మీకు తెలుసా? రాముడూ, సీతా కూడా ఇక్ష్వాకువంశీకులే!

రామాయణంలో నిరుత్తరకాండ-16 ప్రముఖ రచయిత కల్లూరి భాస్కరం చెబుతున్న రామాయణ విశేషాలు

Update: 2024-08-03 08:38 GMT

జైన తీర్థంకరులలో మొదటివాడైన ఋషభుడు ఇక్ష్వాకువంశీయుడనీ, కులాచారం ప్రకారం తన కవల సోదరి అయిన సుమంగళను వివాహమాడాడనీ, ఆ తర్వాత ఒకే తల్లికి పుట్టిన అన్నా, చెల్లెళ్ల పెళ్లిని నిషేధించి; తండ్రి ఒకడే అయినా తల్లులు వేరైన అన్నాచెల్లెళ్లు పెళ్లాడే విధంగా సంస్కరణ తెచ్చాడనీ ఇంతకుముందు చెప్పుకున్నాం. దశరథుడు కూడా ఇక్ష్వాకు వంశీకుడే కనుక అతనికీ, ఋషభునికీ మధ్య వంశపరంగా ఒక పోలిక కుదురుతోందని కూడా అనుకున్నాం...

కోసలరాజు దశరథుడు, కోసలపుత్రి కౌసల్యల వివాహాన్ని అర్థం చేసుకోడానికి ఈ పోలిక ఏదైనా క్లూ ఇస్తోందా?!

ఆ ప్రశ్నను ప్రస్తుతానికి అలా ఉంచి, సీతారాముల వివాహానికి వద్దాం. ఇందులో ఆశ్చర్యమేమిటంటే, ఆ ఇద్దరి వంశం గురించిన ఒక సమాచారాన్ని వాల్మీకి రామాయణం స్వయంగా దాటవేయడం! అంతకన్నా పెద్ద ఆశ్చర్యం, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు కానీ, బహుశా ఇతర రామాయణ వ్యాఖ్యాతలు, వివరణకర్తలు కానీ దానిని గుర్తించకపోవడం; చివరికి, ‘రాముడికి సీత ఏమవుతుంది’ అనే తన పుస్తకంలో, ఆయా రామాయణాలు సీతారాముల మధ్య అన్నాచెల్లెళ్ల సంబంధాన్ని ఎలా చెబుతున్నాయో విస్తృతంగా చర్చించిన ఆరుద్ర కూడా దానిని గమనించకపోవడం!!

అదేమిటో చెప్పుకునేముందు, వెనకటి వ్యాసాలలో ప్రస్తావించిన కొన్ని వివరాలను పునశ్చరణ చేసుకుందాం:

రాముడు విశ్వామిత్రునితో కలసి మిథిలానగరానికి వెళ్ళి శివధనుర్భంగం చేశాడు... దాంతో ఆ నగరానికి రాజైన జనకుడు సీతను అతనికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు... అందుకు దశరథుని అనుమతి కోరడానికీ, ఆయనను మిథిలానగరానికి ఆహ్వానించడానికీ దూతను పంపాడు… దశరథుడు ఆ ఆహ్వానాన్ని అంగీకరించి మిథిలకు తరలి వచ్చాడు... పెళ్లికి ముందు కన్యనిచ్చేవారూ, పుచ్చుకునేవారూ కూడా తమ తమ వంశాలగురించి ఒకరికొకరు చెప్పుకున్నారు... వసిష్ఠుడు దశరథుని వంశచరిత్రను చెప్పగా జనకుడు తన వంశచరిత్రను స్వయంగా చెప్పుకున్నాడు...

విశేషమేమిటంటే, దశరథుని వంశచరిత్ర అవ్యక్తం నుంచి పుట్టిన బ్రహ్మతో మొదలై, మరీచి, కశ్యపుడు, సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు, పృథువు, మాంధాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, కకుత్థ్సుడు, రఘువు, అంబరీషుడు తదితర పురాణ ప్రసిద్ధుల పేర్ల మీదుగా దశరథుని దాకా వస్తుంది. కానీ, జనకుని వంశచరిత్ర బ్రహ్మతో మొదలు కాదు; నేరుగా నిమి అనే రాజుతో ఇలా మొదలవుతుంది:

రాజా zభూత్ త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా/నిమిః పరమధర్మాత్మా సర్వసత్త్వవతాం వరః- బాల. స.71.శ్లో.3.

తన పనులవల్ల మూడు లోకాల్లోనూ ప్రసిద్ధి కెక్కినవాడు, పరమధార్మికుడు, బలవంతులందరిలో శ్రేష్ఠుడు అయిన నిమి అనే రాజు ఉండేవాడని-దీని అర్థం.

నిమి కొడుకు మిథి. అతనే మిథిలానగరాన్ని నిర్మించిన తొలి ‘జనకుడు’. అంటే మిథిలను పాలించిన రాజులందరికీ సొంతపేరుతోపాటు ‘జనకుడు’ అనే పదవీనామం కూడా ఉండేదని దీనినిబట్టి అర్థమవుతుంది. అదలా ఉంచితే, దశరథుడు ఇక్ష్వాకు వంశీయుడైనట్టుగా జనకుడు కూడా ఏదో ఒక వంశానికి చెంది ఉండాలి కదా? ఆ వంశం ఏమిటి? వాల్మీకి రామాయణమూ, దాని వ్యాఖ్యాతలూ, వివరణకర్తలూ దాటవేసిన సమాచారం అదే!

సాధు లక్ష్మీనరసింహశర్మగారు తన పురాణనామసంగ్రహంలో ఉటంకించిన ఉత్తరరామాయణ, విష్ణుపురాణకథనాల ప్రకారం, నిమి మరెవరో కాదు; ఇక్ష్వాకుపుత్రులలో ఒకడు! అతనొకసారి ఒక యాగం తలపెట్టి, దానిని నడిపించాల్సిందిగా తన పురోహితుడైన వసిష్ఠుని కోరాడు. ఇంద్రుడు తన యజ్ఞానికి ఆధ్వర్యం వహించమని నన్ను ముందే కోరాడనీ, అది పూర్తయ్యాక వచ్చి నీతో యాగం చేయిస్తాననీ వసిష్ఠుడు అన్నాడు. నిమికి కోపం వచ్చి, గౌతమమహర్షి సారథ్యంలో యాగం చేశాడు. ఇంద్రుని యాగం పూర్తిచేసి వసిష్ఠుడు నిమి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో బడలికతో ఉన్న నిమి, పగటివేళ అని కూడా చూడకుండా నిద్రపోతున్నాడు. దాంతో అతనికోసం వసిష్ఠుడు వాకిట్లో చాలాసేపు ఎదురుచూశాడు. కాసేపటికి నిమి బయటకొచ్చి యాగం అయిపోయిందని చెప్పాడు...

కులగురువైన తనను కాదని మరొకరి సారథ్యంలో నిమి యాగం చేసినందుకూ, అంతసేపు తనను ఎదురుచూసేలా చేసినందుకూ వశిష్టుడికి కోపం వచ్చింది. నువ్వు అంగహీనుడివి, అంటే దేహం లేనివాడివి అవుగాక అని నిమిని శపించాడు. దేహం లేకపోవడం అంటే ‘విదేహుడు’ కావడం అన్నమాట. నువ్వు కూడా అంగవిహీనుడివవుతావని నిమి ప్రతిశాపమిచ్చాడు. అప్పుడు బ్రహ్మ జోక్యం చేసుకుని, మిత్రావరుణుల కొడుకుగా పుట్టి తిరిగి దేహం ధరిస్తావని చెప్పి వసిష్ఠునికీ; ప్రాణుల కనురెప్పల మీద నివసిస్తావని చెప్పి నిమికీ శాపసవరణ చేశాడు. నిమివల్లనే రెప్పపాటుకు నిమిషమనే పేరు వచ్చింది...

ఈవిధంగా, ఇక్ష్వాకువంశీకుడైన దశరథునితో వియ్యమందుతున్న జనకుడు కూడా ఇక్ష్వాకువంశీకుడే నన్నది ఈ కథలో మనకు కావలసిన ముఖ్యమైన వివరం. జనకుని రాజ్యానికి విదేహరాజ్యమనే పేరూ, విదేహరాజపుత్రిగా సీతకు వైదేహి అనే పేరూ రామాయణప్రసిద్ధాలే కనుక, ఆ పేర్లకు సమర్థన కల్పించడానికి వసిష్ఠుని శాపాన్ని కల్పించారేమో తెలియదు. అలాగే రెప్పపాటుకు నిమిషం లెక్క వర్తిస్తుందా అన్నది ఇంకో ప్రశ్న. వాటి సంగతెలా ఉన్నా, దశరథుని వంశం బ్రహ్మతో మొదలైందంటూ అంత ఘనంగా చెప్పిన వాల్మీకి రామాయణం, జనకుడి విషయానికి వచ్చేసరికి నిమి అనే ఓ రాజును అతని వంశకర్తగా చెప్పి తేల్చివేయడం, అతని వంశమిదీ అని స్పష్టంగా చెప్పకపోవడం వల్లనే పై కథ ఆసక్తికరంగా మారుతోంది. సీతారాముల పెళ్లి జరగబోతున్న సమయంలో కన్యాదాత, కన్యాగ్రహీతలు ఒకే వంశానికి చెందినవారని చెప్పడంలోని ఇబ్బందిని గమనించే రామాయణకథకుడు ఆ వివరాన్ని దాటవేశాడా అన్న అనుమానం కలుగుతుంది.

అంతేకాదు, వాల్మీకి రామాయణం మరొక ఇక్ష్వాకుపుత్రుని గురించి కూడా చెబుతోంది. అతని పేరు దండుడు. దక్షిణభారతంలో దండకారణ్యంగా ప్రసిద్ధమైన పేరు అతనినుంచే వచ్చింది. దాని గురించి మరింత విశేషంగా చెప్పుకునే సందర్భం ముందుముందు వస్తుంది. మొత్తానికి జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఋషభునితో మొదలుపెట్టి రామాయణంలోని దశరథుడు, నిమి, దండులతో సహా ఇక్ష్వాకువంశీయులు చాలామంది ఉన్నారన్నమాట. అంతేకాదు, బౌద్ధగ్రంథాల ప్రకారం, బుద్ధుడు జన్మించిన శాక్యవంశమూలపురుషుల్లో కూడా ఇక్ష్వాకువు ఉన్నాడు; ఆ పేరు పాళీభాషలో ‘ఒక్కక’ అయింది. క్రీ.శ. 3,4 శతాబ్దాలలో విజయపురి రాజధానిగా ఒక శతాబ్దకాలంపాటు ఆంధ్రప్రాంతాన్నిఏలినవారు తమను ఇక్ష్వాకువంశీకులుగా చెప్పుకున్నారు.

ప్రాచీనభారతదేశంలో అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది వరకూ పాలకులు తమను ఇక్ష్వాకువంశీకులుగా చెప్పుకోవడాన్ని అత్యంతప్రతిష్ఠాత్మకంగానూ, గౌరవప్రదంగానూ భావించేవారని పై వివరాలను బట్టి స్థూలంగా అర్థమవుతుంది. ఇక్ష్వాకులుగా తమను చెప్పుకున్నవారిలో సూర్యవంశరాజులే కాక, చంద్రవంశరాజులు కూడా ఉన్నారు. ఇక్ష్వాకుల ప్రాచీనతను సూచిస్తూ, ‘ఇక్ష్వాకుల బారసాల నుంచీ...’, ‘మాంధాతల కాలం నుంచీ...’ అనే రెండు జాతీయాలు కూడా మన దగ్గర వినబడుతూ ఉంటాయి. పైన చెప్పుకున్న ఇక్ష్వాకువంశీకులలో మాంధాత కూడా ఉన్నాడు. కాకపోతే, రాంభట్ల కృష్ణమూర్తి తన ‘వేదభూమి’లో మాంధాత అనే మాటను ప్రాచీన మెసపొటేమియాతో ముడిపెట్టి మరో అర్థం చెబుతారు. ఎలాగంటే, మొదట్లో మెసపొటేమియాలో భూమి ఎవరికీ ప్రైవేట్ ఆస్తి కాదు. అక్కడి రాజులు శాశ్వతసేనలను పోషిస్తూ ఉండేవారు. సైనికులకు కొంతభూమిని మాన్యంగా ఇచ్చేవారు. దానిమీద వచ్చే గింజలు వారికి జీవనభృతి అయ్యేవి. ఆ జీవనభృతిని ‘మందాతు’ అనేవారు.

రాంభట్ల ప్రస్తావించలేదు కానీ, ‘ఏన్షియంట్ మెసపొటేమియా’ అనే పుస్తకం ఆ మాటకు మరో వివరణ ఇస్తుంది. దాని ప్రకారం, ఒక బానిస సొంతంగా చేసే వ్యాపారం తాలూకు రాబడినుంచి యజమానికి చెల్లించే నిర్దిష్టమైన మొత్తాన్ని; లేదా రాజుకు, ఇతర ఉన్నతాధికారులకు చెల్లించే పన్నును ‘మందాతు(mandattu) అంటారు. తిరిగి రాంభట్ల వివరణకు వస్తే, అతిపురాతనకాలంలో వేదరుషులకు పశ్చిమాసియాతోనూ, తద్వారా తాము మ్లేచ్ఛులుగా సంకేతించిన అక్కడి జనాలతోనూ సంబంధం ఉండేది. కుత్సుడనే ఋషి, పైన చెప్పిన ‘మందాతు’ పద్ధతి గురించి విని, సరిగా అర్థం చేసుకోలేక ఆ మాటను ఉపయోగిస్తూ ఋగ్వేదంలో ఒక సూక్తం చెప్పాడు. అది ఇదీ:

‘యాభిః సూర్యం పరియూధిః పరావతి మంధాతారం క్షేత్రపత్యే ష్వాపతం’

ఓ అశ్వినీదేవతలారా, దూరమందుండు సూర్యుని(రాహువు మింగినపుడు)ఏ రక్షలతో రక్షించారో, మంధాత అన్న ఋషిని క్షేత్రపాలుని చేయు కర్మలయందు ఎలా రక్షించినారో ఆ రక్షలతో సుఖముగా రండు’ అని ఈ సూక్తానికి అర్థం.

ఇందులో చెప్పిన మంధాత అనే ఋషే మాంధాత పేరుతో సూర్యవంశపు రాజుగా పురాణాలకు ఎక్కాడని రాంభట్ల అంటారు. ‘మందాతు’ అనే మెసపొటేమియా మాటతో మాంధాత అనే ఇక్ష్వాకువంశీకుని ముడిపెట్టడం ఒకవేళ మరీ శ్రుతిమించిన ఊహ అనిపిస్తే, వ్యవసాయపరంగా దీనికి అర్థవంతమైన వేరొక వివరణ ఉంది. మాంధాత తన తండ్రి యువనాశ్వుని గర్భాన్ని చీల్చుకుని పుడతాడని మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసంలోని అతని కథ చెబుతుంది. విత్తనం భూమిని చీల్చుకుంటూ మొలకెత్తినట్టుగానే మాంధాత కూడా తండ్రి గర్భాన్ని చీల్చుకుంటూ పుట్టాడని చెప్పి రాంభట్ల దీనికి వ్యవసాయసంబంధమైన వివరణ ఇస్తారు. ఆపైన మాంధాత తన దివ్యశరాలతో మేఘాలను సృష్టించి వర్షం కురిసేలా చేసి పంటలు పండించాడని అతని కథ చెబుతోంది. పై ఋగ్వేద సూక్తంలో క్షేత్రపాలుని ప్రస్తావన కూడా వ్యవసాయసంబంధాన్నే సూచిస్తుంది.

నేటి పారిశ్రామికాభివృద్ధిలానే ప్రాచీనకాలంలో వ్యవసాయవిస్తరణ ఒక పురోగామి చర్యగా పెద్ద ఎత్తున అమలు జరిగిందనీ, మనదేశంలో వ్యవసాయవిస్తరణమూలాలు పశ్చిమాసియాలో కూడా ఉన్నాయనీ, అందులో ముఖ్యపాత్ర పోషించిన కారణంగా ఇక్ష్వాకుల వంటి ప్రాచీనరాజవంశాలు ప్రతిష్ఠనూ, ప్రసిద్ధినీ తెచ్చుకుని ఉంటాయనే కోణం నుంచి దీనిని చూడవచ్చు.

అసలు విషయం నుంచి ఇంతగా ఎందుకు పక్కకు జరగాల్సివచ్చిందంటే, ఇక్ష్వాకుల ప్రాచీనతను గుర్తించడం కోసం! ఇక ఇప్పుడు, కోసలరాజైన దశరథుడు, కోసలపుత్రి అయిన కౌసల్యల వివాహాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న ప్రశ్నతోపాటు; కన్యాగ్రహీత అయిన రాముడూ, కన్యాదాత అయిన జనకుడూ కూడా ఇక్ష్వాకువంశీకులే కావడమనే అసంబద్ధతను ఎలా అన్వయించుకోవాలన్న ప్రశ్న కూడా తలెత్తింది. ఇది కూడా జైన తీర్థంకరుడైన ఋషుభుని ఉదంతంలోలానే అతిప్రాచీనులైన ఇక్ష్వాకువంశీకులలోని సోదర, సోదరీ వివాహమనే ఆనవాయితీని చెబుతోందనుకోవాలా? అయితే, ఇక్ష్వాకువంశం అనేక శాఖలుగా చీలిపోయి ఉండవచ్చు కనుక, సీతారాములది మరీ దగ్గరి సోదర, సోదరీసంబంధం కాకపోవచ్చు. అయినాసరే, ఒకే వంశానికి చెందినవారుగా సాంకేతికంగా వారిది సోదర, సోదరీసంబంధమే తప్ప మరొక వరస కావడానికి వీల్లేదు. ఈ రోజున కూడా గోత్రపరంగా చెప్పుకుంటే, కనీసం దూరపు చుట్టరికం కూడా లేకపోయినా గోత్రం ఒకటైతే, వివాహసంబంధం కలుపుకోరు. అలాంటిది అప్పుడెలా సాధ్యమైంది?

మరీ ముఖ్యంగా, కోసలరాజైన దశరథుడు, కోసలపుత్రి అయిన కౌసల్యల వివాహాన్ని అర్థం చేసుకోవడానికి ఇదేమైనా క్లూ ఇస్తోందా?!

ఈరోజున మనం ఇలాంటి ప్రశ్నలకు నికరమైన సమాధానం చెప్పుకోలేకపోవచ్చు; వీటికి మనకు తెలియని అన్వయాలు వేరే ఉండవచ్చు. అయినాసరే, ఒక్కొక్కసారి ప్రశ్నలే సమాధానాన్ని మించి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటూ ఉంటాయి. అసలు ప్రశ్ననంటూ గుర్తిస్తే, అదే వెయ్యి సమాధానాల పెట్టు అవుతుంది!

మిగతా విశేషాలు తర్వాత...

Tags:    

Similar News