పలమనేరు బాలాజీ ‘ఏకలవ్య కాలనీ, ఎరుకల జీవన గాథలు’: గీతాంజలి పరిచయం

Hyderabad Book Fair Special

Update: 2024-12-22 16:41 GMT

సమాజంలో ఎవరూ పట్టించుకోని ఎరుకల జీవితాల మీద కథలు రాసిన తొలి రచయత పలమనేరు బాలాజీ. రచయిత మనల్ని చేయి పట్టుకుని ఎరుకల కాలనీలోకి తీసుకెళ్ళి ఇల్లిల్లూ, ప్రతివీధి, ఆ వీధుల్లో తమ మీద జరిగే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రతిఘటిస్తూ... సంఘర్శిస్తూ ..ఉన్నతంగా తమ మానవీయ విలువలను కాపాడుకునే సౌజన్య మూర్తులను వాళ్ళ కన్నీళ్ళతో ఆనందాల తో సహా చూపిస్తారు.మా అమ్మ, నాయన, కాంతమ్మత్త అంటూ గర్వంగా పరిచయం చేస్తారు. బాలాజీ  రాసిన ఏకలవ్య కాలనీ లోకి వెళితే భారత దేశంలో అమానవీయమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఇంకా కింద స్థాయిలో అత్యంత దారుణంగా ఉండే అణగారిన సామాజిక వర్గానికి చెందిన ఎరుకల జీవన గాథల లోని దుర్భరత్వం అర్థం అవుతాయి.

సంచార జీవులు అయిన ఎరుకల జీవితాల్లోని విషాదం,భీభత్సం...సామాజిక గౌరవం కోసం వారు చేస్తున్న సంఘర్షణ మనసుని కలిచివేస్తాయి.

అటు అడవికీ,ఇటు గ్రామాలకీ చెందని ఎరుకలు అడవి లోని వెదురు కర్రలు,ఈతాకులతో బుట్టలు,గంపలు,చాపలు,చీపురు కట్టలు,తడికెలు తయారు చేసి ఊర్లల్లో, వారాంతపు సంతల్లో అమ్ముకుని జీవిక సాగిస్తారు.అటవీ ఉత్పత్తులు ,తేనే,మూలికలు సేకరించి అమ్ముకుంటారు. అలాగే గాడిదలు, బాతులు పందుల పెంపకంమే కాదు ఆ పశువుల అమ్మ కం కూడా చేస్తారు. వీరు కూలీ పనులు ..ఇళ్ళల్లో పనులుకూడా చేస్తారు కానీ వీరిపట్ల దొంగలన్న ముద్ర ఉండడం మూలంగా వీరికి ఇళ్ళల్లో పనులు దొరకడం కష్టం.స్రీలు ఊర్లు తిరుగుతూ భవిష్యత్తు వాణిని తెలిపే సోది చెబుతారు.ముగ్గు పిండి,ఎర్ర మన్ను అమ్ముతారు. పూసలు,గొలుసులు అమ్ముతుంటారు.అయితే సంచార జీవులైన వీరి మీద ప్రభుత్వం,పోలీస్ వ్యవస్థ,సమాజం దొంగలని ముద్ర వేస్తుంది.బ్రిటిష్ కాలం నాటి దుర్మార్గమైన క్రిమినల్ ట్రైబల్ ఆక్ట్ -1871 అమలు చేసి జైలు పాలు చేస్తారు.చేయని దొంగతనాలు చేసినట్లుగా వొప్పుకోమని వెంటాడి,వేధిస్తారు చిత్ర హింసలపాలు చేసి చేయని నేరాన్ని వీరితో వొప్పించేసి జైలు పాలు చేస్తారు. దొంగ అనే ముద్ర నుంచి బయట పడేందుకు ఎరుకల నానా తిప్పలు పడాలి.(ఎక్కడ దొంగతనం జరిగినా సరిగా పరిశోధించకుండా ఎరుకల కాలనీల్లోకి వెళ్లి "ఈ ఎరుకలొల్లని ఎత్తేసి లోపల పడేయండిరా"అనే పోలీసులు దౌర్జన్యం చేస్తారు)ఈ అబద్రతలోనే వీరి జీవితాలు గడిచిపోతాయి.బీదరికం,ఆకలి,నిలువ నీడ లేక అల్లాడుతూ ఉంటారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు చాలా తక్కువ.వ్యవసాయ భూమి,విద్య హక్కుల కోసం, భద్ర జీవనం కోసం వీళ్ళు పడుతున్న ఘర్షణను ఎరుకల వారి జీవితాలలోని అంతః సారాన్ని,బయటి సమాజానికి తెలియని ఎరుకల జీవితాల్లోని సాంస్కృతిక సౌందర్యాన్ని అత్యంత వాస్తవికంగా కథల రూపంలో రాశారు.ఇన్ని రకాల వృ త్తు ల్లో ఉంటూ ఒక చోట ఒక కమ్యూనిటీగా ఏకలవ్య ఎస్.టీ కాలనీ లో ఎరుకల జీవితాలలోని అనేక కోణాలు బాలాజీ  తనదైన తాత్విక ధోరణితో సామాజిక,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక,మానసిక కోణాల్లోంచి విశ్లేషిస్తూ రాయడం అద్భుతం అనిపిస్తుంది.ఎరుకల జీవితాలను గొప్ప ఎరుకతో రాసే బాధ్యతని అత్యంత ఇష్టంగా ప్రేమగా ఎత్తుకుని రాసిన కథలివి.

ఈ కథల్లో తన స్వంత అనుభవాలు ఉన్నాయి తన కుటుంబ సభ్యుల,బంధువుల అనుభవాలు ఉన్నాయి. "ఆ యమ్మ అంతే !ఒక మదర్ థెరీసా" ! కథ చదవండి...ఎంత అందమైన కథనో ఇది !రాత్రి లేదు..పగల్లేదు .తనకి ఉందా లేదా లేదు..వాళ్ళు సాయం అడిగారా లేదా అని చూడదు . అడక్కుండానే, తెలిసినంత మాత్రానే పరుగున పోయి వాళ్ళను ఆదుకునే జయమ్మని వెతుక్కుంటూ హృదయానికి హత్త్తు కోవాలని అనిపిస్తుంది.హృదయం నిండా సాటి మనుషుల పట్ల ప్రేమ కురిపించే జయమ్మనీ చూసుకుంటూ ఆమె ఆయన ఎందుకంత మురిసి పోతాడో ..అర్థం అవుతుంది. ఇక్కడ జయమ్మ ఎవరో కాదు రచయత బాలాజీ తల్లి గారే. అటవీ వనరులైన కట్టెలు లాంటి వాటికి లొంగి పోని ఫారెస్ట్ గార్డ్ గా పనిచేసిన తన తండ్రి నిజాయితీ గురించి అంతే ఆర్తి తో "పదకొండు నెలల జీతగాడి కథ"లో రాస్తారు.తన కాంతమ్మ త్త చనిపోతే కుప్పల కొద్దీ పూలతో మూడు నాలుగు ట్రాక్టర్ల కదల బారడం,ఎరుకలామె చనిపోతే ఇతరకులాల వాళ్ళు కూడా ఆమె అంత్యక్రియల్లో పాల్గొనడం సాధారణంగా జరగదు. కానీ జయమ్మలాగా గొప్ప సౌజన్యమూర్తి అయిన కాంతమ్మత్త కూడా తన మానవీయ పరిమళాన్ని తన చుట్టూ ఉండే సమూహంలోకి,మనసుల్లోకి విస్తరించిన మనిషిగా అమరజీవి అవుతుంది. ఒక పక్క ఎరుకల జీవితాల్లోని దైన్యాన్ని ఎత్తి చూపుతూనే,ఎరుకలొల్ల ఆత్మ గౌరవాన్ని వ్యక్తీకరించే మాటలు కూడా కాంతమ్మత్త తో పలికిస్తారు బాలాజీ . ధైర్యంగా పంచాయితీల్లో మాట్లాడలేని తన కులపొల్లకి కాంతమ్మ త్తే గొంతు, ధైర్యం అయ్యేది."నమ్మినోళ్ళకి ప్రాణం అయినా ఇస్తారు కానీ, ఎరుకలోళ్ళు ఎవరికీ నమ్మకద్రోహం చేయరు" అంటూ ఏరుకలొల్ల స్వాభిమానాన్ని,వాళ్ళు పాటించే విలువల్ని గర్వంగా చెబుతుంది కాంతమ్మత్త. అంతేనా"ఆడది ఊరికే బోకులు తోమి గుడ్డలు ఉతికి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటాననే కాలం కాదమ్మే ఇది..ఆడాళ్ళు కూడా ఏదో ఒక పని చెయ్యల్ల.కోళ్ళు, పందులు,ఆవులు మేపుతారో , గంపలు బట్టలు అల్లుతారో., కూలీ చేస్తారో అది మీ ఇష్టం. మీ కష్టానికో విలువుండల్ల.,మీ సంపాదనకో లెక్కుండల్ల అంతే"అంటూ స్రీలు ఉత్పత్తి సంబంధాల్లో పాలు గొనాల్సిన అవసరం గురించి,స్రీ ల ఆర్థిక స్వావలంబన గురించి,సాధికారత గురించి..తన అనుభవాల్లోంచే చెబుతుంది.ఎందరినో ఆదుకునే కాంతమ్మత్తకి దీపాల వేళ అందరూ ఆ ఎస్టీ కాలనీలో ఎలా దండం పెట్టుకునే దేవతసుంటి మనిషయిందో "అమరజీవి మా కాంతమ్మత్త" కథలో అపురూపంగా తలుచుకుంటారు.తమ మీద ఆధిపత్య కులాల వాళ్ళు,పోలీసులు మోపే నేరాలను,చేసే దౌర్జన్యాలను ధైర్యంగా,భీతి లేకుండా ఎదుర్కోవాలని ఉడుకోడు లాంటి కథలో చెప్పిస్తారు.


అలాగే ఈ కథల్లో ఆధిపత్య కులపు మగవాళ్ళ లైంగిక దౌర్ర్జన్యాన్ని ఎదిరించిన స్త్రీల పాత్రలు ఉన్నాయి.ఇవే కాదు.. మా తప్పు ఏంది సామీ, దేనికీ భయపడద్దు ,ఉడుకోడు,వెదుర్లు,గురి,ఆకలేస్తున్నప్పుడు,ఏనుగుల రాజ్యంలో ఇంకా ఇతర కథల్లో తన స్వీయ జీవిత అనుభవాలే కాదు ఏకలవ్య కాలనీ లో నివసించే తోటి ఎరుకల జీవితాలను గురించి చర్చించారు.

"ఇవి మా జీవితాలు .ఇవి మా ఎరుకల కథలు.ఈ దేశపు మూల వాసుల్లో,ఆదివాసీల లో ముఖ్యమైన ఎరుకల కథలివి.మా అవమానాలు, కన్నీళ్లు,దుఃఖాలు, వోటములు ,గెలుపులు,నవ్వులు మిమ్మల్ని మా గురించి ఆలోచించమంటాయి.భరోసా,ఆసరా,నమ్మకం,ఒక ధైర్యం కోసం ఎదురుచూస్తున్న ఎరుకల బతుకుల్లో మార్పు కోసమే ఈ కథలు రాశాను"అంటూ తన సామాజిక వర్గం ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉంది,మార్పు అభివృద్ధికోసం ఎదురుచూస్తూ ఉందో..బాల్యం నుంచి తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను అవమానాలు ఎన్ని గాయాలు చేశాయో..ఎంతటి దుఃఖాన్ని ,కన్నీళ్లను కార్చ వలసి వచ్చిందీ .,కథలను రాసే క్రమంలో., ముందూ.. తరవాత కూడా వెన్నాడే ఆ గాయాల సలుపుని భరించ వలసి వచ్చిందొ చెబుతారు... నిరంతర అభద్రతా ,నిరాశ్రయతలకు భయపడే తమ సంచార ఎరుకల జాతివారు ఆస్తులకోసం కాదు బాధ పడేది..సమాజంలో గుర్తింపు నిచ్చె గుర్తింపు కార్డులైన ఆధార్ కార్డులు,జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాలు,ఓటరు కార్డు లు,విద్య,వైద్యం,ఉపాధి హామీ కార్డులు,మంచి నీళ్ళు,రేషన్ కార్డుల కోసం మా పోరాటం కానీ పాలక వర్గం జనాభా,ఎన్నికల లెక్కల్లో అవసరం అయినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా జరుపుతూ ఉండడం వల్ల ఎరుకల వాళ్ళు ఘోర ఆ న్యాయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేని ఎరుకలు స్థానం అడవి,ఊరు వాడల్లో..పట్నాల్లోని మురికివాడలు మాత్రం కావు. మరెక్కడున్నాయి మా ఎరుకలకి న్యాయంగా దక్కాల్సిన భూములు, ఇతర హక్కులు అని ఆవేదనగా,ఆగ్రహంగా ప్రశ్నిస్తారు.లెక్కల్లో తేలకుండా పోయినా ఎరుకల వాళ్ళ లెక్కలు ఇప్పుడు తేలాలి,తేలుతాయి.అదే అసలైన ఎరుక అంటారు బాలాజీ.ఆయన రాసిన ప్రతీ కథలో తన సామాజిక వర్గం పట్ల అవ్యాజ్యమైన ప్రేమ ,బాధ్యత కనిపిస్తాయి.

తనే కాకుండా ఈ ఎరుకతో ఎంతో ఎరుకల సాహిత్యం రావాల్సి ఉంది.కథ,నాటకం,నవల,కవిత లాంటి అనేక సాహిత్య ప్రక్రియల్లో ఎరుకల దుర్భరమైన జీవితాన్ని వాస్తవికంగా రాయాల్సి ఉంది.పరిశోధనలు,అనువాదాలు జరగాల్సింది.ఎరుకలకి జరగాల్సిన మంచి జరిగి తీరాల్సిందే అంటూ బాలాజీ  ఇచ్చిన పిలుపుని అందుకొని మనం రచయితలం ఎరుకల జీవన సంక్షోభాన్ని సృజనీ కరించ వలసి ఉంది.బాలాజీ గారూ.. ఆ పని మేం తప్పకుండా చేస్తాం. మాకు మా బాధ్యతని గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు. అందమైన చిత్తూరు మాండలిక భాషలో,గొప్ప ప్రవాహిక శైలిలో బాలాజీ రాసిన ఈ అపురూపమైన కథల్ని ప్రచురించిన పర్స్పెక్టివ్ సంపాదకులు ఏకే.ప్రభాకర్,ఆర్.కే గారికి అభినందనలు.

హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో నవోదయ బుక్ స్టాల్-281-285 లలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది. 
.




Tags:    

Similar News