బెలుగుప్ప టెన్త్ మెరిట్ విద్యార్థులకు విమానయాన ప్రయాణం రివార్డు
సొంత డబ్బులతో విమాన ప్రయాణ అవకాశం కల్పించిన మండల విద్యాధికారి;
-చెన్నంపల్లి వేణుగోపాలరెడ్డి
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతూ 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు విమానంలో తన సొంత ఖర్చులతో తీసుకొని వెళ్తానని ఒక మండల విద్యాశాఖ అధికారి (MEO) విమానప్రయాణం రివార్డు ప్రకటించాడు.
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రోత్సాహకం తాను ప్రకటించానని, అది సత్ఫలిచ్చిందని అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల విద్యాశాఖాధికారి (MEO) పాటిల్ మల్లారెడ్డి ‘ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ కు చెప్పారు.
ఎంఇవొ పాటిల్ మల్లారెడ్డి (మధ్య) తో విమాన ప్రయాణం రివార్డు పొందిన టెన్త్ విద్యార్థులు
నిజానికి తన మండల స్థాయిలో 570 మార్కులు పైగా మార్కులు సాధించిన వాళ్లను విమానంలో తీసుకెళ్తానని ప్రకటించారు. అయితే ఒక విద్యార్థిని మాత్రమే 570కి పైగా మార్కులు సాధించింది. దీంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటూ 550 పైబడి మార్కులు సాధించిన వారిని అందరినీ విమానంలో తీసుకుని వెళ్తానని పేర్కొన్నారు. దీంతో ఇందుకు ఐదు మంది విద్యార్థులు అర్హత సాధించారు. అయితే అదే మండలానికి చెందిన ఒక విద్యార్థిని గుత్తిలో చదువుతూ 550 కి పైగా మార్పులు సాధించింది. ఆ అమ్మాయికి కూడా విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.
ఇలా వీరందరినీ శుక్రవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి తీసుకుని వెళ్లి అక్కడ నుంచి హైదరాబాద్ కు తీసుకుని వెళ్లారు. హైదరాబాదులో వివిధ చారిత్రక ప్రదేశాలను అన్నింటిని తిప్పి చూపించారు. దీంతోపాటు ప్రతి విద్యార్థి రెండు వేల రూపాయల ఖర్చుతో వారి తల్లిదండ్రులకు ఒక గిఫ్ట్ ను తీసుకుని వెళ్లేలా కూడా ప్లాన్ చేశారు. ఇదంతా మల్లారెడ్డి సొంత ఖర్చులతోనే చేస్తున్నార. అయితే ఇలా బెలుగుప్ప మండలంలో 550 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు ఐదు మందీ అమ్మాయిలే కావడం గమనార్హం.
అందరిలోనూ స్ఫూర్తిని నింపాలని : పాటిల్ మల్లారెడ్డి,
సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం, తిరిగి మన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో పాటు ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని కలిగించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ పనికి పూనుకున్నానని ఆయన ‘ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ కు చెప్పారు.
“విద్యార్థులలో చదవాలన్న కసి, పట్టుదలను పెంపొందిస్తూ చిన్న వయసులోనే తమ వంతుగా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలన్న ఆలోచనను రేకెత్తించాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను. నాకు మొదట్లోనే 550 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని అనుకున్నాను. అనుకున్న విధంగా అలానే చేశాను,” అని ఆయన చెప్పారు.
మల్లారెడ్డి 1989 లో లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యారు.ఆ తర్వాత అంచలంచెలుగా ఎంఈఓ స్థాయికి చేరుకున్నారు. ఇపుడు సొంత మండలంలోనే ఎంఈఓ గా పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెబుతారు. “మా స్వగ్రామం మండలంలోని ఎర్రగుడి గ్రామం, నా భార్య పేరు సుశీల నాకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడి పేరు రాహుల్ రెడ్డి మిలిటరీలో మేజర్ గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం పఠాన్ కోట్ లో పని చేస్తున్నాడు. కూతురు పేరు ప్రియాంక ఆమె ఆస్ట్రేలియాలో ఆర్కిటెక్ట్ గా పని చేస్తోంది. మనం మనస్ఫూర్తిగా ఏదైనా మంచి పని చేస్తే అది తిరిగి మన జీవితంలో ఊహించినంత మంచిని చేస్తుందని నేను చాలా నమ్మకంగా ఉంటాను. అందుకే నాకు తోచినంతగా నేను సమాజానికి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను,” అని మల్లారెడ్డి చెప్పారు.
550 పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు వీరే
బెలుగుప్ప మండల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెన్నపూసల ఈశ్వరి 574 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. ఇదే పాఠశాలకు చెందిన తలారి మధు శ్రీ 568 మార్కులు సాధించింది. గంగవరం హైస్కూల్ విద్యార్థిని ఫౌజియా 563 మార్కులు, వెంకటాద్రిపల్లి హైస్కూల్ విద్యార్థిని సి.లావణ్య 560 మార్కులు, గుండ్లపల్లి హైస్కూల్ విద్యార్థిని కావలి అర్చన 556 మార్కులు సాధించారు. బెలుగుప్ప మండలానికి చెందిన ఈశ్వరి మాత్రమే 574 మార్కులు సాధించడం, తలారి మధు శ్రీ 568 మార్కులు సాధించడంతో ఎంఈఓ పాటిల్ మల్లారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుని 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులను అందరినీ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తీసుకుని వెళ్తానని ప్రకటించాడు. దీంతో ఐదు మంది విద్యార్థులు విమాన ప్రయాణానికి అర్హత సాధించారు. వీరితోపాటు ఎంఈఓ స్వగ్రామమైన ఎర్రగుడి గ్రామానికి చెందిన విద్యార్థిని బోయ ఇందు కూడా అర్హత సాధించింది. ఈ అమ్మాయి గుత్తి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతూ 583 మార్కులు సాధించింది. వీరిలో fowjiyaa కొన్ని అనివార్య కారణాల వలన విమాన ప్రయాణానికి వెళ్లలేదు. మిగిలిన ఐదు మంది విద్యార్థులు శుక్రవారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.
చాలా సంతోషంగా ఉంది : వెన్నపూసల ఈశ్వరి
గురువారం సాయంత్రం DEO ను, జిల్లా కలెక్టర్ ను కలిశాము. రాత్రి 12 గంటల తర్వాత అనంతపురం నుంచి బయలుదేరి బెంగళూరుకు చేరుకున్నాము. ఉదయం ఎయిర్ పోర్ట్ అంతా కలియతిరిగాము. అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేసుకుని హైదరాబాద్ కు విమానంలో వెళ్ళాం. విమానంలో నుంచి కిందకు చూస్తూ ఉంటే అన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి. చాలా సంతోషంగా అనిపించింది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను.
విమానంలో ప్రయాణిస్తామని అస్సలు ఊహించలేదు : తలారి మధు శ్రీ
విమానంలో ప్రయాణిస్తామని కలలో కూడా అనుకోలేదు. పదవ తరగతిలో 550 కి పైబడి మార్కులు సాధించడంతో అది సాధ్యమైంది. అది కూడా ఎంఈఓ సర్ ఇచ్చిన ప్రోత్సాహంతో సాధ్యమైంది. ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థానానికి చేరుకుంటే ఏదైనా సాధించవచ్చునని దీనితో అర్థమైంది. చదువు ఒక్కటే జీవితాన్నే మారుస్తుందని దీనితో మాకు అర్థమయింది. ఇదంతా కలలాగా అనిపిస్తూ ఉంది.
మల్లారెడ్డి సార్ కు రుణపడి ఉంటాం : సి. లావణ్య
ఇప్పటికీ ఇది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎంఈఓ మల్లారెడ్డి సార్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. మేము హైదరాబాదులో ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్, చార్మినార్ అన్నీ చూశాము. మెట్రోలో ప్రయాణించడం కూడా చాలా బాగా ఉంది. విమానంలో ప్రయాణించాం అన్నది నా ఊహకు కూడా అందడం లేదు. బాగా చదువుకోవడం వల్ల ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని మాత్రం అర్థం అయింది.
ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు : కావలి అర్చన
మా స్వగ్రామం విడిచి పెద్ద పెద్ద పట్టణాలకు, నగరాలకు ఎప్పుడూ వెళ్ళింది లేదు. ఇప్పుడు ఏకంగా విమానం ఎక్కి బెంగళూరు అక్కడి నుంచి హైదరాబాద్ కు ప్రయాణించామంటే నమ్మబుద్ధి కావడం లేదు. హైదరాబాదులో చార్మినార్, ట్యాంక్ బండ్ లో అక్కడ ఉన్న బుద్ధుని విగ్రహం, ఎన్టీఆర్ పార్క్ ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మెట్రో రైలులో ప్రయాణించడం కొత్తగా ఉంది. నేను బాగా చదువుకుని చేతనైనంత వరకూ నలుగురికీ సహాయ పడాలని అనుకుంటున్నాను.