రైతుల కోసం మోదీ 5 నిముషాలు కూడా కేటాయించలేరా?

హర్యానాలోని జులనా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తరుపున కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Update: 2024-10-02 15:04 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఓటర్లను కోరారు. దుర్మార్గపు, అన్యాయ పాలనకు ఓటుతో చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. జులనా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఒలింపిక్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తరుపున ప్రియాంక బుధవారం ప్రచారం చేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, నిరుద్యోగ నిర్మూలనలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ఓడరేవులు, భూములు, పరిశ్రమలు, విమానాశ్రయాలు వారికి కట్టబెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. చిన్న వ్యాపారాలు, వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలను చూపలేకపోయిందన్నారు.

అగ్నిపథ్ పథకాన్ని ప్రస్తావిస్తూ.. అగ్నివీరులకు ఎలాంటి పింఛను లభించదని, నాలుగేళ్ల సర్వీసు తర్వాత మళ్లీ ఉపాధి కోసం వెతుక్కోవాల్సి ఉంటుందని.. మోదీజీ మీకు ఇచ్చింది ఇదే’ అని వ్యాఖ్యానించారు. 'పరివార్ పెహచాన్ పత్ర' పథకం గురించి మాట్లాడుతూ..బిజెపి ప్రభుత్వం ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. పదేళ్లుగా మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని.. దశాబ్ద కాలంగా రైతులు, జవాన్లు, రెజ్లర్లు, మహిళలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావిస్తూ.. "ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని నిరసన తెలుపుతున్న రైతులను కలవడానికి మోదీకి ఐదు నిమిషాల సమయం కూడా లేకపోయిందా? అని ప్రశ్నించారు. ఆ వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఏ ప్రయోజనం లేకపోయినా..బడా పారిశ్రామికవేత్తలు మాత్రం వాటితో లాభపడతారన్న విషయం మోదీకి బాగా తెలుసని చెప్పారు. 24 పంటలకు ఎమ్‌ఎస్‌పి ఇస్తామన్న బీజేపీ చెప్పడాన్ని హేళన చేస్తూ.. వాళ్లు చెప్పిన వాటిలో 10 పంటలైనా హర్యానాలో పండుతాయా? అని ప్రశ్నించారు. బీజేపీ మోసాన్ని దేశమంతా గమనిస్తుందన్నారు. 

Tags:    

Similar News