కవితాత్మ పెల్లుబికే చంద్రకళ ‘చంద్రికలు’
'మహిళా ఉద్యోగులకు ఆదివారం ఆటవిడుపు కాదు, డబుల్ వర్కింగ్ డే';
మృదు స్వభావి, మితభాషిణి అయిన ధీకొండ చంద్రకళ గారితో నాకు దాదాపు ఇరవై సంవత్సరాల పై చిలుకు పరిచయం. అందులోనూ ఎనిమిది సంవత్సరాలు ఒకే పాఠశాలలో కలిసి పని చేసాము. తను చేసే ప్రతి పనిలో సృజనాత్మకత కనిపించేది. అప్పట్లో కొండవీటి సత్యవతి సంపాదకత్వంలో వస్తున్న ‘భూమిక’ స్త్రీవాద పత్రికను మా బడికి తెప్పించేవాళ్లం . అలాంటి పత్రికను టీనేజీ పిల్లలు చదవడం చాలా అవసరం. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆ పత్రికను చదివేవారు. ఆ రోజుల్లోనే చంద్రకళ కవిత భూమికలో అచ్చయింది. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే అప్పటినుంచే చంద్రకళ కవిత్వం రాసే వారు అనడానికి ..... ఏదో ఊసుపోని కవిత్వం కాకుండా సామాజిక, మహిళా దృక్పథాలు ఆమె కవిత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అయితే అడపా దడపా రాసే కవిత్వం స్వచ్ఛంద పదవీ విరమణ పొందాక సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఉధృతమైంది. సోషల్ మీడియా గ్రూపులలో చంద్రకళ లాంటి కొద్దిమంది రాస్తున్న కవిత్వం మాత్రమే కవితాత్మ కలిగి ఉంటోంది.
ఇది చంద్రకళ రెండో పుస్తకం. ఇందులో నూటామూడు కవితలు ఉన్నాయి. వాటిలో ఇరవై పైగా మహిళా దృక్పథం తో రాసినవి. మిగిలినవి విభిన్న సామాజిక అంశాలకు సంబంధించినవి. వీటిలో చాలావరకు online పత్రికలలో కొన్ని, దినపత్రికలలో కొన్ని వచ్చాయి. ఆయా సందర్భానుసారంగా రాసినవి కాబట్టి అనేక అంశాలు ఈ కవిత్వంలో చోటు చేసుకున్నాయి. స్త్రీ సమస్యల మీద ఇరవై పైగా కవితలున్నాయి.
"సంతానాన్ని గర్భంలో మోస్తుంది
కుటుంబ భారాన్ని తలెత్తుకుంటుంది
కుటుంబానికి వేరు మూలం అమ్మ " ..... అంటారు. మహిళా ఉద్యోగులకు ఆదివారం ఆటవిడుపు కాదు, డబుల్ వర్కింగ్ డే అంటారు మరోచోట.
"సరోగసీ సమస్యకు పేదరికమే కారణం.
పస్తులకు అలవాటైన కడుపుకు
తనకిష్టమైనవి తినాలనే
కోరికకు ఆంక్షలు పెట్టి
పోషకాలను దండిగా అందిస్తారు ......
ఖండాంతరాలనుంచైనా కఠినమైన
ఆజ్ఞలు అమలు పరిచేస్తారు .....
బోలెడు మద్దతు ధర ఇస్తాం
నీ (కడుపు) పంట ఇస్తే చాలంటారు!
తాను కష్టపడి పండించిన పంటపై
హక్కులేని కౌలుదారు తాను! " ఇదే కవితలో మరోచోట "ఖాళీ చేసిన అద్దె ఇల్లు స్త్రీ దేహం" అంటారు. అద్దెయిల్లు, హక్కులేని కౌలుదారు లాంటి బలమైన పదబంధాలు పాఠకులను వెంటాడుతాయి. సరోగసీ మీద అద్భుతమైన కవితలు ఇవి.
మాతృస్వామ్య వ్యవస్థలో కుటుంబ పెద్ద స్త్రీయే ...మోనోగమీ పద్ధతి ద్వారా తన స్వార్థంతో పురుషుడు క్రమంగా స్త్రీని ఆస్తి హక్కులో భాగంచేసుకున్నాక కుటుంబంలో అమ్మకు ఆదరణ లేకుండా పోయింది.
"ఆది నుంచీ అమ్మకే అగ్రపీఠం . ...
ఆస్తికి ఆవిడే సర్వాధికారిణి.......
అయినా ...... సమానత్వాన్నే
ఆమె కోరుకుంది!
అమ్మకు అధికారమిస్తే
నాన్న లా వల పక్షం వహించదు .....
ఎవరికి ఏది ఇవ్వాలో...
ఎప్పుడు ఎంత పంచాలో
కుంతీదేవిలా ఆమెకు బాగా తెలుసు
అందుకే మరి మళ్లీ అమ్మచేతికే ఇద్దామా?
ఇంటి తాళాలు.".....అంటారు. మరోచోట వివాహ వ్యవస్థ గురించి చెపుతూ......" ఇడుములెన్ని పడినా... వివాహ బంధం వీడని సీతా
రాముల జంటను
ఆదర్శంగా చూపే పవిత్ర భారతదేశం
సహజీవనాలకు అవుతోంది ఆలవాలం!" అంటూ వాపోతారు.
సహజీవనం గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల చంద్రకళకు వ్యతిరేకత ఉందేమో అనడం కంటే భారతీయ వివాహవ్యవస్థ మీద ఆమెకు ప్రగాఢమైన విశ్వాసం ఉందని చెప్పాలి. కానీ లోతుగా పరిశీలిస్తే స్త్రీల సహనం వల్లనే మన కుటుంబ వ్యవస్థ ఇంకా స్థిరంగా ఉన్నది అన్నది మాత్రం వాస్తవం.
"కుటుంబ వ్యవస్థకు పునాదియైన
వివాహ వ్యవస్థ ......
ఆనందకర జీవనాన్ని పాదుకొల్పే
కుటుంబ బంధాలు, బాంధవ్యాలు! "అంటూ ఈవిషయాన్ని కవయిత్రి కొంత glorify చేశారెమో అనిపిస్తోంది.
చంద్రకళ ప్రధానంగా ఆశావాది .ఈ విషయంలో కొన్ని అంశాలలో చంద్రకళ వ్యక్తీకరణలను ఇక్కడ ఉటంకిస్తాను.
"ఒంటరిగా ఏ పనీ చేతకాదనే
ఆత్మన్యూనతను నాడుల్లో
నింపుకున్న నారిని నేను".....
అని కదూ నీ దృఢమైన నమ్మకం?.....
నాక్కొంచం నమ్మకమిచ్చి చూడు .....
జరిగే అద్భుతాలను అలానే
నోరు తెరిచి చూస్తుండి పో! అంటోంది. అయితే ఎవరో లేదా భర్త నమ్మకం ఇవ్వాలనే ఆశ ఒక్క స్త్రీల విషయంలో మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది.
దేశంలో ఉన్న ద్వంద్వ సందర్భాలను చెపుతూ.....
"దేశంలోని ప్రజలందరి ఐక్యతతో
కూడిన మమతను కాంచి .....
సమతాకాంతులు తప్పక వెల్లివిరిసి
మానవ నడతలో తప్పక పరివర్తన కలుగునని .....
మానవులంతా ఐక్యతా రాగంతో బృందగానమాలసిస్తారని ఆశకలుగుతోంది! "అంటారు.
పర్యావరణ కాలుష్యం, నీటికాలుష్యం, ప్రకృతి విధ్వంసాలను బాధతో చాలా కవితలలో చెప్పారు. మనోకొలను అనే కవితలో . ...
"చీకటిపడగానే చంద్రోదయం
విప్పార్చిన వదనాలతో కలువలు.....
కోనేటిలో ప్రతిబింబిచే చంద్రబింబం.....
ఆ వెంటే మిణుకు మిణుకుమంటూ నక్షత్రాలు!
మనమే ఓ ప్రశాంత కొలనైతే......
ఆశా భావాల వెలుతురు
సమస్యా తిమిరాన్ని తరిమేయదూ?!" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
"ఆశావాద ఆమనిని విడిచి
నిరాశా శిశిరానికి చోటీయకు .....
దవ్వులలో దాగి దరిచేరనున్న
వసంతాన్ని వెలివేయకు..... "అంటూ హితవు పలుకుతారు.
ముందే చెప్పినట్లుగా సందర్భానుసారంగా అనేక అంశాల పట్ల రాసిన కవితలు ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు కొన్ని ..... శ్లేష గర్భితంగా వృద్ధాప్యాన్ని వర్ణించిన తీరు పాఠకులను అబ్బుర పరుస్తుంది.
"అనుభవాలతో రాటుదేలిన పండుటాకు.....
నేడో రేపో రాలిపోక తప్పదని తెలిసి .....
పండుటాకు రాలితేనే......
చిగురుటాకుకు చోటని.....
రేపటి తరపు తరువుకు ఎరువై.....
జన్మ సార్థక్య మొందుతుంది!."..... ఇక్కడ పండుటాకు వృద్ధాప్యానికి ప్రతీక.
జారుడు బండను ప్రతీకగా తీసుకొని జీవితంలోని ఆటుపోట్లను చెప్పారు ఉథానపతనాలు అనే కవితలో......
"చదువుచారెడు/ బలపాలు దోసెడు/ చదివేది ఎల్కేజీ/మోసేది బోలెడు పుస్తకాల బ్యాగేజీ." .... అంటూ నేటి విద్యావిధానంలో పిల్లలు కోల్పోతున్న బాల్యాన్ని ఆవిష్కరిస్తారు. నిత్యనూతన బోధనోపకరణం అనే కవితలో...
ఆధునిక సాంకేతిక పరికరాలెన్ని ఉన్నా నల్లబల్ల విలువ కొంచమైనా తగ్గలేదు అంటారు. శ్రీశ్రీ తన మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం ఇవ్వమని గుడిపాటి చలం గారిని అడిగినట్లు....తన కవిత్వ పుస్తకానికి నన్ను యోగ్యతా పత్రం ఇవ్వమంటూ.......ఓ రోజు చంద్రకళ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. కానీ నేను ఆప్తవాక్యం రాశాను. సినారె, శ్రీశ్రీ, గద్దర్, టాగూర్ ల ప్రభావం అక్కడక్కడా కనిపిస్తుంది. సైకిల్ పై సంచీధారి అనే కవిత మనకు టాగూర్ Postman ను గుర్తు చేస్తుంది. పటిష్ఠమైన పదబంధాలు, పురాణ ప్రతీకలు కనిపిస్తాయి. చివరగా..." ప్రపంచంలో ఏ మూలో ఓ ఆక్రందన/ ఇక్కడ కవి హృదయంలో/ కవిత పురుడోసుకుంటుంది.".... అనే కవితా పంక్తులు కవిగా చంద్రకళ సామాజిక బాధ్యతా తీరును తెలియ జేస్తున్నాయి. శాస్త్రీయ దృక్పథం మెండుగా ఉంది. ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీల మానిఫెస్టోలలోని మాయను పటాపంచలు చేసి విలువైన ఓటును సద్వినియోగం చేసుకోమని ప్రజలను హెచ్చరిస్తుంది మాయల మానిఫెస్టో కవిత....... రంగారు బంగారు తంగేడు తెలంగాణ అనే కవితలో... తెలంగాణా వైభవాన్ని చెప్పి, కల్యాణలక్ష్మి, ఆసరా, రైతుబంధు మొదలైన ప్రభుత్వ పథకాలను కవిత్వీకరించారు. అందులో పథకాలు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంది? చర్చనీయాంశాలే .. ... ఉదాహరణకు కల్యాణలక్ష్మి పథకం తీసుకుందాం .. ... దీని వలన ఆడపిల్లలకు ఉన్నత విద్యావకాశాలు పోయాయి. అని మేధావి వర్గంలో, మహిళా సంఘాలలో ఉన్న అభిప్రాయం. పదవ తరగతి ప్రథమ శ్రేణి లో ఉత్తీర్ణులైన అమ్మాయిలకు కూడా తప్పుడు జన్మదిన ధ్రువ పత్రాలు సృష్టించి, కల్యాణ లక్ష్మి పథకంలో వివాహాలు చేసిన సంఘటనలు నా అనుభవంలో కూడా ఉన్నాయి, అలాగే రైతుబంధు పథకంలో ఉన్న లొసుగులు ఎన్నో ... మరికొంత రాజకీయ అగాహనను పెంచుకొని మున్ముందు మరింత గాఢమైన కవిత్వాన్ని పాఠకులకు అందిస్తారనే నమ్మకం కలిగింది.