల వలస క్రమంగా అందరూ మరిచి పోయారు, ఆర్యుల రాజు ఇంద్రసేనుడు తన అధికారాన్ని మరింత సుస్థిరపరచుకోనారంభించాడు. రాబోయే తరాల్లో కూడా దుర్భేద్యంగా ఉండగల బలమైన సైన్యాన్ని తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించాడు.

“సూర్య చంద్రులున్నంత వరకు అందరూ తలచుకునే గొప్ప సైన్యాన్ని మనం నిర్మించాలి..” శోభాయమానంగా అలంకరించిన రాజదర్బారులో నవరత్నఖచిత సింహాసనంపై కూర్చున్న ఇంద్రసేనుడు తన సేనా నాయకుల నుద్దేశించి అన్నాడు. అతని కంఠం కంచుగంటలా మోగింది. “శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే, భావి తరాలవారు గొప్పగా చెప్పుకునే.. బలమైన సైన్యం అది.”

“ మనకు మెరికల్లాంటి సైనికులు కావాలి, తిరుగు లేని వ్యూహరచన నైపుణ్యం, మేలిమి రకపు ఆయుధాలుం కావాలి..” అన్నాడోక సేనానాయకుడు. కిటికీ లోంచి ప్రసరిస్తోన్న సూర్య కాంతిలో అతని కవచం ధగధగా మెరిసి, ఆ మెరుపు అతని కళ్ళల్లో ప్రతిఫలించింది. “అయితే మనం క్రమశిక్షణ, విధేయత ల ప్రాముఖ్యత విస్మరించరాదు. ఎదురు ప్రశ్న వేయకుండా అధికారి చెప్పింది తు. చ. తప్పకుండా శిరసావహించేటట్టు మన సైనికులకు కఠిన తర్ఫీదు ఇవ్వాలి.’

“నేను ఒప్పుకుంటున్నాను..” సాలోచనగా తల పంకిస్తూ స్థిరంగా అన్నాడు ఇంద్రసేనుడు. “ నిర్భీతిగా, అలుపెరగకుండా పోరాడగలిగేలా వాళ్లకి శిక్షణ ఇద్దాం. ఆశ్విక దళం, గురితప్పని విలుకాండ్ర బలగం కొత్తగా వచ్చి చేరాయి – వీటితో మనం శత్రుదుర్భేద్య సత్తా సమకూర్చుకున్నాం. మనం ధరించే కవచాలు, చేపట్టే ఆయుధాలు శ్రేష్టమైన లోహంతో చేసినవిగా, చాలా ధృడమైనవిగా వుంటాయి, వాటి తళతళలు నిస్సందేహంగా శత్రువులకు వణుకు పుట్టిస్తాయి.”

సుశిక్షితులైన సైనికులతో నిర్మాణమైన ఆర్యుల సైన్యం అరివీర భయంకరమైన భారీ సేనగా పేరు పొందింది. తళతళలాడేలా మెరుగు పెట్టిన ఆయుధాలు, కవచాలు మెరుస్తూంటే వాళ్ళు అత్యంత కచ్చితత్వంతో రణస్థలిలోకి కవాతు చేస్తారు ; ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులు దూకుడుగా పరిగెత్తి శత్రు సైనికులను నుజ్జునుజ్జు చేస్తాయి. యుద్ధరంగపు రణగొణ ధ్వనులు, ఆయుధాల ఖణేల్ ఖణేల్ చప్పుళ్ళు, నెత్తుటి కంపు, లోహపు తుప్పు వాసన... చాలా దూరం వరకు వ్యాపిస్తాయి.

ఇంద్రసేనుడి యుద్ధ వ్యూహాలు చాలా పకడ్బందీగా, సునాయాసంగా విజయం తెచ్చి పెట్టేవిగా వుంటాయి, ఆనతికాలం లోనే అతడు ఒకదాని వెంట మరొకటిగా అనేక రాజ్యాలు కబలించాడు. సువిశాల భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. పెద్ద ప్రతిఘటన లేకుండా శత్రురాజులు, సేనలు, ప్రజలు అతని ముందు మోకరిల్లారు. అతని యుద్ధ గజాలు నిర్దాక్షిణ్యంగా విజ్రుంభించి పొరుగు నగరాలను, పంట పొలాలను నేల మట్టం చేశాయి.

భయం గొలిపే వింత నాదంతో విలుకాండ్ర ధనుసులు శత్రువులపై ఊపిరి సలపనీయకుండా బాణాల వర్షం కురిపించేవి. ఆశ్వికదళ సైనికులు అతి వేగంగా గుర్రాలను పరిగెత్తించి పొడవైన కరవాలాలతో చేతికి చిక్కిన శత్రు సైనికుడినల్లా నరికి పోగులు పెట్టేవారు.

ఇంద్రసేనుడి యుద్ధగజాలు ప్రత్యేకంగా శిక్షణ పొందినవి, శత్రు సైనికులను పొడిచి చంపేందుకు వీలుగా వాటి దంతాలకు సాన బెట్టేవారు. వివిధ హంగులతో అలంకరించిన ఆ ఏనుగులపై కత్తులు, బల్లేలు చేత పూనిన సైనికులు స్వారీ చేస్తూ చేతికందిన శత్రువులను చీల్చి చెండాడేవారు.

అతని ఆశ్విక దళంలో వేగానికి, బలానికి ప్రసిద్ధి పొందిన మేలు జాతి అశ్వాలు ఉండేవి. తాము స్వారీ చేసే గుర్రాల వేగాన్ని, కదలికల్ని నియంత్రించేందుకు వీలుగా ఆర్యులు జీనులు, రికాబులు ఉపయోగించారు. అదొక కొత్త విధానం. ప్రతి సైగకు, ప్రతి ఆదేశానికి స్పందించేలా గుర్రాలకు ప్రత్యెక శిక్షణ ఇప్పించేవారు. సైనికులు కత్తులు ఝళిపిస్తూ వాటిపై వేగంగా స్వారీ చేస్తూ వీరవిహారం చేసేవారు.

కంచుతో చేసిన ఆర్య సైనికుల కవచాలు ప్రత్యేకమైనవిగా పేర్కొన దగ్గవి. చాతీపై సర్పాలు, జంతువులు ..వంటి వివిధ ఆకృతులు, నమూనాలు చెక్కిన అవి మెరుస్తూ కనపడేవి. ప్రత్యెక ఆకారంలో మలిచిన శిరస్త్రాణాలపై నొక్కులు, కోడిపుంజు తురాయి వంటి అగ్రభాగం చూపరులకు విభ్రాంతి గోలిపేవి. డాలులపై ఆర్యుల సాహసాన్ని ప్రతిబింబించే అద్భుత చిహ్నాలు చెక్కి ఉండేవి. పిడులపై మణులు పొదిగిన కత్తులు, బల్లేలు శ్రేష్టమైన లోహాలతో తయారై ఆకర్షణీయంగా కనపడేవి.

పతాకాలు గాలిలో రెపరెపలాడుతుండగా తన రాజ్య పొలిమేరల వేపు దూసుకు వస్తోన్న ఆర్య సేనా వాహినిని చూస్తూ ఒక పొరుగు దేశాదిపతి భయంతో వణికాడు. “ఇలాంటి గొప్ప సేన మరెక్కడా చూడలేదు. వీరి సైనికపాటవం అసామాన్యమైనది. ఎదురు తిరిగి నిలబడటం మా తరం కాదు.” అనుకున్నాడు.

“ మర్యాదగా లొంగిపోయి నీ ప్రజలను రక్తపాతం నుంచి కాపాడుకో..” అన్నాడు ఇంద్రసేనుడు నిబ్బరమైన స్వరంతో. “ ఒక వేళ ప్రతిఘటిస్తే..నీ మీద ఏ మాత్రం కనికరం చూపను. నిన్ను నా పాదాల చెంతకు ఈడ్చుకు వస్తారు. నీకు, నీ ప్రజలకు శిక్ష నేను నిర్ణయిస్తాను.”

పొరుగు దేశాధిపతి ఒక నిముషం సంకోచించాడు, వెంటనే అపజయాన్ని అంగీకరించాడు. “ నేను లొంగి పోతున్నా. దయవుంచి నా ప్రజలను ఏమీ చేయవద్దు.”

ఇంద్రసేనుడు వెక్కిరింపుగా అన్నాడు; “నువ్వు తెలివైన నిర్ణయం తీసుకున్నావు, నీ ప్రజలకు ఏ హానీ తలపెట్టను. కానీ నా సమక్షంలో నీపై న్యాయ విచారణ జరుగుతుంది.”

ఆ మీదట ఆర్య సేనావాహిని ముందుకు దూసుకు పోయింది. ఎదురు నిలిచేవారు ఎవరూ లేక పోయారు. ఆర్యుల అజేయ సైనిక శక్తి కీర్తిప్రతిష్టలు ప్రపంచం నలుచెరగులా వ్యాపించాయి.

అదలా వుండగా... ఒక విపరీత ఘటన చోటు చేసుకుంది. చాలా ఏళ్ళు వర్షాలు పడకపోవడం వల్ల సింధు నది లోయ తీవ్ర క్షామం గుప్పిట్లో చిక్కుకుంది. నదులన్నీ ఇంకి పోయినాయి పంటలు ఎండి పోయినై, ప్రజలు తిండికి అల్లల్లాడి పోయారు. ఒకప్పుడు సస్య శ్యామల సీమగా విలసిల్లిన ఆ భూభాగం ఎండి నెర్రెలు బాసింది, ఆకాశంలో మబ్బు తునక కాన రాలేదు, ప్రజలు అందరు దేవుళ్ళను ప్రార్థించారు, కానీ ఎవరూ ఆదుకోవడానికి రాలేదు.

ఆర్యుల సేన ఆయుధాలు ఎత్తిపట్టి ముందుకు సాగుతూనే పోయింది. ఎక్కడ చూసినా ప్రజలు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయి దీనంగా కనపడ్డారు. క్షామం చాలా మందిని బలి తీసుకుంది.

ఒక వూళ్ళో ఒక కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఎండిన డొక్కలతో కిందపడి దొర్లుతూ నీరసంగా మూలిగారు.” ఈ ఆకలి బాధ ఇంకా ఎంత కాలం భరించగలం ?” ఆ ఇల్లాలు పొడిబారిన పెదవులతో వినీ వినబడనట్టు గొణిగింది.

“ నాకూ తెలియదు..” బదులిచ్చాడు ఆమె పెనిమిటి. అతని కళ్ళు లోతుల్లోకి పోయినై. “పంటలు ఎండి పోతున్నాయి. నీరు లేక నదుల్లో ఇసుక మేట వేసింది. ఇంతటి తీవ్రమైన కరువు గతంలో ఎన్నడూ చూసి ఎరగము.”

“ మన పిల్లలు ఆకలితో తల్లడిల్లి పోతున్నారు. ఏమి చేయాలో నాకు దిక్కు తోచడం లేదు. దేవుళ్ళు మన మీద కినుక వహించడానికి మనం ఏమి పాపం చేశాం ?”వణుకుతున్న స్వరంతో అన్నది ఇల్లాలు.

ఇంత జరుగుతున్నా ఆర్యుల సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగుతూ పోయింది. వాళ్ళ విజయ పరంపర కోరిన ప్రాణనష్టం ఖరీదుకి ప్రజల దీనహీన స్థితి అద్దం పట్టింది.

ఒకప్పుడు అత్యంత వైభవోపేతంగా విలసిల్లిన సింధు నది మహా నాగరికత ఇప్పుడు క్షీణదశకి చేరుకున్నది. క్షామం ఆ ప్రాంతాన్ని సర్వనాశనం గావించింది. ఊపిరి నిలుపుకునేందుకు ప్రజలు నానా యాతనలు పడ్డారు. జనసంఖ్య బాగా తగ్గింది. కుటుంబాలు చెల్లాచెదురైనాయి. నగరాలు ఖాళీ అయినాయి. వారి సంస్కృతి విస్మృతి అంచులలో నిలబడి వుంది.

ఎడతెరిపి లేని యుద్ధాలు, నిరంతర భయం, వెంటాడే ఈతిబాధల కారణంగా ప్రజలు విసిగివేసారి పోయారు. హింస, రక్తపాతం లేని ప్రశాంత జీవనం గడపాలనీ, నగరాలను, మునుపటి జీవితాలని పునర్నిర్మించుకునే మంచి సమయం రావాలనీ వాళ్ళు ఆశగా ఎదురు చూశారు. రక్తపాతం ఆగిపోవాలని, మళ్ళా గతంలోలాగా సామరస్యపూరిత జీవనస్థితులు పునరుద్ధరించబడాలనీ దేవుళ్ళను ప్రార్థించారు.

ఆర్యుల సైనికపాటవం నిజంగా సాటిలేనిదే, కానీ దూరప్రాంతాల్లో ఒక కొత్త పరిణామం నిశ్శబ్దంగా వ్యాప్తి చెందనారంభించింది. అశాశ్వతత్వం. నిస్వార్థ పరత్వం, అస్వతంత్ర ఆవిర్భావం... సూత్రాల ప్రాతిపదికగా ఒక తాత్వికఉద్యమం పెల్లుబికిరాసాగింది.

ఆ తాత్వికశాఖ అనుయాయులు ఊరూరూ తిరుగుతూ ఆత్మజ్ఞానం, మోక్షం మనిషికి ముఖ్యం అని బోధనలు చేస్తూ, సాంఘిక-ఆర్ధిక అంతస్తులు అర్థం లేనివనీ, వర్ణవ్యవస్థ నిరంకుశమైనదనీ వివరించారు. రాజ్యాల సైనిక వ్యయ, వ్యామోహాలకు భిన్నంగా వున్నఆ తాత్విక సిద్ధాంతాలు అన్ని రంగాల ప్రజలను ఆకర్షించాయి.

కొత్త తాత్విక భావజాలం వేగంగా వ్యాప్తి చెందింది, ఆ సూత్రాలను, పద్ధతులను అన్ని వర్గాల ప్రజలు స్వీకరించసాగారు. అశాశ్వతత్వాన్ని, బహుజనహితాన్ని, భూతదయను నొక్కి చెప్పే ఆ భావజాలం కొత్త ఆలోచనా ధోరణికి పునాదులు వేసింది. ఒక కొత్త సామరస్య, అవగాహనా పూర్వక శకం కనుచూపు మేరలో కనపడింది. కానీ ఐక్యకూటమి పాలక వర్గాల సైనిక సంస్కృతి ఆ మార్పును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చారిత్రికసంధి దశలో ఒకే ఒక ప్రశ్న లోయ అంతటా మార్మోగింది ; లోతుగా వేళ్ళూనుకుని పోయిన అధికార మదాన్ని, యుద్ధోన్మాదాన్ని శాంతి సయోధ్యలకు సంబంధించి కొత్తగా తలెత్తుతోన్న ఆలోచనలు నిర్మూలించగలవా?(సశేషం)

Tags:    

Similar News