ANGRAU @ 60 | అగ్రీ యూనివర్శిటీలో తిరుగుబాటు బావుటా ఆనాటి 'ఎపిటి'

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వజ్రోత్సవాలకు ముస్తాబైంది. ఈసందర్భంలో గత సంఘటనలను స్మరించుకోవడం, భావితరాలకు స్పూర్తిదాయక సందేశం ఇవ్వడం నేటి అవసరం.

Update: 2024-12-20 01:30 GMT
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వజ్రోత్సవాలకు ముస్తాబైంది. 60 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని వేడుకలు జరుపు కుంటోంది. ఈ 60 ఏళ్ల ప్రయాణ అనుభవాలను సమకాలికులతో కల బోసుకుంటూ , ఈ తరానికి ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇవ్వటం, ఆ దిశగా అడుగులు వేయటం నేటి అవసరం.
1964 లో రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల, పశు వైద్య కళాశాల, బాపట్ల లోని వ్యవసాయ కళాశాల, తిరుపతి లోని వ్యవసాయ, పశు వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వ విద్యాలయం (APAU) ఏర్పాటు చేశారు. 1990 దశకంలో ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం గా పేరు మార్చారు. ఆ తరువాత కాలం లో ఈ విశ్వ విద్యాలయం కు అనుబంధంగా గృహ విజ్ఞాన , ఉద్యాన కళాశాలలు ఏర్పడ్డాయి. మరి కొంత కాలం తరువాత మరికొన్ని వ్యవసాయ, పశువైద్య కళాశాలలు వచ్చి చేరాయి. ఆ తరువాత కాలం లో పెరుగుతున్న అవసరాలు , ఆకాంక్షల మేరకు వ్యవసాయ విశ్వ విద్యాలయంను వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య విశ్వ విద్యాలయాలుగా వేటికవిగా మూడుగా విభజించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఈ మూడు ఆరు అయ్యాయి.
ఇక్కడి విద్యార్థులకు ఇతర విశ్వ విద్యాలయాలు మాదిరిగా రాష్ట్ర, దేశ రాజకీయాల ప్రభావం ప్రత్యక్షంగా లేదు. పాఠ్యాంశాలు , ఇతరత్రా కారణాల వల్ల ఇక్కడి విద్యార్థులు ఇతర విషయాల పట్ల పెద్దగా ఆసక్తి కూడా కనపరిచే పరిస్థితి ఉండేదికాదు. అందువల్ల ఇక్కడి విద్యార్థులది ప్రత్యేకమైన సాలెగూడు జీవితం. అయితే వారి కుండే సమస్యలు వారికీ ఉన్నాయి. వారు వారి అవగాహన , పరిస్థితులు బట్టి నడుస్తూ పరిష్కరించుకుంటూ వెళ్ళేవారు.
ఇక్కడి విద్యార్థులకు వేరే విషయాలు పట్టవా?
సాధారణ విద్యార్థులకు అతీతులా? నిరంతరం పుస్తకాల పురుగులా? వీరికి ఎటువంటి సమస్యలు లేవా? అనే సందేహం ఇతర విశ్వవిద్యాలయాలల్లోని విద్యార్థుల్లో ఉండేది. ఎందుకంటే వీరి ఉనికి ఎప్పుడూ, ఎక్కడా కనిపించేది కాదు . ఈ అభిప్రాయాలు కొంతవరకు మాత్రమే నిజం. ఇది రాష్ట్ర విశ్వవిద్యాలయం అయిన కారణంగా, విశ్వ విద్యాలయంలోని ఒక్కో కళాశాలలో ఒక్కో చోట ఒక్కో తరహా పరిస్థితి. ఏ రెండింటిని ఒక గాట కట్టటం కష్టం. ఉదాహరణకు బాపట్ల వ్యవసాయ కళాశాల అంటే కులాల కుంపటి అంటారు. తిరుపతి అంటే జిల్లాల పేరుతో గొడవలు అని చెప్పుకుంటారు. హైదరాబాద్ అయితే ఈ రెండింటికి భిన్నమైన కథనం వినిపిస్తుంది.

తిరుపతి, హైదరాబాద్ పశు వైద్య కళాశాలలది మరొక కథ. అయితే ఇవన్నీ నిరంతరం ఒకేలా లేవు. ఎన్ని ఉన్నా ఈ విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థులు దేశ పరిపాలన రంగం మొదలుకుని బ్యాంకింగ్, వ్యవసాయం అనుబంధ రంగాల్లో విద్య, పరిశోధన, విస్తరణ రంగాల్లో తమదైన ముద్ర వేశారు. పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, డిజిపి లు మొదలుకుని అన్ని సివిల్ సర్వీస్ విభాగాల్లో తామేంటో నిరూపించుకున్నారు. ఇక బ్యాంకింగ్ రంగంలో నాబార్డ్ చైర్మన్ నుంచి ఎస్.బి.ఐ చైర్మన్ వరకు అత్యున్నత పదవుల్లో చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయంగా శాస్త్ర పరిశోధనా రంగాల్లో ఆకాశమే హద్దుగా ఎదిగారు. వ్యవసాయ, పశు సంవర్ధక శాఖల్లో ఇక్కడి విద్యార్థుల ప్రతిభకు తిరుగే లేదు ఇది వాస్తవం. అయితే ఈ ప్రస్థానం లో విద్యార్థులు ఒక ప్రాపంచిక దృక్పథం తో అడుగు వేయలేదా...కేవలం అన్నింటికీ అతీతంగా పుస్తకాలే సమస్తం గా ఉన్నారా అంటే కాదు.
ఉదాహరణకు ఎంతో మంది వారి వారి జీవన గమనం లో రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభ,శాసన మండలి, లోక్ సభ, రాజ్య సభ సభ్యులయ్యారు. మంత్రి పదవులు నిర్వహించారు.బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఈదురు వెంకట రమణా రెడ్డి, పోతుల రామారావు, చిట్టూరి వేంకటేశ్వర రావు, ముళ్ళపూడి నరేంద్రనాథ్, జీవీఎల్ నరసింహా రావు , వరుదు కల్యాణి లతో పాటు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుర్రం నారాయనప్పలు కేంద్ర రాష్ట్ర మంత్రులు గా పనిచేశారు. అయితే వీరిద్దరూ మన విశ్వ విద్యాలయం ఏర్పడక ముందే పట్టా తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి గా పని చేసిన సుచరిత వ్యవసాయ డిగ్రీ మధ్యలో వదిలి వెళ్లారు.
రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల నుంచి డాక్టర్ జి. చిన్నా రెడ్డి, డాక్టర్ మర్రి శశి ధర్ రెడ్డి రాష్ట్ర మంత్రులు గా పనిచేశారు. రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల నుంచి డాక్టర్ ఎ . చంద్ర శేఖర్, డాక్టర్ పి.మహేందర్ రెడ్డి రాష్ట్ర మంత్రులు గా సేవలు అందించారు. డాక్టర్ రంజిత్ రెడ్డి లోకసభ సభ్యులయ్యరు.తిరుపతి పశు వైద్య కళాశాల నుంచిడాక్టర్ వల్లభనేని వంశీ శాసన సభ, డాక్టర్ కె శ్రీనివాస రెడ్డి శాసన మండలి లో ప్రవేశించారు.
తిరుపతి వ్యవసాయ కళాశాల నుంచి వైఎస్ వివేకా నంద రెడ్డి రాష్ట్ర మంత్రిగా , లోక్ సభ సభ్యులు గా పనిచేశారు. 1982 బ్యాచ్ శేషి రెడ్డి శాసన సభ సభ్యులు అయ్యారు. విషాదమేమంటే వీరిద్దరూ హత్యకు గురయ్యారు. రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల నుంచి ఏలూరు సాంబ శివ రావు శాసన సభ సభ్యులు గా ఉన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసి ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి. బి ఎస్ పి ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత అధ్యక్షులు పూర్ణ చంద్ర రావు బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి. ఇద్దరూ ఐ పి ఎస్ అధికారులు కావటం ఒక విశేషం.
రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి కె వీరయ్య సిపిఎం పార్టీ లో జీవితకాలపు కార్యకర్తగా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్నటి దాకా నవ తెలంగాణ దిన పత్రిక సంపాదకులు గా పనిచేశారు. వీరితో పాటు మరెందరో తాము ఎంచుకున్న మార్గం లో పని చేస్తున్నారు. జగ్గీ వాసుదేవ్ బాబా, పుట్ట పర్తి సాయి బాబా, షిర్డీ సాయిబాబా, రామకృష్ణ మఠం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావ జాలంతో మమేకమైన వారు ఎందరో.. అలాగే క్రీస్తు బోధనల ప్రచారం లో కూడా ఉన్న వారు ఎందరో.. ఇలాగే రకరకాల తాత్వికతలతో వివిధ జీవన మార్గాలు ఎంచుకున్న ఎందరో ఈ విశ్వవిద్యాలయం నుంచి వెళ్లినవారి లో ఉన్నారు.

సాధారణంగా అన్ని విశ్వ విద్యాలయాలు ల్లో కనిపించే విద్యార్థి సంఘాలు ఇక్కడ నేరుగా లేవు. ఎన్ ఎస్ యు ఐ (NSUI- National Students Union of India ), ఎఐఎస్ఎఫ్ (AISF- All India Students Federation), వి జె ఎఫ్ (VJF), ఎ బి వి పి (ABVP- Akhila Bharatiya Vidyaarthi Parishad ) , పి ఎస్ ఎఫ్ (PSF - Progressive Students Forum) , డి ఎస్ ఒ ( DSO - Democratic Students Organisation ), ఎస్ ఎఫ్ ఐ ( SFI- Students Federation of India ) , ఎ ఐ డి ఎస్ ఒ ( AIDSO- All India Democratic Students Organisation), పి డి ఎస్ యు (PDSU - Progressive Democratic Students Union ), ఆర్ ఎస్ యు (RSU- Radical Students Union ) ఇలా ఎన్నో సంఘాలు.
ఇంటర్ చదువుతున్న కాలం లో ఏదైనా విద్యార్థి సంఘాలతో పరిచయం, ప్రభావం ఉంటే అవి అంతర్లీనంగా పని చేసేవి తప్ప, నేరుగా ఆ బ్యానర్ మీద పని చేసిన నేపథ్యం తక్కువ. కళాశాల ఏదైనా పరిస్థితి ఇదే. అయితే ఆయా కళాశాలల్లో స్థానికంగా ఉండే పరిస్థితులు ఆధారంగా విద్యార్థుల మీద ప్రభావం ఉండేది. అగ్రకుల ఆధిపత్యం, మతోన్మాదం ఇవి ఏవీ నేరుగా లేక పోవచ్చు, కాని చాపకింద నీరులా విద్యార్థుల మధ్య తీవ్ర అంతరాన్ని సృష్టించేవి. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన దళిత, బహుజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్లో వారికి తెలియని అభద్రత, భయం, ఆత్మన్యూనతా భావం వంటివాటికి లోనయ్యే ఇబ్బందులు ఇంచుమించుగా రాష్ట్రంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో బాగా ఉండేది. గ్రామాల నుంచి తెలుగు మీడియం లో చదువుకుని రావటం, నేరుగా ఇంగ్లీష్ మీడియంతో కుస్తీ పట్టే సమయంలో టీచర్లుతో అక్కడక్కడ జటిలమైన సమస్యలు ఎదురు అయ్యేవి. ఈ తీవ్రతలు ఒక్కో కళాశాలలో ఒక్కో రకంగా ఉండేవి. దీనితో అన్నీ కళాశాల విద్యార్థులును ఏక తాటి మీదికి తీసుకువచ్చే ప్రయత్నం ఏ సంఘం చేసిన దాఖలాలు లేవు. దీనికి తోడు ఏ మాత్రం అలజడి, గొడవ అయినా సంబంధిత విద్యార్థులను కఠినమైన ఆంక్షలతో, నిబంధనలతో వేధించడమే కాకుండా హాస్టల్ / కళాశాల / విశ్వవిద్యాలయ బహిష్కరణ, డిటెన్షన్ , డిబారు, సస్పెన్షన్ లతో పాటు ఇతర కళాశాలలుకు బదిలీ చేయటం వంటి క్రమశిక్షణా చర్యలు ఆనవాయితీగా తీసుకునే వారు. వీటికి బలయ్యింది కూడా ఎక్కువగా దళిత , బహుజన , బలహీన వర్గాల విద్యార్థులే .
1964 బ్యాచ్ వ్యవసాయ కళాశాల వారు అప్పటి పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాటం చేసీ సాధించుకున్నారు. 1980 దశకం లో వ్యవసాయ అధికారుల ఎంపిక లో పద్ధతి గురించి ఉద్యమించారు. ఇలా ప్రతి కళాశాల విద్యార్థులు వారి కష్టాలు, నష్టాలను ఎదిరిస్తూ స్వతంత్రంగా నిలబడి గెలిచారు ఈ విశ్వ విద్యాలయం కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గొడవ, కొట్లాటలు ప్రధానంగా డిగ్రీ స్థాయికి పరిమితం కావటం. పీజీ విద్యార్థులు భాగ స్వామ్యం కాక పోవటం. మహా అయితే సలహాలు, సూచనలు వరకు పరిమితం అని చెప్పవచ్చు. లేదా అది కూడా పెద్దగా లేకపోవచ్చు.
రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాలలో ప్రత్యేక పరిస్థితి...
దీనిగురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏ కళాశాల లో లేని పరిస్థితి. ఇక్కడ భయం రాజ్యమేలింది. ప్రొఫెసర్లు ఇక్కడ చూపించిన ఆశ్రిత పక్ష పాతం ఎక్కడా చూపించి ఉండక పోవచ్చు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో స్పోర్ట్స్ బదులుగా సంఘ పరివార్ శాఖలు నిర్వహించేది, కొత్తగా చేరిన విద్యార్థులను విధిగా శాఖకు రావాలని హుకుం జారీ చేసేవాళ్ళు. తదనంతర కాలంలో రాజేంద్రనగర్ కేంపస్ లోని ఎ బి వి పి శాఖలో (1983-85) గ్రూపిజం, కుల విభజన, అగ్ర కుల గుండాయిజం వెరసి దళిత వ్యతిరేకతను క్యాంపస్ లో తీసుకు వచ్చిన సందర్భాలు అనేకం. మతోన్మాద శక్తులు, అగ్ర కుల ఉన్మాద గూండాలు కేంపస్ లో విచ్చలవిడిగా‌ తిరుగుతూ , చదువులను పక్కన పెట్టి చదువుకునే విద్యార్థులను వేధిస్తూ, అకారణంగా విద్యార్థులపై దాడులు చేసేవారు. క్రమ శిక్షణా రాహిత్యానికి పెట్టని కోటయ్యారు. దళిత, బహుజన, ప్రగతిశీల ఆలోచన ఉన్న విద్యార్థులపై మూకుమ్మడి దాడులు నిత్యకృత్యంగా జరిగేవి. ఫలితంగా వెటర్నరీ హాస్టల్ "ఎ" లో తీవ్ర ప్రతిఘటన ఓ పెద్ద రణరంగమే జరిగి, పర్యవసానంగా కళాశాలకు కొద్ది రోజులు సెలవులు ప్రకటించారు, పరిస్థితులు సద్ధుమణిగేవరకు ప్రతిఘటించిన విద్యార్థులు 15 - 20 రోజులు హిమాయత్ నగర్ లోని మఖ్ధూం భవనంలో ఆశ్రయం పొందారు. కొంతమంది అధ్యాపకుల అండతో ప్రశ్న పత్రాలను రూముల్లోకే తెచ్చుకొని పరీక్షలు పాసై దళిత, బహుజన విద్యార్థులనే కాకుండా డే-స్కాలర్సును కూడా చితక బాదిన సందర్భాలెన్నో.. చెప్పలేనన్ని అరాచకాలను, విద్యా సంబంధిత విషయాలలో వివక్షను చూసి , తోటి విద్యార్థుల బాధలను అర్థం చేసుకున్న కొంతమంది విప్లవ భావజాలం ఉన్న విద్యార్థులు ఎన్నో ప్రయాసలకు ఓర్చి , తమ విద్యా పురోగతిని పక్కన పెట్టి అందరు ఒకటై అసోసియేషన్ ఆఫ్ ప్రొగ్రెసివ్ థింకర్స్ (Association of Progressive Thinkers- APT) పేరుతో ఓ స్వతంత్ర విద్యార్థి సంస్థను స్థాపించారు.
హైదరాబాద్ లోని ఇతర విశ్వ విద్యాలయాలను సమన్వయ పరచుకుని ఎన్నో ఎన్నెన్నో విషయాలు మీద పోరాటాలు చేసి విజయాలుసాధించారు. మరీ ముఖ్యంగా ప్రజాస్వామిక వాతావరణం లేని హైదరాబాద్ క్యాంపస్ లో ఒక డెమోక్రటిక్ స్పేస్ క్రియేట్ చేసి, అందరూ ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని, స్వేచ్చగా తిరిగే పరిస్థితులను కల్పించారు. విద్యార్థి వ్యతిరేక విద్యా విధానాలకు ( Anti student Academic regulations) వ్యతిరేకంగా, విద్యార్థినుల హాస్టల్ ప్రహారీ గోడ ఏర్పాటు కోసం, గుండాలు ఇతర పోకీరీ విద్యార్థుల నుంచి వచ్చే వేధింపులకు వ్యతిరేకంగా , ర్యాగింగ్ కు వ్యతిరేకంగా, నాణ్యమైన తిండి, తక్కువ మెస్ బిల్ వచ్చే విధంగా అన్ని హాస్టల్లో ప్రత్యేకమైన శ్రద్ద వహించారు. బి ఎస్ సి అగ్రికల్చర్ , హార్టీ కల్చర్ , గృహ విజ్ఞాన విద్యార్థులంతా ఆఖరు సంవత్సరంలో పాల్గొనే రావెప్ (RAWEP) స్టయిపెండ్ పెంచాలని 50 రోజులకు పైగా పోరాడి సాధించుకున్నారు.
ఉత్తీర్ణులైన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఎంపికకు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వ్యతిరేకంగా, మండల్ కమిషన్ వ్యతిరేక దేశ వ్యాప్త ఆందోళన సమయంలో కేవలం ఒక్క ANGRAU లో తరగతులు నిర్వహించే విధంగా ఎ పి టి (APT) ఆద్వర్యంలో విజయవంతమైన ఉద్యమం జరిగింది. దీనితో పాటు మరెన్నో చారిత్రాత్మక ఉద్యమాలకు ఏపిటి (APT) నాయకత్వం వహించింది.‌ ఇన్ని భిన్నమైన పరిస్థితులున్న విశ్వవిద్యాలయంలో రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలది అక్కడి విద్యార్థులది మరో భిన్నమైన పరిస్థితి. బహుశా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఉండి ఉండదు. అగ్రకుల గూండాయిజం, కుల దురహంకారపు టీచర్లు, వీళ్ళ ములాఖాత్ రాజకీయాలు వెరసి కళాశాలలోని దళిత, బహుజన, అగ్రవర్ణ ప్రగతిశీల విద్యార్థులు (BC,SC,ST & Progressive Thinkers of OC) అనుభవించిన అరాచకాలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉండేవి. కుల దురహంకారపు టీచర్లు, వారితో ములాఖాత్ అయిన విద్యార్థుల అరాచకాలకు చరమ గీతం పాడి, వారి ఆశ్రిత పక్ష పాతం నిరూపించి ఎండ గట్టి చరమగీతం పాడింది APT నాయకత్వం.‌ ఇంతటి భిన్నమైన సంస్కృతి ఒక్క రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలకే పరిమితమై ఉండేది.
ఈ నాణానికి మరో కోణం కూడా ఉంది . సమాజ మార్పుకోసం ప్రత్యామ్నాయ భావజాలంతో సమస్త విజ్ఞానం, సహజ వనరు లు ప్రజలు అందరికీ చెందాలనే లక్ష్యం గా ఒక నూతన సమాజం కోసం మార్క్సిజం వెలుగులో లెనినిజం దారిలో మావో ఆలోచనా విధానం తో ప్రయాణించి వారి జీవితాన్ని అశేష ప్రజానీకం కోసం తృణ ప్రాయంగా అర్పించిన విశ్వ విద్యాలయ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటి తరానికి విశేషంగానో , ఆశ్చర్యంగానో అనిపించొచ్చు. ఇదే భావజాలం తో ప్రయాణిస్తూ పాట్నాలో అరెస్టు కాబడి ఒక 8 సంవత్సరాలు బీహార్ లోని హజారిబాగ్ జైల్ లో గడిపి, విడుదలయ్యి ప్రస్తుతం పుస్తకాలు అనువాదకులు గా, సామాజిక అంశాలు విశ్లేషకులుగా హైదరాబాద్ లో జీవిస్తున్న నర్ల రవి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల 1981 బ్యాచ్ విద్యార్థి. అంతేకాదు APT వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరై రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థి పోరాటాలకు నాయకత్వం వహించి మార్గ నిర్దేశం చేసీ కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టిన సంగతి ఆ తరానికి తెలిసిందే.

భూమిలో వున్న ఖనిజాలు లవణాలు ఎన్ని ఉన్నాయో మానవ శరీర నిర్మాణంలో అవే ఉన్నాయి. భూమి పై పండే ఆహార పంటలు, కూరగాయలు, పండ్లు అన్నీ అవే ఖనిజ లవణాలు కలిగి ఉన్నాయి . భూమి నిస్సారంగా మారి పంటలు పండకపోవడానికి కారణం విచ్చలవిడిగా కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల వాడటం వల్లే . ప్రపంచం మొత్తం వ్యవసాయ భూములలో 30% సహజత్వాన్ని కోల్పోయి ఎడారీకరణ జరిగింది.అందువల్లనే పోషకాలు విటమిన్లు లేని పంటలు పండుతున్నాయి. ఆ ఆహారం తినడం వల్ల మానవ శరీరం రోగ నిరోధక శక్తిని కోల్పోయి అనేక రకాల కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇందులో కరోనా ఒకటి... మానవ ‌తప్పిదాలు, ఆకాశమే హద్దుగా ధనదాహాం, విస్మరించలేని / అంతులేని విస్తరణవాదం, వెరసి అప్రకటిత మూడవ ప్రపంచ యుద్ద వాతావరణం, కలిసి ప్రకృతి విద్వంసం కారణంగా రోగకారక క్రిమి కీటకాలల్లో , బాక్టీరియా, వైరస్ లలో ఎన్నో కొత్త జన్యు పరివర్తనలు జరిగి ప్రపంచ శాస్త్రీయ సమాజానికి సవాల్ గా నిలుస్తున్న ఈ కాలమాన పరిస్థితుల్లో కరోనా (Spill over from Wild Animals), ఎబోలా లాంటి, బర్డుఫ్లూ, స్వైన్ ఫ్లూ లాంటి అంతుచిక్కని రోగాలు, టీకాలకు, మందులకు లొంగని వ్యాధులు ఎన్నో ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వైనం ఒకవైపు. అంతులేని సరళీకరణ (Liberalisation) , ప్రయివేటీకరణ (Privatisation) , ప్రపంచీకరణ (Globalisation) విస్తరణవాదం కారణంగా ప్రపంచ భూసారం తగ్గి కనీస‌ పోషకాలు లేని పంటలతో ధనిక దేశాలతో సహా రెండవ మూడవ ప్రపంచ దేశాల ప్రజలు రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. కొత్త, సరి కొత్త వ్యాధులు ప్రపంచమంతా వ్యాపించి మానవ జీవన మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో అసాధ్యం. లాభాన్ని రద్దు చేసే సోషలిస్టు వ్యవస్థలే పరిష్కరించ గలవు. ఈ క్రమంలోనే ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి అంటూ వారు నమ్మిన మార్గం లో జీవితాలను త్యాగం చేసిన వారు ఓ నలుగురు ఉండటం కూడా చరిత్రే కదా. తమ నులివెచ్చని నెత్తుటి త్యాగాలతో వ్యవసాయ విశ్వ విద్యాలయ ఉద్యమ స్ఫూర్తిని ఎరుపెక్కించారు. దేశ విప్లవోద్యమ చరితలో విశ్వ విద్యాలయంకు స్థానం కల్పించిన ఆ నలుగురు గురించి తెలుసుకుందాం.
1. వేమూరి చంద్ర శేఖర్ 1964 బ్యాచ్, బాపట్ల వ్యవసాయ కళాశాల. విశ్వ విద్యాలయం మొదటి బ్యాచ్. కృష్ణా జిల్లా, చల్ల పల్లి పక్కన పల్లె టూరు. విద్య పూర్తి చేసిన తరువాత,కొంత కాలం షుగర్ ఫ్యాక్టరీ లో ఉద్యోగం చేసి..ఆ తరువాత తను నమ్మిన పార్టీకి పూర్తి కాలపు కార్యకర్తగా ముంబై లో కార్మిక ఉద్యమం నిర్మించి, అక్కడే పరిచయం అయిన బెంగాలీ జర్నలిస్టు ను పెళ్ళాడి, డెంగు జ్వరం తో 2006 లో ఢిల్లీ లో తుది శ్వాస విడిచారు
2. బాపట్ల వ్యవసాయ కళాశాల 1981 బ్యాచ్ విద్యార్థి గోప బోయిన ప్రసాద్. ప్రకాశం జిల్లా మద్ది పాడు మండలం పెద్ద కొత్త పల్లి గ్రామం. బాపట్ల లో డిగ్రీ పూర్తి చేసి,అక్కడే పిజి వ్యవసాయ ఆర్థిక శాస్త్రం లో చేస్తూ తను ప్రాణ పదంగా భావించిన పీపుల్స్ వార్ పార్టీ లో జీవిత కాలం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. 1991 ఏప్రిల్ 1 న మాచర్ల ప్రాంతం లో జరిగిన పోలీసు కాల్పుల్లో అమరుడయ్యారు. అప్పటికి పెళ్లి జరిగి వారం రోజులు. ఈ కాల్పుల్లో వారి సహచరి కూడా ప్రాణాలు కోల్పోయారు
3. తొగరి రామకృష్ణ, బి ఎస్ సి అగ్రికల్చర్, 1986 బాచ్,రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల, నాటి APT విద్యార్థి నాయకుడే. రామక్రిష్ణ ది అదిలాబాద్ జిల్లా రామకృష్ణాపురం, బెల్లంపల్లి దగ్గర వారి ఊరు. ప్రజల పట్ల, దేశ సమకాలీన రాజకీయల పట్ల లోతైన అవగాహన పెంచుకొని, ప్రత్యామ్నాయ విప్లవ రాజకీయాలే సరైన మార్గం అని నిర్ణయించుకుని, అప్పటి సి పి ఐ (ఎం ఎల్ ) (పీపుల్స్ వార్ )/ నేటి మావోయిస్టు పార్టీలో జీవిత కాలపు కార్యకర్తగా వెళ్ళి, అనతి కాలంలోనే ఉన్నత స్టాయి నాయకుడుగా ఎదిగి 1993 డిసెంబర్ 3న పోలీసుల చేత చిక్కి కరీంనగర్ జిల్లా గోదావరిఖని దగ్గర వకీలుపల్లి వద్ద బూటకపు ఎదురుకాల్పుల్లో అమరుడయ్యాడు.
4.డిస్కో రమేష్ గా కళాశాల లో ప్రాచుర్యం పొందిన గొట్టి ముక్కల రమేష్ రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల 1984 లేదా 1985 బ్యాచ్ విద్యార్థి. గుంటూరు జిల్లా క్రోసురు మండలం పీసపాడు గ్రామం. 1990 లో తను నమ్మిన పార్టీకి పూర్తి కాలపు కార్య కర్త అయ్యారు. 2016లో బొట్టెం గ్రామ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో అమరుడు అయ్యే నాటికి పార్టీ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు, రమేష్ కూడా ఆనాటి ఎపిటి విద్యార్థి నాయకుడే.
ఈసందర్భంలో నర్ల రవి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నర్ల రవి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల 1981 బ్యాచ్ విద్యార్థి. APT వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన రవి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థి పోరాటాలకు నాయకత్వం వహించాడు. అత్యంత వెనుక బడిన బీహార్, ఝార్ఖండ్ లలో రైతాంగానికి, ఆదివాసులకు వారి హక్కుల పట్ల ఎరుక కలిగించి పోరాటం చేసేందుకు విప్లవకారుడిగా పనిచేయడానికి 1996లో తాను IARI లో చేస్తున్న పి.హెచ్.డి. వదిలి వెళ్ళాడు. ఆ క్రమంలో పాట్నాలో 2009 లో అరెస్టు అయ్యాడు. 8 ఏళ్ల పాటు జైళ్ళలో గడిపాడు. ప్రస్తుతం సామాజిక అంశాలపై విశ్లేషకులుగా, సామాజిక కార్యకర్తగా ఉన్నారు.
విశ్వ విద్యాలయ వజ్రోత్సవాల సమయం లో ఎటువంటి అసమానతలు లేని నూతన సమాజం కోసం తమ ప్రాణాలను గడ్డి పూస కంటే తేలికగా త్యాగం చేసిన వీళ్లను స్మరించుకోవడం సందర్భోచితం. ప్రజల కోసం జీవించడం , ప్రజల కోసం మరణించడం కంటే ఉన్నతమయినది ఏముంటుంది. వారి ఆశయాలు, త్యాగం హిమ శిఖరం కంటే ఉన్నత మయినవి. గత మూడు దశాబ్దాలలో 5 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యల పాలయ్యారు .. సమాజం లో అనేక జీవన రంగాలలో అ సహజ మరణాల పాలవుతున్నారు .. వారిలో విద్యార్థులు , నిరుద్యోగులు కూడా గణనీయంగా ఉన్నారు. ఈ సమాజం మన అందరం జీవించడానికి , అసహజ మరణాల పాలు కాకుండా ఉండడానికి ఏమిచేయాలో మనందరం కలిసి ఆలోచించాలి. ఒక్క వాయు కాలుష్యం కారణంగా ఏటా 16 లక్షల మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.. ఈ విషాదాల నివారణకు నడుం బిగించాల్సింది మనమే .. అన్ని రకాల కాలుష్యాలకు , పర్యావరణ వ్యతిరేక విధానాలకు ఎదురొడ్డి నిలుచోవలసింది మనమే .. మట్టి ఆరోగ్యమే మనిషి ఆరోగ్యం అనే ఎరుకతో ఉద్యమించాల్సింది మనమే ..
ఈనాటి సమకాలీన వ్యాపార కార్పొరేట్ విద్యా విధానంలో, అనైతిక దోపిడీ రాజకీయ వ్యవస్థలో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాల నేపథ్యం లో దిగుమతైన డిజిటల్ యుగంలో విద్యార్థి లోకానికి సమాజం పట్ల ఏమాత్రం అవగాహన, బాధ్యతలు లేకుండా చేస్తున్న ఈ సమయంలో పూర్వ ఎపిటి విద్యార్థులుగా , ప్రగతిశీల ఆలోచనాపరులుగా సంక్షిప్తంగా అయినా ఈ సమాచారాన్ని ఇవ్వడం మా కర్తవ్యంగా భావించి నేటి విద్యార్థి లోకం ముందుచుతున్నాం. చదువు లక్ష్యం ప్రజలకు సేవ చేయడంగా ఉండాలి . సమాజానికి బాధ్యత వహించడం, మెరుగైన సమాజ నిర్మాణానికి కృషిచేయడం లక్ష్యం కావాలి. ఆ దిశగా ఆలోచిస్తారని .. నవ సమాజ నిర్మాణ ఆలోచనలతో శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకుంటారని , హిందూ బ్రాహ్మణీయ మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా, భూస్వామ్య, పితృస్వామ్య విలువలకు, పెట్టుబడిదారీ మార్కెట్ సంస్కృతికి, సామ్రాజ్యవాద పోకడలకు వ్యతిరేకంగా, కుల, మత , ప్రాంత దురహంకారాలకు వ్యతిరేకంగా, దోపిడీ, పీడన విలువలకు వ్యతిరేకంగా, మొత్తంగా ప్రజా వ్యతిరేక విధానాలకు , పర్యావరణ విధ్వంసక విధానాలకు వ్యతిరేకంగా , దళిత , బహుజన , ఆదివాసీ , ముస్లిం , మైనారిటీ, పీడిత, బాధిత ప్రజా సమూహాలకు అండగా నిలబడే చైతన్యాన్ని అలవరచుకుంటారని , మెరుగైన సమాజ నిర్మాణం కోసం అనేక పాయలుగా కొనసాగుతున్న కృషిలో భాగమవుతారని ఆశిస్తున్నాం. మన నేల మీద , దేశంలో , ప్రపంచ దేశాలలో జరిగిన ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ చరిత్ర పాఠాలను నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. క్షీణిస్తున్న పర్యావరణం, మారుతున్న వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని మన రాష్ట్ర ,దేశ రైతాంగానికి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం. మన వ్యవసాయ విశ్వ విద్యాలయ వజ్రోత్సవ సందర్భం లో అందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి .. విద్యార్థి పోరాటాలు వర్ధిల్లాలి ..
పూర్వ విద్యార్థుల సంఘం తరఫున
వలేటి గోపీచంద్
Tags:    

Similar News