2047నాటికి ముస్లింలదే ప్రపంచ పాలన అని చెప్పిన ఈ బాబా వంగ ఎవరు?
మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో తెలియదు గాని దివ్యాంగురాలైన ఈ మహిళా బాబా చెప్పిన భవిష్యవాణి ప్రతిదీ జరిగింది. ఈమె పేరు బాబా వంగ.-వంగేలియా పాండేవా గుష్టెరోవా.
By : The Federal
Update: 2024-10-27 03:59 GMT
మంత్రాలకు చింతకాయలు రాల్తాయో లేదో తెలియదు గాని దివ్యాంగురాలైన ఈ మహిళా బాబా చెప్పిన భవిష్యవాణి ప్రతిదీ జరిగింది. ఈమె పేరు బాబా వంగ. పూర్తిపేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. దేశం బల్గేరియా. ఈమె ఊహించినట్టే సోవియెట్ యూనియన్ కుప్పకూలింది. అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ పై తీవ్రవాదులు దాడులు జరిపారు. అదే 9/11 దాడులుగా పేరుగాంచింది. దీంతో ఇప్పుడామె మరో నోస్ట్రాడమస్ ఆఫ్ బాల్కన్స్ గా ఖ్యాతిగాంచింది. ఈమె చెప్పిందంటే కచ్చితంగా జరుగుతుందనే వాదనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి.
2025 ప్రారంభంలో ప్రపంచం పెనుముప్పును ఎదుర్కోబోతోందని, యూరోపియన్ దేశాలు ఘర్షణలకు తలపడతాయని ఆమె అంచనా వేసింది. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాల మధ్య జరుగుతున్న దాడులను చూస్తుంటే ఆమె అంచనా నిజమే కావొచ్చునంటున్నారు. ఇదంతా ఆమె ఊహే అయినప్పటికీ చాలా మంది ఆసక్తిగా ఆమె చెప్పిన భవిష్యవాణిని చర్చిస్తున్నారు.
భవిష్యత్ ను ఊహించిన వాళ్లు చరిత్రలో లేకపోలేదు. చాలా సంఘటనలు యాధృచ్చికంగా జరిగినప్పటికీ కొందరు ముందే ఊహించడం ఇక్కడ గమనార్హం. మానవాళికి రాబోయే వాటి గురించి సూచనప్రాయంగానైనా సమాచారం అందించారు. ఆ కోవలో ఇప్పుడు బాబా వంగ నిలిచారు. ఈమె చెప్పిన దాని ప్రకారం 2025నాటికి ఐరోపా దేశాలలో పెద్ద సంఘర్షణ జరుగుతుంది. మధ్య ప్రాచ్య దేశాలలో జన నాశనం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎవరీ బాబా వంగ..
ఈమె ఒక బల్గేరియన్. ఈమె పూర్తి పేరు వంగేలియా పాండేవా గుష్టెరోవా. 1911లో పుట్టినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. 12 ఏళ్ల వయసులో తుఫానులో చిక్కుకుని చూపు కోల్పోయింది. ఆ తర్వాత ఆమె ఆధ్యాత్మిక వైపు మళ్లారు. తన దూరదృష్టితో భవిష్యత్ ను ఊహించి చెప్పడం మొదలుపెట్టారు. అవి కొన్నిసార్లు నిజం అయ్యాయి. దాంతో ఆమెకు పేరుప్రతిష్టలు రావడం మొదలయ్యాయి. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలో గడిపారు. "నోస్ట్రాడమస్ ఆఫ్ బాల్కన్స్"గా పేరుగాంచారు.
ప్రపంచ సంఘటనల గురించి ఆమె అంచనాలు కొన్ని నిజం అయ్యాయి. తన మరణాన్నీ ఆమె సరిగానే అంచనా వేసింది. 1990లో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1996 ఆగస్టు 11న చనిపోతానని ఆమె చెప్పింది. సరిగ్గా ఆ తేదీనే ఆమె చనిపోయారు. ఆమె మరణించినప్పటికీ, ఆమె చెప్పిన భవిష్యవాణి పరంపర కొనసాగుతూనే ఉంది. సరికొత్త సంగతులు బయటకు వస్తున్నాయి.
ఆమె ఏమి చెప్పిందీ? ఏమి జరిగిందీ?
బాబా వంగ రెండో ప్రపంచ యుద్ధాన్ని పసిగట్టారు. అపార ప్రాణనష్టాన్ని, యుద్ధ విధ్వంసాన్ని ఊహించారు. అదే జరిగింది. సోవియెట్ యూనియన్ 1991లో కుప్పకూలవచ్చునని ఆమె ఊహించారు. అదే జరిగింది. 1986లో చెర్నోబిల్ వద్ద అణు విపత్తును వంగ ఊహించారని ఆనాడు వార్తలు వచ్చాయి. సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ మరణాన్ని వంగ కచ్చితంగా అంచనా వేశారు. ఈ సంఘటనలు ఆమె పేరు ప్రతిష్టలు పెరిగేలా చేశాయి. 2000లో ఆమె ఓ పెనువిషాదం జరగబోతోందని చెప్పిన తర్వాత రష్యన్ జలాంతర్గామి "కుర్స్క్" సముద్రంలో మునిగిపోయిన భయానక సంఘటన జరిగింది. ఈ సంఘటనను ఇప్పటికీ చాలామంది చాలా సందర్భాలలో ప్రస్తావించారు.
సెప్టెంబర్ 11 దాడుల గురించి ప్రస్తావిస్తూ న్యూయార్క్ లో " స్టీల్ బర్డ్స్" (లోహవిహంగాలు లేదా విమానాలు అనే అర్థంలో) విరుచుకుపడవొచ్చని అంచనా వేశారు.
1985లో బల్గేరియా జరిగిన భూకంపాన్ని అంచనా వేశారు. 2004లో సునామీని అలాగే అంచనా వేశారు. అయితే పలానా తేదీలలో పలానా విధంగా జరుగుతుందని చెప్పకపోయినా విపత్తులు జరిగే అవకాశం ఉన్నట్టు చెప్పారు.
ఇప్పుడామె లేరు. అయితే చెప్పిన కాలజ్ఞానం, రాబోయే సంక్షోభాలు కలవరపరిచేలా ఉన్నాయి. 5079 నాటికి మానవాళి అంతరించిపోతుందని, 2025 నుంచి సంక్షోభాలు, మానవ వినాశం మొదలవుతుందని ఆమె అంచనా. యూరప్‌లో సంఘర్షణలు తీవ్రమవుతాయి. 2043 నాటికి యూరప్ ముస్లిం పాలన కిందకు వస్తుందని ఆమె అంచనా వేసింది. 2076 నాటికి ప్రపంచదేశాలలో కమ్యూనిస్ట్ పాలన వస్తుంది. ఓ ప్రకృతి విలయంతో 5079 నాటికి ప్రపంచం అంతిమంగా ముగుస్తుందని వంగ పేర్కొన్నారు.
గ్రహాంతర వాసులు ఉన్నారని బలంగా విశ్వసించిన ఆమె వీళ్లు 2025నాటికి భూమి మీదకు వస్తారని ఊహించారు. ఈ అంచనా అనేక మందిని ఆకర్షించింది. ప్రస్తుతం గ్రహాంతరవాసుల ఉనికి గురించి ప్రపంచ వ్యాప్తంగా శోధన జరుగుతున్న తీరు చూస్తుంటే ఆమె చెప్పింది నిజమేనేమో అనే అనుమానం వస్తోందంటున్నారు భవిష్యత్ వాణిని నమ్మేవాళ్లు.
అదే సమయంలో ఇవన్నీ పుక్కిటి పురాణాలేనని, ఖచ్చితమైన సాక్ష్యాధారాలు లేకుండా ఇలా ఏవేవో ఊహించి ప్రచారంలో పెడితే ఎలా అనే వాళ్లూ లేకపోలేదు. బాబా వంగ కాలజ్ఞానాన్ని పట్టించుకోవాల్సిన పని లేదనే వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ఆమె ఏమి ఊహించిందో చెప్పడానికి బాబా వంగ ఇప్పుడు బతికిలేరు. ఆ పేరిట ఎవరంతట వాళ్లు తమకు తూచిన కాలజ్ఞానాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఊదరగొట్టేస్తున్నారని మరికొందరు మండిపడుతున్నారు.
యుగాంతం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. మానవ జీవ పరిణామ క్రమంలో ఓ జీవి కనుమరుగైతే మరో జీవి వస్తుందని, మానవాళి పూర్తిగా నశించిపోవడం అసంభవమని కొట్టిపారేస్తున్నారు. 2025లో ఆమె చెప్పిన అంచనాల కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.
బాబా వంగ చెప్పిన భవిష్యవాణిని మన ఉగాది పంచాంగ శ్రవణాలతో పోల్చిన వారూ ఉన్నారు.