నారింజ రుచితో జామపండ్లు సృష్టించిన రైతమ్మ!
తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే మిరియాలు, కనకాంబరాలు, సరుగుడు, అంజీరా , జామ, క్యాప్సికం పంటల మీద పరిశోధన చేస్తున్నారు.;
ఆమె తోటలో జామ పండ్లు నారింజ, చాక్లెట్ రుచులతో నోరూరిస్తాయి ! పచ్చిమిర్చి కమ్మని నెయ్యి రుచి వాసనతో ఘమ ఘమలాడతాయి! అక్కడ పండిన అంజీర పండ్లు అత్యంత తీపిగా ఉంటాయి. మిరియాలు నిమ్మ సువాసన వస్తాయి. ఇంతకీ ఈ రైతమ్మ ఎవరు? ఎక్కడుంటారు? ఆమె సృష్టించిన కొత్త మిరియాల మొక్కలు ఎందుకు వైరల్ అవుతున్నాయి?
ఇవన్నీ కనిపెట్టిన ఆ యువ సైంటిస్ట్ తన పొలంలో చేస్తున్న ప్రయోగాలను శ్రీలక్ష్మి వివరించారు !
కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని కూడప్పాకం కు చెందిన శ్రీలక్ష్మి వినూత్న వంగడాలు అంటే ఆసక్తి. ఇన్ని రకాల వెరైటీ మొక్కలు రూపొందించడం వెనుక ఉన్న స్ఫూర్తి తన తండ్రి వెంకటపతి అంటారు. ఉద్యాన సాగులో విభిన్న పూల వెరైటీలు సృష్టించిన ఆయనకు 2012లో పద్మశ్రీ పురస్కారం వచ్చింది. తన తండ్రి వెంకాడపతి రెడ్డియర్ ప్రోత్సాహం, స్ఫూర్తి లేక పోతే తనకు ఈ రోజు ఇంత గుర్తింపు వచ్చేది కాదు అని శ్రీలక్ష్మి అంటారు.
కనకాంబరాల పై పరిశోధన
‘ తన కుటుంబానికి వ్యవసాయ పనుల్లో సహాయం చేయాల్సి రావడం తో నాన్న చదువు 4వ తరగతిలోనే ఆగిపోయింది. వృక్ష శాస్త్రం పై ఆసక్తి పెంచుకుని, సొంత జ్ఞానం తో మొక్కల ఎదుగుదల లక్షణాలు తెలుసుకున్నారు. శాస్త్రీయ జర్నల్స్‌ను తెప్పించుకొని వాటిని అనువాదాలు చేపించుకొని చదువుతూ కొత్త విషయాలు తెలుసుకునేవారు. చిన్నతనంలోనే ఆయనకు హార్టికల్చర్ పై విపరీతమైన ఆసక్తి ఉండేది, ఆయన తన జీవితాన్ని పూర్తిగా పూల సాగు కోసమే అంకితం చేశారు, ఎందుకంటే పూలు మనిషి జీవితంలో పుట్టిన నాటి నుంచి మరణించేవరకు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన నమ్మారు. పెద్దగా చదువు లేకపోయినా ఆయన మైక్రోప్రొపగేషన్ ద్వారా మొక్కలను అభివృద్ధి చేయడానికి టిష్యూ కల్చర్ లాబొరేటరీ ప్రారంభించిన మొదటి రైతుగా పుదుచ్చేరిలో గుర్తింపు పొందారు. నిత్యం అనేక శుభ కార్యాల్లో వాడే కనకాంబరం పూలు సాగులో అనేక తెగుళ్లకు గురవ్వడం ఆయన గుర్తించారు. మొదట ఆయన అడవుల నుంచి కనకాంబరం వంగడాలను సేకరించి, స్థానిక సాగు వంగడాలతో వాటిని క్రాస్ చేసి మరి కొన్ని రకాల అభివృద్ధి చేశారు.
పరిశోధనలు మరింత విస్తరించాలనే ఆలోచనతో 1972లో లక్ష్మీనారాయణ Crossandra Innovation Centre అనే పరిశోధన కేంద్రం స్థాపించారు. మొక్కలకు అంటు కట్టే విధానం లో ఆయన ప్రసిద్ధి చెందారు. అక్కడ వివిధ రకాల కనకాంబరం పూల మొక్కల పై పరిశోధనలు చేసి తెగుళ్లను తట్టుకునే 100 వెరైటీలను సృష్టించారు. ’ అని తండ్రి జీవన ప్రస్థానం వివరించారు శ్రీలక్ష్మి. ఇందిరా గాంధీ అణు పరిశోధన కేంద్రం సహకారంతో గామా తరంగాలు ( Gamma rays) ను ఉపయోగించి ఆయన అధిక దిగుబడిని ఇచ్చే 30 రకాల కనకాంబరాలను అభివృద్ధి చేశారు. డిల్లీలో కనకాంబరం పూలకు డిమాండ్ ఉండటంతో ఎకరానికి ప్రతి రోజూ 20 కిలోల పూలను పొందే వ్యవసాయ పద్ధతులను కూడా ఆయన రూపొందించినట్లు శ్రీలక్ష్మి చెప్పారు. ఆమె కూడా తండ్రితో కలిసి ఆ ల్యాబొరేటరీలో టిష్యూ కల్చర్ సాంకేతికతలను ఉపయోగించడం నూతన వంగడాలను రూపొందించడం ప్రారంభించారు. అందరినీ ఆశ్చర్య పరుస్తున్న నిమ్మ సువాసన మిరియాలు!
నిమ్మ సువాసన మిరియాలు!
శ్రీలక్ష్మి వ్యవసాయంలో కొత్త పద్ధతులను అన్వేషిస్తూ దానికి అనుగుణంగా, తక్కువ కాలంలో దిగుబడి వచ్చే మిరియాల వంగడాన్ని కనిపెట్టారు. వాటి గురించి వివరిస్తూ ‘సాధారణంగా స్థానిక జాతి మిరియాల మొక్కలు 5 లేదా 6 సంవత్సరాల తర్వాత మాత్రమే దిగుబడి ఇస్తాయి. తీగలు 40 నుండి 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి, కానీ 15 అడుగుల తర్వాత మాత్రమే కొమ్మలు బయటకు వచ్చి కాత వస్తుంది. కానీ మేం ఇప్పుడు అభివృద్ధి చేసిన నిమ్మ వాసన మిరియాలు 15 అడుగుల ఎత్తు మాత్రమే పెరిగి పై నుండి కింది వరకు అన్ని కొమ్మలు ఉంటాయి. 18 నెలల్లోనే పంట తీయడానికి సిద్ధంగా ఉంటుంది. 5 నుండి 6 సంవత్సరాల్లో ఎకరానికి 8 టన్నుల దిగుబడి వస్తుంది. ఒక ఎకరానికి 5 అడుగుల దూరంలో 1750 మొక్కలు పెంచవచ్చు. స్ధానిక మిరియాల మొక్కలు నాటిన ఏడో సంవత్సరంలో మాత్రమే దిగుబడి ఇస్తాయి.’ అన్నారు శ్రీలక్ష్మి.
‘ ఈ కొత్త రకం మిరియాల ఆకులను నలిపినా నిమ్మకాయ వాసన ఇస్తుంది, అలాగే గింజలు కూడా నిమ్మకాయ రుచి ఉంటుంది. ఇతర బ్లాక్ పెప్పర్‌తో పోలిస్తే, ఇది ఎక్కువ కారం , ఘాటు ఎక్కువగా ఉంటుంది.దీనికి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండి ఎగుమతులకు అవకాశం ఉంటుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది.’ అని ఆమె మరి కొంత వివరించారు.
సిల్వర్ ఓక్ కంటే మలబార్ వేప బెటర్!
‘ అరకు,పాడేరు ప్రాంతంలో సిల్వర్ ఓక్ చెట్లు పై మిరియాల తీగలు పాకించి సాగు చేస్తారు. దీని కంటే మలబారు వేప, పైన్ వృక్షాల ఆధారంగా మిరియాలు పెంచడం మంచిది. మలాబారు, పైన్ వృక్షాల కలపకు అధిక డిమాండ్ ఉంది .’ అని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్ మన్యం అరకు,పాడేరులో పండే మిరియాలు చాలా ఎత్తుగా ఎదగడం వల్ల కోత సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఆమె కనిపెట్టిన మిరియాల మొక్కలు తక్కువ ఎత్తు పెరగడం వల్ల ఆ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
జన్యు పరిశోధనలు
మేము గత 10 సంవత్సరాలుగా పంటల మీద పరిశోధన చేస్తూ వివిధ రకాలు అభివృద్ధి చేస్తున్నాము. మేము Germplasm రకాల సేకరణ చేస్తున్నాం. అంటే ఒక పంటకు సంబంధించిన వివిధ జన్యువులకు చెందిన అన్ని వేరియేషన్ లను కలిగి ఉన్న మొక్కలు లేదా విత్తనాల సేకరణ. అందులో ఉత్తమమైన వాటిని రైతులకు పరిచయం చేస్తున్నాము. మా అన్ని చిన్న రైతులకు ఉపయోగ పడేవే. ఇవి ఉష్ణ మండలం, కొండ ప్రాంతాల్లో సాగుకు అనుకూలంగా ఉంటాయి.
నేతిరుచితో క్యాప్సికం
ప్రస్తుతం తమ Crossandra Innovation Centre లో తక్కువ కాలంలో దిగుబడినిచ్చే మిరియాలు, కనకాంబరాలు, సరుగుడు, అంజీర , జామ, క్యాప్సికం పంటల మీద పరిశోధన చేస్తున్నారు.
నారింజ,చాక్లెట్ రుచితో ఉండే జామ మొక్కలను, అత్యంత తియ్యని రుచితో ఉండే రెండు రకాల అంజీర మొక్కలను కొత్త సాంకేతిక పరిజ్ఞానం తో అభివృద్ధి చేశారు.అంజీర 6 నెలలకే అధిక దిగుబడి ఇస్తాయి. కమ్మని నెయ్యి రుచి వాసనతో ఉండే క్యాప్సికం మొక్కలను కూడా సృష్టించారు. అవి రెండు కాయలు సాంబారులో వేసుకుంటే నేతి రుచి వాసన వస్తుందని ఆమె చెప్పారు.
వాటిని ‘ గీ చిల్లీ’ అని పిలుస్తున్నారు. ‘ ఈ వంగడాలన్నీ పుప్పొడి క్రాసింగ్ ద్వారా ఆవిష్కరించాం. ఆ రకాలను పేటెంట్ కోసం అప్లై చేశాం. ఇంకా రాలేదు. ఇప్పటివరకు వాణిజ్య పరంగా ఆ దిగుబడులును విడుదల చేయలేదు. బంధువులు,స్నేహితులు రుచి చూసి మెచ్చుకున్నారు ’ అని ఆమె అన్నారు.
కొత్త వంగడాలకు నాయకుల పేర్లు
చాక్లెట్ రుచి తో ఉన్న జామ మొక్కలకు ప్రధాన మంత్రి మోదీ పేరును, తీపి అంజీర రకపు మొక్కను పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడి పేరు పెట్టారు. ఆమె తండ్రి వెంకటపతి అభివృద్ధి చేసిన కనకాంబరం రకాలలో ఒక దానికి భారత మాజీ రాష్ట్రపతి ‘‘అబ్దుల్ కలాం క్రోసాండ్ర’’ అనే పేరును పెట్టారు. అలాగే మరొక కాస్యురినా (సరుగుడు చెట్టు ) కు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామికి అంకితం చేస్తూ ‘‘రంగస్వామి కాస్యురినా’’ అని పేరుపెట్టారు.
ఎకరంన్నరలో పరిశోధన.
ఎంబీఏ చదివిన శ్రీలక్ష్మి వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చిన్నప్పటి నుండి చూస్తూ ఎదిగారు.దానికి తోడు తండ్రి స్ఫూర్తి తోడయింది. ‘ ఆదాయం కోసం కాకుండా కేవలం వ్యవసాయంలో కొత్త వంగడాలు రూపొందించడానికి పరిశోధన కోసం ఒకటిన్నర ఎకరంలో వైవిధ్యమైన పంటలు పండిస్తున్నాం. వ్యవసాయ నిపుణులకు, రైతులకు మా పరిశోధన ఫలాలు అందిస్తాం. మా లక్ష్యం రైతుల పెట్టుబడులు తగ్గించి, తక్కువ సమయంలో అధిక దిగుబడులు సాధించేలా వారికి కొత్త వంగడాలను అందివ్వడమే! ’ అంటారు ఆ రైతమ్మ.