'ఎర్రజెండా నీడలో...ఏవీ వర్మ స్ఫూర్తి' పుస్తక పరిచయం

పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, ఎల్ బి గంగాధర రావు, మోటూరు హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ వంటి పెద్దల ప్రసంగాలను విని ఆస్తులు వద్దనుకున్నాడు.

Update: 2024-07-10 02:30 GMT

-అవనిగడ్డ వనజ*


'ఎర్రజెండా నీడలో నా అనుభవాలు' పుస్తక రచన చేసిన ఏవీ వర్మ జీవితం స్ఫూర్తిదాయకం.. ఎన్నో ఒడిదుడుకులు... కష్టాలు ... అయినా ఆనందంగా అనుభవించాడు... ఎదిరించిన ప్రతిసారీ, ప్రశ్నించినపుడల్లా పోస్టల్ డిపార్ట్మెంట్ లో 'బదిలీ'ల పరంపర కొనసాగింది ...

దేవుడే నూతన ఆర్థిక విధానాలను అవలంభించమని చెప్పాడని అధికారి చెబితే, ఎంతో చాకచక్యంగా 'ఆ దేవుడే నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాడమని మాకు చెప్పారని' ఉద్యోగ సంఘాల నేతగా సమయస్ఫూర్తి తో బదులిచ్చిన తీరు సాహసోపేతం...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ఉమ్మడి కుటుంబ బాధ్యతలను నెత్తికి ఎత్తుకుని, కష్టాలను చిరునవ్వుతో స్వీకరించారు.

పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, ఎల్ బి గంగాధర రావు, మోటూరు హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ వంటి పెద్దలు చెప్పిన ప్రసంగాలను విని ఆస్తులు వద్దనుకున్నాడు.

కులం, మతం వదిలేశారు. మూఢనమ్మకాలను దరిచేరనీయలేదు. జనంతో మమేకమై సిపిఎం పార్టీని నిర్మించిన తీరు నేటి ఉద్యోగ, కార్మికులు నేర్చుకోవాల్సిన అంశం.

పార్టీ నిర్మాణంలోనూ, ప్రజాశక్తి పత్రికల పెంపులోనూ 'ఉక్కు' క్రమశిక్షణ ఆయన సొంతం.

తన తండ్రి కాంగ్రెస్‌ అయినా, ఎర్రజెండా భావాలు నచ్చి, ఐదు దశాబ్దాలుగా ఎర్రజెండా నీడన పోరాడుతున్న ఏవీ వర్మ, 'ఏమిచ్చి రుణం తీర్చుకోను... ఈ సమాజానికి' అంటూ బతికుండగానే తన భౌతికకాయాన్ని ఆసుపత్రికి రాసిచ్చిన ఆదర్శ కమ్యూనిస్టు.

నానాగడ్డి కరచి పిల్లలకు ఆస్తులను కూడబెట్టి వారసత్వంగా ఇచ్చే ఈ రోజుల్లో, తన పిల్లలకు 'కమ్యూనిజాన్ని' వారసత్వంగా ఇచ్చిన ధన్యజీవి.


 



సిపిఎం నిర్మాణంలో సాధారణ కార్యకర్తగా ఆయన గడిపిన జీవితం ఈనాటి హోల్‌టైమర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 66 మండలాల్లోనూ పార్టీ నిర్మాణం జరగాలని జిల్లా కమిటీ నిర్ణయించి ఆదేశిస్తే అమలుచేసి చూపాడు ఏవీ వర్మ...

గుడిలోని చేతి పంపు వద్ద స్నానం చేసి, గుడిలోనే పడుకుని, ఊరి ప్రజలతో మమేకమై, వారానికి ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లి వస్తూ జనమే కుటుంబంగా గడిపాడు.. ప్రజలతో మమేకమై పార్టీని నిర్మించాడు. ఈరోజుల్లో ఎక్కడికైనా వెళ్లి పార్టీ పని చేసి రమ్మని చెబితే ఉండటానికి వసతి, భోజన ఏర్పాట్లు అన్నీ ఉంటే గానీ కదలని పరిస్థితులు. పార్టీ పని చేయడం ఏవీ వర్మకు వ్యసనం. చిన్న పనైనా ఏదో ఒకటి చేస్తేనే నిద్రపోయే మనస్తత్వం. ఎదురుదెబ్బలు ఎన్ని తగిలినా సొంత ప్రయోగాలతో పార్టీని నిర్మించి చూపాడు.

అరవై ఏళ్లకే అన్నీ అయిపోయాయని ఉద్యోగ కార్మికులు రిటైర్‌ అయ్యి 'కృష్ణా రామా' అని జపం చేసుకుందామని అనుకునే రోజులు. అయితే ఏవీ వర్మ 'అరవై' లలో కంప్యూటర్‌ అంటే జనానికి పెద్దగా తెలియని రోజుల్లోనే 'డిటిపి' నేర్చుకుని అబ్బురపరిచారు. పార్టీ డాక్యుమెంట్లన్నీ అన్నీ తానై టైప్‌ చేసి సమావేశాల ముందు ఉంచారు. ఈరోజుల్లో ఎవరినైనా అదనపు పని నేర్చుకోమని చెబితే, నేర్చుకుంటే ఎక్కడ అదనపు పని చేయాల్సి వస్తుందోనని చాలా దూరంగా ఉండటం కొంతమందిలో చూస్తుంటాం. నిరంతరం తన చుట్టూ ఉండే జనంతో ఏది మాట్లాడినా, దాని వెనుక వారిని పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం. అలా ఎంతోమందిని పోస్టల్ లోనూ, ప్రజాశక్తి లోనూ, పార్టీలోనూ పార్టీ సభ్యులుగా తీర్చిదిద్దారు.

కళలంటే పిచ్చిగా ఆరాధించే ఏవీ వర్మ ఎన్నో నాటికలను స్వయంగా రచించి, దర్శకత్వం వహించారు. ఏడు పదుల వయస్సులో సంగీతం నేర్చుకుని, కామ్రేడ్‌ ఆదినారాయణ జీవిత చరిత్రను హరికథగా చెప్పి అలరించారు.

'ప్రజాశక్తి' జీవితకాల చందాదారులు. అంతేకాదు పార్టీ సభ్యత్వాన్ని ఏడాది మొదట్లోనే మొత్తం చెల్లించే 'మంచి' కమ్యూనిస్టు.

ఆరోగ్యం విషయంలోనూ ఉక్కు క్రమశిక్షణ. అందుకే ఎనిమిది పదుల వయసులోనూ బీపీ, సుగర్‌ లేదు. మానసిక చింతన అంతకంటే లేదు. ఎప్పుడూ మొహంలో చిరునవ్వే ఆభరణం. ఉదయం 9 గంటలకు 10 గంటలకు నిద్రలేచే యువత, తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేచి ఏవి వర్మ ఏం చేస్తారనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాలకృత్యాలు తీర్చుకుని, రెండు లీటర్ల నీటిని తాగి, యోగాసనాలు వేస్తూ, ఉదయం 5 కల్లా స్నానం చేయడం దినచర్య. రాత్రి 8 గంటలకు నిద్రపోవడం అలవాటు. ఈ మధ్యన చేసే చర్యలన్నీ టైం టు టైం జరిగిపోతాయి. బ్యాటరీ అయిపోయి గడియారం ఆగిపోతుందేమో గానీ, ఆయన దినచర్యలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. ఎపుడైనా అనారోగ్యంగా ఉంటే తప్ప... తీసుకునే ఆహారంలోనూ ఎటువంటి 'డైట్‌' ఉండదు. ఏదైనా తింటారు. ఐదారు లీటర్లు రోజంతా నీరు తాగుతారు. స్వీట్లు అంటే మహా ఇష్టం. చాక్లెట్లు, ఐస్‌క్రీం ఇప్పటికీ చిన్నపిల్లవాడిలా తింటారు. ఇదే ఏవీ వర్మ ఆరోగ్య రహస్యం. ఈనాటి యువత ఆరోగ్యం పట్ల తెలుసుకోవాల్సిన అంశం.

ప్రతి ఒక్కరినీ ఏం తమ్ముడు, ఏమ్మా, ఏం గురు, ఏం మాస్టారూ అంటూ ప్రేమగా పిలవడమే అలవాటు. ఆయన్ను ఎవరైనా తమ కుటుంబంలో వ్యక్తిగా భావిస్తారే తప్ప పరాయి అనుకోరు. అలా ఉంటుంది ఆయన మనుష్యులతో వ్యవహరించే తీరు. నమ్మిన సిద్దాంతం కోసం కుండబద్దలు కొట్టినట్లు చెప్పే మాట తీరు 'మొండోడు' అని ముద్ర వేయించుకున్నారు.

కులమతాలకు అతీతంగా పిల్లలకు పెళ్లిళ్లు చేసి ఆచరించి చూపారు.

మూఢవిశ్వాసాలను ఇంటి గుమ్మంలోకి రానీయలేదు. కుట్రలు, కుతంత్రాలకు దూరంగా చివరి వరకూ మిగిలి పోయారు. ఎర్రజెండా నీడలో కుటుంబాన్ని నిలిపాడు.

ఇటీవల జూన్‌ 30న 83వ వసంతంలోకి అడుగుపెట్టిన ఎవి వర్మ గారు ఎర్రజెండా నీడలోనే తన జీవితం ముగిసి పోవాలన్న భావనతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఏవీ వర్మ నిజంగానే 'గుర్తింపు కోరని కమ్యూనిస్టు'.


(*అవనిగడ్డ వనజ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Similar News