హృదయం ఉన్న నేల !

ఇల్లు సీక్వెల్: 19 నేలకు కవయిత్రి 'గీతాంజలి' నీరాజనం

Update: 2024-07-21 05:32 GMT


ఇంటి నేలనే కదా..ఒట్టి రాళ్లు కదా అనుకుంటాం కానీ....

నేల కూడా సాగు భూమి లాంటిదే.

నేలని శ్వాసించడం చూసావా ఎప్పుడైనా ?

పోనీ నేల అద్దమై పోవడాన్ని ?

అద్దమై ఎన్ని ముఖాలను చూపిస్తుందో కదా !

నేల మోసే పాద ముద్రలని చూసావా ఎపుడైనా ?

అమ్మలు..అమ్మమ్మ లు

నానమ్మలు, ముత్తవ్వ లు..అక్కలు..చెల్లెళ్లు.,

మొత్తానికి స్త్రీల అనాది పాదముద్రలు ?

విరిగిన పాదాలు కమిలిన పాదాలు

నెర్రెలీనినట్లు పగిలిన పాదాలు...

దేహ నొప్పులని కడుపాకలిని...

గర్భసంచీ లో పిండాల్ని..నెలసరుల రక్త స్రావాల్ని.,

చర్మం మీద కనిపించీ.. కనిపించని గాయాల్ని.,

కళ్ళల్లోంచి దుమికే కన్నీళ్ల ను..

గుండెని మండించే అవమానాలని.,భరిస్తూ...

వంటగది,పడకగది,వరండా,పిల్లలగది, పెద్దల గది, భోజనాల గది,

వాకిలి,పెరడు,తోట,డాబా, స్నానాల గదుల్లోకి,

గదుల మధ్యా బాధ్యత గా..హడావుడిగా.,ఆత్రంగా

ఆవేదనగా ఖంగారుగా,భయంగా,దిగులు దిగులుగా 

ఎండిన నవ్వులతో తిరిగే ...పరిగెత్తే, పారిపోయే.,

ఆగి..ఆగి నడిచే స్త్రీల పాదముద్రల్ని మోసే నేలని చూసావా ?

పోనీ విన్నావా..ఆ గాయపడ్డ పాదాలు.

ఏడిచే పాదాలు చేసే సవ్వడిని..

నేల విన్నట్లుగా విన్నావా ?

ఆ సవ్వడికో భాషని కనిపెట్టిన నేల !

నెమ్మదిగా  తీరికగా

నిర్లక్ష్యంగా కడుపు నిండి నడిచే నాన్నల తాతల పాదాల ముద్రలని..

అవి చేసే తీరుబడి సవ్వడులని ?

నాన్నల పాదాల సవ్వడికి.. అమ్మల పాదాల సవ్వడికి

మధ్య ఉన్న తేడాని కనుక్కున్న నేల !

తప్పించుకునే సవ్వడి, నిలేసినట్లు ఆగిపోయి

నిలుచున్న సవ్వడి, నొప్పిని తట్టుకోలేనట్లు

ఈడుస్తూ నడుస్తున్నట్లున్న సవ్వడి,

ఒకింత విశ్రాంతి తీసుకోలేని పాదాల నిస్సహాయ సవ్వడులను

గుర్తుపట్టడం నేలకు మాత్రమే తెలుసు !

***

పొలాల్లో

వరి నాట్లేసే శ్రామిక అమ్మల పగిలి చిట్లిన రక్త పాదాలు..

ముళ్లు.. రాళ్లు గుచ్చిన పాదాలు చేసే ఆక్రందన ...

విన్నావా..చూసావా ఎపుడైనా ?

నేల చూసింది

నేల ఆ పాదాల్ని స్పర్శించింది !

నేల ఆ పాదాలకు నమస్కరించింది !

భూమి కూడా అమ్మల పాదాలతో పాటు తానూ రక్తకన్నీరు కార్చింది.

తెల్లారకుండానే..రోడ్లు ఊడిచే సఫాయి అమ్మల పాదాల్ని...

మనుషుల మాలిన్యాలను శుభ్రం చేసే

ఆడవాళ్ల పాదాలకు...ఆ పాద ముద్రలకు

రోడ్లు.. వీధుల నేలా,ఆకాశం,సూర్యచంద్రులు,నక్షత్రాలు రాత్రుళ్ళు..

ఉదయాలు సలాము చేయడం చూసావా ఎపుడైనా ?

*****

ఇళ్లల్లో ఆడవాళ్ళు చేసే మహా ప్రయాణాన్ని...

ఆ ఇంటి నేల ఆవాహన చేసుకుంటుంది.

యుగాలుగా ..రోజంతా వంటింట్లో కి తరమబడే

స్త్రీల పాదాల అలిసిన సవ్వడిని నేల వింటుంది..

వాళ్ళు నడిచే దూరాల్ని కిలో మీటర్ల లెక్క వేస్తుంది !

నేల కూడా వాళ్ళతో పాటు ఏడుస్తుంది.

****

చాలా సార్లు సంసార భారాన్ని మోసే నాన్నలు బరువుగా ..

చేసే పాదాల సవ్వడిని కూడా నేల గుర్తు పడుతుంది.

అలసిన అమ్మల పాదాల నొప్పులని..

నాన్నలు ప్రేమతో తగ్గించడాన్ని కూడా చూసి మురిసిపోతుంది ..

ప్రతీ అమ్మకి అలాంటి నాన్న లు ఉంటేనే బాగు అని కోరుకుంటుంది.

*****

వాళ్ళ పాద ధ్వనులను ఒక్కోసారి ..

నేల మొత్తం చెవిగా మారిపోయి వింటుంది.

మరోసారి నేల మొత్తం కన్నుగా మారిపోయి...

తడబడే,కలతపడిపోయే

ఆ స్త్రీల ఉరుకుల పరుగులను నిర్ఘాంత పోయి చూస్తుంది.

చాలా సార్లు డాబా- నేలా రహస్యంగా సంభాషించుకుని నిట్టూరుస్తాయి.

*****

కట్నం కోసం తరమబడ్డ పాద ధ్వనులెలా ఉంటాయో..

పడకగది నుంచి పారిపోయే పాద ధ్వనులెట్లా ఉంటాయో...

పెరటి ఏకాంతంలోకి జారుకునే

మెత్తటి పాద ధ్వనులెట్లా ఉంటాయో

ఆ పాదాలను మోసే నేలకి బాగా తెలుసు !

నేల ఆమెలతో నిరవధికంగా మాట్లాడుతూ నే ఉంటుంది !

*****

ఆ స్రీలు నేలని శుభ్రం చేస్తారు.

దుమ్ముతో పాటు..ఆడ..మగ పాద ముద్రలని ..

తమ నీడలతో సహా ఊడ్చి పడేస్తారు !

చాలా సార్లు ఆమెని ప్రమాదం నుంచి తప్పించడానికి.,

నేలనే బయటకి పరిగెత్తిస్తుంది .

చాలా సార్లు నేల ఆ స్త్రీలని డాబా ఎక్కిస్తుంది..

రహస్యంగా దుఃఖించడం కోసం..

అమ్మా నాన్నలను తలుచుకోవడం కోసం !

****

ఏ అర్థ రాత్రో నేల ఆమె కమిలిన పాదాల్ని ఒళ్ళోకి తీసుకుని

వెన్నపూస అద్ది..వెచ్చని తన చేతులతో వొత్తుతుంది..

గాఢంగాకౌగలించు కుని నిద్ర పుచ్చుతుంది !

ఆ క్షణం నేల తల్లై పోతుంది.

*****

నిత్యం పరుగులు తీసే క్రీడా కారిణిలా అలిసిన ఆ స్త్రీల పాదాలకి

కళ్ళు...నోరు ఉండడం ..

తమ కథలను నేలకి చెప్పుకోవడం ..

నేల నేమీ ఆశ్చర్య పరచదు.

తోటలోని నేల... ఆమె పాదాలకి రాలిన పూలను...

సుగంధాలను ఇస్తుంది.

వాకిలి నేల ...ఆమె పాదాలమీద రంగవల్లిగా మారిపోతుంది !

వేసవిలో నేల మల్లెల పరుపై పోతుంది.

చలికాలపు నేల పారిజాత సౌరభమైపోతుంది.

వర్షా కాలపు నేల... ఆకాసమల్లె ల్ని

చినుకులతో పాటు తనలోకి ఇంకించుకుంటుంది.

అంతా ఆమె కోసమే !

****

ఆమె కింద పడ్డప్పుడల్లా...

నేల ఆమెకి సింహాసనం అవ్వాలనుకుంటుంది.

పుట్టింటికీ... అత్తింటికీ మధ్య నలుగుతున్న

ఆమె పాదాలను నిలవరించే పనిలో పడుతుంది నేల !

వంగిపోకుండా...వణికి పోకుండా..నిలువుగా నిలబడమని ఆమెను హెచ్చరిస్తుంది నేల.

ఆమెకి ఆ ఇంటి నేలా... నింగికీ హక్కుదారుని చేద్దామని నేల తపించిపోతుంది !

*****

ఒక్కోసారి...ఆమె వెళ్ళిపోతుంది.

ఇంటి నేల నిండా ఆమె పాదముద్రలు..మిగిలిపోతాయి.

ఇల్లంతా నిండిపోయిన పాద ముద్రలని

నేల..రంగు,రూపాలతో నొప్పులతో సహా గుర్తు పడుతూ ..

వియోగాన్ని తట్టుకోలేక విల విలా దుఃఖిస్తుంది..

కానీ ఆమె తిరిగి రాకపోతేనే బాగుంటుందని

రహస్యంగా మనసులోనే కోరు కుంటుంది నేల .

ఆమె తిరిగి వస్తే అలుగుతుంది నేల.

***

కొన్నిసార్లు.. ఆ స్త్రీలు శాశ్వతంగా లోకం నుంచి నిష్క్రమిస్తారు.

అప్పుడు వాళ్ళ పాదాల బొటన వేళ్ళు కలిపి గట్టిగా కట్టివేయ బడతాయి.

వాళ్లప్పుడు...నిమ్మళంగా నిద్రపోతున్నట్లే వుంటారు.

మరణం తరువాతే దొరికిన ఆ విశ్రాంతి కి..

ఆనందిస్తున్నట్లు వాళ్ళ మొహాలు ప్రశాంతంగా ఉంటాయి.

నేల మళ్ళీ తల్లి అవుతుంది.

వాళ్లకు మృత్యు శయ్య అవుతూ గుండె పగల ఏడుస్తుంది !

వాళ్లెప్పుడూ ఇక మరలి రారని తెలిసి...

అంతిమ వీడ్కోలును

ఆ ఇంట్లో ఇంకెప్పుడూ చూడలేని పాద ముద్రలని తలచుకొని..

నేల తనంతట తాను ఆమెల కోసం అమర స్థూపంగా మారి పోతుంది !

*****

ఒట్టి నేల అని...శిల అని అనుకుంటామా..

కాదు..హృదయం ఉన్న నేల ఇది !

తన మీదుగా నడిచే..ఎగిరి దుమికే మనుషులను క్షమించే ధరిత్రి అది !

ఆరు బయటి దైతే..పొలమై అన్నం పెడుతుంది..

ఇంటిలోని దైతే మన దుఃఖాన్ని భరిస్తుంది.

అందుకే ఇల్లు ఇచ్చే నొప్పిని భరిస్తున్న

అమ్మల పాదాలతో పాటు

నేల తల్లినీ కళ్ల కద్దుకోవాలి !




Tags:    

Similar News