గుడ్ బై గుంజన..ఇక సెలవామరి !
లోయ నుంచి పైకెక్కతూ గుంజనను చివరి సారిగా చూశాను. చుట్టూ కలియతిరిగి చూశాను. అలా చూస్తుంటే గుండె బరువెక్కింది. దాని మహొధృతి ముందు నా మనసు మోకరిల్లింది.
గుంజన నిత్య నూతనం.. నిత్య యవ్వనంతో మిసమిసలాడుతూ, తొణికిసలాడుతూనే ఉన్నది.. అమ్మ ఒడిలో ఉన్నట్టు , రెండు కొండల నడుమ ఒదిగి, రెండు విశాలమైన ప్రేమ బాహువుల నడుమ బందీఅయినట్టూ కనిపిస్తుంది. కానీ అది బందీ కాదు. ఎత్తైన కొండపై నుంచి దుముకుతూ, నిత్యం స్వేచ్ఛా గానం చేస్తూనే ఉంటుంది. జీవం ఉట్టిపడుతూ చలనశీలంగా ముందుకు సాగుతూనే ఉంటుంది.
గుంజనను ఎన్ని సార్లు దర్శించలేదు ! ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. మళ్ళీ గుంజనను చూడాలనుకున్నా. నా మిత్రుడు వాకా ప్రసాద్ కు తొలిసారిగా ట్రెక్కింగ్ రుచి చూపించాలనుకున్నా. , కొందరు కొత్త మిత్రులు, అనేక మంది పాత మిత్రులు కొత్త పాతల మేలుకలయికలా అంతా పజ్జెనిమిది మందిమి. తిరుపతిలో బొంతాలమ్మ దేవాలయం వద్దకు 5 గంటకల్లా వచ్చేయాలని మధు ఫత్వా జారీ చేశాడు. నేను జై బాలాజీ ఆశ్రమానికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చాను. గెస్ట్ లైన్ డేస్ ఎదురు రోడ్డులో ఉన్న వాకా ప్రసాద్ ఇంటి దగ్గర నా స్కూటర్ పెట్టి, ఆయన బుల్లెట్ లో ఇద్దరం బయలు దే రామ్. ఆదివారం తెల్ల వారుజామున అయిదు గంటలకు అంతా కలిసి పది మోటారు బైకుల్లో అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు వైపు సాగాం.
మా మోటారు బైకులు దూసుకుపోతున్నాయి. అది జాతీయ రహదారైనా అడుగడుగునా గుంతలే. ‘రహదారులు మన నాగరికతకు చిహ్నాలు’ అన్నది పాత మాట. మన ఏలిన వారి నిర్లక్ష్యానికి, అవినీతికి దర్పణాలన్నది నేటి మాట. జాతీయ రహదారిపై దాదాపు యాభై కిలోమీటర్లు సాగాలి. తెల్లవారుజామునైనా చలి పెద్దగా లేదు. రోడ్డంతా పొగమంచు. ఎదురుగా ఏమీ కనిపించడం లేదు.
రోడ్డు పక్కనున్న ఒక పచ్చని చెట్టు ఒంటరిగా నిటారుగా నిలుచుంది ! మరొక పచ్చని చెట్టు నడుము ఒంచుకుని ఎంత వయ్యారంగా ఒరిగిందో ! ముందుకు సాగిన కొద్దీ ఇలా ఎన్ని మహాద్భుత దృశ్యాలు ! చుట్టూ పరికిస్తే, తెల్లటి క్యాన్ వాస్ పై ప్రకృతి గీసిన ఎన్ని అందమైన చిత్రాలో ! మంచుతోనే కాదు, ఆ ఆనందంలోనూ తడిసి ముద్దయిపోయాం. తల నుంచి ఒకటొకటిగా మంచు బిందువులు రాలుతున్నాయి. రైల్వే కోడూరుకు నాలుగు కిలోమీటర్ల ఈవల వరకు సాగిన మా ప్రయాణంలో సగం పొగమంచులోనే సాగింది. యాభై కిలోమీటర్లు దాటాక జాతీయ రహదారికి ఎడమ వైపున సూరపరాజుపల్లె నుంచి మా వాహనాలు సాగుతున్నాయి.
అప్పటికి తెల్లారిపోయింది. పొగమంచు పూర్తిగా వీడిపోయింది.
దారి పొడవునా కొన్ని గ్రామాలు. అక్కడక్కడా అందమైన భవనాలు. ఒక గ్రామం పేరు ‘పొట్టివారి పల్లె’ ‘పేరెంత బాగుందో! ’ అన్నారు వాకా ప్రసాద్ ఆశ్చర్యపోతూ. ‘పొడుగువారి పల్లె కూడా ఉంటుందేమో అన్నా. ఇద్దరం నవ్వుకున్నాం. ఆ రోడ్డు
మెలికల్లో మా వాహనాలు తూనీగల్లా సాగిపోతున్నాయి.
ఎండిపోయి, గులకరాళ్ళతో నిండిన గుంజన ఏరు ఇక్కడ వరకు వచ్చింది. రోడ్డుకు ఇరువైపులా అరటి, బొప్పాయి, మామిడి తో టలు. అరటి, బొప్పాయి చెట్ల నిండా కాయలే. బొప్పాయి పండ్లు పండి కొన్ని రాలిపోయాయి. అలా ముందుకు సాగేసరికి ఎందురుగా అటవీ శాఖ గేటు. దాన్ని దాటుకుని అడవిలోకి ప్రవేశించాం. మా చప్పుళ్ళకు ఒక నెమలి అడివిలోకి పారి పోయింది. మరి కొస్త ముందొస్తే కొన్ని అడవి జంతువులు కనిపించేవి.
అడవిలో ముందుకు సాగుతున్న కొద్దీ మట్టి రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన చెట్లు. రహదారి చాలా దారుణంగా ఉంది. మట్టి ఘాట్ రోడ్డులో కొండ ఎక్కుతున్నాం. పక్కన ఏటవాలుగా ఉన్న కొండ నుంచి కింద వరకు పచ్చని చెట్లు పరచుకున్నాయి. ఎన్ని మెలికలు తిరిగిందో ఆ రహదారి. వాకా ప్రసాద్ ట్రెక్కింగ్ కు రావడం ఇదే తొలిసారి. అడివిని చూసి ఉబ్బితబ్బబైపోతున్నారు.
పదిహేడు కిలోమీటర్ల ఆ అడవి మార్గంలో వెళ్ళడానికి దాదాపు గంట సేపు పట్టింది. దొంగలబండ(దొంగలచెల)కు ఈవలే మా వాహనాలాపేశాం. ఎడమ వైపు సాగి, లోయలోకి దిగడం మొదలు పెట్టాం. నిటారుగా ఉన్న లోయలోకి రాళ్ళ పైనుంచి దిగాలి. పక్కనున్నచెట్లే ఊతంగా అడుగులు పడుతున్నాయి. లోయలోకి దిగడానికి కొత్త వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నా, గుంజనను చూడాలన్న ఉత్సాహం వాళ్ళనలా నడిపిస్తోంది.
లోయలోకి ఏటవాలుగా కంటే ఎక్కువ నిటారుగానే ఉంది. లోయలోకి దిగుతున్నప్పుడు దారి ఎన్ని మెలికలు తిరిగిందో, మా నడుమూ అన్ని మెలికలూ తిరిగింది. చెమటలు కక్కుతున్నాం. ఇరువైపులా ఉన్నచెట్లు పట్టుకుని దిగుతున్నాం. కుడి వైపున కొండ అంచులు పట్టుకుని సాగుతున్నాం. కూర్చుని పాకుతున్నాం. జారుతున్నాం. లోయలోకి దిగడం మొదలు పెట్టగానే గుంజన జలపాతపు హోరు వినిపిస్తోంది. అలా గంటలో లోయలోకి దిగేశాం.
మా ఎదురుగా గుంజన హోరెత్తుతోంది. దాని మాయలో పడి అంతా మమ్మల్ని మేం మరిచిపోయాం. నేను, వాకా ప్రసాద్ చపాతీలు తింటున్నాం. వాకా ప్రసాద్ నా వైపు చూసి మాట్లాడుతుండగానే, తను తింటున్న చపాతీల్లో అర చపాతి మాయమైపోయింది. కొత్త కదా నవ్వుతూ ఆశ్చర్చపోయారాయన. తొందరగా తినేయండి అది కూడా మాయమైపోతుందన్నా. ట్రెక్కింగ్ లో ఇది మామూలే. ఇతరులు తెచ్చుకున్న తిండిని మొహమాటం లేకుండా తీసుకుని తినేయడం, తాము తెచ్చుకున్న తిండి ఇతరులకు పెట్టడం సర్వసాధారణం.
ఒకరొకరుగా గుంజనలోకి దూకుతున్నారు. గుంజన గుండం గట్టు నుంచి దూకడం కొత్త కాదు. తల కిందుల డై కొట్టడమూ కొత్త కాదు. అయితే, ఎత్తు నుంచి అందరూ దూకలేరు. కానీ ఆ ఎత్తు నుంచి దూకాలన్నది నా చిరకాల వాంఛ. గుంజనలోకి ‘‘పై నుంచి మీరు దూకలేరు, దూకద్దు’’ అంటూ గత రెండు విడతలుగా మధు వారిస్తున్నాడు. ఒక్క సారి పైనుంచి దూకేసి గుంజనకు గుడ్ బై చెపుదామనుకున్నాను.
‘‘మేం ఉన్నాం దూకండి’’ అన్నారు కార్తీక్, శ్రీహరి. దాదాపు ముప్పై అడుగుల ఎత్తుండే రాతి గట్టుపైకి ఎక్కాను. దూకలేరు ఒద్దు ఒద్దంటూ మధు దణ్ణం పెట్టాడు. నా పక్కనే ఉన్న కార్తీక్, శ్రీహరి ‘‘దగ్గరగా దూకితే రాళ్ళున్నాయి. దూరంగా దూకేయండి.’’ అంటున్నారు. అంతే..మధు వీడియో ఆన్ చేశాడు. కొన్నిక్షణాల్లో దూకేశాను. బ్రహ్మాండంగా ఉంది. అందరిలో ఆశ్చర్యం. గుండంలోకి జలపాతంతో దూకేయడం ఎంత అద్భుతమైన అనుభూతి ! అలా సాహసం చేయకపోతే ఎంత కోల్పోయేవాణ్ణి! ఈ సాహసం చాలిక.
జలపాతం గుండంలోపడి రొద చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ కొండ నుంచి ఆ కొండ వరకు మొత్తం బండ పరుచుకుని ఉంది. ఆ బండరాయిపైన ఒక పక్కనుంచి జలపాతం కిందికి జోరుగా సాగుతోంది. ఆ బండపైన నిలుచుం టే ముందుకు పడిపోయేలా ఉన్నాం. ఏటవాలుగా ఉన్న ఆ బండపైన కూర్చుని నిదానంగా కిందకు దిగుతున్నాం. కాదు కాదు నిదానంగా దేకుతూ జారుతున్నాం. మా తోటే, మా పక్కనే గుంజన రొద చేస్తూ కిందకు దుముకుతోంది. అదలా కింద ఉన్న లోతైన గుండంలో పడిపోతోంది.
కింద గుండ్రటి నీటి గుండం. దానికొక పక్క ఎవరో చెక్కినట్టు
అర్ధచంద్రాకారంలో ఆ రాతిపైన మన ఊహల్లో మెదిలే రూపాలన్నిటినీ దర్శించుకోవచ్చు. తల బాగా పైకెత్తితే తప్ప ఆకాశం కనిపించదు. కొండ చిట్టచివర కొసలో మహావృక్షాలు చిన్నచిన్న మొక్కల్లా కనిపిస్తున్నాయి. పై నుంచి వచ్చే జలపాతంతో పాటు దాని పక్కనుంచే గుండంలోకి దూకాం.
ఆ నీటి గుండానిక ఒక పక్కగా మధ్యలో తలెత్తి పైకి లేచిన విశాలమైన పెద్ద బండరాయి. దానిపైకి ఎక్కి కూర్చున్నాం. పదిన్నర అవుతోంది. అప్పుడే ద్వీపం లాంటి ఆ బండపైన ఎండ పడుతోంది. కాసేపు ఎండలో కూర్చున్నాం. పడుకున్నాం. ఆ బండ పైనుంచి గుండంలోకి జారుడు బండలా ఉన్న బండ పై కూర్చుని కొందరు సరదాగా జారారు. యువకులే కాదు, తల నెరిసిన నడివయస్కులు కూడా పిల్లలైపోయారు.
గుండ్రటి నీటి గుండంలో తేలిన బండ పైనుంచి ఈదుకుంటూ ఆవలికి వెళ్ళాం. ఈ గుండం నుంచి మరో జలపాతం ఉధృతంగా కిందకు దుముకుతోంది. వాకా ప్రసాద్, మరో ముగ్గురు అక్కడే ఎండలో విశ్రాంతి తీసుకుంటూ ఆగిపోయారు. ‘‘అందరూ ఇక్కడే ఉండండి’’ అన్నాడు మధు. మధు, కార్తీక్, శ్రీహరి తాళ్ళు తీసుకుని పక్కనున్న చిన్న రాతి గుట్ట ఎక్కి, తాళ్ళు కట్టుకుంటూ అ పక్క నుంచి కిందవరకు తాడు వదిలారు. ఒకరొకరుగా ఆ రాతి గుట్ట ఎక్కి, రెండు మూడడుగులున్నదాని అంచునే తాడు పట్టుకుని కూర్చుని ముందు కెళ్ళి, జాగ్రత్తగా తాడు పట్టుకునే కిందకు దిగాం. వారి సాయం లేనిదే దిగడం అసాధ్యం. ఇది వరలో ఒక సారి ఇలా వచ్చాను. నిజంగా ఇది సాహసమే.
రాతి గుట్ట పైనుంచి తాడు సాయంతో కిందకు దిగేసరికి పై నుంచి జలపాతం ఉధృతంగా దుముకుతోంది. ఎన్ని నీటి ముత్యాలను విరజిమ్ముతోందో! కొంత మంది మాత్రమే నిలుచోడానికి అక్కడ చోటుంది. జలపాతం అక్కడి నుంచి కిందకు అంతే ఉధృతంగా దుముకుతోంది. కిందటి తడవ వచ్చినప్పుడు జలపాతం ఇంత ఉధృతంగా లేదు.
పైనున్న జలపాతం పక్కనే ఒక రాయికి తాడు కట్టి కిందకు వదిలారు. రాతి గుట్టపై నుంచి వేలాడేసిన తాడుకును దానికి కలిపారు. ఈ రెండు తాళ్ళ మధ్య నుంచి ఒక తాడు కట్టి కింద నున్న జలపాతం లోంచి కిందకు వదిలారు. ఒకరొకరు ఆ తాడు పట్టుకుని జలపాతంతో పాటే కిందకు దిగుతున్నారు. జలపాతం కిందటి సారి కంటే ఉధృతంగా ఉంది. దిగద్దన్నాడు మధు. అయినా సాహసించాను. మధు అన్నది నిజమే. జలపాతం నుంచి దానికి అభిముఖంగా నిలుచుని తాడు పట్టుకుని దిగుతుంటే, జలపాతం నీళ్ళు మొహాన చిమ్ము తూ ఊపిరాడనివ్వడం లేదు. కొంత దూరం దిగాక, తాడు పట్టుకుని జలపాతంలోనే కూర్చునేసి నిదానంగా కిందికి జారుతూ దిగాను.
మా వాళ్ళంతా కింద ఉన్న నీటి గుండంలో ఆవలివరకూ ఈదుకుంటూ వెళ్ళారు. నేను కూడా కిందటి తడవ ఈదుకుంటూ వెళ్ళాను. అది చాలా పెద్ద నీటి గుండం. అంత దూరం ఈదడం చాలా కష్టం. తిరిగి వచ్చేటప్పుడు శక్తి చాలక కొండ అంచులు పట్టుకుని కాసేపు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఈ తడవ ఎందుకంత సాహసం చేయడం. ఒక సారి వెళ్ళి వచ్చానుకదా చాలులే అనుకున్నాను. కాసేపు ఆ జలపాతం కిందనే బండ పైన నిలుచుని గుండంలో మిగతా వారి విన్యాసాలను వీక్షించాను. పక్క నున్న కొండపైకి ఎక్కి దూకుతున్నారు.
ఒంటిగంటవుతోంది. మళ్ళీ ఆ జలపాతం నుంచి వేలాడేసిన తాడుపట్టకుని ఎక్కడం మొదలు పెట్టాను. ముప్పావు భాగం ఎక్కేసరికి కాళ్ళకు పట్టుదొరకడం లేదు. జారుతోంది. అది గమనించి పై నుంచి మరొకరు అదే తాడుపట్టకుని నాదగ్గరకు వచ్చి చేయి అందించాడు. ఆ చేయిపట్టుకుని పైకి ఎగబాకి కాళ్ళకు పట్టు దొరికించుకున్నాను. నిజంగా ఇది సాహసమే. నా వయసుకైతే దుస్సాహసమే. ఇక చేయకూడదనుకున్నాను.
తాడు పట్టుకుని మళ్ళీ రాతి గుట్ట ఎక్కాను. ఎక్కడం లో కూడా ఇద్దరు సాయంచేశారు. ఎండ చుర్రు మంటోంది. అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి వెనుతిరిగాం. మళ్ళీ రాతి ద్వీపం చేరి ఈదుకుంటూ గుండం అంచులకు చేరామో లేదో వర్షం మొదలైంది. ఎక్కడంలో ఒకరికొకరు సాయం. వర్షం పడడంతో రాతిబండంతా జారుతోంది. అతి కష్టం పైన ఎటవాలుగా ఉన్న రాతి బండను ఎక్కుతున్నాం.
సగం వరకు ఎక్కేసరికి పట్టుదొరకలేదు. పైకి ఎక్కుతుంటే వర్షం వల్ల జారుతోంది. పోనీ కిందకు దిగుదామా అంటే, పట్టుదొరకక కిందకు కూడా జారుతోంది. ఏటవాలుగా ఉన్న ఆ బండను బల్లిలా అతుక్కుని అట్లాగే కాసే పు పడుకుండిపోయాను. పైనుంచి ఒక ట్రెక్కర్ వచ్చి చేయిపట్టుకుని పైకి లాగాడు. ఇహ అంతే ..వర్షంలో నే చకచకా పైకి ఎక్కేశాను. నా వెనుక మరికిందరు ఎక్కుతూ వచ్చారు.
అంతా గుంజన జలపాతం దగ్గరకు వచ్చేశాం. మా బ్యాగులు దాదాపుగా తడిసిపోయాయి. ప్లాస్టిక్ కవర్లలో పెట్టిన భోజనం, సెల్ ఫోన్లు తడవలేదు. తలదాచుకోవడానికి ఎక్కడా చోటు లేదు. మేం పై నుంచి దూకిన కొండ అంచున గుహలా ఉంది. వర్షం వల్ల నేలంతా తడిసి అక్కడికి వెళ్ళలేకపోతున్నాం. ఆ వర్షం లోనే తినేశాం.
వర్షంలో గుంజన ఎలా ఉంటుంది! జలపాతం విరజిమ్మే నీటి ముత్యాలతో పాటు, ఆకాశం నుంచి పడుతున్న పెద్ద పెద్ద వర్షపు చినుకులతో గుంజన గుండం పరవశించిపోతోంది. వర్షంలో తడుస్తూనే గుంజన జలపాతాన్ని, ఆ వర్షపు చినుకులను అలా చూస్తూ ఆస్వాదించాం. కొందరు మళ్ళీ గుంజనలోకి దూకారు. నీళ్ళలో ఎంత సేపున్నా తనివి తీరడం లేదు. వర్షం తెరిపిస్తోంది. తడిపొడి బట్టలతోనే తడిసిన నేలపైన వెల్లకిలా పడుకుని కాసేపు సేదదీరాం.
మధ్యాహ్నం మూడవుతోంది. ఫోటోలు, వీడియోలు అయిపోయాయి. ‘ప్యాకప్’ అన్నాడు మధు. అప్పటికే నేను, మరికొందరు సిద్దమయ్యాం. ముందర మేం బయలుదేరాం. మా వెనుక ఒకరొకరు బయలు దేరుతున్నారు.
లోయ నుంచి పైకెక్కతూ గుంజనను చివరి సారిగా చూశాను. చుట్టూ కలియతిరిగి చూశాను. అలా చూస్తుంటే గుండె బరువెక్కింది. దాని మహొధృతి ముందు నా మనసు మోకరిల్లింది. మూడు దశాబ్దాలుగా తరచూ వచ్చి గుంజనను పలకరించిపోతూనే ఉన్నాను. దాని అందాలను ఆస్వాదిస్తూనే ఉన్నాను. దాని అనుభవాలను ఆవాహనం చేసుకుంటూనే ఉన్నాను. గుంజనతో ఎన్ని కబర్లు చెప్పానని. ఆ కబుర్లను, కవిత్వాన్ని అక్షరాల పావు రాళ్ళ ను చేసి లోకం పైకి విసిరేశాను. గుంజనలోకి ఎన్ని సార్లు దూకానో లెక్కే లేదు. ఈ రోజు చివరి సారిగా అత్యంత ఎత్తునుంచి దూకేశాను.
ఇక చాలు గుంజనా.. నీతో ఈ ప్రత్యక్ష స్నేహం. ఈ భౌతిక అనుబంధం. నీ జ్ఞాపకాల ను, నీ అనుభూతులను అక్షరాల్లోనే కాదు, గుండెల్లో దాచుకున్నాను. ఇక నీ దగ్గరకు రాలేను. వయసు పెరుగుతోంది. ఈ వయసులో రావడమే ఎక్కువ. గుడ్ బై గుంజనా.. చిరకాల స్నేహానికి ఇక సెలవామరి !