‘‘భారత్ - పాక్ మధ్య లో అమెరికా సైనిక జోక్యం వద్దు’’

ఆపరేషన్ సిందూర్ పై చార్లీ కిర్క్ అభిప్రాయాలు, ఆయన హత్యతో మరోసారి వైరల్ గా మారిన కిర్క్ మాటలు;

Update: 2025-09-12 09:49 GMT
చార్లీ కిర్క్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, నిన్న ఉటా యూనివర్శిటీలో హత్యకు గురైన చార్లీ కిర్క్ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆయనకు చెందిన ఓ పాడ్ కాస్ట్ లో ఆపరేషన్ సిందూర్ పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ అనేది అమెరికా యుద్దం కాదని, దానిలో వాషింగ్టన్ జోక్యం చేసుకోకూడదని అన్నారు.

పహల్గామ్, ఆపరేషన్ సిందూర్ గురించి..
‘వాట్ ది హెక్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా’’ అనే తన పాడ్ కాస్ట్ లో కిర్క్ ఈ మాటలు అన్నారు. దేశంలో అమెరికా సైనిక జోక్యానికి వ్యతిరేకంగా వాదించాడు. అమెరికా పాత్ర దౌత్య ప్రయత్నాలకే పరిమితం కావాలని, రెండు పొరుగు దేశాల మధ్య శాంతి చర్చలను ప్రొత్సహించాలని పేర్కొన్నాడు.
రెండు అణ్వాయుధ శక్తి కలిగిన దేశాలు అయినప్పటికీ, అణ్వాయుధ యుద్ధం రాదని ఆయన చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ రెండు దేశాలు ‘‘యుద్ధం అంచున’’ఉన్నాయని కిర్క్ చెప్పారని జాతీయ మీడియా నివేదించింది.
26 మంది పౌరులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత భారత్- పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, పాకిస్థాన్ ప్రధాన భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.
పాకిస్తాన్ ను కిర్క్ చంచలమైన దేశంగా అభివర్ణించిన ఆయన, ఇస్లామాబాద్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించారు. అదే సమయంలో పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన భారత్ ను హిందూ మెజారిటీ దేశంగా అభివర్ణించినట్లు హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది.
నైతిక మద్దతు చాలు..
భారత్- పాకిస్తాన్ వివాదంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకూడదని దాని పాత్ర కేవలం నైతిక మద్దతు వరకూ పరిమితం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రతీకారం తీర్చుకుంటున్నందున మనం భారత్ కు కొంచెం అనుకూలంగా ఉండవచ్చు. కానీ అది నైతిక మద్దతుగానే ఉండాలి. ఇది మన యుద్ధం కాదు. మన సంఘర్షణ కాదు’’ అని కిర్క్ అన్నారు. జాన్ బోల్టన్, లిండ్సే గ్రాహం ప్రతిపాదించిన భారత్- పాకిస్తాన్ వివాదాలలో అమెరికా సైనిక ప్రమేయాన్ని కోరుతూ చేసిన వాదనలు ఆయన తోసిపుచ్చారు. ఇది మా ప్రాంత పోరాటం కాదన్నారు.
ట్రంప్ సుంకాలపై కిర్క్ ఏమన్నారంటే..
ట్రంప్ సుంకాల విధానం పై కూడా ఆయన మాట్లాడారు. ట్రంప్ తీసుకున్న విధానంతో భారత్ అమెరికా వస్తువులపై సుంకాలు తొలగించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. న్యూఢిల్లీ తీసుకున్న అలాంటి చర్య చైనాను ఎదుర్కొంటునే భారత్- అమెరికా సంబంధాలను బలోపేతం చేయగలదని ఆయన అన్నారు.
భారత్ వస్తువులపై 50 శాతం సంచిత సుంకం విధించాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న తరువాత భారత్- అమెరికా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారత్ తో అమెరికా వాణిజ్య సంబంధాలను స్థిరికరించడానికి ట్రంప్ భారత్ పై 25 శాతం పరస్పర సుంకం విధించారు.
మాస్కో నుంచి న్యూఢిల్లీ చమురు కొనుగోలు చేస్తుందని, ఈ నిధులతో క్రిమ్లిన్ , కీవ్ తో యుద్ధం చేస్తోందని ఆరోపిస్తూ 25 శాతం సుంకాలు విధించారు. అయితే భారత్ వీటిని ఖండించింది. మాస్కో నుంచి చైనా అత్యధిక సంఖ్యలో ముడి చమురు కొనుగోలు చేస్తోందని తెలిపింది.
అలాగే సహజవాయువును యూరప్ దిగుమతి చేసుకుంటుందని, అమెరికా కూడా కీలకమై అణ్వాయుధ సామగ్రిని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటుందని బయటపెట్టింది. ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ కూడా ఇవన్నీ నిజాలని అమెరికా చేస్తున్న వాదలను తప్పని చెప్పింది.


Tags:    

Similar News