రాజ్యం ఉన్న వాళ్ళ కోసమే : కాకరాల
చిన్న పాత్రల మహానటుడు కాకరాలతో ఆలూరు రాఘవ శర్మ జరిపిన ఇంటర్వ్యూ
By : Admin
Update: 2024-04-24 03:45 GMT
“సామాజిక సంఘర్షణ నుంచే వైరుధ్యాలను అర్థం చేసుకోవాలి. సమాజాన్ని నడిపిస్తున్న అమ్మను అర్థం చేసుకోవడమే పరిష్కారమని నేననుకుంటున్నా. సంస్కరణలు ఎక్కడ ఆగిపో లేదు.రాజ్యం ఉన్న వాళ్ళ కోసమే.” అంటారు ప్రముఖ రంగస్థల, సినీ నటులు కాకరాల. చిన్న పాత్రల మహానటుడు కాకరాల వైద్యం కోసం తిరుపతి వచ్చిన సందర్భంగా మంగళవారం వారితో ప్రముఖ రచయిత రాఘవశర్మజరిపిన ఇంటర్వ్యూ.
-ఆలూరు రాఘవశర్మ
ప్రశ్న : వర్తమాన సమాజం మీకు ఎలా కనిపిస్తున్నది? ఎలా అనిపిస్తున్నది?
కాకరాల : వర్తమాన సమాజం నాకు సంఘర్షణాత్మకంగా కనిపిస్తున్నది. అది మానవ మనుగడ ప్రయాణంలో సహజంగానే అనిపిస్తున్నది.
ప్రశ్న : నేటి సమాజంలో కులం, మతం, భాష, జెండర్, ప్రాంతం వంటివి వైవిధ్యంగా కాకుండా వైరుధ్యంగా ఎందుకు పరిణమించాయి?
కాకరాల : వైవిధ్యం పైరూపు, సంఘర్షణ లోచూపు. ఇంతకంటే విశ్లేషించడానికి ఏమీ లేదు.
ప్రశ్న : స్త్రీ, పురుష తేడాలు ప్రకృతి వైవిధ్యమే కదా! అవి పునరుత్పత్తికి దోహదపడేవే కదా! మాతృస్వామిక, పితృస్వామిక సమాజాలు ఏర్పడడం, స్త్రీలు ప్రశ్నించేసరికి పితృస్వామిక దుర్మార్గాలు బైటపడడం చూస్తున్నాం. అవి
స్త్రీ, పురుషుల మధ్య తీవ్ర వైరుధ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ వైరుధ్యాలు సామాజిక సమస్యలకు పరిష్కారం కాదు కదా! మరి పరిష్కారం ఏమిటి?
కాకరాల : ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి అమ్మను అర్థం చేసుకోవడమే పరిష్కారమని నేను అనుకుంటున్నాను. దీన్ని వివరంగా చెప్పాలంటే, జానపద కవిబ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి గారి విశ్లేషణని గుర్తు చేసుకోవాలి. 'రాజు-పేద' సినిమాలో ఆయన రాసిన పాట 'కళ్ళు తెరిచి కనరా- సత్యం ఒళ్ళు మరచి వినరా - సర్వం నీకె బోధ పడురా' ఆయన చెప్పిన ఈ జానపద రహస్యాన్ని అర్థం చేసుకుంటే, మనం ఈ సమాజాన్ని నడిపిస్తున్న జగదాంబ తత్వం ఒక రూపంలో మనకి అర్థమై, ఈ జగదాంబ సృష్టిని తేలికగా అర్థంచేసుకోవడానికి దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. ఆవిడ చేయి పైదయ్యే సరికి ఈ పురుషపుంగవులంతా బుజాలు తడుముకుంటున్నారు.
ప్రశ్న : పురాణ కాల్పనిక సాహిత్యం స్త్రీల అంగాంగ వర్ణనల వరకు వెళ్ళిపోయింది. స్త్రీల సాహిత్యంలోకి కూడా ఇవి చొరబడ్డాయి. స్త్రీని ఆధారం చేసుకుని తిట్టు భాష కూడా తయారైంది. ఎంత నాగరిక సమాజం అనుకున్నా దీని నుంచి బైటపడలేకపోతోంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
కాకరాల : ఈ జీవితానికున్న లక్షణం ఏమిటంటే, ఏదో గొప్పగా ఉంటుందనుకుంటున్న జీవితం కూడా అనుభవంలోకి వచ్చేసరికి అది సంక్లిష్టమై అర్థంకాని గందరగోళంలోకి పడేస్తుంది. అన్నీ తానై నడిపిస్తున్న ఆదిపరాశక్తి తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడమే దీనికి మూలకారణం. అది తెలిసిన వాడు కనుకనే కొసరాజు రాఘవయ్య చౌదరిగారు 'కళ్ళు తెరిచి కనరా, సత్యం ఒళ్ళు మరిచి వినరా సర్వం నీకె బోధపడురా' అని ఆదిపరాశక్తి కున్న అధికారాన్ని చెప్పకుండా చెప్పారు. స్త్రీ అధికారం బైటపడుతున్న కొద్దీ పురుషుడి అసహనం బైటపడుతూ వస్తోంది. 'ఆదికాలమందు తండ్రికి లోబడి, ఆ తర్వాత భర్తకు లోబడి, తదనంతరం కొడుక్కి లోబడి స్త్రీ జీవించాల'ని మనువు శాసించాడు. మనువు శాసించాడంటే బ్రాహ్మడు శాసించాడనే లెక్క. దీనికి పరిష్కారం పోరాటమే. ఆ పోరాటం కూడా ఇప్పటికే నిర్ణయమైపోయింది. స్త్రీకి రక్షకుడిగా ఉన్నంత కాలం, అది నిన్ను నెత్తినపెట్టుకుంటుంది. సక్రమంగా చూసుకుంటే నిన్ను గౌరవిస్తుంది. లేకపోతే నేలనేసి కాలరాస్తుంది.
ప్రశ్న : ఒక కులం వారి ముందు మరొక కులం వారు, ఒక ప్రాంతం వారి ముందు మరొక ప్రాంతం వారు, ఒక మతం వారి ముందు మరొక మతం వారు నిలబడి శత్రువులుగా చూస్తున్నారు. ఈ సంక్లిష్టత, ఈ సంక్షోభ పరిష్కారానికి ఏ మార్పులు తీసుకురావాలి? ఈ మార్పునకు రాజ్యం ఏం దోహదం చేస్తుంది?
కాకరాల : వైరుధ్యాలేవైనా దూరంగా ఉన్నంత సేపూ మనకి అందంగానే కనిపిస్తాయి. అర్థమై దగ్గరకొస్తున్న కొద్దీ వాటి సంక్లిష్టత అనుభవానికొచ్చి వాటిని మనం సరిదిద్దుకునే దాకా వేధిస్తూనే ఉంటాయి. సామాజిక సంఘర్షణ నుంచే మనం అర్థం చేసుకుని పోరాడుతూనే సరిదిద్దుకోవాలి.
ప్రశ్న : గతంలో వేమన, పోతులూరి వీరబ్రహ్మం, గురజాడ, కందుకూరి, త్రిపురనేని రామస్వామి చౌదరి, గోరా వంటి వారు తమ కాలంలోని సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడి ఎంతో కొంత సమాజానికి మేలు చేసిన పాత్ర నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సామాజిక సంక్లిష్టతలో తలదూర్చి సంఘ సంస్కరణకు పాటుపడేవారెవరైనా మీకు కనిపిస్తున్నారా? సమాజం కోసం పనిచేయాలంటే కందుకూరి లాగా ఒక సామాజిక ఎజెండా ఉండాలి కదా!?
కాకరాల : వేమన, పోతులూరి, గురజాడ, కందుకూరి, త్రిపురనేని, గోరా కున్న నిబద్దతతో మొదటి తరం పనిచేసింది. రెండవ తరం వచ్చేసరికి నిబద్దత పోయింది. బలహీనతలు మిగిలాయి. వాళ్ళు గనక నిబడ్డారు కానీ, వీళ్ళెక్కడ నిలబడ్డారయ్యా అనుకున్నాం. వారిలాంటి వారు కనిపించడం దుస్సాధ్యం. మళ్ళీ మనం వాళ్ళ దగ్గరకే వెళుతున్నాం. నిబద్ధతగల సంఘ సంస్కర్తల లాగానే, నటనకు సంబంధించి మద్దాల శేషగిరి రావు బక్కగా ఉండేవాడు, భీముడి వేషం వేసేవాడు. తన వంట తాను చేసుకుని, తన మేకప్ తాను వేసుకుని రంగస్థలంపైకి వచ్చి 'ఇంతకీ సంధి ఏమని!?' అంటూ గంభీరంగా డైలాగు చెపితే ప్రేక్షకులంతా ఒక్క సారి అతనివైపు చూసేవారు. అది నిబద్దత. మాధవపెద్ది వెంటక రామయ్య గారు దుర్యోధనుడు వేషం వేసినా, కృష్ణుడి వేషం వేసినా ఆ నిబద్దత ఉండేది. ఆ తొలితరానికున్నటువంటి నిబద్దత మలితరానికి వచ్చేసరికి జారిపోయాయి. అలాగే ఏదేశ రాజకీయ నాయకత్వానికైనా.
ప్రశ్న : పాలక పార్టీలు, కమ్యూనిస్టుల పేరుతో మరి కొన్ని పార్టీలు, విప్లవం పేరుతో ఇంకొన్ని పార్టీలు సామాజిక సమస్యలకు ఒక పరిష్కార ఎజెండాను తీసుకురాలేకపోతున్నాయి. సామాజిక పరిస్థితిలో ఒక స్తబ్దత, ఒక నిరాశ, ఒక పరాధీనత, ఒక సంక్షోభం ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? వీటిని మీరెలా అర్థం చేసుకుంటారు?
కాకరాల : ఆయా పార్టీలు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ సంక్షోభం. వీళ్ళు ఎక్కడికక్కడ రాజీ పడిపోతున్నారు. తొలితరానికున్న నిబద్దత వీళ్ళకు లేదు. అందరినీ ఒకే గాటన జమకట్టకూడదు కానీ, చేస్తున్న వారు చేస్తున్నారు. వాళ్ళని తీసేయడానికి లేదు. ఒకరిపైనే ఆధారపడి ఈ భూచక్రం నడవడం లేదు.
ప్రశ్న : కళ్ళ ముందే సైన్స్ ఎదుగుదలను మన సాంస్కృతిక రంగం చూస్తోంది. కానీ, సైన్స్కు భిన్నమైన మత రాజకీయాల వైపు మొగ్గుచూపుతోంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సైన్సున్ను కాకుండా మతాన్ని ఆశ్రయిస్తున్నారు. సమానత్వ భావన దెబ్బతింటోంది. రాజకీయ ఉద్యమాలు వీటిని ఎందుకు పట్టించుకోవడం లేదు?
జవాబు : ఇది టగ్గాఫ్ వార్ ఆట వంటిది. అవతలవారు వాళ్ళ స్థితిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళ పోరాటం వీరిది. రిలాక్సైపోయినవారు వేరు. పనిచేసేవారు పనిచేస్తున్నారు. ఇది ఏ ఒక్కరిపైనో ఆధారపడి నడిచే పరిస్థితి కాదు. అన్ని వైపులా ఉంటారు. ఒకరు నెగ్గుతారు. ఒకరు ఓడతారు. ఇది నిరంతర పోరాటం. వీరందరూ సమాజంలో ఉంటారు.
ప్రశ్న : అన్ని కులాల్లో చదువుకున్న వారున్నారు. ఏ కులానికి ఆ కులం వారే సంస్కరణలు తేవాలని చర్చ జరుగుతోంది. చదువుకున్న వారు తమతమ కులాల్లో సంస్కరణలు ఎందుకు తేకూడదు?
కాకరాల : దళిత కులాలన్నీ మేలుకున్నాయి. రేపు ప్రపంచమంతా దళితుల చేతుల్లోకి వెళ్ళబోతోంది. కాలేజీల్లో కానీ, ఎక్కడ కానీ దళితుల ఆధిపత్యం మనకు కనిపిస్తోంది.
ప్రశ్న :సమాజంలోకి పెట్టుబడి ప్రవాహంలా వచ్చిపడుతోంది. ఆ పెట్టుబడి ఫ్యూడల్ పునాదిని ఎట్లా పట్టుకోగలిగింది?
కాకరాల : వీటితోనూ పోరాడాలి.వాటి ప్రవాహాన్ని వాటి ప్రవాహంగా వెళ్ళనీయకుండా, పాలకవర్గాలు తమ చెప్పుచేతల్లోకి తీసుకుని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అంచేత నిరంతర సంఘర్షణ. మనం వాటితోనూ పోరాడాలి, వీటి తో నూ పోరాడా లి.
ప్రశ్న : ఒకప్పుడు కొందరు జీవితాదర్శాలతో సమాజానికి ఆదర్శంగా ఉండేవారు. అలాంటి వ్యక్తులే ఈ రోజు నిలబడలేనప్పుడు సంస్థ లెక్కడ నిలబడతాయి? ఈ లోపం వ్యక్తుల్లో వచ్చిందా? వ్యవస్థకే వచ్చిందా? ఈ జబ్బు.
కాకరాల : నాకు దగ్గరగా ఉన్న వ్యవహారాల్లో కొడవటిగంటి కుటుంబరావు రాజకీయ చైతన్యంతో జీవితాన్నంతటినీ ఒక దారికి తీసు కొచ్చారు. కొడవటిగంటి కుటుంబరావు కావచ్చు, రావి శాస్త్రి కావచ్చు, చలసాని ప్రసాద్ కావచ్చు అంకిత భావంతో పనిచేశారు. విశ్వనాథ కఠోరమైనటువంటి మనిషికింద కనిపిస్తాడు కానీ, ఆయనకు అంతా తెలుసు. తన పద్ధతులను మార్చుకోకుండానే జీవిత సత్యాన్ని గ్రహించి, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి శిష్యులుగానే కొనసాగారు.
ప్రశ్న : సంస్కరణలు ఎందుకు ఆగిపోయాయి?
కాకరాల :సంఘ సంస్కరణలు ఎక్కడ ఆగిపోయాయి? కేవీయార్ జీవితం అంతాగ్రహిస్తే సంఘసంస్కరణలు ఎక్కడా ఆగిపోలేదని తెలుస్తోంది. కేవీయార్ జీవితమే దానికోసం వెచ్చించింది. ఆయన అన్ని ఆధారాలతో తీసిపెట్టాడుకదా! ఒక విధంగా శ్రీశ్రీ వెనుక ఉండి రక్షించుకుంటూ వచ్చింది కేవి రమణా రెడ్డే. ఆ విధంగా శ్రీశ్రీ కేవీయారు కితాబు కూడా ఇచ్చాడు.
ప్రశ్న: రాజ్యాంగ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కూడా రాజ్యానికి ఎందుకు ఎజెండా కావడం లేదు?
జవాబు : రాజ్యం కనుక అది పట్టించుకోదు. రాజ్యం అనేది ఉన్న వాళ్ళ కోసమే.