కొత్త భూభాగాల అన్వేషణలో హరప్పవాసులు

ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 18. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి

By :  Admin
Update: 2024-11-30 07:23 GMT

-బేతి పాణిగ్రాహి

ఆర్యన్ గుర్తింపు సాంస్కృతిక ఆధిక్యతకి చిహ్నంగా చలామణి అవుతుండగా కొందరు హరప్పనులలో పాత భ్రమలు తొలగిపోసాగాయి. తమ సొంత ప్రత్యెక సంస్కృతీ సాంప్రదాయాలు కనుమరుగవుతూ, అధిక సంఖ్యాక ఆర్యుల గుర్తింపుతో విలీనమవుతున్నాయని వారు భావించారు.

తమ గుర్తింపు కను మరుగై పోతూండటాన్నిచూస్తూ భరించలేమని హరప్పనులకు అర్థమైంది. ఒక కొత్త నివాసాన్ని-తాము స్వేచ్చగా వ్యవహరించ గలిగే, సొంత భాషలో మాట్లాడుకోగలిగే, నమ్మిన దేవుళ్ళను పూజిస్తూ తమవైన ఆచారాలు పాటించ గలిగే – ఒక నూతన ప్రదేశాన్ని కనుక్కోవాల్సిన అవసరం వారికి ఏర్పడింది. ఎవరో ఆక్రమిస్తారన్న, ఎవరో హాని తలపెడతారన్న భయం లేకుండా గర్వంగా బతుకుతూ తమ అస్తిత్వాన్ని నిలుపుకోగల ప్రాంతం గురించి వాళ్ళు కలగన్నారు.

అన్నాదుడు అనే జ్ఞాన సంపన్నుడైన వృద్ధుని నాయకత్వంలో కొంత మంది హరప్పనులు ఒక స్పష్టమైన వైఖరి తీసుకోనిర్ణయించారు. వాళ్ళు స్వయం ప్రతిపత్తి కోసం, పాలకవర్గాల ప్రభావం పడని రీతిలో తమ సొంత జీవనవిధానాన్నిసంరక్షించుకునే స్వేచ్చ కోసం ఉవ్విళ్ళూరారు. అదే సమయంలో వారు వర్ణాశ్రమ వ్యవస్థని తీవ్రంగా ద్వేషించారు ; అది అణచివేతకు ఆయుధమని, మనుషుల సామర్థ్యానికి పరిమితి విధింఛి కరడు గట్టిన సామాజికశ్రేణులకు బందీ చేసే గట్టి సంకెల అని భావించారు.

“మనం శూద్రులం కాము, వైశ్యులము కాము,” ప్రకటించాడు అన్నాదుడు. “మనం హరప్పనులం, మనకు సొంత ఆచారాలున్నాయి, సుసంపన్నమైన వారసత్వం వుంది. మనం చేసే పనులను బట్టి మనల్ని విభజించే ఈ కృత్రిమస్థాయి బేదాల వ్యవస్థకి కట్టుబడలేము.”

వాళ్ళు రహస్యంగా సంచరిస్తూ భావసారూప్యత గల వ్యక్తులను కలిసి తమ సాంస్కృతిక వారసత్వంకి ఏర్పడనున్న ముప్పు గురించి చెప్పి భయాందోళనలు వెలిబుచ్చారు. హరప్పన్ వారసత్వం, సాంప్రదాయాల గురించి లోతైన అవగాహన వున్నఅన్నాదుడు ఆ నిశ్శబ్ద తిరుగుబాటుకి నాయకుడైనాడు.“ పరిస్థితి చేయి దాటక ముందే మనం ఎదో ఒకటి చేయాలి..” అని అన్నాదుడు తన అనుచరులకి ఉద్బోధించాడు. “ మన భాష, మన ఆచారాలు. మన కళలను ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షించుకోవాలి. మన అస్తిత్వాన్ని సజీవంగా నిలుపుకోవాలి. వర్ణవ్యవస్థ సంకెళ్ళను బద్దలు కొట్టాలి.”

బృందం సభ్యులు అందరినీ కూడగట్టుకుంటూ రహస్య స్థావరాలలో సమావేశాలు నిర్వహించనారంభించారు. ప్రమాదపు నీలినీడల నేపథ్యంలో తమ సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచేందుకు కథలు, పాటలు, కవితలు ఒకరితో ఒకరు పంచుకున్నారు. కానీ వారి చర్యలను పాలకులు గమనించారు. తలెత్తుతున్న అసమ్మతిని పసిగట్టిన ఆర్య అధికారులు అన్నాదుడిని నిర్బంధలోకి తీసుకుని ఖైదులో పెట్టారు.

ఆర్యుల రాజు ఇంద్రసేనుడు చెరసాల పాలైన అన్నాదుడిని ఉద్దేశించి ఎద్దేవగా మాట్లాడాడు. “అన్నాదా, నువ్వొక మూర్ఖుడివి, నీ తిరుగుబాటు ఎన్నడూ విజయవంతం కాదు. సామ్రాజ్యం చాలా బలమైనది, శక్తివంతమైనది. నువ్వు జైలు లోనే కృశించిపోతావు, నీ వాళ్ళు నిన్ను మర్చిపోతారు. అంతే.” కానీ అన్నాదుడు అంత సులభంగా పట్టుదల వీడే వ్యక్తీ కాదు. సామ్రాజ్యంలోని వాస్తుకళని సంవత్సరాల తరబడి అధ్యయనం చేసి ఉన్నందున జైలు నిర్మాణం, దాని ఆకృతి గురించిన పరిజ్ఞానం సాయంతో అతడు తప్పించుకు పోవడానికి పథకం వేశాడు. ఒక రాత్రి దట్టమైన చీకటి సమయంలో జైలు గది నుంచి బయట పడి ప్రధానద్వారం చేరుకోగలిగాడు.

అతడు ద్వారం సమీపిస్తుండగా వెనుక వరండా వేపు నుంచి అడుగుల సవ్వడి వినవచ్చింది. అతడు తప్పించుకు పోతున్నాడని తెలుసుకున్న భద్రతాదళాలు అతన్ని పట్టుకునేందుకు పరిగెత్తుకు వచ్చాయి. ఉద్వేగంతో అన్నాదుడికి తన గుండె చప్పుడు తనకు స్పష్టంగా విన్పించింది, ద్వారాన్ని ఒక్క తోపుతోసి బాణంలా చీకట్లో పరుగెత్తాడు. మెలికలు తిరిగి వున్న నగర వీధుల గుండా అతడు వేగంగా పరుగులంకించుకున్నాడు. అతన్ని వెంబడిస్తూ సైనికులు దౌడు తీశారు. నగర నిర్మాణ ప్రణాళిక, మలుపులు తెలిసినవాడు కాబట్టి అన్నాదుడు సైనికులకు చిక్కకుండా ఉండేందుకు సందుల వెంట పరుగు పెట్టాడు. వాళ్లకు దొరకకుండా తప్పించుకున్నాను అని తేలికగా ఊపిరి తీసే లోపలే గుర్రపుడెక్కల చప్పుడు అతని వెన్నంటే వచ్చింది. వెనక్కి తిరిగి చూడగా అశ్వారూడులైన సైనికులు కత్తులు దూసి అతన్ని చుట్టూ ముడుతూ కని పించారు. వాళ్ళని ఎదిరించి నిలువడం సాధ్యం కాదని అన్నాదుడికి అర్థమైంది, మెరుపులా ఒక ఆలోచన వచ్చి సమీపంలోని నదిలోకి దూకాడు. సైనికులు గుర్రాల కళ్ళాలు లాగి అన్నాదుడు అదృశ్యమైన స్థలం వేపు వేలు చూపి గందరగోళంగా గట్టిగా అరిచారు. అయితే అన్నాదుడు గజఈతగాడు, నది లోతు, వెడల్పు అతనికి కరతలామలకం. అతడు శ్వాస బంధించి నీటిలోమునిగి వేగంగా ఈది ఆవలి ఒడ్డు చేరుకున్నాడు.

బాగా అలసిపోయి చలికి వణుకుతూ అన్నాదుడు నీళ్ళలోంచి బయటికి వచ్చాడు. నలు దిక్కులా చూశాడు, తనొక నిర్మానుష్యమైన ప్రదేశంలో వున్నాడు, పైకి చూస్తె నగరంలోని కట్టడాలు చాలా ఎత్తుగా, పెద్దగా కనిపించాయి. తాను చాలా దూరం వెళ్ళాల్సి వుందని అతనికి అర్థమైంది. దిగంతాల వేపు చూపులు నిలిపి తడబడే అడుగులతో ముందుకు సాగాడు. తుదకు కొన్ని గంటల ప్రయాణం తర్వాత, నీడల్లో తన కోసం ఎదురు చూస్తోన్న ఒక ఆకారాన్ని చూశాడు అన్నాదుడు. అతడు తిరుగుబాటు ఉద్యమంలో తన సహచరుడు, తనకి దారి చూపించేందుకు ఇతర మిత్రులు పంపగా వచ్చాడు.

“అన్నాదా, నువ్వు మాకు ఇక కనపడవేమో అని భయపడ్డం..” అంటూ ఆ వ్యక్తి అప్యాయంగా అన్నాదుడిని అలుముకున్నాడు. “ నేనెన్నడూ మీకు దూరం కాను, “అన్నాడు అన్నాదుడు ,కృత నిశ్చయంతో కళ్ళు మెరుస్తుండగా. “మన ప్రజల కోసం, మన సంస్కృతి కోసం, మన స్వేచ్చ కోసం పోరాడేందుకు ఎల్లప్పుడూ ఎదో మార్గం వెతుకుతూనే వుంటాను.”

ఉద్రిక్తతలు పెరుగుతూనే వున్నాయని, తమ పోరాటం ఒక కొలిక్కి రాలేదనీ అన్నాదుడికి తెలుసు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగించేందుకు, తమ సంస్కృతీ సాంప్రదాయాలు సజీవంగా ఉంచేందుకు, పీడనకు మరో రూపమైన వర్ణవ్యవస్థని కూలదోసేందుకు అతడు ప్రతిన పూనాడు.

“ప్రాబల్యవర్గాల కుట్రలకు మన సంస్కృతి బలి కానీయబోము..”అని నొక్కి పలికాడు అన్నాదుడు.”మన పూర్వీకుల తరఫున, మన పిల్లల తరఫున మనం ఒక వైఖరి తీసుకోవాలి.” “కానీ మనం ఎక్కడికి పోగలం? “ భయంతో వణికే స్వరంతో అన్నాడొక యువహరప్పన్. “ అడవుల్లో ఎన్నో ప్రమాదాలు పొంచి వున్నాయి, ఈ రాజ్యం ఎల్లలు దాటితే మనకు ఇల్లు అనేది లేదు.” “అందుకు మనమొక మార్గం చూద్దాం,” అన్నాడు అన్నాదుడు కృతనిశ్చయం ధ్వనించే స్వరంతో.”ఒక కొత్త నివాస స్థలాన్ని వెదుకుదాం. అక్కడ మనం సుఖ శాంతులతో జీవిస్తూ మన జీవన విధానాన్ని పరిరక్షించుకుందాం.” సుదీర్ఘ చర్చల అనంతరం, రాజ్యానికి చాలా దూరాన వున్న దక్షిణ ప్రాంత భూములకు అందరూ తరలి వెళ్లాలని బృందం సభ్యులు తీర్మానించారు. అక్కడొక సారవంతమైన లోయ ఉందనీ, అక్కడి నదులు స్వచ్చంగా ప్రవహిస్తాయనీ, అక్కడి నేలల్లో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయనీ వారు విని వున్నారు. కొత్త నివాసప్రాంతం చేరుకోవడానికి వారు గుట్టలు, బండలు, నిర్జీవ నదులతో నిండిన సువిశాల దక్కన్ పీఠభూమిని దాటాల్సి వుంటుంది. ఎన్ని ప్రయాసలకోర్చి అయినా అనుకున్న ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్న హరప్పనులు దక్షిణానికి పయనమయ్యారు.

పుట్టి పెరిగిన నేలను వదిలిపెట్టి పోయేముందర రకరకాల ఆలోచనలతో వారి గుండెలు బరువెక్కాయి. వారి సంస్కృతీ సంప్రదాయాలు, భాషా సాహిత్యాలు నిరాటంకంగా విరాజిల్లిన పాత రోజులు, పూజ పురస్కారాలతో కళా కాంతులతో వేలయేళ్ళు ప్రభవిల్లిన గత దేవుళ్ళు.. వారి స్మృతిపథంలో మెదిలారు. జనంతో నిత్యం కిటకిటలాడిన అంగడి వీధులు, ప్రజలు వైభవోపేతంగా జరుపుకున్న పండుగలు, ఒక తరం నుంచి మరో తరానికి అందిన కథలు, గాథలు..వారు గుర్తుకు తెచ్చుకున్నారు. దక్షిణాదికి వలస వెలుతున్నవారికి వీడ్కోలు పలికేందుకు మిగిలిన హరప్పనులు గుమిగూడారు. కుటుంబాలు, స్నేహితులు విడిపోతూన్న ఆ సన్నివేశంలో అందరి కళ్ళలో ధారాపాతంగా కన్నీరు. తన వాళ్ళని, తన సంస్కృతిని విడిచి పోతున్నాననీ, తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాననీ నాగశౌర్య చాలా బాధ పడ్డాడు. పాలకుల ప్రజాపీడన పాలనను అంతమొందించే సామర్త్యం ఎన్నటికైనా తన సొంతమవుతుందా, లేక, తన జాతి ప్రజల గుర్తింపు మట్టిలో కల్సి పోతుండగా నిష్చేష్టుడిలా చూస్తూ వుండి పోవాల్సిందేనా అని అతడు మధన పడ్డాడు.

“ మిమ్మల్ని నేనెప్పుడూ మర్చి పోలేను..” అన్నాడు నాగశౌర్య గద్గద స్వరంతో. “ మీరు మన సంస్కృతీ పరిరక్షకులు. మీ ధైర్య సాహసాలకు సదా రుణపడి వుంటాను.” “ మేము కూడా నిన్ను ఎన్నడూ మరవలేము,” అన్నాడు అన్నాదుడు కన్నీళ్లు ఆపుకుంటూ. “మీరందరూ మా అక్కచెల్లెండ్రు, అన్నదమ్ములు. మిమ్మల్ని ఎల్లప్పుడూ మా గుండెల్లో దాచుకుంటాం.” అన్నాదుని వెంట అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు, తలిదండ్రులు వున్నారు. ప్రయాణం పొడవునా అతని కుటుంబ సభ్యులు అతనికి ఉత్తేజాన్ని, స్ఫూర్తిని అందించారు.

ప్రయాణం మొదలవుతూనే అన్నాదుడిని అతని ఇద్దరు కూతుళ్ళు వాటేసుకున్నారు, వాళ్ళ ముఖాల్లో భయం, ఆందోళన.”నాన్నా, మనకి ఒక కొత్త ఇల్లు ఎన్నటికైనా దొరికేనా ?” కంపిత స్వరంతో ఒక బాలిక అడిగింది. “తప్పకుండా దొరుకుతుంది, చిట్టి తల్లీ..” అన్నాడు నన్నయ అనునయంగా. “ మనం సుఖ శాంతులతో జీవించగలిగే, మన జీవనవిధానాన్ని పరిరక్షించుకోగలిగే..కొత్త నివాస స్థలాన్నితప్పక వెతుక్కోగలం.” “ కానీ మనకి గాయాలైతే, లేదా ఒకరి నుంచి ఒకరు తప్పిపోతే...?” అంది మరో బాలిక. కన్నీళ్లు తుడుచు కుంటున్న ఆ బాలిక గొంతు జీరవోయింది.

అన్నాదుడు తన కూతుళ్ళిద్దరినీ ఆప్యాయంగా గుండెలకు అదుముకున్నాడు. “మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.. కానీ వాటిని అందరమూ కలిసే ఎదురుకుంటాం. మనం ఒకరికి ఒకరం సహాయంగా వుంటాం. బాధ్యతను ఎన్నడూ విస్మరించం. మనం హరప్పనులం, బలశాలులం, గుండెనిబ్బరం గల వాళ్ళం. కాదా ..” అలా హరప్పనులు తమ సుదీర్ఘయాత్ర ప్రారంభించారు. రాజ్య సరిహద్దులు దాటేసి కొత్త భూభాగాల వెంట నడుస్తూ పయనిస్తూ పోయారు. దోవ పొడవునా ఎన్నో సవాళ్లు, ప్రమాదాలు ఎదుర్కొంటూ రోజులు, నెలలు ప్రయాణం చేశారు. నిప్పులు చెరిగే ఎండలో ఊసరక్షేత్రాలు దాటి దక్కన్ పీఠభూమిలో అడుగు పెట్టారు. కొండలు, గుట్టలు, ఎండిన వాగులతో సుదూరాలకు విస్తరించిన ఎడారి వంటి నేలకు అంతం లేనట్టు కనపడింది, నీళ్ళు, ఆహారం కోసం వాళ్ళు నానా ఇక్కట్లు పడ్డారు.

అలా వాళ్ళు దుర్గమ్మ భూభాగాల వెంట పోతూంటే, సరైన తిండి తిప్పలు లేక, కొత్త శీతోష్ణ స్థితికి తాళలేక కొందరు హరప్పనులు జబ్బు పడ్డారు. పిల్లలు, వయో వృద్ధులు మొదట అనారోగ్యం పాలయ్యారు. వారి దేహాలు నిరంతర యాత్ర మూలంగా శుష్కించి పోయినాయి. అన్నాదుడు అతని అనుచరులు వారి పట్ల శ్రద్ధ చూపి చేతనైన సాయం చేశారు, కానీ కొందరు ప్రాణాలు వదిలారు. ప్రతి వ్యక్తి మరణానికి వారు సంతాపం ప్రకటించారు. దు;ఖం, అలసట భారం వారిని క్రుంగ దీయాలని చూశాయి. కానీ వారు మనోనిబ్బరం కూడదీసుకున్నారు, కొత్త నివాస స్థలాలు కనుగొనాలన్న బలీయమైన వాంఛ, సంస్కృతిని కాపాడుకోవాలన్నగట్టి తపన వాళ్ళను ముందుకు నడిపించాయి. ఆ దుర్భర క్షణాల్లో లభించిన కొద్దిపాటి నీళ్ళు, ఆహారాన్ని అందరూ సమంగా పంచుకున్నారు, ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకున్నారు.

అలా హరప్పనులు కొన్ని నెలలు దుర్భర యాత్ర సాగించి తుదకు ఒక సారవంతమైన లోయ చేరుకున్నారు. అక్కడ కొత్త నివాసం ఏర్పర్చుకోవడానికుపక్రమించారు. రాజ్యం లోనే ఉండిపోయిన మిగతావాళ్ళు వారి సాహసాన్ని కొనియాడారు, హరప్పన్ జీవనవిధానాన్ని సంరక్షించాలన్న వారి దృఢ సంకల్పాన్ని కథలుకథలుగా చెప్పుకున్నారు. “వాళ్ళు ధీరోదాత్తులు, పిరికి వాళ్ళు కాదు..”అన్నాడు నాగశౌర్య ఆరాధనా భావం నిండిన స్వరంతో. “అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం మనిషి తాననుకున్నది సాధించగలడని వాళ్ళు నిరూపించారు.” కానీ రోజులు గడిచినా కొద్దీ, ఆత్మీయులు దూరం వెళ్ళిపోయారన్న వెలితి తెలిసి రాసాగింది. అయితే రాజ్య పాలకులు ఇదేమీ గమనించ లేదు, కానీ, తాము తప్పు చేశామేమోనన్నభావన మిగిలిన హరప్పనులకు కలిగింది.

అలా, హరప్పనుల మహావలస ఒక ఇతిహాసగాథ అయింది, సాంస్కృతిక అణచివేతకు వ్యతిరేకంగా ఎగసిన ప్రతిఘటనకు ఒక గొప్ప సంకేతంగా, విపత్కర సమయాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తుకు ఎల్లప్పుడూ ఆశ మిణుకు మిణుకు మంటుంది అనడానికి చెరిగిపోని గుర్తుగా నిలిచింది. రాజ్యంలోనే మిగిలిపోయిన వారికి మాత్రం అది ఆత్మీయులను కోల్పోయిన ఒక బాధాకర అనుభవంగా, మున్ముందు ఏమి జరుగనున్నదో చెప్పలేని అనిశ్చిత స్థితిగా తోచింది.

దక్షిణ ప్రాంతానికి తరలి వెళ్ళిన హరప్పనులు తమ జీవితాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు ; దుర్భేద్యమైన రాజ్యాలు నిర్మించారు, వైభవోపేత సంస్కృతికి పునాది వేశారు. వారి కొత్త నివాస భూభాగం ద్రావిడ రాజ్యంగా పేరు గాంచింది, వారిని ద్రావిడులని చరిత్రకారులు పిలిచారు. ఒకప్పుడు సింధు నదీ తీరం వెంట విరాజిల్లిన హరప్పన్ వారసత్వం, ప్రాచీన నాగరికతని వాళ్ళు విస్మరించనప్పటికీ, ఒక కొత్త గుర్తింపుని, అస్తిత్వాన్ని సాధించుకున్నారు ; కొత్త మాతృభూమిలో పలు సవాళ్లు, సాఫల్యాలు రూపు దిద్దిన గుర్తింపు అది.(సశేషం)

Tags:    

Similar News