ఆదివాసీల అడవుల్లోకి కార్పొరేట్ల జైత్రయాత్ర, విజయవాడలో ఆందోళన
ఇప్పుడు మనం మౌనంగా ఉంటే ఈ కార్పొరేట్ ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని రేపు మన మీద కూడా ప్రకటించవచ్చు.
కార్పోరేటికరణ, ఆపరేషన్ ‘కగారు’ కు వ్యతిరేకంగా ఆగస్టు 26న విజయవాడ ధర్నా చౌక్ లో ప్రజా సంఘాల ధర్నా జరిగింది. ఈ మీటింగు వింటుంటే "తంగలాన్" రివ్యూలు గుర్తు వచ్చాయి. దాదాపు ఓ పది రివ్యూలు చదివి ఉంటాను. తులసి చంద్ యూట్యూబ్ చూసి సినిమా చూద్దాం అనుకుంటున్నాను. (బాహుబలి, త్రిబుల్ ఆర్ ఆర్ లాంటివి ఊదరగొట్టగా చూస్తే అన్ని తప్పులే కనిపించాయి నాకు. సినిమా సినిమా గానే చూడు, తప్పులు చూడకు అని ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అరుస్తుంటారు) తంగలాన్ వందలయేళ్ల నాటికథ, మిత్ తోఉన్న సినిమా (గ్రాఫిక్స్ కూడాఉన్నాయేమో?)అని అర్థమవుతుంది. రివ్యూలు చేసినవారిని లేదా సినిమాలు తీసిన వారిని నేను విమర్శించడం లేదు. (రాసిన, చూసిన, మెచ్చుకున్న వాళ్ళందరూ జాకెట్టు వేసుకున్న పాట అద్భుతం అంటున్నారు.) కాకపోతే సినిమాలకు స్పందించిన మనం, కళ్ళ ఎదుట జరుగుతున్న వాటికి స్పందించడం లేదని బాధగా, దుఃఖంగా ఉంది.
1996లో బెంగళూరులో అంతర్జాతీయ (విశ్వసుందరి) అందాల పోటీల ఈవెంట్లను అమితాబచ్చన్ కార్పొరేషన్ నిర్వహిస్తున్నప్పుడు, ఈ అందాల పోటీలను వ్యతిరేకిస్తూ దండకారణ్య ప్రాంతంలోని గిరిజనులు నారాయణపూర్ లో "మాకు జాకెట్లు కావాలి" అనీ పెద్ద ర్యాలీని నిర్వహించారు. అప్పటికి, గిరిజన మహిళలు పెళ్లి అయితే జాకెట్లు తీసేయాలి. వేసుకోకూడదు. పెట్టుబడి అనేది లాభాల కోసం స్త్రీల శరీరంతో కూడ వ్యాపారం చేస్తాయని గిరిజనులు ప్రశ్నల వర్షం కురిపించారప్పుడు. ఆ గిరిజనుల చైతన్యానికి అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం అని చెప్పవచ్చు. ఈ గిరిజనులకు సంఘీభావంగా బెంగళూరులో సి. ఎం. ఎస్, పిఓడబ్ల్యు లాంటి మహిళా సంఘాలు మద్దతు తెలపగా 200 మందికి పైగా అరెస్టు చేశారు. ఆ క్రమంలో పెంచుకున్న చైతన్యంతో అప్పటినుండి ఇప్పటికీ జెల్, జంగిల్, జమీన్ మాదేనoటూ, అటవీ సంపదను దోచుకుంటున్న పెట్టుబడిదారులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ చైతన్యం అక్కడి గిరిజనులందరిదీ. దోపిడి నుండి అడవిని రక్షించడానికి బీర్సా ముండా, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు పోరాటాలు, యుద్ధాలు చేశారు. ఈరోజు కొత్తగా మావోయిస్టుల వల్లనే గిరిజనులు చైతన్యం కాలేదు. (మావోయిస్టుల కోసమే కగార్ ప్రకటించలేదు. అటవీ సంపద దోపిడి కోసమే ప్రకటించబడింది) దోపిడీ ప్రారంభమైనప్పటినుండి చైతన్యం, పోరాటం కూడా ప్రారంభమైంది. ఈ దోపిడి అనేది, ఆ జాతిని అంతం చేసే "కగార్" యుద్ధం, అంటే అంతిమ యుద్ధం ప్రకటించబడింది. యుద్ధం అంటేనే అత్యాచారాలు, హత్యలు, మహిళల శరీరాలతోనే ప్రారంభమవుతుంది. యుద్ధంలో ముందుగా బలయ్యేది స్త్రీలు, పిల్లలేకదా. సినిమాకు స్పంధించిన మేధావులు, మనలాంటి సాధారణ ప్రజలు, వెనుకబడిన, ఆ ప్రాంత మూలవాసులైన గిరిజనుల కోసం, ఆ స్త్రీల కోసం ఖనీసంగా కూడా ఎందుకు స్పందించలేకపోతున్నామనే బాధ దుఃఖం ఈ మీటింగు జరుగుతున్నoతసేపు, ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నది.
(పాటలు పాడుతున్న ప్రజాకళా మండలి బృందం)
ఈ మీటింగు వింటున్నప్పుడే చచ్చిపోతానని తెలిసికూడా పోరాటం వదలను అంటున్న ప్రొ. సాయిబాబా గుర్తొచ్చాడు. సాయిబాబా గారు మీరు అంగవైకల్యులు కారు. అన్నీ ఉన్నా మేము అంగవైకల్యలo.
ఇప్పుడు మనం మౌనంగా ఉంటే ఈ కార్పొరేట్ ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని రేపు మన మీద కూడా ప్రకటించవచ్చు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసిన జర్మనీ కవిత కూడా గుర్తొస్తుంది, నాకోసం పోలీసులు వస్తే మాట్లాడటానికి ఎవరు లేరని. ధర్నా విషయం చెప్పకుండా ఇదంతా ఏమిటి?
26.8. 24న ఆదివాసి హక్కుల ధర్నాకు ఆహ్వానం పలుకుతూ లాయర్ ఆంజనేయులు ధర్నాని ఉద్దేశించి, ఆదివాసి అడవి ప్రాంతం మొత్తాన్ని ఎంఓయు (MOU) ల పేరిట, దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగించడమనీ, అడ్డుకుంటున్న ఆదివాసుల మీద పోలీసులు, గూండాలు,ప్రభుత్వాలు చేస్తున్న ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నట్లు వివరించారు.
చిలక చంద్రశేఖర్ గారు అధ్యక్ష ఉపన్యాసంలో జనవరి నెల నుండి నేటి వరకు 200 మందికి పైగా ఆదివాసులను చంపారు అని వాళ్ళందరూ నక్సలైట్లు కాదన్నారు. ద్రోణులతో సమూహాల మీద దాడులు చేస్తున్నారు. ద్రోణులు స్నానం చేస్తున్న మహిళల నగ్నచిత్రాలను తీస్తున్నాయి .ఆదివాసి గ్రామాలలో బాత్ రూములకు పైన కప్పు ఉండదు. చుట్టూ తడికల్తోనే కట్టుకున్నవి ఉంటాయి. పట్టణాల్లో లాగా కాంక్రీట్ వి ఉండవు. తన దేశ ప్రజలపైనే మిలిటరీ, సరిహద్దు సైనిక దళాలు, ప్రభుత్వాలు అడవులలో సునాయాసంగా తిరగగల, లొంగదీసుకున్న గిరిజన యువకులతో ఏర్పాటు చేసుకున్న పోలీసు బలగాలతో దాడులు చేస్తున్నారు. ఇదంతా ఊపిరితిత్తులాంటి అడవులను ధ్వంసం చేసి, అటవీ ఖనిజ సంపద నంతటిని కార్పోరేట్లకు అప్పచెప్పడం కోసమే. అడవులను ధ్వంసం చేయటం అంటే పకృతి విలయాలను సృష్టించడమే. కేరళ వైనాడ్ లో జరిగిన ప్రకృతి విలయంలో అనేకమంది చనిపోయారు. శతాబ్దాలుగా అడవిని నమ్ముకుని బ్రతుకుతున్న మూలవాసులను అడవుల నుండి తరిమి వేయటమే. ప్రభుత్వాలు చేస్తున్న ఈ దాడుల్లో పాలు తాగుతున్న పసిబిడ్డ కు తూట తగిలి చనిపోయింది. ఆ తల్లికి గాయమైంది. చెవిటి మూగ ఉన్న 15 ఏళ్ల అమ్మాయిని పట్టుకెళ్ళి చంపేసి రెండు రోజుల తర్వాత ఆమెకు యూనిఫామ్ తొడిగి మావోయిస్టు అన్నారు. చతీష్ గడ్ లో చనిపోయిన ఆదివాసులకు, వైనాడ్ ప్రకృతి విలయంలో అసువులు బాసినవారికి రెండు నిమిషాలు అందరూ శ్రద్ధాంజలి ఘటించారు.
మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావు ఎనభై ఏళ్ళ వయసులో, అనారోగ్యంతో ఆదివాసి హక్కుల సంఘీభావ కమిటీ ఏర్పడినప్పుడు, ఈ ధర్నాకు రావడం, మాట్లాడటం ప్రత్యేక విషయం గానే చెప్పుకోవాలి. అయన సభను ప్రారంభిస్తూ దండకారణ్యంలో విచక్షణ రహితంగా హింసకాండక పాల్పడుతూ చాలా భారీ సంఖ్యలో ఆదివాసులను, తీవ్ర భావాలున్న వారిని దారుణంగా చంపుతూ మారణకాండకు పాల్పడుతున్నారన్నారు. ఆదివాసులు ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తూ, పోరాడుతూ అడవి తల్లి నమ్ముకున్నారు. అడవిలో దొరికే ఉత్పత్తులను వాడుకుంటూ, వ్యవసాయం, బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ అడవిని కాపాడుతున్నారు. మనం పంటలు పండిస్తాము. ఆదివాసీలు అడవిలో దొరికే ఆకు కాయ పండు లాంటి ఉత్పత్తులను ఉపయోగించుకుంటారు. అడివి ఈ మాత్రం ఉన్నదంటే ఆదివాసులు అడవిని కాపాడటం వల్లనే. అటవీ సంపద కేవలం ఆదివాసులు అనకూడదు. అటవీ సంపద మన అందరిదీ. ఈ దేశ ఆహార భద్రత కొనసాగించడానికి ఈ భూగోళానికి అడవులు ఊపిరితిత్తులు అంటారు. అడవులను నాశనం చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే. అలాంటి అడవులను రక్షిస్తున్నది ఆదివాసిలే. అలాంటి ఆదివాసీలపై మారణకాండచేసి గుప్పెడు మంది కార్పొరేట్లకు భారతదేశ ఖనిజసంపదను మోడీ అప్పగిస్తున్నాడు.
మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చాడు. బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర వహించిన నితీష్ కుమార్ స్వార్థ ప్రయోజనాలకు మళ్లీ బిజెపి కి మద్దతు ప్రకటించాడు. అనేక తిప్పలు పెట్టిన మోడీకి, చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇవ్వడం సరైంది కాదు. వీరిద్దరూ మద్దతు ఇవ్వకపోతే మోడీ అధికారంలోనే ఉండడు. తెలుగుదేశం మాజీమంత్రి అయినా శోభనాదేశ్వర రావు ఇలా నిక్కచ్చిగా మాట్లాడటం చాలా నచ్చింది.
మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాసరావు అడివిలో సంపదను రక్షిస్తుంది ఆదివాసులేనన్నారు. ఆసంపద 140 కోట్ల మన అందరిదీ. ఈ గవర్నమెంట్, కార్పొరేట్లు కలిసి అక్కడ ఉన్న చెట్లు భూమి వనర్లు, నీరు అన్నిటినీ ఎక్సప్లాయిజ్ చేస్తున్నారు. ఈ విషయం అర్థమైతే ఈ సభలో 2000 మంది ఉండాలన్నారు. అక్కడ ఉన్న బొగ్గు, ఇనుప గనులు పోయాయంటే ఇక్కడున్న ప్రతి ఇంటికి పోయిద్ది. ఆదివాసుల పోరాటానికి మనం సపోర్టు ఇవ్వాల్సిందే. ఈ సభల వలన ఖనిజాలను, మినరల్స్ ను తీసుకోవడం మోడీ ఆపేస్తాడా? ఎం ఓ యు లను రద్దు చేస్తాడా? ఈమధత్తు సరిపోతుందా? పాసిస్టు ప్రభుత్వం. వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి మిలటరీ, హెలికాప్టర్స్' సైన్యం, తుపాకులు డ్రోన్స్ ఉన్నాయి.
ఆదివాసులకు మన మద్దతు పెరగాలంటే మన సంఘాలను ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ఆదివాసుల కోసం పనిచేస్తున్న ఆదివాసి సంఘాలు, లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి పోరాడాలి. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే పార్టీగా ఏర్పడాలి. పార్టీలన్ని ఒక కౌన్సిల్ గా ఏర్పడి ఆ కౌన్సిల్ ఉమ్మడి నిర్ణయాలతో పాలన కొనసాగించాలి. లేకపోతే త్రిపుర, బెంగాల్ లో తుడుచుకుపోయినట్లు పోతాయి. అప్పుడు ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే స్తంభాలైన అసెంబ్లీ పార్లమెంట్లు, కోర్ట్లు, ఆఫీసర్లు, మీడియా అన్ని ఫెయిల్ అయ్యాయి. అసెంబ్లీ పార్లమెంట్లో క్రిమినల్లులు చేరారు. నిజాయితీ ఉన్న రాజకీయ నాయకులు, నిజమైన అధికారులు కనిపిస్తున్నారా? ప్రధాన మీడియా అంతా కార్పొరేట్లకు అమ్ముడుపోయాయి.
స్వతంత్ర పోరాటాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. కార్పొరేట్ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలి. ప్రధాన మీడియాను వాళ్ళు రేటింగు పెంచకుండా చూడడం మానేయాలి. మన దగ్గర ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. లాయర్లు ఏకనమిస్టులు, చార్టర్ ఎకౌంట్లు సోషల యాక్టివిస్టులు, నిజాయితీగల రాజకీయవాదులు, కమ్యూనిస్టులు అందరూ కూర్చొని దాన్ని తయారు చేయాలి. అప్పుడు మాత్రమే ఈ కార్పొరేట్లను, కార్పోరేట్, ఫాసిస్ట్ ప్రభుత్వాలను దెబ్బకొట్టగలం.
శ్రీనివాసరావుని పరిచయం చేస్తూ, శ్రీనివాసరావుగారు ఇక్కడ ఐఏఎస్ గా కాకుండ కేరళ ఐఏఎస్ గా చెప్పడం ఇష్టం అన్నారని చిలక చంద్రశేఖర్ అన్నారు. శ్రీనివాసరావు గారు నిజాయితీ ఉన్న, ప్రజల పట్ల నమ్మకం ఉన్న, తన పదవికి రాజీనామా చేసిన ఓ ఐఏఎస్ అధికారి.
ఎంఎల్ సి ఐ వి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర బలగాలు నిర్వహిస్తున్నటువంటి ఆయుధ యుద్ధాన్ని ఆపాలని, కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలతో కుదుర్చుకున్న 104 ఎం. ఓ. యు లను ఆపాలని డిమాండ్ చేశాడు. ఈ కార్పొరేట్ కంపెనీ మాకొద్దని ప్రధానమైన డిమాండ్ తో సంఘీభావంగా ఈ సదస్సు నిర్వహించడం ఎంతో అవసరం. ఈ దేశంలో ఆదివాసి ప్రాంతానికి, ఆదివాసి ప్రజలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. 1895... 1900 ప్రాంతాలలో బీర్సాముండా ఏమి చేశాడు? మనందరికి తెలుసు. ఆయనను, ఆయన అనుసరులను జైళ్ళలో కుక్కి, విష ప్రయోగం చేసి, దేశాంతర శిక్ష వేసిన ఓ దుర్మార్గమైన నరహంతక పాలన సాగింది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేశారు. 1827 భారత అటవీ చట్టం, ఇటీవల వచ్చిన చట్టాలు కూడా ప్రజా పోరాటాల ద్వారా వచ్చాయన్నారు. మధ్య భారతంలో అమాయక ఆదివాసుల మీద కేంద్ర రాష్ట్ర సైనిక బలగాలు చేస్తున్న ఆపరేషన్ కగార్ యుద్ధాన్ని ఆపాలి. అమాయక ప్రజల లేదా వారికి మద్దతు ఇస్తున్న వారి ప్రాణాలను తీయొద్దని ఈ ధర్నా ద్వారా కోరుతున్నాను. ఈ దేశ అటవీ సంపదను 104 ఎం. ఓ. యుల ద్వారా కార్పొరేట్ లకు కట్ట పెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆదివాసులు కున్న రాజ్యాంగ హక్కులను కాపాడాలని కోరుతున్నాను. కాపాడటం పోయి కగార్ యుద్ధం చేయడం సరైంది కాదు. ఈ యుద్ధం కేంద్ర రాష్ట్రపాపిస్ట్ ప్రభుత్వాలు మావోయిస్టుల కోసమే చేస్తున్న యుద్ధం కాదు. అడవిలో ఉన్న లక్షల కోట్ల ఖనిజ సంపదనుగుప్పెడు మంది కార్పొరేట్లకు దోసి పెట్టడానికె. ఆదివాసులను, వారికి మద్దతు ఇస్తున్న వారిని చంపటమేనన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఫాసిస్టు ప్రభుత్వము ఆకాశయుద్ధం ద్వారా, హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా, రాకెట్ల లాంచర్ల ద్వారా ఖతం చేయడమేనన్నారు. యుద్ధం ఆపాలని, ఎం.వో.యులను వెనక్కి తీసుకోవాలని ఈ ధర్నా ద్వారా కోరుతునన్నారు. ఐ వి గారు ఆదివాసుల మీద వారి కష్టాలను తెలియజేస్తూ మంచి పాట పాడి వినిపించారు.
అఖిలభారత ఆదివాసి వేదిక తరపున అబ్రహం లింకన్ గారు, అట్టడుగు వర్గంలో జీవిస్తున్నటువంటి ప్రాంతాలు గాని, అక్కడ నివసిస్తున్న ప్రజలు గాని ఇవ్వాళ పరాయికరణ చెందుతున్నారు. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆదివాసుల పట్ల తీవ్రమైన దాడిని ప్రారంభిస్తున్నారు, చేస్తున్నారు. అనేక పేర్లు పెట్టి ఆదివాసి ప్రాంతాన్ని ఆదివాసులకు కాకుండా చేస్తున్నారు. ఈ యుద్ధాలలో ఆదివాసిలే సమిథలవుతున్నారు. ఆదివాసుల పక్షాన, ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం మాట్లాడుతున్న వారి పైన కూడా ఈరోజు నిర్బంధం పెంచి జైలలో వేస్తున్నారు. బలమైన ఉద్యమం ద్వారా ప్రతిఘటన రూపాన్ని మనం తీసుకురాకపోతే ఆదివాసి ప్రాంతాన్ని, ఆదివాసి ప్రజల్ని మొత్తంగా ఆక్రమించుకునే పరిస్థితులు తీసుకొస్తారన్నారు.
రైతు సంఘం తరఫున కొల్ల రాజమోహన్ మాట్లాడుతూ భారతదేశంలో ఇంకా పేదరికం ఉందంటే కారణం భారతదేశము యొక్క సహజ వనరుల దోపిడి విపరీతంగా జరిగిపోవడం. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాడు ఇంకా విపరీతంగా పేదిరికం పెరిగిపోతుంది. అడవి సంపద ఈ మాత్రం గానైనా ఉన్నదంటే ఆదివాసులే కారణం. అడవి కోసం ఎవరు ఎదిరించారు. ఎవరు కాపాడారంటే ఆదివాసులే. అదేవిధంగా భారత స్వాతంత్ర పోరాటంలో నిలబడింది ఆదివాసులేనన్నారు. డాక్టర్ చాగంటి భాస్కర్, మల్లికార్జున్, అల్లూరి సీతారామరాజు లాంటి అనేకమంది అక్కడి ఆదివాసులతో కలిసి పోరాడి ప్రాణాలర్పించారు. స్వాతంత్ర పోరాటం లాగా ఈ ఆదివాసి హక్కుల పోరాటాన్ని కూడా ముందుకు తీసుకు పోదాం. అప్పటినుంచి ఇప్పటిదాకా జరిగిన పోరాటాలలో కచ్చితంగా కొన్ని ఫలితాలు ఉన్నాయి.. వన్ బై 71 చట్టం వచ్చింది శ్రీకాకుళం పోరాటం తర్వాతే. అనేక ప్రజా పోరాటాల ద్వారానే ల్యాండ్ రిఫార్మర్స్ వచ్చాయన్నారు. ఎన్ని పోరాటాలు జరుగుతున్నా కార్పొరేట్ దోపిడిని ఆపలేకపోతున్నం. గాలి జనార్దన్ రెడ్డి ఇనప, మైనింగ్ ఖనిజాన్నంత దోసేసి స్వామివారికి కోట్ల ఖరీదు చేసే 40 కేజీల బంగారు కిరీటాన్ని చేయించాడు. ఖనిజన్నంతా విదేశాలకు ఎగుమతి చేశాడు. ఈ రోజున తాళిబొట్టు కూడా లేక పసుపుతాడు కట్టుకుంటున్న పేద ప్రజలు 80 శాతం ఉండగా అంబానీ తన కొడుకు పెళ్ళికి 5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. ఇదంతా దోపిడీ చేసిందేనన్నారు. ఈ ఖనిజ సంపద అంతా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము. అంబానీ చేస్తున్న ఆయిల్ వ్యాపారంలో మన రాష్ట్రంలో ఉన్న కృష్ణ గోదావరి బేసిన్ నుండి 30%. ఉంది.వీళ్లు ప్రభుత్వాలకు చెల్లించాల్సిన పన్నులను కూడా చెల్లించరు. ఈ సంపదంత ప్రజలకు చెందాల్సిందేనని ఈ ధర్నా ద్వారా డిమాండ్ చేస్తున్నాను. రాజ్ మోహన్ గారు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైన కొల్ల వెంకయ్య కొడుకు. రాజ్ మోహన్ గారు తన డాక్టరు వృత్తిని కూడా వదిలి రైతు సంఘాలలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు.
ఇప్ట్ ప్రసాద్ ఆదివాసులపైన ప్రభుత్వం కగార్ పేరిట ఓ అంతిమ యుద్ధం ప్రకటించిందన్నారు. దానికి వ్యతిరేకంగా ఆదివాసీ ప్రాంతాల సంపదలు కబ్జా కాకుండా ఉండటం కోసం ఈ వేదిక పనిచేస్తుంది. కగార్ అనేది యాదృచ్ఛికంగా వచ్చిన నినాదం కాదు ప్రతిదానికి స్వరూప స్వభావాలనేవి రెండు ఉంటాయి. కగార్ ఒక రూపం. దాని సారం ఒక జీనోసైడ్. అంటే ఒక జాతి నిర్మూలన. అది ఇప్పుడు గాజ. తెగల నిర్మూలన కూడా జీనో సైడే. అదిప్పుడు దండకారణ్యంలో జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రీన్ హంట్ తో మొదలైంది. అక్కడున్న అడివి సంపదే కాకుండా ఖనిజ సంపద కూడా కొల్లగొట్టాలనుకున్నప్పుడు ఏర్పడింది. ఆదివాసులను అక్కడినుంచి వెళ్ళగొట్టాలని రూపం ధరించినప్పుడు మోడీ ప్రభుత్వంలో కగార్ ఏర్పడింది. గ్రీన్ హంటు ఫాసిస్టు ప్రభుత్వంలో ఒక ప్రారంభ రూపం. ఎక్కడైనా ఓ ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలంటే మూడు పద్ధతులు ఉంటాయి. 1.తరలింపు 2.తరిమివేత. 3.తుడిచివేత. తరలింపు అంటే ఏదో ఒక ప్యాకేజీ ఇచ్చి ప్రజలను ఇంకొక ప్రాంతానికి తరలించడం. ఉదాహరణకు ప్రాజెక్టులు. అణిచివేత, నిర్బంధం ప్రయోగించి తరిమి వేయటం. తరలింపు, తరిమివేతలకు, అణిచివేతలకు లొంగనప్పుడు తుడిచివేత వస్తుంది. దీనినే నిర్మూలన అంటారు జాతి నే నిర్మూలించడం. గాజాకాని, దండకారణ్యం లోని ఆదివాసులను నశింపజేయడం. కనుక కగార్ అనేది యాదృచ్ఛికంగా వచ్చిన పేరు కాదు.
భారతదేశంలో గత పదేళ్లుగా పాపిష్టిపాలనే ఉంది కాని, ఫాసిస్టు వ్యవస్థ ఏర్పడలేదు. కాశ్మీర్ వరకు పాసిస్టు వ్యవస్థ ఉంది. ఫాసిస్ట్ రెండవ దశలో ఈశాన్య రాష్ట్రాలు దండకారణ్యo, ట్రైబల్ ప్రాంతాలున్నాయి. (కేశవానందతీలు కీర్తించినట్టుగా రాజ్యాంగంలో మౌలిక మార్పులు చేయకపోయినప్పటికీ, ఆచరణలో అమలు చేయటానికి మద్యంతర దశలో ఉన్నది. పాసిజం యొక్క ప్రారంభనినాదం, కగారు రూపంలో ముందుకొస్తుందని గుర్తుపెట్టుకోవాలి.) అక్కడ తరలింపు, తరిమివేత, తుడిచివేతలకు ప్రయత్నం చేస్తూ, ఇక్కడ దానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళని అక్కడ జైళ్ళలో పెడుతున్నారు. చతీష్ గడ్ జైళ్ళు ప్రజా సంఘాల వారితో నిండిపోతున్నాయి. భారతదేశం ఎప్పుడు ఒక ఇండియా కాదు. రెండు ఇండియాలు. ఇంతకుముందు రిచ్ ఇండియా, పూర్ ఇండియా లుండేవి. ఇప్పుడు రిచ్ ఇండియా కార్పొరేట్ ఇండియా గా మారింది. పూర్ ఇండియా పీపుల్స్ ఇండియాగా మారింది. గత పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ ఇండియా పాసిస్ట్ ఇండియాగా మారింది. పూర్ ఇండియా డెమోక్రటిక్ గా మారింది. రేపు ఫాసిస్టు-- డెమోక్రటిక్ భారత్ కు యుద్ధమే తప్ప మరొకటి కాదు. ఈ యుద్ధంలో ప్రజలు, మేధావులు, రైతులు, కార్మికులనే నాలుగు యక్స్ లవలన ప్యాసిస్టు ఇండియా ఓడిపోతుంది. నాలుగు ఎక్స్ల వేదికగా ఇది ఏర్పడడానికి, ఇంకా విశాలంగా మారడానికి అవకాశం ఉంది. ఈ వేదిక ఇంకా పటిష్టమైన ప్రజా ఉద్యమంగా ఏర్పడటానికి మన వైపు నుండి ప్రయత్నం చేద్దామని వేదిక అవసరాన్ని ప్రసాద్ గారు వివరించారు. ఈ సభలో పి. ఓ. డబ్ల్యు పద్మ మరి కొంతమంది ఉపన్యసించారు. కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొని ఆదివాసి హక్కుల పోరాటాలకు సంఘీభావం తెలియజేశారు.
నెల్లూరులో సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయం 10 గంటల నుండి జరిగే ఆదివాసి హక్కుల ప్రాంతీయ సభను,ర్యాలిని అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పోరాట కమిటీ వాళ్లు కోరు.