‘ఈశాన్య భారతం’ బంగ్లాలో భాగంగా చూపిన ‘యూనస్’
కొత్త కుట్రలకు తెరలేపిన బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు
By : Praveen Chepyala
Update: 2025-10-27 13:19 GMT
బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మరో దుస్సాహసం చేశాడు. భారత ఈశాన్య ప్రాంతం మొత్తం బంగ్లాదేశ్ లో భాగంగా చూపించాడు. ఈ వివాదాస్పద మ్యాప్ తో ఏకంగా పాక్ సైనికాధికారిని కలవడం తీవ్ర కలకలం రేపింది.
అస్సాంతో సహ ఈశాన్య రాష్ట్రాలు...
పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ కమిటీ చైర్ పర్సన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా ఈ వారాంతంలో ఢాకాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తాత్కాలిక పాలకుడు అయిన యూనస్ ను కలిశాడు.
1971 యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి. కానీ యూనస్ పగ్గాలు చేపట్టిన తరువాత ఇవి క్రమంగా బలపడుతున్నాయి. ఆదివారం యూనస్ పాకిస్తాన్ జనరల్ తో సమావేశ ఫొటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఇందులోని ఒక ఫొటోలో అతనికి ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్ అనే పుస్తకాన్ని బహుకరించినట్లు ఉంది. ఇందులో ఉన్న చిత్రంలో భారత ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాలో భాగంగా చూపించారు. ఇది భారత్ లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
బంగ్లా రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న గ్రేటర్ బంగ్లాదేశ్ కథనానికి అనుగుణంగా ఈ ఫొటోలు ఉన్నాయి. ఈ పోస్ట్ తరువాత యూనస్ భారత సార్వభౌమాధికారాన్ని ఆక్రమించినట్లు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
పాకిస్తాన్.. చైనా పై మొగ్గు..
విద్యార్థుల పేరుతో జరిగిన తిరుగుబాటు తరువాత యూనస్ తాత్కాలిక పాలకుడిగా పగ్గాలు స్వీకరించాడు. అప్పటి నుంచి అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు మొగ్గు చూపుతున్నాడు. ఇంతకుముందు ఈశాన్య భారతాన్ని ఆక్రమించుకోవాలని చైనాకు సలహ ఇచ్చాడు. భారత చికెన్ నెక్ కారిడార్ లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. ఈయన హయాంలో న్యూఢిల్లీతో ఢాకా సంబంధాలు బాగా క్షీణించాయి.
చుట్టూ బంగ్లాదేశ్ ఉంది..
భారత్ ఈశాన్యా ప్రాంతం మొత్తం చుట్టూ బంగ్లాదేశ్ ఉందని, అది భూ పరివేష్టిత ప్రాంతమని వాచాలతత్వం ప్రదర్శించారు. ఏప్రిలో లో తన తొలి చైనా పర్యటన సందర్భంగా భారత ఈశాన్య ప్రాంతం ల్యాండ్ లాక్డ్(భూపరివేష్టిత ప్రాంతం) అయినందుకు బంగాళాఖాతానికి ఏకైక సముద్ర రక్షకుడు తామే అని గొప్పలు చెప్పుకున్నారు.
ఖండించిన భారత్
చైనాలో యూనస్ చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్రంగా స్పందించింది. విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ భారతదేశ ఈశాన్య ప్రాంతం వ్యూహాత్మక ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ ఉన్న బిమ్స్ టెక్ కు కీలకమైన కనెక్టివిటీ కేంద్రంగా అభివర్ణించారు.
దీనికి ప్రతిస్పందనగా బంగ్లాదేశ్ వస్తువులు భారత భూభాగం గుండా నేపాల్, భూటాన్, మయన్మార్ లకు అనుమతించే ట్రాన్స్ షిప్ మెంట్ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది.
పహల్గామ్ దాడి తరువాత న్యూఢిల్లీ పై పాకిస్తాన్ దాడి చేస్తే బంగ్లాదేశ్, చైనా కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని యూనస్ సన్నిహితుడు మేజర్ జనరల్ (రిటైర్డ్) ఫజ్లూర్ రెహమాన్ వ్యాఖ్యానించడంలో రెండు దేశాల మధ్య మే నెలలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
2024 లో యూనస్ సహచరుడు నహిదుల్ ఇస్లాం కూడా పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాంలోని కొన్ని భాగాలను కలిపి గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ చిత్రాలను షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. తరువాత ఈపోస్ట్ తొలగించారు.