భారత్ పై ట్రంప్ సుంకాల మోత మోగించడానికి కారణం ఏంటీ?
సుంకాలు విధించడానికి యూఎస్ అధ్యక్షుడు చెప్పిన కారణాలు ఏంటంటే..;
ప్రసన్న మొహంతి
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు పెద్ద ఆశ్చర్యపరచలేదు. న్యూఢిల్లీపై తాను ఆంక్షలు విధించబోతున్నట్లు ట్రంప్ ఇంతకుముందే చాలాసార్లు హింట్ ఇచ్చారు. న్యూఢిల్లీ- వాషింగ్టన్ మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియపై తాను ఏ మాత్రం సంతృప్తిగా లేనట్లు ఆయన మాటలు ఉన్నాయి. భారత్ దృష్టిలో ఇవి అన్యాయమైన సుంకాలు కానీ.. బ్రిక్స్ లాంటి కూటమిలో ఉన్నందుకు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ వాటిపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు.
ఈ ప్రకటన రావడానికి కొద్ది గంటల ముందు ఒక యూరోపియన్ జర్నలిస్ట్ తో ట్రంప్ మాట్లాడుతున్న సందర్భంలోనే తాను ఆగష్టు 1న ఇండియాపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం దాదాపుగా 20 నుంచి 25 శాతం వరకూ ఉంటుందని కూడా ఆయన హింట్ ఇచ్చారు. అయితే ఒప్పందం జరగకపోతేనే ఆ సుంకాలు అమల్లోకి వస్తాయని కూడా హెచ్చరించారు. ఇండియా తమకు మంచి మిత్రుడే అయినప్పటికీ కూడా గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు.
తాత్కాలిక సుంకాలేనా?
ప్రస్తుతం అమెరికా విధించిన సుంకాలు తాము ఊహించినవే అని, ఆగష్టు చివరి వారంలో తిరిగి చర్చలు ప్రారంభం అవుతాయని పేరు చెప్పడానికి ఇష్టపడని భారత అధికారి ఒకరు చెప్పారు. అయితే భారత్ సుంకాలు వేయగానే స్పందించింది. అమెరికాకు ఇచ్చే రాయితీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఎలాంటి రాయితీలను నిలిపివేస్తుందో మాత్రం ప్రకటించలేదు.
భారత్ కూడా ముందస్తు ఒప్పందం కుదురుతుందని ఆశించింది. కానీ ట్రంప్ మాత్రం వీటికి అంగీకారం తెలపలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ చర్చల్లో వేటికి ఆయన భయపడ్డారో కచ్చితంగా తెలియదు. భారత్ కూడా మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోవడానికి తహతహలాడింది. ఐదు విడతల్లో అమెరికా అధికారులతో చర్చలు జరిపారు. కానీ చివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు.
ఏప్రిల్ లో ట్రంప్ మాట్లాడుతూ.. జపాన్, వియత్నాం, కొరియా, ఇండియా తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తూ లాభం పొందుతున్నాయని అన్నారు. వాషింగ్టన్ ప్రపంచంలోని అనేక దేశాలపై సుంకాలు విధించడం మొదలు పెట్టాక భారత్ ఈ ఏడాదిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమెరికా వస్తువులపై సుంకాలు భారీగా తగ్గించింది. అయినప్పటిక ట్రంప్ దీనిపై ఎలాంటి కనికరం చూపకుండా భారత్ పై సుంకాల మోత మోగించారు.
రష్యాతో సన్నిహిత సంబంధాలు..
భారత్ పై సుంకాలు విధించినందుకు ట్రంప్ ఇప్పుడు కొత్తగా రెండు అంశాలు చెప్పారు. వాటిలో ఒకటి భారత తన సాయుధ దళాల అవసరాలకు రష్యా వస్తువులు, ఇంధన అవసరాల కోసం ముడి చమురు దిగుమతి, ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ పైకి దాడికి వీటి నుంచి వచ్చే ఆర్థిక అవసరాలను ఉపయోగించుకుంటోందని అమెరికా ఆరోపణ. రష్యా, ఉక్రెయిన్ లోని సామాన్య పౌరులే లక్ష్యంగా దాడులు చేస్తోందని పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి.
‘‘సార్వభౌమత్వం కలిగిన దేశాలు ఎవరితో వాణిజ్యం చేయాలో ట్రంప్ ఎలా ఆదేశించగలరు. రష్యా నుంచి ఆయుధాలు, చమురు దిగుమతి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఎలా చెప్తారు’’ అని వ్యాపార నిపుణుడు బిశ్వజిత్ ధర్ చెబుతున్న మాట. ‘‘రష్యాతో మీరు ఎలాంటి వాణిజ్యం చేయరాదు. పుతిన్ తో మాట్లాడరాదు అంటున్నారు.ఇదే విధానం ఆయన చైనాతో అనుసరించగలరా? ’’ అని ధర్ ప్రశ్నించారు.
ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష సుంకాలను ఆయన ఎత్తి చూపారు. ‘‘ అతను చర్చలను కొనసాగించాల్సి ఉండేది. చర్చలు పూర్తయ్యాక ఒప్పందం కుదరలేదు అని చెప్పాల్సింది. కానీ అవేవీ లేకుండా ఏకపక్షంగా వ్యవహరించాడు. కానీ చర్చల వల్ల తను అనుకున్న ఫలితం పొందలేడని అనుకున్నాడు. తన ప్రధాన వ్యాపార భాగస్వామితో ఇలా వ్యవహరించాల్సింది కాదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ ఇప్పుడు ఎలా రష్యాతో వ్యవహరిస్తుందో అలాగే తన భాగస్వామ్యాన్ని కొనసాగించాలని ఆయన భారత ప్రభుత్వానికి సూచన చేశాడు.
2024 లో జరిగిన అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో ట్రంప్ తో మోదీ భేటీ కావాల్సి ఉండేది కానీ ఆయన చివరి నిమిషంలో తన పర్యటన షెడ్యూల్ ను మార్చుకున్నారు. చివరకు ఆయన రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లారు.
‘మిగా’ కు ప్రామిస్ చేసిన మోదీ
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా లో పర్యటించిన మోదీ, అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో ఉపయోగించిన ‘మేక్ గ్రేట్ అమెరికా అగైన్’(మాగా) ను స్ఫూర్తిగా తీసుకుని ‘మేక్ ఇండియా గ్రేట్ అగైన్’(మిగా) ను తీసుకువస్తామని ప్రకటించారు. ఇండియా - అమెరికా కలిస్తే అది ‘మెగా’ గా మారుతుందని కూడా ప్రవచించారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటామని అలాగే చమురు, గ్యాస్ ను కొనుగోలు చేస్తామని కూడా వెల్లడించారు. తన వ్యూహాత్మక అవసరాల కోసం రష్యా నుంచి అమెరికా వైపు మొగ్గు చూపడానికి కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు.
తరువాత ట్రంప్ కు చేదోడుగా ఉన్న ఇలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ సేవలు, టెస్లా కార్లను కూడా భారత్ లోకి ప్రవేశించడానికి న్యూఢిల్లీ అనుమతించింది. ఇంతకుముందు తయారీ కూడా ఇక్కడే చేపట్టాలనే పాలసీని పక్కన పెట్టింది. అమెరికా బేస్డ్ న్యూక్లియన్ ఎనర్జీ కంపెనీలతో రియాక్టర్లను నిర్మించే చర్చలు ప్రారంభించింది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక క్రిప్టో కరెన్సీకి ద్వారాలు ఓపెన్ చేశారు. యూఎస్ క్రిప్టో ఆధారిత ఎక్స్ ఛేంజ్ లో నమోదయిన బినాన్స్, కాయిన్ బేస్ రెండు భారత్ లోకి ప్రవేశించాయి. ఇవి ఇంతకుముందు భారత్ నుంచి తమ కార్యకలాపాలను ఉపసంహరించుకున్నాయి. భారత్ అమెరికాకు అనుకూలంగా ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సుంకాల మోత మాత్రం తప్పలేదు.