మదర్స్ డే.. ఒక తల్లి అలా.. మరోతల్లి ఇలా..

తల్లి ప్రేమను వర్ణించడానికి ఏ భాషా సరిపోదేమో. ప్రపంచంలో అత్యంత నిర్మలమైనది తల్లి ప్రేమ. కానీ ఇప్పుడు అది కూడా కలుషితం అవుతుందా..

Update: 2024-05-12 08:09 GMT

అమ్మ.. ఆ మాట ప్రతి ఒక్కరికీ చాలా ప్రత్యేకం. ఆ మాటతోనే అందరికీ చెప్పలేని అనురాగం, ఆప్యాయత, ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ‘అమ్మ’ చాలా ప్రత్యేకం. పలికే తొలిమాట దగ్గర నుంచి అన్ని విషయాలను అమ్మ దగ్గరే నేర్చుకుంటాం. అమ్మ అంటే కేవలం ఒక బంధం మాత్రమే కాదు. ఆప్యాయత, అనురాగం, ఆదర్శం, ఆత్మీయత, ఆనందం మరెన్నో అనుభవాలు. అమ్మ అనే పలుకులో ఉండే కమ్మదనం ఎంతకాలమైనా అలానే ఉంటుంది.

అమ్మపై తమ ఆప్యాయతను కనబరచడంలో ఎవరి శైలి వారికి ఉంటుంది. అందుకే కొందరు అమ్మ ప్రేమను అమృతాన్ని మించిన ఔషధంలా చెప్తే, మరికొందరు అమ్మ అనే పదమే అమృతంతో సమానమంటారు. అటువంటి అమ్మల ప్రేమను గుర్తు చేసుకుంటూ.. వారికంటూ ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే రోజే ఈరోజు. నేడు ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం. కానీ ఇది కలియుగం సార్.. ఇప్పటికే చాలా వరకు అమ్మ ప్రేమ చెక్కు చెదరకుండా అలానే ఉంటే.. కొందరు మాత్రం అమ్మలమని చెప్పుకుంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు ఆమె తల్లేనా అన్న అనుమానాలు కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. అందుకు ఇవిగో ఉదాహరణలు..




 

మాతృప్రేమకు నిదర్శనం పద్మ

కుంటోడైనా, గుడ్డోడైనా, ప్రపంచాన్ని గెలిచే వీరుడైనా చుట్టుపక్కల వారి మాటలు, చూపుల్లో తేడా ఉంటుందేమో కానీ తల్లి ప్రేమలో కాదు. అందుకు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ సమీపంలోని ఎన్నంపేటకు చెందిన బొక్క పద్మ నిలువెత్తు నిదర్శనం. ఆమెకు ఇద్దరు కుమారులు ఒకరికి 21 ఏళ్లు, మరొకరికి 18 ఏళ్లు. ఇప్పటికీ వారిని ఆ కన్నతల్లి చంటి బిడ్డల్లానే కాపాడుకుంటుంది. ఆమె కుమారులు కూడా ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు అందరి పిల్లల తరహాలోనే ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్తూ చదువుకుంటూ ఉన్నారు.

కానీ అప్పుడే వాళ్లకు జీవితంలోని అతిపెద్ద కష్టం వచ్చింది. పెద్ద కుమారుడు నడకలో తేడా వచ్చింది. ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఉన్నట్టుండి కిందపడిపోవడం, కాస్త దూరం నడవగానే అలసిపోవడం, మోకాళ్ల నొప్పితో బాధపడటం ఇలాంటి ఇబ్బందులు రావడం మొదలైంది. అదే విధంగా చిన్న కుమారుడికి కూడా ఇబ్బందులు రావడం మొదలయ్యాయి. అతడి కాళ్లూ చేతులు పనిచేయడం ఆగిపోయింది. ఆఖరికి కూర్చోవడం కూడా కష్టమైపోయింది. ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా లాభం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ వీరి పరిస్థితి మరింత క్షీణిస్తుందని వైద్యులు వివరించారు.

అప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాలు ఆ పిల్లలను చంటి పిల్లల మాదిరి ఎత్తుకుని తిప్పుతూ ఆ మాతృమూర్తి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పిల్లల పరిస్థితి చూసి ఇల్లు అద్దెకి ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో.. అప్పులు చేసి ఓ ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న వికలాంగుల పింఛన్‌ వస్తున్నా అది వారి మందులకే సరిపోవడం లేదని ఆ మాతృమూర్తి వివరించింది.

మరో తల్లి ఇలా

అమ్మ ప్రేమను అమృతాన్ని మించిన గొప్పదిగా చెప్పుకునే ఈ ప్రపంచంలో అమ్మ అన్న పదానికే కళంకంగా కొందరు మారుతున్నారు. అటువంటి ఓ మహిళే హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో కూడా ఉంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే అభం శుభం తెలియని 14 ఏళ్ల కుమార్తెను నీచాతినీచమైన వృత్తిగా భావించే వ్యభిచారంలోకి దించింది. ఆ పాడుపని తాను చేయలేనంటూ ఆ చిన్నారి వేడుకున్నా కరగలేదు ఆ తల్లి హృదయం. జుట్టు కత్తిరించి, కర్రతో చావబాది, భయపెట్టి, బెదిరించి వ్యభిచారంలోకి దించింది.

ఈ రక్కసి చెరలో ఆ చిన్నారి రెండేళ్ల పాటు నరకం చూసింది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఆ రాక్షసి ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ శరీరమంతా గాయాలతో నిండిన బాలికను చూసి పోలీసులు కూడా చలించి పోయారు. వెంటనే బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ చేస్తుండగా వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి.

అసలు ఆ మహిళ.. బాలిక కన్న తల్లి కాదన్న విషయం బట్టబయలైంది. ఆ 38 ఏళ్ల జూనియర్ ఆర్టిస్ట్ దాదాపు 15 ఏళ్లుగా ఇంట్లోనే వ్యభిచారం చేస్తోంది. కస్టమర్ల డిమాండ్ మేరకు స్నేహితురాళ్లనూ ఇంటికి పిలిపించుకునేది. అలా ఆమె స్నేహతురాళ్లలో ఒకరు 13 ఏళ్ల క్రితం తన ఏడాది బిడ్డను నిందితురాలికి ఇచ్చి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆ చిన్నారిని నిందితురాలే పోషించింది. ఆమె కస్టమర్లలో కొందరు చిన్నారిపై కన్నేసి ఎక్కువ డబ్బులిస్తామని చెప్పడంతో రెండేళ్ల క్రితం బాలికను చదువు మాన్పించి వ్యభిచారంలోకి దించింది. ఇప్పటివరకు నిందితురాలు తన కన్నతల్లి కాదని ఆ బాలికకు కూడా తెలియదు. కాగా ఆమెకు బిడ్డను ఇచ్చిన స్నేహితురాలి గురించి నిందితురాలు సరైన సమాచారం ఇవ్వడం లేదని, ఒక్కోసారి ఒక్కో కథ చెప్తోందని పోలీసులు చెప్పారు. ఈ కేసు విచారణ చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News