ఆఫ్ఘన్- పాక్ మధ్య సైనిక ఘర్షణలు
58 మంది పాక్ సైనికుల హతమైనట్లు తాలిబన్ల ప్రకటన
By : Praveen Chepyala
Update: 2025-10-12 12:54 GMT
కాబూల్ పై వైమానిక దాడులు చేసి కయ్యానికి కాలుదువ్విన పాక్ పై తాలిబన్లు విరుచుకుపడ్డారు. వీరు చేసిన దాడుల్లో కనీసం 58 మంది సైనికులు మరణించారని, మరో 30 మంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆదివారం ప్రకటించారు.
అయితే పాక్ సైతం తాలిబన్లపై ఎదురుదాడికి దిగినట్లు ప్రకటించింది. అనేక ఆఫ్ఘన్ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. డజన్ల కొద్ది ఆప్ఘన్ సైనికులతో పాటు ఖవారీజ్ సైనికులను హతమార్చినట్లు చెప్పుకుంది. కానీ తాలిబన్ చేసిన మరణాలను పాక్ ఇంకా ధృవీకరించలేదు.
ఐసిస్ ఉగ్రవాదులను తరిమికొట్టాలి
పాకిస్తాన్ లో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులను బహిష్కరించాలని ముజాహిద్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘పాకిస్తాన్ నేలలో దాక్కున్న ముఖ్యమైన ఐసిస్ ఉగ్రవాదులను బహిష్కరించాలని. లేదంటే వారిని వెంటనే ఇస్లామిక్ ఎమిరేట్ కు( తాలిబన్లకు) అప్పగించాలి.
ఐఎస్ఐఎస్ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్ తో సహ ప్రపంచంలోని అనేక దేశాలకు ముప్పు కలిగిస్తుంది. ఇస్లామిక్ ఎమిరేట్ తన భూభాగాన్ని అశాంతి కలిగించే వారికి ఉపయోగపడదు. కానీ వారి కోసం ఫష్తుంఖ్వాలో కొత్త కేంద్రాలను స్థాపించారు. కరాచీ, ఇస్లామాబాద్ విమానాశ్రాయాల ద్వారా శిక్షణ కోసం ఈ కేంద్రాలకు తీసుకువచ్చారు’’ అని ముజాహిద్ అన్నారు.
కాబూల్ ప్రతీకార దాడులు..
నిన్న రాత్రి కాబూల్ తో సహ ఆప్ఘన్ గడ్డపై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా తమ దళాలు ప్రతీకార, విజయవంతమైన దాడులు నిర్వహించాయని ఆప్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ధృవీకరించింది.
హెల్మండ్ ప్రావిన్స్ ప్రతినిధి మౌల్వీ మహమ్మద్ ఖాసీం రియాజ్ ను ఉటంకిస్తూ.. హురియత్ రేడియో లో ఆప్ఘన్ దళాలు కనీసం 15 మంది పాక్ సైనికులను హతమార్చిందని పేర్కొంది.
బహ్రంచా జిల్లాలోని డ్యూరాండ్ లైన్ సమీపంలోని సైనిక, మిలిషియా అవుట్ పోస్టులు లక్ష్యంగా పాక్ సైనికులపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుందని తెలిపింది.
పాకిస్తాన్ కు హెచ్చరిక..
కాందహార్, హెల్మండ్, పాక్టికా, ఖోస్ట్, పాక్టియా, జాబుల్, నంగహర్, కునార్ వంటి ప్రాంతాలలో ప్రతీకార దాడులు అమలు చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు.
‘‘పాకిస్తాన్ మరోసారి ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను మరోసారి ఉల్లంఘిస్తే మన సాయుధ దళాలు దేశ సరిహద్దులను రక్షించడానికి పూర్తి సిద్దంగా ఉన్నాయి. మా స్పందన ఇక ముందు ఇంకా బలంగా ఉంటాయి’’ అని రక్షణ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ ఆపరేషన్ల సమయంలో అనేక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని రియాద్ చెప్పారు.
ఎటువంటి కవ్వింపు లేకుండా దాడులు..
సరిహద్దు ప్రాంతాలలో ఆప్ఘన్ దళాలు చేసిన దాడులకు స్పందించామని అనేక ఆప్ఘన్ సరిహద్దు పోస్టులు, శిక్షణా శిబిరాలు , ఉగ్రవాద స్థావరాలకు ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించింది.
ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలోని అంగుర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్, బలూచిస్తాన్ లోని బరంచాలోని పాక్ పోస్టులను ఆప్ఘన్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. శనివారం రాత్రి అనేక పాకిస్తాన్ సరిహద్దు పోస్టులపై తాలిబన్ దళాలు కాల్పులు జరపడంతో రెండు వైపుల నుంచి దాడులు ప్రారంభమయ్యాయి.
పాక్ వార్తాపత్రికల ప్రకారం.. పాకిస్తాన్ భద్రతా దళాలు ఖవారీజ్ లేదా టీటీపీ ఉగ్రవాదులు పాక్ లోకి ప్రవేశించడానికి ఆప్ఘన్ దళాలు దాడులు చేసినట్లు కథనాలు ప్రసారం చేసింది.
ఆప్ఘన్ సైనికులను హతం చేసింది..
పాకిస్తాన్ తన ప్రతిదాడిలో సరిహద్దులోని అనేక ఆప్ఘన్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసిందని, ప్రతీకార కాల్పులలో డజన్ల కొద్దీ ఆప్ఘన్ సైనికులు, ఖవారీజ్ కూడా మరణించారని పేర్కొంది.
సరిహద్దు పోస్టులపై తాలిబన్ దాడులు కేవలం పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని ఆప్ఘన్ మంత్రి మెహ్సిన్ నఖ్వీ అన్నారు. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని ఆయన ఆరోపించారు.
పాకిస్తాన్ దళాలు అత్యంత ధైర్యంగా ఈ దాడులను ఎదుర్కొన్నాయని చెప్పారు. ఆప్ఘన్ దళాలు రెచ్చగొడితే ఫలితం దారుణంగా ఉంటుందని పాక్ కు అలవాటైన డాంబికాలను ఆయన పలికారు.
గొడవలకు కారణం ఏంటీ?
పాకిస్తాన్ లో టీటీపీ పదే పదే సైన్యమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. గతవారం ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలోని ఓర్జాకాయ్ జిల్లాలో జరిగిన దాడులలో పాక్ మిలిటరీకి చెందిన లెప్టినెంట్ కల్నల్, ఒక మేజర్ సహ 11 మంది సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో రెండు పొరుగు దేశాల మధ్య పరిస్థితి మరింత దిగజారిందని తెలుస్తోంది.
దాష్ రహస్య స్థావరాలే లక్ష్యంగా దాడులు..
అంతర్జాతీయ సరిహద్దు వద్ద మోహరించిన పాకిస్తాన్ దళాలు అనేక ఆప్ఘన్ సరిహద్దు పోస్టులను లక్ష్యంగా దాడులు చేశాయని భద్రతా వర్గాలు ధృవీకరించాయి.
బహుళ ఆఫ్ఘన్ పోస్టులు, ఉగ్రవాద నిర్మాణాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు నివేదికలు ఉన్నాయని అన్నారు. ఈ యుద్ధంలో ఆర్టీలరీ, ట్యాంకులు, తేలికపాటీ తో పాటు భారీ ఆయుధాలు, వైమానిక వనరులు, డ్రోన్ లను ఉపయోగించినట్లు పాక్ తెలిపింది.
పాక్ స్టేట్ టీవీ వీడియోల షేర్..
సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లలో ప్రభుత్వ నిర్వహణలోని పీటీవీ న్యూస్ ఆఫ్ఘన్ పోస్టులపై కాల్పులు జరిపిన వీడియోలను విడుదల చేసింది. వీటిలో కొన్ని మంటలలో ఉన్నాయి. ఒక వీడియోలో కుర్రం లో పాకిస్తాన్ దళాలకు లొంగిపోతున్న తాలిబన్లను కూడా రికార్డు చేసింది.