చికాగో డౌన్ టౌన్ టూరు..బోటుపై షికారు!

ఈ సిటీని చూసినప్పుడు మనకు చప్పున విజయవాడ గుర్తుకొస్తుంది. బెజవాడలో మనకూ మూడు కాలువలున్నాయి. అయితే ఏమీ చేయలేకపోయామనుకోండి. టూరిజాన్ని డెవలప్ చేయడమంటే మాటలా!

Update: 2024-07-09 02:20 GMT

చికాగో డౌన్ టౌన్.. చూడచక్కని వాడ. నిద్ర పోని జాణ. పర్యాటకానికి పుట్టిల్లు, రంగుల కలలకి, కళలకి మెట్టిల్లు. 2024 జూన్ 28.. శుక్రవారం సాయంత్రం.. వాతావరణం మనసు దోచేస్తోంది. మిచిగన్ లేక్ లేలేత సూర్య కిరణాలతో మిలమిల మెరుస్తోంది. నీటి కుదుపులకు పడవలు అటూ ఇటూ తొణికిసలాడుతున్నాయి. తెరలు తెరలుగా వస్తున్న అలలకు నీళ్ల మీద పడే ఎండ మెరుపులు కళ్ల మీద పడి తణుక్కున మెరుస్తూ కనువిందు చేస్తున్నాయి. అప్పుడే కురిసి వెలిసిన వానకు వీధులు తడితడిగా ఉన్నాయి.

మా ఆర్కిటెక్చర్ టూర్ సాయంత్రం 8 గంటలకు. బాటా కంపెనీ రేట్ల మాదిరిగా పెద్దోళ్లకు 49.95 డాలర్ల టికెట్. పిల్లలకైతే 26.95 డాలర్లు. పన్నులు అదనం. మొత్తం 75 నిమిషాల టూరు. షోర్ లైన్ సంస్థ వారి బోట్. వాళ్లు చెప్పినట్టే 15 నిమిషాల ముందే బోట్ డెక్ పైకి చేరాం. డౌన్ టౌన్ అందాలు మిస్ కాకుండా కళ్లారా చూసేందుకు వీలుగా డెక్ పై ఎడమ వైపు కూర్చున్నాం. చికాగో చరిత్ర, డౌన్ టౌన్ గొప్పతనాన్ని చెప్పేందుకు ఓ 25 ఏళ్ల అమ్మయి (టూరిస్ట్ గైడ్) మైకు పట్టుకుంది.

కిందో అంతస్తు, పైనో అంతస్తు ఉండేలా ఉండే బోట్ లో జనాన్ని కూర్చోబెట్టుకుని డౌన్ టౌన్ ఆకాశ హర్మ్యాలను చూపించే- స్కైలైన్ క్రూయిజ్- రెండు చోట్ల నుంచి బయలుదేరుతుంది. ఒక పాయింట్ నేవీ పియర్, రెండోది మేము బయలుదేరిన మిచిగన్ ఎవెన్యూ. ఇది డౌన్ టౌన్ మధ్యలో ఉంది. సరిగ్గా 8 గంటలకు మేమెక్కిన పడవ కదిలింది.
టూర్ గైడ్ గా ఉన్న అమ్మాయి నోటి నుంచి గంగా ప్రవాహంలో మాటల జడి సాగుతోంది. సరస్సుకు ఏవైపున ఏయే అందాలు, ఆకర్షణలు, కన్నెత్తి చూస్తే తప్ప లెక్కించలేనన్ని అంతస్తులున్న అందమైన భవనాలు, పేరున్న రెస్టారెంట్లు, సంగీత కచేరీలు జరిగే ఆడిటోరియంలను చూడమంటూ ఆమె మనకు చెబుతోంది. "ది విండీ సిటీ" చికాగో మిచిగాన్ సరస్సు ఒడ్డున ఉంది. మొదటి సారి చూసేవాళ్లను మురిపిస్తుంది. మరోలోకంలోకి తీసుకువెళుతోంది. ఒక యాత్రికుడు ఏమి కోరుకుంటాడో, ఏమి తెలుసుకోవాలనుకుంటాడే ఆ గైడ్ వివరిస్తూ చికాగో సిటీ చరిత్రను చెబుతుంటుంది.
మా ప్రయాణం ఇలా మొదలైంది...
మిచిగన్ ఎవెన్యూ నుంచి కదిలిన పడవ వెళ్తూ ఉంటే పైన వంతెనలపై ఉండే వాళ్లు, చుట్టుపక్కల రెస్టారెంట్లలో ఉండే వాళ్లు చేతులూపుతూ 'ఎంజాయ్' 'ఎంజాయ్' అని అరుస్తూ చేతులూపుతున్నారు. చికాగో ఆకాశ హర్మ్యాలు ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతుంటాయి. చూసే వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ప్రతి మలుపులో ఉండే ప్రముఖ స్కై స్కాపర్లు, వాటిని ఎప్పుడు, ఎవరు కట్టారో, ఎక్కడెక్కడి నుంచి ఆర్టిటెక్టులు వచ్చారో, దేనికంత ఖర్చయిందో గైడ్ చెబుతుంటుంది.

 బోటు బయలుదేరి వంద అడుగులు పోయిందో లేదో మా కుడి పక్కన ట్రంప్ టవర్స్ కన్పించింది. అమెరికాలో అతిపెద్ద భవనాల్లో ఇదొకటి. 98 అంతస్తులు. 2005 మార్చిలో మొదలు పెట్టి 2009 జనవరి మూడున ఈ 423.1 మీటర్ల ఎత్తున్న భవనాన్ని కట్టారు. దుబాయిలోని బుర్జ్ ఖలీఫా తర్వాత ఈ భవనం మూడోదిగా ఉంటుందట. న్యూయార్క్ టవర్స్ పై ఉగ్రవాదుల దాడితో భయపడ్డాడంట గాని లేకుంటే ప్రపంచంలోనే ఎత్తైన భవనాన్ని కట్టాలని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి 2001 తర్వాత సర్దుకున్నాడట.
ఈ టూర్ మొదట్లో మనకు కనిపించదు గాని అసలు ఎత్తైన భవనం విల్లీస్ టవర్. గతంలో సియర్స్ టవర్ అని పిలిచేవారు. ఇది 110-అంతస్తుల ఆకాశహర్మ్యం. ఎత్తు 1,451 అడుగులు లేదా 442.3 మీటర్లు. 1974లో పూర్తయింది. 1998 వరకు విల్లీస్ టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం.
ఈ సిటీని చూసినప్పుడు మనకు చప్పున విజయవాడ గుర్తుకొస్తుంది. సిటీలో మనకూ మూడు కాలువలున్నాయి. అయితే ఏమీ చేయలేకపోయామనుకోండి. ఏమైనా, సిటీ మధ్యలో సరస్సులుండీ అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మాదిరి 'ఏమి హాయిలే హలా' అంటూ పాటలు పాడుకుంటూ పడవలో ముందుకు పోతూ ఉంటే దాని లెక్కే వేరు, కిక్కే వేరు.
మొత్తానికి లేక్ మిచిగాన్ మీదుగా ముందు ఉత్తరం వైపు తీసుకువెళ్లారు. అక్కడ పడవ యూటర్న్ తీసుకునేలోగా ఫోటోలు తీసుకోమన్నారు. బోట్ మొదటి అంతస్తులో ఉన్న బార్లోకి వెళ్లి కావాల్సినవి కొనుక్కోమన్నారు. అవసరమున్నోళ్లని రెస్ట్ రూమ్స్ వాడుకోమన్నారు.
గ్రేట్ చికాగో ఫైర్-1871..
చికాగో ఎన్నో చారిత్రక ఘటనలకు నెలవు. ఈవేళ మనం అనుభవిస్తున్న 8 గంటల పని దినానికి రక్తాన్ని చిందించి అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మిగిలిన- మేడే-కి చికాగోలోని హేమార్కెట్ లో జరిగిన రక్తపాతమే నిదర్శనమే. మన వివేకానందుడు ఆధ్యాత్మిక చేసింది ఈ డౌన్ టౌన్ లోనే. ఇలా ఎన్నో చరిత్రాత్మక, సంగీత సంఘటనలను చికాగో తన కడుపుతో దాచుకుంది.
20వ శతాబ్దంలో ఎంత పేరుగాంచిందో 19వ శతాబ్దంలో అంతటి విషాదాన్నీ చవిచూసింది. 1871 అక్టోబర్ 8న జరిగిన ఘోర అగ్నిప్రమాదం (గ్రేట్ చికాగో ఫైర్) చికాగో ప్రాభవం కోల్పోయేలా చేసింది. దాదాపు 300 మంది కాలిబూడదయ్యారు. మూడు రోజుల పాటు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. దాదాపు 9కి.మీ మేర 17,000 భవంతులు బుగ్గిపాలయ్యాయి. లక్ష మంది బజారుపాలయ్యారు. అసలు ఈ అగ్ని ప్రమాదం ఎక్కడ మొదలైందో ఆ భవనమున్న ప్రాంతాన్ని ఈ టూర్ లో మనం చూడవచ్చు. సిటీ సెంటర్‌కు నైరుతి ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. ఇప్పుడా భవనాన్ని కూల్చి ఆ ప్లేస్ లో కొత్తదాన్ని కట్టారు. ఈ అగ్ని ప్రమాదం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్న తర్వాతి తరాలు మళ్లీ అటువంటి అవకాశం లేకుండా కొత్తవాటిని కడుతున్నారు. ఆ సందర్భంలో బ్రిటన్ ఇచ్చిన విరాళంతో చికాగో పబ్లిక్ లైబ్రరీ ఏర్పాటైందట. చికాగో తనను తాను పునర్నిర్మించుకోవడానికి, డైనమిక్ ఇమేజ్‌ని ప్రదర్శించడానికి ఆ అగ్నిప్రమాదం కారణమైందట.
ఇక్కడి దాకా ప్రతి భవనం గురించి చెప్పిన గైడ్.. కాసేపు అలుపు తీసుకునేలా బోట్ పశ్చిమం వైపు మళ్లుతుంది. అక్కడో మూడు నిమిషాలు ఆగుతుంది. ఫోటోలు తీసుకోమన్నారు. ఒక్కరే వెళ్లిన వారికి బోట్ స్టాఫ్ పోటోలు తీసుకోవడంలో సాయపడతారు.
చికాగో లూప్ అంటే..
ఇక, పశ్చిమం వైపు నుంచి దక్షిణం వైపుగా నదిలో పడవ ప్రయాణం సాగుతుంది. ఈ నది మొత్తాన్ని ది లూప్ - చికాగో లూప్-అంటుంటారట. సౌత్ లూప్, వెస్ట్ లూప్, నార్త్ లూప్ ఇలా.. పైన వంతెనలు, నడిచి చూడడానికి వీలుగా ఏర్పాట్లు వంటివి కూడా ఉన్నాయి. మా పడవ దక్షిణం వైపు మళ్లిన తర్వాత ఆ గైడ్ చికాగో కి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పడం మొదలు పెట్టింది.
చికోగో అనే పేరు ఎలా వచ్చిందంటే...
ఇల్లినాయిస్ స్టేట్ లో పెద్ద నగరం చికాగో. చికాగో లేదా మిచిగన్ నది ఒడ్డున ఉంది. దాదాపు 2.75 మిలియన్ల జనాభా. అమెరికాలో మూడో అతిపెద్ద నగరం. విస్తీర్ణంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం. 1837లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో విలీనమైంది. 19వ శతాబ్దం మధ్యలో జెట్ స్పీడ్ తో అభివృద్ధి చెందింది.
ఈ నగరానికి ఆ పేరెలా వచ్చిందనే దానిపై బోలెడన్ని కథలున్నాయి. బాగా వాడుకలో ఉన్న ఓ కథనం ప్రకారం షెకాగో అనే సిటీ ఉండేదని, అది మిచిగన్ నదిలో మునిగిపోయిందని, ఆ నది ఒడ్డునే మళ్లీ ఈ నగరాన్ని కట్టి ఈ పేరు పెట్టారనేది ఆ కథ.
ఇంకో కథనం ప్రకారం.. అసలు పేరు "షికాక్వా" అని అదే తర్వాత చికాగో గా మారింది. చికాగో నది ముఖద్వారం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని స్థానికులు "షికాక్వా" అని పిలుస్తారట. వాస్తవానికి ఈ పదం చిక్వాగో లేదా చికాగౌవా అనే పదం నుంచి పుట్టిందట. దీనర్థం వెల్లుల్లి (ఉల్లి కాదు). శాస్త్రీయ నామం అల్లియం ట్రైకోకమ్. ఫ్రెంచ్ పదం ఐల్ సావేజ్. చికాగోకి దక్షిణాన మిచిగాన్ సరస్సు ఉంటుంది. దాని పరివాహక ప్రాంతంలో స్థానికులు చాలా ఎక్కువగా వెల్లుల్లి పండించేవారు. దాంతో ఆ ప్రాంతాన్ని చికాగౌవా గా పిలిచేవారు. కాలక్రమంలో అది చికాగో మారినట్టు చరిత్ర చెబుతోంది.
మొదట అడుగుపెట్టింది ఫ్రెంచ్ వారే..
1671లో నికోలస్ పెరోట్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టిన మొదటి యూరోపియన్. ఫ్రెంచ్ అన్వేషకులు జాక్వెస్ మార్క్వేట్, లూయిస్ జోలియెట్ ఆయన్ను అనుసరించారు. 1780లలో జీన్ బాటిస్ట్ పాయింట్ డు సేబుల్ 1780లలో మొదటి శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రాంతంలో స్థిరపడిన మొదటి స్థానికేతరుడు అతనే అంటారు. 1673లో ఇక్కడికి రావడం ప్రారంభించిన ఫ్రెంచ్ వారు చికాగౌ అని రాశారు. 1690ల ప్రాంతంలో ఫాదర్ గ్రేవియర్ రికార్డు చేసిన దాని ప్రకారం ఈ పదాన్ని స్థానికులు వారి మియామీ భాషలో చికాగో గా పలికేవారు. 1830ల తర్వాత మున్సిపాలిటీగా మారింది. అంతర్యుద్ధం తర్వాత అభివృద్ధి చెందడం ప్రారంభించింది.
బోట్ పశ్చిమ వైపు సాగి కొంత దూరం వచ్చాక మనకు ఓ పెద్ద ఆడిటోరియం కనిపిస్తుంది. దానిపేరే ఆడిటోరియం థియేటర్. నేషనల్ హిస్టారికల్ ల్యాండ్‌మార్క్. వినూత్న నిర్మాణమట. ప్రపంచంలోనే మహదానందమైన అద్భుతమైన డిజైన్లలో ఇదొకటని పేరు. ఫెర్డినాండ్ వైత్ పెక్ అనే చికాగో వ్యాపారవేత్త ఈ ఆడిటోరియం థియేటర్ ఆలోచన చేశాడట. 8 గంటల పని దినం కోసం ప్రాణ త్యాగం చేసిన - 1886 హేమార్కెట్ రక్తపాతం తరువాత- ఆయన ఈ ఆడిటోరియానికి రూపకల్పన చేసి చికాగోకి అంకితం చేశారు. ఇందులో థియేటర్ మాత్రమే కాకుండా ఆఫీస్ బ్లాక్, హోటల్ కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద, గొప్ప, అత్యంత ఖరీదైన ఈ భవనం కోసం చికాగో ఆడిటోరియం అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు.
1889లో ప్రారంభమైన ఈ ఆడిటోరియం చికాగోలో అప్పటి-ఎత్తైన భవనంగా, ఇప్పటివరకు రూపొందించిన తొట్టతొలి మల్టీస్టోరీడ్ బిల్డింగ్ గా చెబుతారు. ఈ భవనం దాటి కొంచెం ముందుకు వస్తే ఎడమవైపున నిర్మాణంలో ఉన్న సేల్స్ ఫోర్స్ భవనం కనిపిస్తుంది.
చరిత్ర సృష్టించిన జీన్ గ్యాంగ్..
పశ్చిమ లూప్ లో వెళుతున్న మా బోట్ ఓ భవనం ఎదుట ప్రత్యేకంగా ఆగింది. ఏంటా ఇదని చూస్తే.. మొత్తం ప్రపంచంలోనే ఓ మహిళ డిజైన్ చేసిన ఎత్తైన టవర్ ఇదే. పేరు సెయింట్ రెగిస్. ఇల్లినాయిస్ కి చెందిన ఆర్కిటెక్ట్ జీన్ గ్యాంగ్ ఈ భవన రూపకర్త.

చికాగో డౌన్ టౌన్ స్కై లైన్ ఆర్కిటెక్టులందరూ పురుషులే. ఇప్పడో మహిళా ఆర్టిటెక్ట్ ఘనతను చెప్పడానికే పడవను ఆపారు. 101 అంతస్తుల ఐకానిక్ స్కైలైన్‌ అది. మెలికలు తిరిగిన ఓ సెంట్ బాటిల్ ఆకారంలో కట్టారు. 2016 ఆగస్టులో ప్రారంభించి 2020లో అంటే 4 ఏళ్లలో పూర్తి చేశారు. అంతా సమానమనుకునే అమెరికన్ సమాజంలో ఓ మహిళ ప్రతిభను గుర్తించడానికి సుమారు 250 ఏళ్లు పట్టింది.
“ఆర్కిటెక్చర్ స్కూలు విద్యార్థులలో సగం మంది ఆడవాళ్లున్నా ఇప్పటికీ వివక్షే కొనసాగుతోంది. సమాన అవకాశాలు లేవు. సమాన వేతనాలు లేవు. ప్రొఫెషనల్ సపోర్టు ఉండదు. అవకాశం ఇస్తే పురుషుల్ని తలదన్నేలా ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తారనడానికి జీన్ గ్యాంగ్ నిదర్శనం" అంటోంది చికాగో ఆర్కిటెక్ట్ సెంటర్. ఈ ఆకాశహర్మ్యాన్ని జీన్ గ్యాంగ్, ఆమె నిర్మాణ సంస్థ స్టూడియో గ్యాంగ్ రూపొందించారు.
అప్పటికి సమయం రాత్రి 9.15గంటలైంది. ఎండాకాలం కావడంతో పొద్దు సాంతం ఇంకా గూట్లో పడలేదు. పడమటి దిక్కున ఆకాశం నెత్తురుకక్కుకుంటున్నట్టు ఎర్రబారింది. ఎర్రబారిన సూర్యకిరణాలు అప్పుడప్పుడే మసకబారుతున్నాయి. పడవ ప్రయాణం సాగి ఆగుతోంది. దూరంగా నేవీ పియర్ లైటింగ్ కనిపిస్తోంది. జెయింట్ వీల్ గిర్రున తిరుగుతోంది. పడవ బయలుదేరిన చోటుకి వెనక్కి తిరుగుతోంది. అక్కడి నుంచి డౌన్ టౌన్ చూస్తుంటే- నా సామిరంగ- అనుకోవాల్సిందే. ఫోటోలు తీసుకోమన్నారు గాని లైటింగ్ పోయింది. పడవ నెమ్మదిగా బయల్దేరిన చోటుకు చేరంది. లంగరేసే దాకా మమ్మీలందర్నీ డెక్ పైన్నే ఉంచారు. ఓ ఐదు నిమిషాల తర్వాత అన్ని జాగ్రత్తలు చెప్తూ డౌన్ టౌన్లో డిన్నర్ ఎక్కడ చేయవచ్చో, నిద్ర లేకుండా ఎలా ఎంజాయి చేయవచ్చో చెబుతూ పడవ నుంచి దించడంతో మా స్కైలైన్ యాత్ర ముగిసింది.
చికాగో డౌన్ టౌన్లో ఇంకేమి చూడవచ్చంటే...
మిలీనియం పార్క్ (ది బీన్) , అబ్రహాం లింకన్ పార్కు, మిచిగన్ బీచ్, విల్లీస్ టవర్ స్కైడెక్, ఆర్ట్ ఇనిస్టిట్యూట్, నేవీపియర్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, చికాగో థియేటర్లలో బ్రాడ్‌వే షో లేదా నాటకాన్ని చూడండి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫ్యాషన్ ఉపకరణాలు, బట్టలు, బ్యాగులు కొనుక్కోవాలంటే స్టేట్ స్ట్రీట్‌లో షాపింగ్ చేయండి. ఇదో దుకాణదారుల స్వర్గం! ఇవన్నీ ఎలా ఉన్నా మిచిగాన్ సరస్సులో బోట్ క్రూయిజ్ ఓ మధురానుభూతి.
అమరయ్య ఆకుల- 9347921291
Tags:    

Similar News