ఇదీ గిరిజన రైతులు,ఇక్రిశాట్ శాస్త్రవేత్తల విజయం,వారు ఏం చేశారంటే...
ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు,రైతులు కలిసి పనిచేస్తే ఏ ప్రాజెక్టు అయినా విజయవంతం అవుతుందని నిరూపించారు.కనుమరుగై పోయిన పెర్శజొన్నలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు..
By : Shaik Saleem
Update: 2024-07-16 11:56 GMT
ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాల్లోని సారవంతమైన భూముల్లో నాలుగు దశాబ్దాల కిందట గిరిజనులు పండించిన సంప్రదాయ పంట అయిన పెర్శ జొన్నల సాగు హైబ్రిడ్ యుగంతో కనుమరుగైపోయింది.
- కారణాలేమైనా మేలైన పోషకాలతోపాటు అత్యంత రుచిగా ఉండే పెర్శరకం జొన్నల సాగును పునరుద్ధరించేందుకు ఇక్రిశాట్ వ్యవసాయ శాస్త్రవేత్తలు గిరిజన రైతుల సహకారంతో ఆదిలాబాద్ పూలచిత్ర జొన్న రకం సాగుకు వినూత్న ప్రాజెక్టు చేపట్టి, నాటి సంప్రదాయ పెర్శ రకం జొన్నల సాగును మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత పునరుద్దరించగలిగారు.
- ఇక్రిశాట్ శాస్త్రవేత్తల పరిశోధనలు, స్వచ్ఛంద సంస్థ చేయూత, గిరిజన రైతుల కృషి ఫలించి నాటి పురాతన పెర్శజొన్నల సాగు విస్తరిస్తోంది.
- ఏమిటీ పెర్శజొన్నల ప్రత్యేకత? ఈ జొన్నల సాగుతో ప్రయోజనాలేమిటి? ఈ రకం జొన్నలు ఏ భూమిలో పండుతాయి? ఈ ప్రాజెక్టు ఎలా విజయం సాధించింది ? అనే విషయాలు తెలుసుకునేందుకు మనమూ ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి వద్దాం రండి.
కలిసి కదిలారు...విజయం సాధించారు...
సన్నని చినుకులు వానగా మారి వరదలా ఉప్పొంగి వాగులై ప్రవహిస్తూ నదులవుతుంటాయి...అలాగే ముందుగా ఇద్దరు రైతులు...ఆపై అయిదుగురు...అనంతరం 20 మంది...ఇలా పెంచుకుంటూ పోయి ప్రస్థుతం 200 మంది గిరిజన రైతులతో పూర్తిగా కనుమరుగై పోయిన పెర్సజొన్నల సాగును ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు చేపట్టారు.ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ పెర్స రకం, పూలచిత్ర జొన్నల సాగు ప్రాజెక్టును ఇక్రిశాట్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్ మెంట్ సొసైటీ, గిరిజన రైతులు కలిసికట్టుగా విజయవంతం చేశారు. పోషకాలతోపాటు రుచిగా ఉండే పూలచిత్ర జొన్నల సాగును విస్తరించడం ద్వారా భవిష్యత్ తరాలకు మేలు చేసేందుకు ఇక్రిశాట్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం చేసిన వినూత్న పరిశోధనలు ఫలించాయి.
కనుమరుగైపోయిన పెర్శ జొన్నల సాగు
నాలుగు దశాబ్దాల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పెర్శరకం జొన్నలను పండించే వారు.అత్యంత రుచితోపాటు పోషకాలను ఇచ్చే పెర్శరకం జొన్న పంట పొడుగ్గా పెరుగుతోంది. దీంతోపాటు దీని ఆకులు చెరకు లాగా తియ్యగా ఉండటంతో కోతులు, పక్షులు, అడవి పందుల గుంపులు ఈ పంటపై దాడి చేస్తుండేవి. పెద్ద గాలి వీస్తే ఈ జొన్న చెట్లు నేలకూలుతుండేవి. దీంతో పాటు హైబ్రిడ్ జొన్న రకాల రాకతోపాటు పత్తి సాగు విస్తీర్ణం పెరగడంతో గిరిజన ప్రాంతాల్లో రైతులంతా పెర్శరకం జొన్నల సాగును వదిలేశారు. దీంతో ఈ విత్తనాలు కూడా కనుమరుగయ్యాయి.
సంప్రదాయ జొన్నలే నాడు అక్షింతలు
పురాతన కాలంలో గిరిజనులు పెర్శరకం జొన్నలను జంగుబాయి దేవత వద్ద పెట్టి పూజ చేసి వ్యవసాయ పనులు ప్రారంభం కాగానే పొలాల్లో జొన్న విత్తనాలు చల్లే వారు. దీపావళి సందర్భంగా జొన్న ఆకులు తెచ్చి పూజ చేసేవారు. దసరా సందర్భంగా గిరిజనులు వ్యవసాయ పనిముట్లతోపాటు జొన్నలను పెట్టి పూజలు చేసేవారు. గిరిజన ప్రాంతాల్లో విజయదశమి సందర్భంగా జమ్మి ఆకు కాకుండా జొన్న ఆకును బంగారంగా ఇచ్చిపుచ్చుకునే సంస్థృతి ఉండేదని ఉట్నూరుకు చెందిన విఠల్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పెళ్లిళ్లలో జొన్నలనే అక్షింతలు వాడేవారు.గిరిజనులు జొన్న రొట్టెలు, తేనే, జొన్న గటక తాగుతూ ఆరోఃగ్యంగా ఉండే వారని ఆయన పేర్కొన్నారు.
పెర్శజొన్నల ప్రత్యేకత ఏమిటి?
గోండి భాషలో గిరిజనులు పెర్శ రకం జొన్నలని పిలుచుకునే వారు.ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల గిరిజనులు తరచూ మలేరియా, వైరల్, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలుతన్నాయి. నాడు పెర్శరకం జొన్నలతో గటకను తాగితే బలంతోపాటు విషజ్వరాలు మటుమాయం అయ్యేవని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ గిరిజన రైతు మహదు పటేల్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ జొన్నల దిగుబడి కూడా అధికంగా వచ్చేది. దీంతోపాటు పెర్శరకం జొన్న చొప్ప చెరకులాగా ఉండటంతో పశువులు కూడా దీన్ని ఇష్టంగా తినేవి. పోషకాలతోపాటు ఎన్నో ప్రయోజనాలున్న పెర్శరకం జొన్నల సాగు కనుమరుగైంది.
ఆదిలాబాద్ పూలచిత్ర జొన్నల ప్రాజెక్టు
ఆదిలాబాద్ జిల్లాలో కనుమరుగై పోయిన పెర్సజొన్నల సాగును ఇక్రిశాట్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం జోష్ణ కోల్వ, మరింజ్, నెదర్లాండు దేశానికి చెందిన విన్సెంట్, క్రితికల బృందం సెంటర్ షర్ కలెక్టివ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు మేనేజరు కె విఠల్ రావుతో కలిసి ఆదిలాబాద్ జిల్లాల్లో సంప్రదాయ పూలచిత్ర జొన్నల సాగు ప్రాజెక్టును చేపట్టారు.ఇక్రిశాట్ లో ఆదిలాబాద్ జిల్లాలో నలభై ఏళ్ల క్రితం సాగు చేసిన పెర్శరకం జొన్నల విత్తనాలు కొన్ని సేకరించి పెట్టుకున్నారు. హైబ్రిడ్ రకాల రాకతో ఈ సంప్రదాయ మేలైన రకం కనుమరుగైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతే గిరిజన రైతుల సహకారంతో ఎకరం సాగు నుంచి 200 ఎకరాల సాగుకు ఈ రకం జొన్నను పెంచారు. సంప్రదాయ జొన్నలకు పూలచిత్ర అని పేరు పెట్టిన ఇక్రిశాట్ శాస్త్రవేత్లలు ఈ విత్తనాలను ఉచితంగా రైతులకు అందించి వాటిని పొలాల్లో సాగుకు సూచనలు, సలహాలు ఇస్తూ అధిక దిగుబడులు సాధించారు.
పూలచిత్ర జొన్నల సాగును విస్తరించారిలా...
ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు ముందు ఇద్దరు రైతులతో కేవలం ఎకరం పొలంలో పూలచిత్ర జొన్నలను సాగు చేయించారు.ఆపై అయిదుగురు రైతులు, అలా ఏడుగురు,20 మంది, ప్రస్థుతం 200 మంది రైతులను ఎంపిక చేసి పూలచిత్ర జొన్నసాగు విస్తీర్ణాన్ని పెంచారు. ఇక్రిశాట్ వ్యవసాయ శాస్త్రవేత్తల చొరవతోనే కనుమరుగై పోయిన పూలచిత్ర జొన్న రకం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు సలహాలు ఇస్తుండటంతో సంప్రదాయ జొన్నల సాగుకు గిరిజన రైతులు ముందుకు వచ్చారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పూలచిత్ర జొన్నలసాగు విస్తీర్ం పెంచుతాం
ఆదిలాబాద్ జిల్లాలో పూలచిత్ర జొన్నల సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచుతామని సెంటర్ ఫర్ కలెక్టివ్ డెవలప్ మెంట్ సోసైటీ ప్రాజెక్టు మేనేజరు విఠల్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పోషకవిలువలతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలున్న పూలచిత్ర జొన్నల సాగు పెంచడం ద్వారా ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల్లో కీలక మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.