నువ్వు రిటైర్ అయితే నాకేంటిట చెప్పు??

అరవైదాటినా చావని పురుషాహంకారం మీద గీతాంజలి దాడి

Update: 2024-07-30 03:16 GMT


ఇక అతను రిటైర్ అయ్యాక...ఇల్లోక లైబ్రరీ చేద్దామనుకున్నా!

రాసిన పుస్తకాలు
నేను రాయబోయే ఖాళీ కాగితాలు సర్దుకుందామనుకున్నా!
ఇల్లంతా కొత్త కాగితాల పరిమళాలతో నింపేద్దామనుకున్నా.
గది గదినీ సౌరభించే ఒక పుస్తకాల తోటని చేద్దామనుకున్నా !
మొత్తం ఇంటిని ఒక రైటింగ్ టేబుల్ చేద్దామనుకున్నా!
ప్రపంచమంతా యాత్రలు చేస్తూ నేనే ఒక ట్రావెలోగ్ ఔదామనుకున్నా
ఇంటి లోపలికి నేను చూసిన ప్రపంచాన్ని తెద్దా మనుకున్నా...
యాత్రల్లో కలిసిన కొత్త స్నేహాలను
నా ఇంట్లోకి చేయి పట్టి తీసుకొద్దామనుకున్నా !
***
కానీ
అతను రిటైర్ అయ్యాక..
ఇల్లంతటిని డైనింగ్ టేబుల్ గా మార్చేశాడు.
ఇల్లంతటినీ కలిపి ఒక కిచెన్ గా మార్చేశాడు.
యు ట్యూబ్ లో రోజోక కొత్త వంట నాకు ఫార్వర్డ్ చేస్తాడు
నాకు హెడ్ చెఫ్ గా ప్రమోషన్ ఇస్తానంటున్నాడు.
అతనేం చేస్తున్నాడంటే
నా ఈ మిగిలిన జీవితాన్ని
నా కొద్ది జాగాని..
నా నుంచి గుంజు కుంటున్నాడు.
******
నా ఏకాంతాన్ని గజల్స్ తో
పాటలతో
సంగీతంతో నింపేద్దామనుకున్నా.
ఇన్నేళ్లుగా నే పాడలేని పాటలను పాడుకుందామనుకున్నా.
నేను రాయలేక దాచుకున్న ప్రేమ కవిత్వాన్ని
స్వేచ్ఛగా రాద్దామనుకున్నా !
నా బాల్యయవనకౌమార్యపు స్నేహాల
తలుపులు తడదామనుకున్నా!
*******
నన్ను నేను యవ్వన కాలమంత
మనోహరంగా పునః సృష్టించుకుని
పాటలరా గాలకవిత్వాలతో
నాకు నేను నన్నే కానుకగా ఇచ్చుకుం దామనుకున్నా.
నాకు నేను ప్రేమలేఖ రాసుకుందామనుకున్నా!
నన్ను నేను నాకోసం దక్కించుకుందామనుకున్నా.
ప్రత్యేక మైన నా రిటైర్మెంట్ కలల చిట్టాలో
ఏమున్నా యో నీ కెప్పుడూ కనపడేది కాదు !
****
పోపుల , కూరల, మసాలాల ,వంట వాసనల సబ్బుల
వాషింగ్ పౌడర్ల
నీ పెత్తనాలు నిండిన ఇంటి వాసనకు
దూరంగా వెళ్ళిపోయి.
నిలువెల్లా వంట వాసనలతో ఆవిర్లు కక్కే
నా దేహాన్ని నా శ్వాసని నా హృదయాన్ని
నా తోటలోని పొగడపూల ఆకాశమల్లెల పారిజాతాల సౌరభాలతో
నా కోసమే కురిసిన నా ఆకాశపు వర్షంలో
వంటింటి వాసన పోయేదాకా
వానకి భూమిలో విత్తనం నానినట్లు
స్నానిద్దామనుకున్నా నాని నాని కొత్తగా మొలకెత్తడానికి.
*****
కానీ నువ్వు రిటైర్ అయ్యి ఏం చేసావంటే
ఇంట్లో మరింతగా ఒక గెడ కర్రలాగా పాతుకుపోయావు .
ఇల్లంతా నీదే నంటావు
ఇల్లంతా నువ్వే తిరుగుతావు.
ఇల్లంతా నువ్వైపోతావు !
నువ్వు ఆఫీస్ కెళితే
ఇంట్లో కొంత నువ్వు లేని ఉల్లాస సమయం
అందమైన స్థలం నాకుండేది.
నా ఊపిరి నాకు దక్కేది.
నేను కవిత్వం రాసుకునే కిటికీ ..
నాకు వర్షాన్ని చూపించే కిటికీ
*ఖోయా ..ఖోయా చాంద్...ఖులా ఆశ్మాన్*లో
తప్పిపోయిన చందమామని వెతికి మరీ
నాకు కానుకగా ఇచ్చే నా రఫీని వినిపించే కిటికీ..
అడవి కోయిలల్ని వర్షపు తోటని చూపించే కిటికీ నాకుండేది
నాదిగా మాత్రమే ఉండేది... పూర్తిగా నాదై ఉండేది !
నా లాగే నా కిటికీ నన్ను గాఢంగా ప్రేమించింది.
వెన్నెల నెత్తు కొచ్చి నా మీదికి ఒంపుతూ
కిటికీ నా చెవుల్లో నన్ను ప్రేమిస్తున్నట్లు గుస గుసలాడేది.
కానీ నువ్వు రిటైర్ అయ్యాక
నా కిటికీ ని మొత్తంగా నీతో మూసేసావు.
నా కిటికీని దొంగలించావు.
నన్ను కిటికీకి లోపల వంటింట్లోకి తోసేసావు.
నువ్వు రిటైర్ అయ్యి ఏం చేసావంటే...
ఇంట్లో నా మొత్తం కాలాన్ని స్థలాన్ని
తిమింగలంలా మింగేసావు.
***
నీ మెనూ లో బ్రేక్ఫాస్ట్,లంచ్,డిన్నరే కాదు
మధ్యాహ్నపు నాలుగుగంటల స్నాక్స్ చేర్చావు.
"ఆఫీసులో చల్లగా ఆదరాబాదరాగా తిన్నా ఇన్నేళ్ళు
ప్రియా ఇక ఇప్పుడు ఎప్పటికప్పుడు నువ్వు పొయ్యిలో తీసి
కంచంలో వేసినంత వేడి వేడిగా తింటా
కాస్త చేసి పెడుదూ ఇంకెం తుందోయ్ జీవితం...
ఇంకో పది.. పదిహేనేళ్ళు " అంటావు
అచ్ఛం కొత్త రుచులు కోరే రిటైర్డ్ మగ బాలింతలా !
నీ కడుపు వైశాల్యం లోతూ
మోటర్ తవ్వినట్లు పెరుగుతూనే ఉంటుంది కదా...
మీ పురుషుల హృదయ వైశాల్యం పెంచే
యంత్రం మాత్రం ఎప్పుడెవ్వరు కనుక్కోవాలి ?
***
నీ రిటైర్మెంట్ పూల.దండ నా మెళ్ళోనూ పడుతుంది
నువ్వు మాట్లాడే బూతు పురాణాల దుర్వాసనని పోగొట్టడానికన్నట్లు
శాలువ నన్నూ కప్పుతుంది..
నా ఒంటి మీద నీ వేలి ముద్రలని దాచడానికన్నట్లు.
******
35ఏళ్ళ ఆఫీస్ విజయానికి కారణం
నేను ముప్పూటలా నిన్ను మేపుతూ ..
సుఖసంతోషాలతో ఉంచడమేనటగా ..
ఇక ముందూ అలాగే ఉంచాలిట...
నీ బాన పొట్టా.. నడుము టైర్లు
డైట్ తో తగ్గించేయాలిట.
ఓయ్..నా రిటైర్డ్ భర్తా..నువ్వు రిటైర్ అవుతే నాకేంటిట చెప్పు?
నువ్వు రిటైర్ అయ్యేదాకా
నీ కడుపులో నేను భోజనంలా అరుగుతూనే ఉన్నాను.
నువ్వు మాత్రం నా కంచాన్ని షుగర్ ఇంజెక్షన్ లు..
బీపీ మాత్రలు..గుండె దడ తగ్గించే మాత్రలతో నింపుతూనే ఉన్నావు,
నువ్వు రిటైర్ అయ్యేదాకా.
నువ్వు పొధ్ధున్న తిని రాత్రి పడుకునే దాకా నీ చుట్టూ....
పగలూ రాత్రీ ..నూనె పిండే గానుగెధ్ధు అయ్యాను!
****
నువ్వు రిటైర్ అయ్యేదాక సాయంత్రం ఐదు వరకు ఖాళీ ఇల్లు నాదే...
నువ్వు లేని సమయం నాకు ఇల్లొక తోట..
ఇల్లొక పుస్తకం...ఇల్లొక సంగీత వేదిక
ఇల్లొక నిద్రపుచ్చే నులకమంచం !
కానీ..
నువ్వు రిటైర్ అయ్యాక. నాకు ఇల్లొక శరణార్ధుల శిబిరం
ఎప్పటిలా నువ్వు నీ ఇంటి యజమానివి... ల్యాండ్ లార్డ్ వి !
నువ్వు రిటైర్ అయితే నాకేంటిట చెబుతావా కాస్త?
ఎప్పటికన్నా కాస్త ఎక్కువగానే నా దివారాత్రుళ్లు..
నా దేహం ..తునకలు తునకలు గా నీకోసం విభజింప బడుతుంది.
నీ కంచంలో...మంచంలో వడ్డించ బడుతుంది.
***
ఇక నువ్వేమో...సోషల్ మీడియాలో...
వాట్సప్పుల్లో నీ దోస్తుల ఆరోగ్యాలు..
వాళ్ళ పెళ్లాల బీపీలు షుగర్లు ఏ కషాయాలు తాగి కంట్రోల్లో పెట్టాలో
మహా ఫేక్ మానవతా వాదిలాగా
చెబుతూ నఖరాలు చేస్తూ ఉంటావు.
నోటి నిండా నా మీద బూతుల పురాణాలు దాచుకుని మరీ...
వయాగ్రాల పవర్ రహస్యంగా స్క్రోల్ చేస్తుంటావు నా ప్రాణానికి !
నా జీవితం రోగం లేకుండా ఉండడం మాత్రం నీ చేతుల్లో లేనట్లే...
****
ఇక ఇప్పుడు నేనేం చేయాలి నేనెలా రిటైర్ అవ్వాలి చెప్పు ??
నా రిటైర్మెంట్ గురుంచి
నా విశ్రాంతి గురుంచి ఎప్పుడైనా ఆలోచించావా?
నువ్వు రిటైర్ అయ్యి ఆ క్రమించుకున్న ఇంట్లో
నేనిప్పుడు నీకు ఫుల్ టైం ప్యూన్ న్ని.. నర్స్ ని.
నువ్వేమో పక్ష వాతం వఛ్చినట్లే...
ఉన్న చోటుకే నాతో అన్నీ తెప్పించుకునే
పూర్తి స్థాయి వికలాంగుడివయిపోయావ్ !
నేనేదో నీకు జీవితాంతం అప్పాయింట్ అయిన కుక్ లాగా !
ఇక ఇప్పుడు నేనేం చేయాలంటే..
నీ ఇంట్లో నిన్నోదిలేసి..
నేనో రిటైర్మెంట్ హౌస్ ని కొనుక్కోవాలి.. తప్పదిక !
ఏమోయ్..నాకూ రిటైర్మెంట్ కావాలి !
నీ ఇంటి నుంచీ.. నీ నుంచీ.
చూడూ... నువ్వొక పర్మనంట్ కుక్ ని మార్కెట్ నుంచి రిక్రూట్ చేస్కో.
ఇక నేను నా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా ఫో ..!



Tags:    

Similar News